సూడాన్: 30 కి.మీ. ప్రయాణానికి రూ. 32 లక్షలు అడుగుతున్నడ్రైవర్లు, అసలు అక్కడేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, FADI ATABAN/BBC
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో పోరు తీవ్రమైంది. ప్రజలు సురక్షితంగా దేశం దాటిపోయేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి.
ప్రత్యర్థి పారామిలటరీ బలగాలను తరిమికొట్టేందుకు వైమానిక దాడులు, భారీ ఆయుధాలతో నగరం నలువైపుల నుంచి దాడులు చేస్తున్నట్లు సూడాన్ ఆర్మీ ఆదివారం తెలిపింది.
ఆర్మీ, పారామిలటరీ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటికీ ఖార్టూమ్ నగరంలో లక్షల మంది చిక్కుకుని ఉన్నారు. అక్కడి వారికి ఆహారం దొరకడం కూడా కష్టంగా మారింది.
సూడాన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించాయి.
భారత్ కూడా ఏప్రిల్ 25 నుంచి సూడాన్‌లో చిక్కుకుకు పోయిన తమ పౌరులను వెనక్కి రప్పిస్తోంది. ఆపరేషన్ కావేరీలో భాగంగా ప్రతి రోజూ వందలమంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆగని ఘర్షణ
ఏప్రిల్ 15న ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య మొదలైన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకూ సుమారు 500 మందికి పైగా చనిపోయారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఐక్యరాజ్యసమితి, అమెరికా, యూకే దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చినప్పటికీ కాల్పుల విరమణ పొడిగింపు సాధ్యం కాలేదు.
శనివారం సాయంత్రం నుంచే ఖార్టూమ్ నగరంలో దాడులు మొదలయ్యాయి.
మరోవైపు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రజలు వేల సంఖ్యలో సరిహద్దుల వద్దకు చేరకుంటున్నారు. అయితే, రవాణా సదుపాయాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్ల దోపిడీకి గురవుతున్నారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
30 కిలోమీటర్లకు 40 వేల డాలర్లు
ఘర్షణలకు ముందు వరకూ ఈజిప్ట్ వెళ్లేందుకు బస్సు అద్దె 3 వేల డాలర్లు(2 లక్షల 45 వేల రూపాయలు) ఉండేది. ప్రస్తుతం డ్రైవర్లు 40 వేల డాలర్లు(సుమారు 32 లక్షల 69 వేల రూపాయలు) డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు.
కాలినడకన సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉండడంతో బస్సుల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి.
బోర్డర్ దాటేందుకు బస్సు డ్రైవర్లు 40 వేల డాలర్లు( సుమారు రూ. 32 లక్షలు) డిమాండ్ చేస్తుండడంతో వేల మంది ఈజిప్ట్ సరిహద్దుల వద్ద చిక్కుకుపోయారు.
ఖార్టూమ్‌లో ఘర్షణలో కారణంగా రెండు రోజుల కిందట ఏడుగురు సభ్యులున్న కుటుంబం ఈజిప్ట్ వెళ్లిపోయేందుకు వచ్చింది. వారిలో ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు.
88 ఏళ్ల వృద్ధురాలితో సహా ఇక్కడ చిక్కుకుపోయామని ఫది అటబాని అనే వ్యక్తి చెప్పారు.
''వేల మంది ప్రజలు ఇక్కడ చిక్కుకుపోయారు. ఇక్కడ కనీసం వసతి సదుపాయాలు లేవు. ఇక్కడి స్కూళ్లు, ఇంకా పలుచోట్ల కింద చాపలు వేసుకుని నిద్రపోతున్నారు.'' అని అటబాని బీబీసీతో చెప్పారు. సరిహద్దు పట్టణమైన వాది హల్ఫా నుంచి ఆయన మాట్లాడారు.
తమ కుటుంబంలో ఎక్కువ మందికి బ్రిటిష్ పౌరసత్వం ఉందని, సాయం కోసం యూకే అధికారులను కూడా సంప్రదించినట్లు అటబాని చెప్పారు.
''ఎడారి మధ్యలో ఉన్నాం. పిల్లల ఆరోగ్యం ఏమవుతుందో చెప్పలేను. ఇక్కడి నుంచి బయటపడేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నా. కనీసం బోర్డర్ దాటేందుకు బస్సు సమకూర్చాలని కోరుతున్నా.'' అని ఆయన అన్నారు.
ప్రయాణికుల ఇబ్బందులను ఇక్కడి స్థానిక బస్ డ్రైవర్లు అవకాశంగా తీసుకుంటున్నారని అటబాని ఆరోపించారు.
'' సాధారణ రోజుల్లో బస్సు అద్దె 3 వేల డాలర్లు ఉంటుంది. కానీ ఈరోజు కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బోర్డర్ దాటేందుకు 40 వేల డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.'' అని అటబాని చెప్పారు.
బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Reuters
'ఫిరంగి గుండ్లు పడడం నా కూతుళ్లు చూశారు'
తన ఇద్దరు కూతుళ్లు ఖార్టూమ్‌లోనే చిక్కుకుపోయారని సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కి చెందిన హోస్నా తెలిపారు. ఆమె తన ఇంటి పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు.
