జనాభాలో చైనాను దాటేస్తున్న భారత్... ఇవీ 5 ముఖ్యాంశాలు

జనాభా

భారత్ సుమారు 142.8 కోట్ల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

ఇది యూరప్ జనాభా (74.4 కోట్లు), అమెరికా జనాభా (104 కోట్లు) కంటే చాలా ఎక్కువ. చైనా 142.57 కోట్ల జానాభాతో రెండవ స్థానంలో నిలుస్తుంది.

భారత్‌లో 1960, 1980 మధ్య జనాభా వేగంగా పెరిగింది. 70 సంవత్సరాల కాలంలో 100 కోట్లకు పైగా పెరిగింది.

1980ల తరువాత కూడా జానాభా పెరిగినప్పటికీ, వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాబట్టి భవిష్యత్తులో భారత జనాభా తగ్గుతుంది అనుకోవచ్చా?

స్వతంత్రం వచ్చిన తరువాత భారత జనాభా పెరుగుదల, వృద్ధి రేటు, భవిష్యత్తు అంచనాలు అయిదు చార్టులలో తెలుసుకుందాం.

జనాభా

1. రికార్డు స్థాయిలో 100 కోట్లు దాటిన జనాభా

భారత్‌లో చివరి జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగింది. కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన జన గణన వాయిదాపడింది. కాబట్టి, 2023లో వాస్తవంగా ఎంత జనాభా ఉందన్నది కచ్చితంగా తెలీదు.

మునుపటి జనాభా లెక్కల ప్రకారం, 1950, 1980ల మధ్య భారత జనాభా రాకెట్‌లా దూసుకుపోయింది. 1951లో 36.1 కోట్ల నుంచి 1981కి 68.3 కోట్లకు చేరుకుంది. కేవలం మూడు దశాబ్దాలలో రెండు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 70 ఏళ్ల కాలంలో 100 కోట్లు దాటిపోయింది.

అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టడంతో పెరుగుదల నెమ్మదించింది.

భారత్‌లో జానాభా పెరుగుదల మందగించినప్పటికీ, సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నుంచి ప్రొఫెసర్ ఉదయ్ శంకర్ మిశ్రా అన్నారు.

"భారత జనాభా గ్రాఫ్ చూస్తే, మరో నాలుగు దశాబ్దాల పాటు సంఖ్య పెరుగుతూనే ఉంటుందని అంచనా వేయవచ్చు. ఆ తరువాత వృద్ధిలో స్థిరత్వం రావచ్చు" అని డాక్టర్ మిశ్రా అన్నారు.

మరోవైపు, చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140 కోట్లు పైనే ఉంది కానీ, ఇటీవల క్షీణించడం ప్రారంభించింది.

జనాభా వృద్ధి రేటు
ఫొటో క్యాప్షన్, జనాభా వృద్ధి రేటు

2. జనాభా వృద్ధి రేటు

1950, 1990ల మధ్య భారత జనాభా వృద్ధి రేటు 2 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఒక దేశంలో జననాల రేటు, మరణాల రేటు మధ్య ఉన్న వ్యత్యాసం బట్టి జనాభా పెరుగుదలను నిర్థరిస్తారు. ఈ సంఖ్యను గణించేటప్పుడు నికర వలస రేటును పరిగణిస్తారు.

"భారత్‌లో మరణాల రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. కానీ, సంతానోత్పత్తి రేటులో తరుగుదల జనాభా వృద్ధి రేటు క్షీణించడానికి ప్రధాన కారణం" అని డాక్టర్ మిశ్రా తెలిపారు.

2021లో దేశ జనాభా వృద్ధి రేటు 0.68 శాతానికి పడిపోయింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లో జనాభా వృద్ధి రేటు 2017లో 2 శాతం పైనే ఉంది.

దీన్ని బట్టి, భారత్‌లో ప్రజల ఆయుర్దాయం పెరిగింది, తక్కువమంది పిల్లలని కంటున్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే వృద్ధి రేటు తగ్గుతోంది.

ఇప్పటి నుంచి 2050 మధ్య సంతానోత్పత్తి రేటు అధికంగా ఉన్న దేశాలలో జనాభా పెరుగుతుందని, సబ్ సహారన్ ఆఫ్రికాలో, ఆసియాలోని కొన్ని దేశాల్లో అధిక జనాభా ఉండవచ్చని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి.

