చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రచయిత, వి. రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ‘‘చార్ ధామ్ యాత్ర’’ ఒకటి. ఈ యాత్రలో హిందువులు నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు.
2023 ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరచుకున్నాయి. ఏప్రిల్ 22, అక్షయ తృతీయ రోజున యమునోత్రి-గంగోత్రిల దర్శనం ప్రారంభమైంది.
ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ ప్రారంభం కానుంది.
చార్ ధామ్ యాత్ర అంటే ఏంటి?
హిమాలయ పర్వతాల్లో ఉండే నాలుగు దేవాలయాలను దర్శించే యాత్రను చార్ ధామ్ (నాలుగు క్షేత్రాలు) అంటారు. ఇవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి.
నాలుగు క్షేత్రాలు:
- యమునోత్రి
- గంగోత్రి
- కేదార్‌నాథ్
- బద్రీనాథ్
ఈ నాలుగు క్షేత్రాలను జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించాలన్నది హిందువులలో కొందరి విశ్వాసం.




ఎప్పుడు వెళ్లాలి?
ఏటా ఏప్రిల్, మే నెలల్లో చార్ ధామ్ యాత్ర మొదలవుతుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలి కాలమంతా మంచు కప్పి ఉంటుంది. వాటిని దర్శించడం కుదరదు. అందువల్ల ఆరు నెలల పాటు దేవాలయాను మూసేసి ఉంచుతారు.
వేసవిలో అంటే ఏప్రిల్-మే మధ్య ఆ నాలుగు క్షేత్రాలను భక్తుల కోసం తెరుస్తారు. అక్టోబరు-నవంబరు మధ్య వాటిని మూసేస్తారు. అంటే ఆరు నెలల పాటు ఈ దేవాలయాలు తెరచి ఉంటాయి.
2023కు సంబంధించి చార్ ధామ్ యాత్ర ఇప్పటికే ప్రారంభమైంది.
యాత్ర ఎలా సాగుతుంది?
చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో(క్లాక్ వైజ్) ప్రారంభించాలనే నమ్మకం ఉంది. యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల దర్శనంతో ముగుస్తుంది. అందరూ ఇలాగే చేయాలని లేదు. కొందరు కొన్నింటిని మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి రైలు, విమానం ద్వారా ఉత్తరాఖండ్‌కు చేరుకోవచ్చు.
రైలు ప్రయాణం:
సికింద్రాబాద్-దిల్లీ
దిల్లీ-రిషికేశ్ (లేదా) దిల్లీ-దెహ్రాదూన్
రిషికేశ్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఉంటుంది. దెహ్రాదూన్ నుంచి అయితే 175 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు తీసుకొని వెళ్లొచ్చు.
విమాన ప్రయాణం:
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి దెహ్రాదూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌కు విమానాలు నడుస్తున్నాయి. కాకపోతే వీటిలో నేరుగా వెళ్లేవి చాలా తక్కువ. ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి.
హైద్రాబాద్-దిల్లీ-దెహ్రాదూన్
హైద్రాబాద్-ముంబయి-దెహ్రాదూన్
హైద్రాబాద్-బెంగళూరు-ముంబయి-దెహ్రాదూన్... ఇలా ఒకటి లేదా రెండు స్టాపులతో ఉంటాయి.
దెహ్రాదూన్ ఎయిర్‌పోర్ట్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఉంటుంది.
బస్సు ప్రయాణం:
హైదరాబాద్ నుంచి దిల్లీకి చేరుకున్నాక ఇక్కడి నుంచి రిషికేశ్ బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి హనుమాన్ చట్టీకి బస్సులు ఉంటాయి. హనుమాన్ చట్టీ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఉంటుంది.
ఆసక్తి ఉన్న వాళ్లు సొంత వాహనాలలో కూడా వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి రిషికేశ్‌కు సుమారు 1800 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ముందుగా https://uttarakhandtourism.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తరువాత Explore అనే ట్యాబ్‌లో Spiritual అనే సెక్షన్ కింద Char Dham అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. లేదా https://uttarakhandtourism.gov.in/activity/char-dham ఈ లింకును క్లిక్ చేస్తే సరిపోతుంది.
అక్కడ Registration అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాస్‌వార్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి.
ఆ తరువాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ తరువాత మొబైల్ నెంబర్, పాస్‌వార్డ్ సాయంతో లాగిన్ కావాలి.
Create/Manage Tour Info అనేదాని మీద క్లిక్ చేయాలి.
Plan Your Tour కింద ఉండే Add New Tourను సెలెక్ట్ చేసుకోవాలి.
అక్కడ కింది వివరాలు ఇవ్వాలి...
Tour Duration: ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు... తేదీలు ఇవ్వాల్సి ఉంటుంది.
