డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరాసన్ ఎథిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
హిమాలయ దేశం భూటాన్, రెండు ఆసియా దిగ్గజ దేశాలైన భారత్, చైనా మధ్య ఉంది. ఈ ప్రత్యేక భౌగోళిక స్థానం కారణంగా భూటాన్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చైనాకు అటు భూటాన్‌తో ఇటు భారత్‌తో సరిహద్దు వివాదం ఉంది.
భారత్, చైనా మధ్య హిమాలయ సరిహద్దుపై చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో చైనా ఎదుగుదల భూటాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. చైనాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా భూటాన్‌పై ఒత్తిడి వస్తోంది.
ఈ ఒప్పందం కుదరాలంటే భూటాన్‌కు దాని మిత్రదేశమైన భారత్ అంగీకారం అవసరం.
భారత్, భూటాన్ మధ్య మంచి అనుబంధం ఉంది. భూటాన్‌కు లక్షల మిలియన్ డాలర్ల ఆర్థిక, సైనిక సహాయాన్ని భారత్ అందిస్తోంది.
చైనా, భూటాన్‌లకు హిమాలయ ఉత్తర, పశ్చిమ భూభాగాల విషయంలో వివాదాలు ఉన్నాయి.
ఈ మూడు దేశాలకు మధ్య వివాదాస్పదంగా మారిన భూభాగాల్లో ప్రధానమైనది డోక్లాం. భారత్, భూటాన్, చైనా కూడలికి సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, భూటాన్ రెండూ కూడా డోక్లాం ప్రాంతం తమదేనని చెప్పుకుంటాయి.
ఈ విషయంలో భూటాన్‌కు భారత్ అండగా నిలుస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డోక్లాం ప్రాంతం భారత్‌కు భద్రతపరంగా చాలా కీలకమైనది. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తే, సిలిగురి కారిడార్‌కు ప్రమాదం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కారిడార్‌ను చికెన్ నెక్ అని పిలుస్తారు. భారత ప్రధాన భూభాగాన్ని, ఈశాన్య రాష్ట్రాలతో కలిపేలా 22 కి.మీ వ్యాప్తితో ఈ కారిడార్ ఉంటుంది.
ఈ సమస్యకు పరిష్కారం కేవలం భూటాన్ చేతుల్లోనే లేదని ఇటీవల బెల్జియం వార్తా పత్రిక లా లిబ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భూటాన్ ప్రధానమంత్రి లోటే షెరింగ్ చెప్పారు.
"ఇది మూడు దేశాల సమస్య. ఇక్కడ పెద్ద దేశం, చిన్న దేశం అనే మాట లేదు. అన్ని దేశాలు సమానమే. ప్రతీ దేశం మూడో దేశం వైపు చూస్తోంది. మేం సిద్ధంగా ఉన్నాం. మిగతా రెండు దేశాలు కలిసి వస్తే మేం చర్చించడానికి సిద్ధమే’’ అని ఆయన తెలిపారు.
ఒకట్రెండు సమావేశాల్లో భూటాన్, చైనా వాటి సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలకు హద్దులను నిర్ణయించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1984 నుంచి భూటాన్, చైనా మధ్య సరిహద్దు చర్చలు నడుస్తున్నాయి.
తమ భూభాగంలోకి చైనా చొచ్చుకు రాలేదని షెరింగ్ చెప్పారు.
షెరింగ్ వ్యాఖ్యలు భారత్‌ను ఆలోచనలో పడేలా చేశాయి. ముఖ్యంగా మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. భూటాన్, చైనా మధ్య ట్రై జంక్షన్ విషయంలో ఏదైనా స్వాప్ అగ్రిమెంట్ (మార్చుకునే ఒప్పందం) కుదిరే అవకాశం ఉండొచ్చని చాలా మంది వ్యాఖ్యాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డోక్లాం విషయంలో భూటాన్ తన వాదనలను గట్టిగా వినిపించట్లేదని కొందరు వ్యాఖ్యాతలు అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
‘‘భారత్‌ను వేధించడానికే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని భూటాన్‌పై చైనా ఒత్తిడి తెస్తోందని భారత్ ఆందోళన చెందుతోంది’’ అని భారత మాజీ సీనియర్ దౌత్యవేత్త, హిమాలయ ప్రాంత వ్యవహారాల నిపుణుడు పి. స్టోబ్డన్ అన్నారు.
‘‘తమ విభేదాలను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని భూటాన్ భావిస్తోంది. వివాదాన్ని పరిష్కరించడంలో చైనా పాత్రకు సంబంధించి ఇటీవల భూటాన్ వైఖరిలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి’’ అని ఆయన చెప్పారు.
