టూత్‌పేస్ట్ ట్యూబ్‌లలో డ్రగ్స్ స్మగ్లింగ్... 65 మంది అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లి ఎన్‌జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
యాభై కేజీల మాదకద్రవ్యాలను వియత్నాంకు అక్రమ రవాణా చేసిన 65 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌లో కొంతభాగాన్ని టూత్‌పేస్ట్ ట్యూబ్‌లలో దాచి స్మగ్లింగ్ చేశారు.
కిందటి నెల, పారిస్ నుంచి హో చి మిన్ సిటీకి వచ్చిన వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానం క్యాబిన్ సిబ్బందిలో నలుగురి బ్యాగులలో డ్రగ్స్‌తో ఉన్న టూత్‌పేస్ట్ ట్యూబ్స్ దొరికాయి. వారిని అరెస్ట్ చేశారు.
60 కిలోల టూత్‌పేస్ట్‌ను రవాణా చేసే పనిని తమకు అప్పగించారని, అయితే ఆ ట్యూబ్‌లలో ఎక్స్‌టసీ, కెటమీన్, కొకైన్ ఉన్నట్టు తెలియదని వాళ్లు చెప్పారు.
వియత్నాంలో అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల చట్టాలు ఉన్నప్పటికీ, ఆ దేశం డ్రగ్స్ అక్రమ రవాణాకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది.
విమాన సిబ్బంది తీసుకొచ్చిన 327 టూత్‌పేస్ట్ ట్యూబ్‌లలో సగం వాటిల్లో డ్రగ్స్ ఉన్నాయి.
అయితే, క్యాబిన్ సిబ్బందికి నిజంగానే వాటి గురించి తెలీదని దర్యాప్తులో తేలినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ నలుగురు మహిళలూ బెయిల్ మీద బయటికొచ్చారు.
ఈ వారంలో అదే మార్గంలో వియత్నాంకు అక్రమ రవాణా అవుతున్న మరో ఆరు షిప్‌మెంట్‌లను పోలీసులు పట్టుకున్నారు. 65 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు.
విమానం సిబ్బందికి పని పురమాయించిన అదే స్మగ్లింగ్ మూక వీరికి కూడా పని అప్పగించిందని అనుమానిస్తున్నారు.
ఈ 65 మంది అనుమానితులను.. మాదక ద్రవ్యాలను కొనుగోలు చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, నిల్వ చేయడం వంటి వివిధ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
అదే డ్రగ్స్ సిండికేట్.. ఫ్రాన్స్‌లో ఉంటున్న, చదువుకుంటున్న వియత్నాం పౌరుల ద్వారా కూడా దేశంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తూ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వియత్నాం విమానాశ్రయాలకు డ్రగ్స్ చేరిన తరువాత, స్థానిక డెలివరీ సర్వీసులు వాటిని సైగాన్ సరిహద్దులో ఉన్న డాంగ్ నై ప్రాంతానికి తరలిస్తాయి.
అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు అవి పంపిణీ అవుతాయి.
గత మూడు నెలల్లో విమాన మార్గంలో దేశంలోకి అక్రమంగా వచ్చి చేరిన డ్రగ్స్, గత అయిదేళ్లల్లో విమాన మార్గంలో వచ్చిన డ్రగ్స్‌ను మించిపోయాయని అధికారులు తెలిపారు.
హో చి మిన్ సిటీ.. పొరుగున ఉన్న కంబోడియాకు సమీపంలో ఉన్నందున, స్మగ్లర్లకు ఆకర్షణీయమైన రవాణా కేంద్రంగా మారింది.
వియత్నాంలో 600 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్, 2.5 కిలోల కంటే ఎక్కువ మెథాంఫేటమిన్ అక్రమంగా రవాణా చేసేవారికి మరణశిక్ష విధిస్తారు.
నిర్దిష్ట పరిమాణాలకు మించి మాదకద్రవ్యాల ఉత్పత్తి లేదా అమ్మకానికి కూడా మరణశిక్ష ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది? 20 ఏళ్ల పరిశోధనలో ఏం తేలింది? 'బికినీ మెడిసిన్' వల్ల స్త్రీలు నష్టపోతున్నారా?
- 'ఏజెంట్' రివ్యూ: అఖిల్‌కు సురేందర్ రెడ్డి మాస్ విజయాన్ని ఇచ్చారా?
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఈ రోజు ఎఫ్ఐఆర్.. సుప్రీంకోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
- గాఫ్ ఐలాండ్: ఈ అందమైన ద్వీపంలో పని చేయడానికి మనిషి కావాలంట.. జీతం 22 లక్షలు
- దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్య: 'కారుపై వేల మంది రాళ్ల దాడి చేశారు, బయటకు లాగి చిత్రవధ చేశారు’ - భార్య ఉమ














