భారత జనాభా గణనలో జాప్యం, డేటా విడుదలలో రాజకీయ జోక్యం... ఎందుకిలా?

భారత జనగణన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శరణ్య హృషికేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటీష్ పాలనలోని భారత్‌లో తొలిసారి 1881లో జనాభా గణాంకాల నమోదును చేపట్టినప్పుడు 25 కోట్ల మందికి పైగా ప్రజలు జనాభా గణన సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఆ తర్వాత 130 ఏళ్లకు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఎన్నో యుద్ధాలు, సంక్షోభాలను ఎదుర్కొన్నాక భారత్ ప్రతి దశాబ్దానికి ఒకసారి గణాంకాల నమోదు చేపట్టాలని నిర్ణయించింది.

వందలాది మంది జన గణన సిబ్బంది దేశంలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి ఆ ప్రజల స్థితిగతులను, ఉద్యోగాలను, ఆర్థిక పరిస్థితిని, వలస విధానాన్ని, సామాజిక-సాంస్కృతిక అలవాట్లను, ఇతర విషయాలను సేకరిస్తున్నారు.

ప్రపంచంలో జనాభా ప్రాతిపదికన రెండో అతిపెద్ద దేశమైన (ఈ ఏడాది చైనాను అధిగమించనున్న) భారత్ ఏ వైపుగా సాగుతున్నదో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా చట్టసభ్యులకు, ఆర్థిక వేత్తలకు, గణాంకాల నిపుణులకు కీలకమైన డేటాను అందించేందుకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన విధానం.

రాష్ట్రాలకు కేంద్రం నిధులను కేటాయించడం నుంచి స్కూల్స్‌ను ఏర్పాటు చేయడం, ఎన్నికల సమయంలో నియోజవర్గాల సరిహద్దులను విభజించడం వరకు ప్రతి నిర్ణయం కోసం ఈ డేటానే వాడుతూ ఉంటారు.

దశాబ్దానికి ఒకసారి భారత్ చేపట్టే జనగణన తొలిసారి ఆలస్యమైంది. ఈ గణనను 2021లో చేపట్టాల్సి ఉంది. కానీ, ఎప్పుడు ఈ లెక్కింపు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు.

దీనివల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా చేరవని, నిధుల కేటాయింపులో కూడా తప్పులు దొర్లుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘‘జనగణన అంటే కేవలం దేశంలో ఎంత మంది జనాభా ఉన్నారో లెక్కించడం కాదు. ఇది సూక్ష్మ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమయ్యే అత్యంత విలువైన డేటాను అందిస్తుంది’’ అని పేదరికం, ఆదాయ అసమానతలపై విస్తృతంగా పనిచేసిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ కేపీ కన్నన్ అన్నారు.

జనాభా గణాంకాల చట్టం 1948 ప్రొవిజన్ల కింద భారత్ జనాభాను లెక్కిస్తుంది. అయితే, ఈ విధానాన్ని ఎప్పుడు చేపట్టాలి లేదా జనాభా గణన ఫలితాలను ఏ సమయం లోపల విడుదల చేయాలనే దాన్ని దీనిలో పేర్కొనలేదు.

భారత జనగణన

ఫొటో సోర్స్, Getty Images

2020లో భారత్ తొలి దశ జనగణనను ప్రారంభించింది. కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు హౌసింగ్ డేటాను సేకరించింది. కానీ, కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో దేశమంతా ఎక్కడికక్కడ స్తంభించింది. దీంతో, జనాభా గణనను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం.

ఆ తర్వాత మూడేళ్లు అయింది. దాదాపు అర్హులైన భారతీయులందరూ కరోనా వ్యాక్సినేషన్లు వేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల జీవితాలు సాధారణ స్థితికి వచ్చాయి.

కరోనా మహమ్మారి అవుట్‌బ్రేక్ కారణంతో 2021 జనగణన, ఇతర సంబంధిత కార్యకలాపాలను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వాయిదా వేస్తున్నట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం డిసెంబర్‌లో పార్లమెంట్‌కు తెలిపింది.

జనగణన చేపట్టనంత వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ జిల్లాలు, పట్టణాలు, గ్రామాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేదని, పాలనపరమైన సరిహద్దులను మార్చేందుకు వీలు లేదని చెబుతూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూన్ 30 వరకు ఆంక్షలు విధించింది.

తాజా ఆదేశాల ప్రకారం ఈ సర్వే సెప్టెంబర్‌లో చేపట్టనున్నట్టు తెలుస్తుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024 చివరిలోపు జనాభా గణాంకాల నమోదు జరుగుతుందని నిపుణులు భావించడం లేదు.

దీనివల్ల పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేసే ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)పై నేరుగా ప్రభావం చూపనుందని దిల్లీ అంబేద్కర్ యూనివర్సిటీ ఆర్థికవేత్త దీపా సిన్హా అన్నారు.