Check Availbility: మీరు ఎంచుకున్న తేదీల్లో స్లాట్లు ఖాళీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
No.of Tourists: ఎంత మంది వస్తున్నారు.
Mode of Travel: ఎలా వస్తున్నారు... అంటే రోడ్డు, హెలికాప్టర్, నడక... అనేది చెప్పాలి.
Plan Your Destination: ఏ రోజు ఏ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటున్నారో తేదీలను ఎంచుకోవాలి.
ఇవ్వాల్సిన వివరాలు:
- పేరు
- మొబైల్ నెంబర్
- ఈమెయిల్ ఐడీ
- ఆధార్ కార్డ్ నెంబర్
- అడ్రస్
- ఎమర్జెన్సీ కాంటాక్ట్: అత్యవసర సమయంలో మీ బంధువులు/స్నేహితులను కాంటాక్ట్ చేసేందుకు వారి వివరాలు
- ఐడీ ప్రూఫ్
- పాస్ పోర్ట్ సైజు ఫొటో
సాధారణంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వచ్చే యాత్రికుల చార్ ధామ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి మొదలవుతుంది. విమాన మార్గంలో వస్తే దెహ్రాదూన్ నుంచి ప్రారంభమవుతుంది.

ఫొటో సోర్స్, HTTPS://REGISTRATIONANDTOURISTCARE.UK.GOV.IN/
ట్రావెల్ ప్యాకేజీలు
ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా చార్ ధామ్ యాత్ర కోసం రవాణా, హోటల్ సేవలు అందిస్తుంటాయి.
- రిషికేశ్-యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్-బద్రినాథ్-రిషికేశ్
- హరిద్వార్-యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్-బద్రినాథ్-హరిద్వార్
- దెహ్రాదూన్-యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్-బద్రినాథ్-హరిద్వార్
- దిల్లీ-యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్-బద్రినాథ్-హరిద్వార్
- రిషికేశ్- కేదార్‌నాథ్-బద్రినాథ్-రిషికేశ్
...ఇలా భిన్న మార్గాల్లో 14 ప్యాకేజీలను ఉత్తరాఖండ్ టూరిజం శాఖ అందిస్తోంది.
ప్యాకేజీలు ఎలా బుక్ చేసుకోవాలి?
- https://uttarakhandtourism.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- Explore అనే ట్యాబ్‌లో Spiritual అనే సెక్షన్ కింద Char Dham అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. లేదా https://uttarakhandtourism.gov.in/activity/char-dham ఈ లింకును క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఆ తరువాత Packages అనే విభాగంలో Tour No.01 నుంచి Tour No.14 వరకు ప్యాకేజీలు ఉంటాయి. వాటిలో మీకు నచ్చినవి ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు Tour No.01లో రిషికేశ్-యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్-బద్రినాథ్-రిషికేశ్ యాత్ర ఉంది. ఇది ఆరు రోజులు జరుగుతుంది.

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉత్తరాఖండ్ టూరిజం విభాగానికి చెందిన పీఆర్‌ఓ ఉన్నట్లు వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
మొబైల్:9493982645
ల్యాండ్ లైన్: 040-23409945... ప్యాకేజీల కోసం ఈ నెంబర్లలోనూ సంప్రదించొచ్చు.
హెలికాప్టర్ ప్యాకేజీలు:
హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్లాలనుకునే యాత్రికులు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న https://heliservices.uk.gov.in/ లేదా https://heliyatra.irctc.co.in/ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం... హెలికాప్టర్ ప్యాకేజీ ధరలు(రౌండ్ ట్రిప్)
- గుప్తకాశీ-కేదార్‌నాథ్: రూ.7,740
- ఫాటా-కేదార్‌నాథ్: రూ.5,500
- సెర్సీ-కేదార్‌నాథ్: రూ.5,498
ముందు చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అయిన తరువాతే హెలికాప్టర్ సర్వీసును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఒక యూజర్ రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు.
- ఒక్కో టికెట్ మీద ఆరుగురు ప్రయాణించొచ్చు. అంటే ఒక యూజర్ ఐడీతో 12 మంది మాత్రమే ప్రయాణించగలరు.
- 2ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం. కాకపోతే సీటు ఇవ్వరు. 2ఏళ్లు దాటిన పిల్లలకు పూర్తి చార్జీ వసూలు చేస్తారు.
- హెలికాప్టర్ ఎక్కడానికి గంట ముందే చేరుకోవాలి.
- హెలికాప్టర్ ఎక్కే ప్రయాణికుల బరువును కొలుస్తారు. శిశువును ఎత్తుకొని ఉన్న వ్యక్తి బరువు(శిశువుతో కలిపి) 80 కిలోల కంటే ఎక్కువ ఉంటే అదనంగా కిలోకు రూ.150 చెల్లించాలి.
ఉదాహరణకు ఒక బిడ్డను ఎత్తుకున్న తల్లి బరువు 90 కేజీలు ఉంటే అదనంగా ఉన్న 10 కేజీలకు డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఒక్కో కేజీకి రూ.150 చొప్పున రూ.1500 కట్టాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- చార్ ధామ్ క్షేత్రాలు నాలుగూ సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటాయి.
- తెలుగు రాష్ట్రాల వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాగే ఉన్నట్టుండి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కూడా. కనుక ముందుగానే అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాలి.
- యాత్రకు ముందు అందరూ ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.
- ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వాటికి సంబంధించిన మందులను దగ్గర ఉంచుకోవాలి. ప్రిస్కిప్షన్, డాక్టర్ల వివరాలు కూడా దగ్గరే ఉండాలి.
- వయోవృద్ధులు, కోవిడ్-19 వైరస్ సోకి బాగా అనారోగ్యానికి గురైన వారు యాత్ర చేయకపోవడమే మంచిదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది.
- తగినన్ని స్వెటర్లు, రగ్గులు తెచ్చుకోవాలి.
- గుండె సమస్యలు, శ్వాసకోస ఇబ్బందులు, డయాబెటిస్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- పొగతాగడం, మద్యం తీసుకోవడం చేయకూడదు.
- యూవీ కిరణాల నుంచి తప్పించుకునేందుకు సన్ స్ర్కీన్ లోషన్, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
- ఖాళీ కడుపుతో ఉండకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి.
- ఏదైనా అత్యవసర సమయంలో 104, 108 హెల్ప్ లైన్లను సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర జాగ్రత్తలు
అన్నింటికన్నా ముందు మీరు సరైన ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకుంటున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
- ఏటా తెలుగు యాత్రికులు ఎక్కడో ఒక చోట ట్రావెల్ ఏజెన్సీలను నమ్మి మోసపోవడం, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారింది. కనుక ముందుగానే నమ్మదగ్గ సేవలు అందించే ట్రావెల్ ఏజెన్సీల్లో మాత్రమే మీ టూర్ బుక్ చేసుకోండి.
- కొన్ని సార్లు అనుకోకుండా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడవచ్చు. అప్పుడు కొన్ని గంటల పాటు ఆహారం దొరికే పరిస్థితి ఉండదు. కనుక బిస్కెట్ ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్, గ్లూకోజ్, చాక్లెట్లు ఇతర స్నాక్స్ తీసుకెళ్లడం మంచిది.
- యాత్రలో భాగంగా కిలోమీటర్ల దూరం ఎత్తయిన కొండలు, లోయల మధ్య నడవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీకు వ్యాయామం అలవాటు లేకపోతే యాత్రకు 4 నెలల ముందు నుంచే ప్రారంభించడం మంచిది. లేదంటే కనీసం నెల రోజుల ముందు నుంచి వ్యాయామం, నడక అలవాటు చేసుకోవడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు ఉండవు.
- ప్యాక్ చేసిన లేదా కాచిన నీటిని మాత్రమే తీసుకోండి.
- అన్నింటితో పాటు ఉన్ని రగ్గు, గొడుగు, రెయిన్ కోట్, టార్చిలైట్, కాన్వాస్ షూస్ ఇవి మీ ప్రయాణంలో కావాల్సిన కనీసం అవసరాలు. కనుక వీటిలో ఏ ఒక్కటీ మర్చిపోకండి.
- స్థానిక పరిస్థితులపై అక్కడ ఉండే వారికి మాత్రమే అవగాహన ఉంటుంది. అందుకే దారులు తెలుసుకునేందుకు స్థానికంగా ఉండే దుకాణదారులపై ఆధారపడండి. కనీసం ఇద్దరి నుంచి నిర్ధరించుకోండి.
- ఫోన్లు, కెమెరాలకు అదనపు బ్యాటరీలను లేదా బ్యాటరీ బ్యాకప్‌లను తీసుకెళ్లడం తప్పనిసరి.
ప్రైవేటు వాహనాలు ఉంటే:
- వాహనాలను రిజిస్టర్ చేయించుకోవాలి.
- ప్రయాణికుల జాబితా డ్రైవర్ వద్ద ఉండాలి.
- ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం నుంచి గ్రీన్ కార్డు తీసుకోవాలి.
- పార్కింగ్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ కచ్చితంగా వాడాలి.
చేయకూడనివి:
- పర్వత మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య వాహనాలు నడపకూడదు.
- ఘాట్ రోడ్లలో ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేయకూడదు.
- వాహనాల మీద కూర్చోకూడదు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