తన కూతుళ్లు బోర్డర్ వరకూ వచ్చేందుకు ఒక్కొక్కరికి 400 డాలర్లు (సుమారు 32 వేల రూపాయలు) చెల్లించాల్సి వస్తోంది. సూడాన్‌లో ఘర్షణలు జరగకముందు అది కేవలం 25 డాలర్లు( సుమారు 2 వేల రూపాయలు)గా ఉండేదని ఆమె చెప్పారు.
సూడాన్‌లో ఘర్షణలు ప్రారంభమయ్యేందుకు కొద్దిరోజుల ముందు హోస్నా ఈజిప్ట్‌లోని అస్వాన్‌కి వచ్చారు.
'' ఇంటికి సమీపంలో ఫిరంగి గుండ్లు పడడం నా కూతుళ్లు చూశారు. నేను వారిని ఇక్కడికి తీసుకురాలేకపోయాను. వారికి సాయం చేసేందుకు నాకు భర్త, కొడుకు లేరు. డబ్బులు సంపాదించేందుకు రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాను'' అని హోస్నా చెప్పారు.
డబ్బు సంపాదించేందుకు శరణార్థులకు కేంద్రంగా మారిన బస్ స్టేషన్‌లోనే టీ షాప్‌లో ఆమె పనిచేశారు. ఈ బస్ స్టేషన్ అస్వాన్ పట్టణానికి సమీపంలోనే ఉంది.
''సూడాన్ పూర్తిగా నాశనమైంది. ఆర్మీ, పారామిలిటరీ దళాలు ఇళ్లలోని ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నాయి.'' అని హోస్నా చెప్పారు.
బస్సు అద్దెలు అమాంతం పెరిగిపోయాయని సూడాన్ - అమెరికన్ విద్యావేత్త ఇస్రా బని చెప్పారు. దేశం విడిచి వెళ్లిపోతున్న శరణార్థులకు సాయం చేసేందుకు ఆమె అస్వాన్ పట్టణానికి వచ్చారు.
''శరణార్థులు సొంత ఖర్చులతో తరలిపోతున్నారు. వారికి కనీస గౌరవం కూడా దక్కడం లేదు. ఇది చాలా బాధను కలిగించే విషాదకరమైన పరిస్థితి.'' అని ఇస్రా బని బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, UK MINISTRY OF DEFENCE
ఇళ్లు వదిలేసి వెళ్తున్న కుటుంబాలు
సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ దళం ఆర్ఎస్ఎఫ్(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్) మధ్య ఏప్రిల్ 15 నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికే వందల మంది ఈ ఘర్షణల్లో చనిపోయారు. వేల మంది గాయాలపాలయ్యారు.
ఇరువర్గాలు మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు గత సోమవారం ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందాన్ని గురువారం పొడిగించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్, చుట్టు పక్కల ప్రాంతాలు ఘర్షణల కారణంగా నాశనమయ్యాయి. ఖార్టూమ్ నగరంలో దాదాపు కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ఆహారం, నీళ్లు, ఇంధనం వంటి కనీస అవసరాలు కూడా దొరక్కపోతుండడంతో ప్రజలు నగరం వదిలి వెళ్లిపోతున్నారు.
ఖార్టూమ్‌లోని ఇంటి నుంచి వచ్చేశామని, వస్తూ కొన్ని దుస్తులు మాత్రమే తెచ్చుకున్నామని అటబాని చెప్పారు.
'' విలువైన వస్తువులన్నీ ఇంట్లోనే వదిలేశాను. ఇంకా నాకు అక్కడ ఇల్లు ఉందా? ఈ ఘర్షణకు అంతమెప్పుడో ఆ దేవుడికే తెలియాలి. మేము తెచ్చుకోగలిగినంత తీసుకుని వచ్చేశాం.'' అని ఆయన అన్నారు.
''రాయబార కార్యాలయం ద్వారా సాయం చేసేందుకు పలుమార్లు ప్రయత్నించామని యూకేలోని బంధువులు చెప్పారు. కానీ ఎలాంటి సాయం అందలేదు.''
''ఖార్టూమ్ సమీపంలోని వాది సీడ్నా ఎయిర్ ఫీల్డ్ నుంచి కేవలం బ్రిటిష్ పౌరులను మాత్రమే తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని చెప్పారు. అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. అయితే, రిస్క్ చేసి ఆ ఎయిర్‌ఫీల్డ్‌కి వెళ్లమని వాళ్లు చెబుతున్నారు. కానీ నా కుటుంబాన్ని ఎలా రిస్క్‌లో పెట్టగలను'' అని అటబాని అన్నారు.
అయితే, వాడి సీడ్నా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండ్ అవుతున్న విమానాన్ని పేల్చివేసినట్లు గురువారం తుర్కియే తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?
- స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
- టూత్‌పేస్ట్ ట్యూబ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్... 65 మంది అరెస్ట్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