2011 నాటి గణాంకాలపైనే ఇంకా ప్రభుత్వం ఆధారపడుతుందని, ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ పథకాలకు ఎవరు అర్హులో గుర్తిస్తుందని ఆర్థిక వేత్తలు జీన్ డ్రెజ్, రితికా ఖేరా, మేఘనా ముంగికర్‌ల పరిశోధనను కోట్ చేస్తూ సిన్హా తెలిపారు. పీడీఎస్ వెలుపల 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలున్నారని అన్నారు.

భారత జనగణన

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఉత్తర ప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో చాలా మంది ప్రజలు సంక్షేమ పథకాలను కోల్పోతున్నారు’’ అని సిన్హా తెలిపారు.

కరోనా మహమ్మారి ముందు కూడా 2021 జనగణన అనేది వివాదాస్పదమైన విధానంగా ఉంది.

జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)ను అప్‌డేట్ చేసేందుకు జనాభా గణాంకాల సర్వేను చేపట్టనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్‌పీఆర్‌లో ‘అనుమానిత పౌరులు’ కూడా ఉంటారని, వారు కచ్చితంగా భారతీయులై ఉండాల్సినవసరం లేదని విమర్శకులన్నారు.

2019 పౌరసత్వ చట్టం వివాదాస్పదమైన తర్వాత ఈ విమర్శలు నెలకొన్నాయి. 20 కోట్ల మందికి పైగా ముస్లింలను టార్గెట్ చేశారని విపక్షాలు విమర్శించాయి. దేశవ్యాప్తంగా ఈ పౌరసత్వ చట్టంపై ఎన్నో నెలల పాటు తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.

కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టాలని పలు విపక్ష పార్టీలు, స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల హిందూ ఓటులో చీలికలు రానున్నాయని, ఇది అధికార భారతీయ జనాతా పార్టీ(బీజేపీ)ని దెబ్బతీయనుందని అనలిస్టులు భావిస్తున్నారు. పలు గ్రూప్‌ల నుంచి కోటాల కోసం డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

సంక్షేమ పథకాలపై ఈ జనగణన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా, జాతీయ శాంపుల్ సర్వే(దేశ ప్రజల జీవన విధానాలకు సంబంధించిన అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించే వరుస సర్వేలు), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వంటి పలు కీలకమైన అధ్యయనాలకు కూడా డేటాను అందిస్తుంది.

రాష్ట్రాలు, కొన్ని మంత్రిత్వ శాఖలు సొంతంగా అధ్యయనాలు నిర్వహించి ఈ డేటా మధ్యలో అంతరాలను తొలగించవచ్చు. ఉదాహరణకు బిహార్ ప్రస్తుతం కుల గణనను చేపడుతుంది. అన్ని కులాలు, ఉపకులాలు, వాటి జనాభా, ఆ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఈ సర్వే ద్వారా వెలుగులోకి తీసుకురావాలనుకుంటోందని నిపుణులు చెప్పారు.

భారత జనగణన

ఫొటో సోర్స్, Getty Images

‘‘దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించి సమాచారాన్ని అందించే జనగణన లాంటి క్రెడిబుల్ జాతీయ సర్వేకు మరో ప్రత్యామ్నాయం లేదు’’ అని ప్రొఫెసర్ కన్నన్ అన్నారు.

డేటా నాణ్యత, పలు అధ్యయనాల విడుదలలో ఆలస్యం వంటి విషయాల్లో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో జనగణనలో కూడా అనిశ్చితి ఏర్పడింది.

నాలుగు దశాబ్దాలకు పైగా తొలిసారి వినియోగదారుల వ్యయాలు పడిపోయాయని ఒక అధ్యయనం పేర్కొనడాన్ని మీడియా రిపోర్టు ఎత్తిచూపింది. ఈ రిపోర్టు విడుదల తర్వాత డేటా నాణ్యత సమస్యలతో 2017-18కి చెందిన కీలక అధ్యయన ఫలితాలను విడుదల చేయడం లేదని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేయాలని నోబెల్ బహుమతి విజేత ఆర్థికవేత్త అంగస్ డీటన్‌తో సహా 200 మందికి పైగా ఆర్థిక వేత్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ డేటాపై ఆందోళనలు వ్యక్తం చేశారు.

రాజకీయ జోక్యం లేకుండా గణాంకాల సంస్థలు స్వతంత్రంగా ఉండటం జాతికి చాలా ముఖ్యమని, అన్ని డేటాలను స్వతంత్రంగా విడుదల చేసేందుకు అనుమతి ఉండాలని ఒక ప్రకటన విడుదల చేశారు.

దేశ ఆర్థిక సంస్థలన్నింటిని లెక్కించే భారత ఏడవ ఆర్థిక గణనను విడుదల ఆలస్యం కావడంపై ప్రభుత్వం సమాధానమివ్వాలని పార్లమెంటరీ ప్యానల్ కూడా గత ఏడాది ఆగస్టులో ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా డేటా సమస్యలున్నాయని సిన్హా అన్నారు.

ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ సొంత గణనలను చేపట్టుకునేందుకు గతంలో భారత్ సాయం చేసిందని ప్రొఫెసర్ కన్నన్ చెప్పారు. ఇది జాతి గౌరవానికి సంబంధించిన విషయమన్నారు.

డేటా సమగ్రత తగ్గుతుండటంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)