అయితే, గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది.

సంతానోత్పత్తి
ఫొటో క్యాప్షన్, సంతానోత్పత్తి రేటు

3. సంతానోత్పత్తిలో తగ్గుదల

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 గణాంకాల ప్రకారం, భారత్‌లో అన్ని మతాల్లోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టింది.

జనాభాలో 80 శాతం ఉన్న హిందువుల్లో సంతానోత్పత్తి రేటు 1.9 ఉంది. 1992లో ఈ రేటు 3.3 ఉంది. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలలో 1.4 తగ్గింది.

ముస్లిలలో కూడా సంతానోత్పత్తి రేటు బాగా తగ్గింది. 1992లో 4.4 నుంచి 2019లో 2.4 కి తగ్గింది.

క్రైస్తవులు, బౌద్ధులు, జైనుల్లో కూడా ఈ రేటు క్షీణిస్తోంది.

అయితే, దీనివల్ల రానున్న సంవత్సరాలలో భారత్‌లో జనాభా తగ్గిపోతుందని కాదు.

"చిన్న వయసు ఉన్న మహిళలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ, పెద్ద వయసు వారిలో ఈ రేటు ఎక్కువగానే ఉంది. కాబట్టి మరో 40 ఏళ్లు జనాభా పెరుగుతూనే ఉంటుంది" అని డాక్టర్ మిశ్రా అన్నారు.

ఐరాస అంచనాల ప్రకారం, ఇలాగే సంతానోత్పత్తి రేట్లు క్రమంగా క్షీణిస్తూ ఉంటే 2100 నాటికి భారత జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఇటీవల పెరుగుదలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో పెరుగుదల రేటు బాగా తగ్గినట్టు లెక్క.

సంతానోత్పత్తి రేటులో తరుగుదలకు పలు సామాజిక, ఆర్థిక అంశాలు కారణమని డాక్టర్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం, అమెరికా (1.6), చైనా (1.2)ల కంటే సంతానోత్పత్తి రేటు భారత్‌లో ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు బాగా తగ్గింది. 1959లో 5.9, 1992లో 3.4, ఇప్పుడు 2.00 కి కాస్త పైన ఉంది.

యువత

4. యువత ఎక్కువగా ఉన్న దేశం

భారతదేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరో 50 ఏళ్ల వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తం జనాభాలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు 40 శాతానికి పైనే ఉన్నారు. సగం జనాభా 25-64 వయసుల మధ్యలో ఉన్నప్పటికీ మధ్యస్థ (మీడియన్) వయసు 28 సంవత్సరాలు.

అమెరికాలో మీడియన్ వయసు 38, చైనాలో 39.

భారత్‌లో వృద్ధుల (65 పైబడినవారి) సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో కేవలం 7 శాతం వృద్ధులు ఉన్నారు. అయితే, వృద్ధి రేటులో తరుగుదల కొనసాగితే, వృద్ధుల శాతం పెరుగుతుంది.

 యువత vs వృద్ధులు
ఫొటో క్యాప్షన్, యువత vs వృద్ధులు

5. యువత vs వృద్ధులు

అమెరికా, చైనా, జపాన్‌లలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కానీ, భారత్‌కు ఆ సమస్య లేదు.

చైనాలో, ప్రతి 10 మందిలో, 1.4 మంది 65 ఏళ్లు పైబడిన వారు. అమెరికాలో ప్రతి 10 మందిలో, 1.8 మంది 65 ఏళ్లు పైబడిన వారు.

భారత్‌లో కేవలం 7 శాతం 65 ఏళ్లు దాటినవారు. 2010 నాటికి, వృద్ధులు 23 శాతం పెరుగుతారని అంచనా.

ప్రస్తుతం భారత్‌లో 40 శాతం కంటే ఎక్కువగా 25 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 2078 నాటికి ఇది 23.9 శాతానికి పడిపోతుందని ఐరాస అంచనా.

కానీ, 2063 వరకు భారత్‌లో వృద్ధులు 20 శాతం లోబడే ఉంటారని అంచనా. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మరికొన్నేళ్లు యువ దేశంగానే కొనసాగుతుంది.

వీడియో క్యాప్షన్, యువ జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లేంటి?

ఇవి కూడా చదవండి: