ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డైసీ రోడ్రిగజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"స్త్రీలు బయటి నుంచి, లోపలి నుంచి కూడా కళాకృతుల వంటి వారు. నేను న్యూరోసైంటిస్ట్‌ను. లోపలి భాగాలపై దృష్టి పెడతాను. ముఖ్యంగా మహిళల మెదడు మీద."
ఈ మాటలు చెబుతూ, లిసా మాస్కాని తన టెడ్‌టాక్ ప్రారంభించారు.
"మెనోపాజ్ మహిళల మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?" - ఇదీ ఆమె ప్రసంగం టైటిల్.
మాస్కాని న్యూరోసైన్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్, న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ వెయిల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో అల్జీమర్స్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ డైరెక్టర్.
చాలా ఏళ్లుగా ఆమె మనిషి మెదడును అధ్యయనం చేస్తున్నారు. మహిళల మెదడుకు, పురుషుల మెదడుకు మధ్య వ్యత్యాసాలపై పరిశోధన చేస్తున్నారు.
"మెదడుకు లింగపరమైన వ్యత్యాసాలు ఏమీ ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. పింక్, బ్లూ లేదా బార్బీ, లెగోస్.. ఇవన్నీ మానవులు తయారుచేసుకున్న సాధనాలు. మెదడు పనితీరుకూ, వీటికీ ఏ సంబంధం లేదు" అని ఆమె అన్నారు.
బీబీసీ, డాక్టర్ లిసా మాస్కానితో మాట్లాడింది. ఆమె చెప్పిన పరిశోధన వివరాలు ఇవీ.
మాస్కాని ‘The XX Brain’ అనే పుస్తకం రాశారు. అందులోని కొన్ని అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: 20 ఏళ్ల పాటు మహిళల మెదడుపై చేసిన అధ్యయనంలో మీరేం నేర్చుకున్నారు?
జవాబు: మెదడుకు సంబంధించిన, మానసిక రుగ్మతల ప్రభావం మహిళలపై, పురుషులపై వేరు వేరుగా ఉంటుంది. ఈ తేడా ఎందుకు వస్తుందంటే.. పురుషుడి మెదడు, స్త్రీ మెదడు వయసుల్లో వ్యత్యాసం ఉంటుంది. అవి వేరు వేరుగా ఎదుగుతాయి. ఈ అంశం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నా పరిశోధనలో తేలింది.
ఉదాహరణకు, ఆందోళన రుగ్మతలు లేదా డిప్రెషన్ పురుషుల కంటే మహిళలలో కనిపించే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. అలాగే, మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆటోఇమ్యూన్ వ్యాధులు, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటివి స్త్రీలకు వ్యాపించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అదనంగా, మహిళలకు తలనొప్పి, మైగ్రేన్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ.
అంతే కాకుండా, మెనింజియోమాస్ లాంటి బ్రెయిన్ ట్యూమర్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా మహిళలకు వచ్చే అవకాశాలు ఎక్కువ.
డెమెన్షియాకు ప్రధాన కారణమైన అల్జీమర్స్ సోకే ముప్పూ మహిళలకే ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ప్రజలు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఇందులో దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో ముగ్గురిలో ఇద్దరు మహిళలే.
అయినప్పటికీ, ఇవేవీ కూడా "మహిళల ఆరోగ్యం" కిందకు రావు. ప్రస్తుతం మహిళల ఆరోగ్యం అంటే సంతానోత్పత్తి ప్రక్రియకు సంబంధించన వాటిపైనే దృష్టి పెడుతున్నారు.
ఉదాహరణకు, 60లలో ఉన్న ఒక మహిళకు వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా అల్జీమర్స్ సోకే అవకాశాలే ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్‌ను మహిళల అనారోగ్య సమస్య కింద పరిగణిస్తున్నారు కానీ, అల్జీమర్స్‌ను కాదు.
ఇప్పటికీ మహిళల మెదడుపై జరుగుతున్న పరిశోధన కనిష్ఠ స్థాయిలోనే ఉందని చెప్పాలి. వైద్య పరిశోధనలో చాలా తక్కువ నిధులు వాటిపై పెడుతున్నారు. మహిళల మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను గుర్తించడం, చికిత్స చేయించడమూ తక్కువే.
ఈ అసమానతను గుర్తిస్తూ, ఇలాంటి ముఖ్యమైన అంశాలను కూడా మహిళల ఆరోగ్యం కిందకు తీసుకురావడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, COURTESY: LISA MOSCONI
ప్రశ్న: మహిళల మెదడు ఎలా పనిచేస్తుంది?
జవాబు: వయసు మళ్లడం అనేది ఒక సరళమైన ప్రక్రియ అనుకుంటారు. కానీ, మహిళల మెదడు విషయంలో అలా కాదు.
కొన్ని ట్రిప్పింగ్ పాయింట్ల వద్ద ఆడవాళ్ల మెదడు గణనీయమైన మార్పులను ఎదుర్కొంటుంది. వాటిని నేను ‘3 Ps’ అని పిలుస్తాను. అవేంటంటే- ప్యూబర్టీ (రజస్వల కావడం), ప్రెగ్నెన్సీ (గర్భం దాల్చడం), పెరిమెనోపాజ్ (మెనోపాజ్‌కు ముందు దశ).
మెచ్యూర్ అయినప్పుడు, గర్భం వచ్చినప్పుడు హార్మోన్లు చాలా ఎక్కువ స్థాయిలో గతి తప్పుతాయి. శరీరం చాలా మారిపోతుంది. శారీరక మార్పులు పైకి కనిపిస్తాయి. కానీ, మెదడుపై ప్రభావం బయటకు తెలీదు.
ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రెండు దశల్లో ఆడవాళ్ల మెదడులోని కొన్ని భాగాలు కుంచించుకుపోతాయి. ముఖ్యంగా, సాంఘిక నియమాలు, ప్రవర్తనకు సంబంధించిన అంశాలతో ముడిపడిన భాగాలు.
అయితే, ఇది అనవసరమైన న్యూరాన్‌లను తొలగించి, యుక్తవయసుకు మళ్లే, మాతృత్వానికి చేరే క్రమానికి అవసరమయ్యే కొత్త కనెక్షన్లకు దారి ఇచ్చే అందమైన ప్రక్రియని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కుంచించుకుపోవడం వల్ల మహిళల మెదడు పరిమాణం తగ్గుతుంది కానీ పనితీరు మెరుగుపడుతుంది.
పెరిమెనోపాజ్ దశలో కూడా ఇలాంటి మార్పులనే గమనించవచ్చని తేలింది.
ప్రశ్న: మీ పుస్తకంలో "పురుషుల శరీరం పెద్దగా ఉంటుంది కాబట్టి, మెదడు పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. కానీ, మహిళలలో మందమైన సెరిబ్రల్ కార్టెక్స్ ఉంటుంది. దానివల్ల అంతర్గత ఛానెల్స్‌ను కలిపే ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది" అని రాశారు. దాని అర్థమేమిటి?
జవాబు: పురుషులలో కంటే మహిళలలో 'బ్రెయిన్ రిజర్వ్' (మెదడు నిల్వ) ఎక్కువగా ఉంటుంది.
బ్రెయిన్ రిజర్వ్ అంటే వ్యాధులను, దెబ్బలను, వార్థక్యాన్ని నిరోధించగలిగే సామర్థ్యం.
ఈ నిల్వ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువగా వృద్ధాప్యం లేదా వ్యాధులు వచ్చినప్పుడు ప్రవర్తనలో మార్పులు వస్తాయి.
ఉదాహరణకు, ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తిలో పురుషుల కన్నా మహిళలు మెరుగ్గా ఉంటారు. డెమెన్షియా వచ్చినా, ఆడవారి జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉంటుంది.
అయితే, మెదడు నిల్వ ఎక్కువ ఉండడం వలన కొన్ని అపాయాలు కూడా ఉన్నాయి. డెమెన్షియా వచ్చినప్పుడు ప్రారంభ లక్షణాలను కప్పిపుచ్చగలదు. అందువల్ల చాలా ఆలస్యంగా వ్యాధి బయటపడుతుంది. చికిత్స ఆలస్యమవుతుంది.
వ్యాధులను త్వరగా గుర్తించే సాధనాలపై మేం పరిశోధన చేస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: మహిళల మెదడుపై హార్మోన్ల ప్రభావం ఎలా ఉంటుంది? రెండు ఎక్స్ క్రోమోజోముల ప్రభావం ఏమిటి?
జవాబు: మహిళల మెదడు ఈస్ట్రోజెన్‌పై ఆధారపడి నడుస్తుంది. రోజూ ఈస్ట్రోజెన్ అణువులు మెదడులోకి జారి, అవి ఇమడగలిగే సరైన ఆకృతిని కలిగి ఉన్న ప్రత్యేక గ్రాహకాల(రిసెప్టర్ల) కోసం వెతుకుతాయి.
