జనాభాలో చైనాను దాటనున్న భారత్‌కు పెను సవాళ్లు ముందున్నాయా ?

- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- భారతదేశంలో జనాభా వృద్ధిరేటు తగ్గుతోంది కానీ, జనాభా పెరుగుతూనే ఉంది.
- ఈ ఏడాది సగం గడిచేసరికి దేశ జనాభా 142 కోట్ల 86 లక్షలకు చేరుకోనుందని అంచనా. ఇది చైనా జనాభా కంటే 29 లక్షలు ఎక్కువ.
- జనాభా పెరుగుదల దేశ వనరులపై ఒత్తిడి పెంచుతుంది. పాలసీకి సంబంధించిన సవాళ్లు పెరుగుతాయి.
- గృహ, రవాణా, ఆరోగ్యం, విద్యా సౌకర్యాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించవలసి ఉంటుంది.
- పెరుగుతున్న జనాభా కారణంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య పెరగవచ్చు.
- భారతదేశ వృద్ధుల జనాభా (65 ఏళ్లు పైబడిన వారు) మొత్తం జనాభాలో కేవలం 7 శాతం మాత్రమే.
- వృద్ధులకు ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారవచ్చు.
ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుంది.
ఈ ఏడాది సగంలో దేశ జనాభా 142 కోట్ల 86 లక్షలకు చేరుకుంటుందని, ఇది చైనా జనాభా 142 కోట్ల 57 లక్షల కంటే 29 లక్షలు ఎక్కువగా ఉంటుందని అంచనా.
2011 తరువాత దేశంలో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. కాబట్టి, ప్రస్తుతం దేశ జనాభాకు సంబంధించిన అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు.
అయితే, 2020లో జనాభా అంచనాలపై 'నేషనల్ కమీషన్ ఆన్ పాపులేషన్' ఒక నివేదికను విడుదల చేసింది. 2011, 2036 మధ్య 25 సంవత్సరాలలో భారతదేశ జనాభా 121 కోట్ల 10 లక్షల నుంచి 152 కోట్ల 20 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది.
దీని ఫలితంగా, జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 368 నుంచి 463 మందికి పెరుగుతుంది.
కాగా, దేశ జనాభా వృద్ధిరేటు తగ్గుముఖం పట్టింది. ఆయుర్దాయం పెరగడం, తక్కువమంది పిల్లల్ని కనడం ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ, జనాభా పెరుగుతూనే ఉంది. ఇంకా చాలా సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? పరిశీలిద్దాం.

వనరుల కొరత
సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే అతిపెద్ద సవాలు.
జనాభా పెరుగుదల కారణంగా భూమి, నీరు, అడవులు, ఖనిజాలు అవసరానికి మించి వినియోగించాల్సి వస్తుంది.
నీటి కొరత ఏర్పడవచ్చు. వ్యవసాయ ఉత్పాదకత, పర్యావరణం క్షీణించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మౌలిక సదుపాయాలపై ఒత్తిడి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ, రవాణా, ఆరోగ్య, విద్యా సౌకర్యాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించాల్సి ఉంటుంది.
జనాభా అవసరాలను తీర్చడం కష్టమవుతుంది. జనాభాలో ఎక్కువ భాగం దుర్భరమైన పరిస్థితుల్లో జీవించాల్సి రావచ్చు.

ఫొటో సోర్స్, RAHUL KOTYAL/BBC
నిరుద్యోగం
జనాభా పెరుగుతుంటే పని చేయగల సామర్థ్యం ఉన్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం సవాలుగా మారుతుంది. లేదా నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవచ్చు.
ఇప్పటికే దేశంలో నిరుద్యోగ సమస్య ప్రబలంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా ఈ సమస్య భవిష్యత్తులో మరింత తీవ్రం కావచ్చు.
దీనివల్ల ఆర్థిక అసమానతలు, పేదరికం పెచ్చుమీరుతాయి. సామాజిక అస్థిరత, అశాంతి చోటుచేసుకోవచ్చు.
విద్య, నైపుణ్యాల కుంగుబాటు
అధిక జనాభాకు విద్య, నైపుణ్యం కల్పించడం సవాలుగా మారుతుంది. విద్యాసంస్థలు సామర్థ్యాన్ని మించి పనిచేయాల్సి రావచ్చు.
ఫలితంగా, ఎక్కువమందికి విద్య అందకపోవచ్చు. దీనివలన అసమానతలు మరింత పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
పేదరికం, అసమానతలు
పెరుగుతున్న జనాభా కారణంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య పెరగవచ్చు. ఆదాయ అసమానతలు పెరిగే ప్రమాదం ఉంది.
పేదరికాన్ని తగ్గించే ప్రయత్నాలను సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయడం పెద్ద సవాలుగా మారవచ్చు.
ప్రజల కోసం సమర్థవంతమైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడం, అమలు చేయడం ప్రభుత్వాలకు సమస్యగా పరిణమించవచ్చు.
విద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలు తగినన్ని లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలలో లోతైన అసమానతలు పొడజూపగలవు.

