చైనా: కుందేలు అనుకొని మనిషిని షూట్ చేశారు

కుందేలు
ఫొటో క్యాప్షన్, చైనాలో కుందేళ్లను తినడం సర్వసాధారణం.
    • రచయిత, నికోలస్ యోంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనాలో చెట్ల పొదల్లో ఉన్న వ్యక్తిని కుందేలు అనుకొని షూట్ చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన వ్యక్తిని వాంగ్ మౌజిన్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన నలుగురిని అరెస్టు చేశారు.

ఏప్రిల్ 14 సాయంత్రం ఆ నలుగురు వ్యక్తులు జియాంగ్జి ప్రావిన్స్‌లోని షాక్సీ టౌన్‌లో వేటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తుపాకీ కాల్పుల లాంటి ఘటనలు చైనాలో చాలా అరుదు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

"ఇది అమెరికా వార్త అనుకున్నాను"

జిన్‌జౌ జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. వాంగ్ మౌజిన్‌ షాక్సీ టౌన్‌లోని పరిసరాల్లో చేపలు పట్టడానికి వెళ్లారు.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న నలుగురు వేటగాళ్లు గడ్డిలో కదలికలు గమనించారు.

దీంతో కుందేలుగా పొరబడి గడ్డి వైపు కాల్పులు జరిపారు. ఘటనలో వాంగ్ మృతిచెందారు.

కేసుపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

వాంగ్ నీటిలో మునిగి చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

చైనాలో కఠినమైన తుపాకీ చట్టాలు ఉన్నాయి. బొమ్మ తుపాకీలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. దీంతో తాజా ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

ఈ దేశంలో మనుషులు తుపాకీ కలిగి ఉండటం ఎలా సాధ్యమని చైనా సోషల్ మీడియా యాప్ అయిన వీబోలో ఒక నెటిజన్ ప్రశ్నించారు.

"ఇది అమెరికా వార్త అనుకున్నాను" అని మరో నెటిజన్ స్పందించారు.

చైనాలో వేటాడటానికి అనుమతిస్తారు. కానీ, ఎక్కువగా సైన్యం, చట్టం అమలు చేసేవారికి, భద్రతా సిబ్బందికే తుపాకులను పరిమితం చేస్తారు.

తుపాకులు, పేలుడు పదార్థాలతో కూడిన నేరాలను అరికట్టాలని భావిస్తున్నట్లు జిన్‌జౌ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అటువంటి నేరాలకు వ్యతిరేకంగా చైనా మూడేళ్లుగా అవగాహన కల్పిస్తోంది.

నిర్దిష్ట లక్ష్యాన్ని షూట్ చేయడానికి ఎయిర్ గన్ వాడుతుంటారు. ఎయిర్ గన్, కంప్రెస్డ్ ఎయిర్‌ను ఉపయోగించి పెల్లెట్లను సంధిస్తుంది.

జియాంగ్జీ వంటి ప్రావిన్సులో చైనీస్ కుందేళ్లు ఎక్కువ. వీటిని తినడం సర్వసాధారణం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)