కప్పలోకి తాళం చెవి వచ్చి చేరినట్టు ఈస్ట్రోజెన్ అణువులు గ్రాహకాలలోకి చేరిపోతాయి. వెంటనే తాళం పడిపోతుంది. తరువాత కణాల కార్యకలాపాలు మొదలవుతాయి.
ఈ ప్రక్రియ తెలిస్తే, మెనోపాజ్ వచ్చినప్పుడు మెదడుపై పెను ప్రభావం ఎందుకుంటుందో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
మెనోపాజ్ సమయంలో గ్రాహకాలకు తగిన ఈస్ట్రోజెన్ అణువులు అందవు. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: 'బికినీ మెడిసిన్' అంటే ఏంటి? దీనివల్ల మహిళల మెదడు ఆరోగ్యానికి, మెదడుపై అధ్యయనాలకు కలిగిన నష్టం ఎంత?
జవాబు: నేను ముందే చెప్పినట్టుగా, జెండర్ అసమానత అంటే సామాజిక, ఆర్థిక, భద్రతా అంశాలే కాదు. ఆరోగ్య పరమైన విషయాల్లో కూడా అసమానత ఉంది. ఇదే విషయాన్ని నా పుస్తకంలోనూ చెప్పాను.
మహిళలు అంటే సంతానోత్పత్తికి సంబంధించిన విషయాలే మనకు జ్ఞాపకం వస్తాయి. వైద్యంలో కూడా అదే నేర్పిస్తారు. దీన్నే నేను 'బికినీ మెడిసన్ ' అంటాను.
వైద్యపరంగా పురుషులకు, మహిళలకు వ్యత్యాసం ఏమీ లేదని ఎంతోకాలం నుంచి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం, సంతానోత్పత్తికి సంబంధించిన అవయవాలే తేడా. బికినీ కవర్ చేసే అవయవాలే వ్యత్యాసం. మహిళల ఆరోగ్యం అంటే అవే గుర్తొస్తాయి. వైద్య పరిశోధన అదే దిశలో సాగుతోంది.
ఇందులో పెద్ద సమస్య ఉంది. దీనివల్ల మహిళలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. వారి మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: "మెనోపాజ్ లక్షణాలు మెదడులో మొదలవుతాయి, అండాశయంలో కాదు" అని మీరన్నారు. దీని అర్థమేమిటి?
జవాబు: మెనోపాజ్‌కు ముందు దశలో సంతానోత్పత్తిలో వచ్చే క్షీణత మెదడుపై పెద్ద ప్రభావం చూపిస్తుందని నా పరిశోధనలో తేలింది.
మెనోపాజ్ దశలో అండాశయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టీరాన్ హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. అందువల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
అయితే, ఈ హార్మోన్లు మెదడు పనితీరును నియంత్రించడంలో కూడా పాత్ర పోషిస్తాయి. మెదడు, వీటి ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇదొక చక్రం.
దీన్నిబట్టి మెనోపాజ్ అనేది మెదడుకు సంబంధించిన చర్య అని కూడా అర్థమవుతోంది కదా.
మెనోపాజ్ లక్షణాలు.. వేడి ఆవిర్లు, రాత్రి పూట చెమటలు, ఆందోళన, నిరాశ, నిద్రలేమి, మెదడు స్తబ్దత, జ్ఞాపకశక్తిలో క్షీణత వంటివి మెదడులో ప్రారంభమవుతాయి, అండాశయాల్లో కాదు. ఇవన్నీ న్యూరలాజికల్ లక్షణాలు. కానీ, ఈ కోణాన్ని విస్మరిస్తారు.
మెదడుపై మెనోపాజ్ ప్రభావం గురించి నేను పరిశోధన మొదలెట్టనప్పుడు, దాని గురించి పెద్దగా చర్చ కూడా లేదు. చాలా కొద్దిమందికే మెనోపాజ్-మెదడు సంబంధంపై అవగాహన ఉంది.
ఇప్పుడు ఇది ప్రధాన స్రవంతి చర్చల్లోకి వచ్చింది. మా పరిశోధన ఈ మార్పు తీసుకొచ్చినందుకు గర్వంగా ఉంది.
ప్రశ్న: మెనోపాజ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు: "మీ బాధ నాకు అర్థమవుతోంది. మీరు చెప్పేది నిజమే. మీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదని మీరనుకోవద్దు. మీకేం పిచ్చి పట్టలేదు" అని సముదాయిస్తాను.