పర్యావరణ సవాళ్లు
జనాభా పెరుగుదల పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
అటవీ నిర్మూలన, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ప్రధాన సవాళ్లుగా మారతాయి.
సామాజిక సవాళ్లు
అధిక జనాభా రద్దీని పెంచడమే కాకుండా పట్టణీకరణను ప్రోత్సహిస్తుంది. నేరాలు పెరుగుతాయి, శాంతిభద్రతలను పరిరక్షించడం కష్టమవుతుంది.

పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ప్రశ్నలు
అధిక జనాభా పర్యావరణం, వనరులపై ఒత్తిడి తెస్తుందనే విషయాన్ని తిరస్కరించలేమని 'పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా'లో పాలసీ అండ్ ప్రోగ్రామ్స్ లీడ్ సంఘమిత్ర సింగ్ అన్నారు.
అందుకే, జనాభా సంఖ్యపై ఆందోళన, చర్చ జరుగుతోందని ఆమె అన్నారు.
అయితే, "భారతదేశం చాలాకాలంగా జనాభా సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు మొదటి స్థానానికి రావడం మరీ అంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు" అని ఆమె అన్నారు.
ఇంతకీ, ఆదర్శప్రాయమైన జనాభా పరిణామం అనేది ఉంటుందా?
"ఏ దేశానికీ అనువైన జనాభా పరిమాణం లేదు. జనాభా అంటే వ్యక్తులు. సంఖ్య కంటే వ్యక్తులపై దృష్టి పెట్టడం మంచి విధానం. అందరికీ సరైన అవకాశాలు, విద్య, ఆరోగ్యం అందుతున్నాయా, లేదా అని చూడాలి. అసమానతలు తగ్గించేందుకు అవసరమైన విధానాలపై దృష్టి పెట్టాలి. అదే ముఖ్యం" అని సంఘమిత్ర అభిప్రాయపడ్డారు.

సంతానోత్పత్తి రేటులో తరుగుదల
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, భారతదేశంలోని అన్ని మత సమూహాలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది.
జనాభాను సంతానోత్పత్తి రేటుతో మాత్రమే ముడిపెట్టడం అంటే మొత్తం భారం మహిళలపైనే వేస్తున్నారని అర్థం అన్నారు సంఘమిత్ర.
"జనాభా తగ్గుతున్నప్పుడు, మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని, జన సంఖ్య పెరుగుతున్నప్పుడు తక్కువమంది పిల్లల్ని కనాలని చెబుతూ మహిళలపై భారం మోపుతున్నారు. మహిళల ఇష్టాయిష్టాలు, స్వేచ్ఛా, స్వాతంత్రాలకు ఏమైనా గౌరవం ఇస్తున్నామా?
ఇప్పటికే సమాజంలో పితృస్వామ్యం, జెండర్ అసమానతలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది పిల్లలని కనాలో నిర్ణయించుకునే హాక్కు, గర్భనిరోధక సాధనాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల పరిస్థితి ఎలా ఉంది? ఇవి అడగాల్సిన ప్రశ్నలు. చర్చించాల్సిన విషయాలు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధ జనాభా విషయంలో ఆందోళనలు
దేశంలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు మొత్తం జనాభాలో 40 శాతం మంది ఉన్నారు.
25 ఏళ్ల నుంచి 64 ఏళ్లున్న వారు మొత్తం జనాభాలో సగం మంది.
వృద్ధులు అంటే 65 ఏళ్లు పైబడిన వారు మొత్తం జనాభాలో కేవలం 7 శాతం మంది మాత్రమే.
కానీ, భారతదేశ జనాభా వృద్ధి రేటు పడిపోతోంది కాబట్టి, రాబోయే దశాబ్దాలలో జనాభాలో ఎక్కువ భాగం వృద్ధులే అవుతారనే ఆందోళనలు ఉన్నాయి.
‘‘నేడు భారతీయుల సగటు వయసు 28 సంవత్సరాలైతే, ఆ తరువాత 30 ఏళ్లలో సగటు వయసు 58 ఏళ్లకు పెరగుతుంది’ అని సంఘమిత్రా సింగ్ తెలిపారు.
అందుకే పెరుగుతున్న జనాభా వల్ల వచ్చే అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు, యువత నుంచి ప్రయోజనాలు పొందాలంటే కేవలం 30 ఏళ్ల సమయం మాత్రమే ఉందని చెబుతుంటామని అన్నారు.
ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, వారి జనాభాలో యువత ఉంటారు. ఆ తరువాత వారు వృద్ధులుగా మారుతాారు. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని సంఘమిత్రా సింగ్ చెప్పారు.
30 ఏళ్ల తరువాత ఏం జరగబోతోందన్నదే ఈరోజు ఆలోచించాల్సిన విషయమని సంఘమిత్రా సింగ్ చెప్పారు.
‘‘సామాజిక భద్రతా చర్యలు తీసుకోవాలి. వృద్ధుల కోసం ఆరోగ్య సంరక్షణలో మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. దేశంలో ఎక్కడైతే లింగ అసమానతలు ఉంటాయో, అక్కడ వృద్ధ మహిళలు పలు సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిపై తగిన శ్రద్ధ చూపాలి. వారికి సాయపడాలి. వారి ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించాలి’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