భారత మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో షెరింగ్ ఏప్రిల్ మొదట్లో ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యల గురించి స్పష్టత ఇచ్చారు.
‘‘నేను కొత్తగా ఏమీ చెప్పలేదు. భూటాన్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు’’ అని భూటాన్‌కు చెందిన ఒక పత్రికతో షెరింగ్ చెప్పారు.
షెరింగ్ వ్యాఖ్యలకు భారత మీడియాలో వచ్చిన స్పందన చూసి చాలా మంది భూటాన్ ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ విషయంలో భారత్ మద్దతు లేకుండా ఒక ఒప్పందానికి రావడానికి భూటాన్ చెమటోడ్చాల్సి వస్తుందని చైనా అభిప్రాయపడుతోంది.
‘‘ఇక్కడ అడ్డంకి భారత్. ఒకవేళ సరిహద్దు అంశాన్ని భూటాన్, చైనా పరిష్కరించుకుంటే భారత్ ఒంటరిగా మిగిలిపోతుంది. భారత్ ఇలా జరుగనిస్తుందని నేను అనుకోను’’ అని షాంఘై ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ సీనియర్ ఫెలో లియు జోంగీ బీబీసీతో చెప్పారు.
1996 సమయంలో చైనా, భూటాన్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యేలా కనిపించిందని, భారత జోక్యం వల్ల అది విఫలమైందని లియు తెలిపారు.
భూటాన్-చైనా సరిహద్దు సమస్యలు దశాబ్దాల నాటి భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్నాయి.

భారత్, చైనా సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను తమవంటే తమవని చెప్పుకుంటాయి. తమకు 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉందని భారత్ చెబుతుండగా, 2,000 కి.మీ సరిహద్దు ఉందని చైనా అంటుంది.
ఇరు దేశాల వాస్తవ సరిహద్దు భారత్‌లోని లద్దాఖ్ ప్రాంతం నుంచి మొదలై అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పిలుస్తుంది.
ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా, సైనిక పరంగా చైనా ఎదుగుదలను చాలా మంది భూటాన్ వాసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనాతో రాజీకి వస్తే తమ దేశానికి మంచిదని వారు భావిస్తున్నారు.
1949లో భారత్, భూటాన్ ఒక ప్రత్యేక ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత భద్రత అంశాలను ఈ ఒప్పందం పరిగణనలోకి తీసుకుంటుంది.
2007లో చేసిన సవరణ ఒప్పందం, భూటాన్‌కు విదేశాంగ విధానం, సైనిక కొనుగోళ్ల విషయంలో మరింత స్వేచ్ఛను ఇచ్చింది.
భూటాన్‌లో వందల మంది భారత సైనికులు ఉన్నారు. భూటాన్ బలగాలకు భారత సైనికులు శిక్షణ ఇస్తున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. భూటాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయం డోక్లాంకు 20 కి.మీ దూరంలో ‘హా’ అనే పట్టణంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
డోక్లాం నిర్వహణను భూటాన్ చూసుకోవాలనే పట్టును భారత్ వదిలేస్తే, భూటాన్‌కు చైనాతో సరిహద్దు పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని వాంగ్చా సంగే లాంటి భూటాన్ వ్యాఖ్యాతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా చమురుతోపాటు తమ అవసరాల్లో ఎక్కువ ఉత్పత్తులను భారత్ నుంచే భూటాన్ దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దిగుమతుల విషయంలో పొరుగునే ఉన్న చైనాతో జతకట్టడం ద్వారా భూటాన్ కొత్త మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని వాంగ్చా సంగే అభిప్రాయపడ్డారు.
భూటాన్ ప్రధాని వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆచితూచి స్పందించింది.
‘‘పరస్పర జాతీయ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా భారత్-భూటాన్ మధ్య సన్నిహిత అనుబంధం, సహకారం కొనసాగుతోంది’’ అని భారత విదేశాంగ శాశ్వత కార్యదర్శి వినయ్ మోహన్ అన్నారు.
డోక్లాంకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యంవల్ల దాని చుట్టుపక్కల పునర్ వ్యవస్థీకరణను భారత్ కోరుకోవడం లేదు.
మరోవైపు, భూటాన్ లాంటి దేశానికి చైనాపై ఒత్తిడి తీసుకురావడం చాలా కష్టం.
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు గొప్ప ఆర్థిక వ్యవస్థలతో (భారత్, చైనా) సరిహద్దును పంచుకోవడంలో భూటాన్ గొప్ప స్థానంలో ఉండొచ్చు. కానీ భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపరంగా చూస్తే భూటాన్ మరింత ప్రమాదకర స్థితిలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