మెనోపాజ్ సమయంలో ఇంత బాధ పడనవసరం లేదని కూడా చెబుతాను. లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నా, పరిష్కారం ఉందని గుర్తించాలి.
మనకు ఉపయోగపడే చాలా రకాల సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ), నాన్-హార్మోనల్ థెరపీ, మందులు ఉన్నాయి. కొందరు సహజమైన పరిష్కారాల కోసం చూస్తారు. అవీ ఉన్నాయి. జీవనశైలిలో మార్పుల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
టెన్షన్ పడకుండా, మనకు సరిపోయే పద్ధతేమిటో తెలుసుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: మీ పుస్తకంలో భయపెట్టే విషయం ఒకటి ప్రస్తావించారు. "ఒక 45 ఏళ్ల మహిళకు జీవితంలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఇరవై శాతం. అదే వయసున్న పురుషుడికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పది శాతం." ఎందుకు ఇలా జరుగుతంది? మహిళల మెదడు అంత బలహీనంగా ఉండడానికి కారణాలేంటి?
జవాబు: వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలకు అల్జీమేర్స్ సోకే అవకాశం పెరుగుతుందన్నది చాలా కాలంగా తెలిసిన విషయమే. మహిళల ఆయుర్దాయం పురుషుల ఆయుర్దాయం కంటే ఎక్కువ కావడమే దీనికి కారణమని ఇటీవల కాలం వరకు అనుకునేవాళ్లు.
అల్జీమర్స్ ఎక్కువగా వయసు మళ్లినవారికే వస్తుంది. కానీ, అసలు కారణం అది కాదు. మహిళలలో హార్మోన్ల ఏజింగ్ దీనికి ప్రధాన కారణం.
స్త్రీ హార్మోన్లు, ముఖ్యంగా ఈస్ట్రాడియోల్ వృద్ధాప్యం, వ్యాధుల నుంచి మెదడును రక్షిస్తుందనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రాతిపదికగా ఈ మధ్యే మేం 'ది ఈస్ట్రోజెన్ హైపోథెసిస్ ఆఫ్ అల్జీమర్స్' అనే పరిశోధనను ముందుకు తీసుకొచ్చాం.
మెనోపాజ్ తరువాత ఈస్ట్రాడియోల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో, మెదడు రక్షణ కవచం కోల్పోతుంది. అందుకే, అల్జీమర్స్ లాంటి వ్యాధులు సులువుగా దాడి చేస్తాయి.
కొంత మంది మహిళలకు డిమెన్షియా రావడానికి మెనోపాజ్ ట్రిగ్గర్ కావచ్చని మా పరిశోధనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: మహిళలు తమ మెదడు గురించి ఏం తెలుసుకోవాలి?
జవాబు: మహిళలకు మధ్య వయసులో ఆరోగ్యమే, తరువాతి దశలో, వృద్ధాప్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తుంది.
అందుకే, మధ్య వయసుకు రాగానే ఆడవాళ్లు తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్‌పై.
మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం స్వార్థం కాదు.
మా పరిశోధన మీకు ఉపయోపడుతుందని ఆశిస్తున్నాం. మెనోపాజ్ దశలో, ఆ తరువాత కూడా మీ అందమైన మెదడును కాపాడుకోవడానికి పనికొస్తుందని భావిస్తున్నాం.
ప్రశ్న: మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యాధుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు? మహిళలకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు: వయసుతో సంబంధం లేకుండా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా చేయొచ్చు.
పొగాకు, సిగరెట్ మానేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, మంచి ఆహార విధానాన్ని అనుసరించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్ర, పర్యావరణానికి హాని కలిగించేవాటికి దూరంగా ఉండడం.. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. భవిష్యత్తులో డిమెన్షియా వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.
దీనికి క్రమశిక్షణ అవసరం. ఫలితాలు జీవితాంతం పొందవచ్చు.
ఇదే కాకుండా, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా హార్మోన్లకు సంబంధించినవి.
అల్జీమర్స్ నుంచి రక్షించుకునేందుకు ముందస్తు పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి.
మెనోపాజ్ వల్ల మహిళల అండాశయాలు ఎంత ప్రభావితం అవుతాయో, మెదడూ అంతే ప్రభావితం అవుతుంది.
"మెదడు ఆరోగ్యమే మహిళల ఆరోగ్యం" - ఇదే నేనిచ్చే నినాదం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి... ముగ్గురూ మోదీకే జై కొడుతున్నారా?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














