సూడాన్: ఇంటిపై క్షిపణి దాడి, పారిపోతుంటే రాకెట్ దాడి.. ఇన్ని గండాలను దాటి ఆ కుటుంబం ఎలా బయటపడింది?

సూడాన్‌లో చెలరేగుతున్న హింస నుంచి తప్పించుకునేందుకు లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు.
ఈజిప్టు, దక్షిణ సూడాన్, చాద్ వంటి పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. అలాంటి వారిలో 21 ఏళ్ల వైద్య విద్యార్థిని నూన్ అబ్దెల్‌బాసిత్ ఇబ్రహీమ్ ఒకరు.
సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య పోరాటం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత కూడా ఆమె కుటుంబం దేశాన్ని వదిలి వెళ్లడానికి వెనుకాడింది.
‘‘పొరుగు దేశాల సరిహద్దులు మూసి ఉంటాయని, మేం ఎక్కడో చోట ఇరుక్కుపోతామని మొదట అనుకున్నాం’’ అని నూన్ బీబీసీతో చెప్పారు.

క్షిపణి దాడితో అంతా మారిపోయింది
నాలుగు రోజుల్లో అంతా మారిపోయింది. వారి ఇంట్లో అశాంతి నెలకొంది. దీనికి కారణం, ఏప్రిల్ 18న సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని వారి ఇంటిపై క్షిపణి దాడి జరిగింది. తన కుటుంబం అంతా ఖార్టూమ్‌లో నివసిస్తుండగా, నూన్ మాత్రం అదే జిల్లాలోని బుర్రిలో ఉంటారు. ఇక్కడే ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నాయి.
‘‘అందరూ మా అమ్మమ్మ గదిలోకి వెళ్లి దాక్కున్నారు. అంతా వణికిపోయారు. ఇలా ప్రాణాలతో బయటపడే అవకాశం మరోసారి రాదు. ఈ ఘటన తర్వాత అక్కడ ఉండకూడదని మేం తెలుసుకున్నాం’’ అని నూన్ చెప్పారు.
నూన్ ఉండే వీధిలోని ఇళ్లు, వ్యాపార సముదాయాలపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఆమె తల్లికి తెలిసిన ఒక వ్యక్తిని కూడా కాల్చేశారు. విద్యుత్, నీటికి తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ఆహార కొరత ఏర్పడింది.
నూన్ సహా ఆమె కుటుంబంలోని తొమ్మిది మంది ఇప్పుడు ఈజిప్ట్ రాజధాని కైరోలో సురక్షితంగా ఉన్నారు.
వారు ప్రమాదకర రీతిలో రెండు రోజుల పాటు ప్రయాణించి కైరోకు చేరుకున్నారు.
ఏప్రిల్ 20 తెల్లవారుజామున ఖార్టూమ్ నుంచి బయల్దేరిన కిక్కిరిసిన బస్సులో స్నేహితులు, పొరుగువారితో కలిసి వారు ప్రయాణించారు.
ఈ బస్సు కిరాయి కోసం అందరూ కలిసి రూ. 4 లక్షలకు పైగా చెల్లించారు. నూన్ పెంపుడు కుక్క ఉచితంగానే వచ్చింది.
‘‘మా దగ్గర ఉన్న డబ్బు అంతా ప్రయాణానికే ఖర్చు చేశాం. కానీ, మేం నిజానికి అదృష్టవంతులం. నా ఫ్రెండ్ ఒకరు మొదట 8 వేల డాలర్లకు (రూ. 6,55,356) ఒక బస్సును మాట్లాడారు. కానీ, చివరి నిమిషంలో ఆ బస్సు యజమాని ధరను రెట్టింపు చేశారు’’ అని నూన్ వివరించారు.

బస్సు దగ్గరకు వెళ్లబోతుండగా రాకెట్ దాడి
నూన్ ప్రస్తుతం కైరోలోని తమ బంధువుల అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఖార్టూమ్ వీధుల్లో దారి వెంట ధ్వంసమైన ట్యాంకులు, మృతదేహాలను చూసి ఆమె కలవరపడ్డారు.
బస్సులో ఉన్న పిల్లలు, పెద్దవారందరికీ చాలా ధన్యవాదాలు. వారంతా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా నడుచుకున్నారు. ఆర్మీ, పారామిలిటరీ చెక్ పాయింట్ల వద్ద చక్కగా సహకరించారని ఆమె చెప్పారు.
‘‘అక్కడి నుంచి పారిపోయి రావడంతో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇది అంత సులభంగా జరుగలేదు’’ అన్నారు.
ప్రయాణం ప్రారంభంలోనే వారి భయాన్ని రెట్టింపు చేసే ఘటన జరిగింది. బస్సు నిలిపి ఉన్న చోటుకు వెళ్లడానికి ఆమె కుటుంబం బయల్దేరిన సమయంలోనే వారి పొరుగు వీధిలోని ఒక భవనంపై రాకెట్ దాడి జరిగింది.
‘‘మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెనక్కు పరిగెత్తాం. ఇంట్లోకి వచ్చాం. కానీ, కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఒక గట్టి నిర్ణయానికి వచ్చాం. ఎలాగైనా అక్కడి నుంచి పారిపోయి బస్సును అందుకోవాలని అనుకున్నాం’’ అని నూన్ వివరించారు.

డాక్టర్ అవ్వాలనే కల
మెడికల్ స్కూల్‌లో నూన్ చివరి సంవత్సరం చదువు మొదలైంది. అంతలోనే సూడాన్‌లో ఘర్షణలు తలెత్తాయి.
చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వాలని నూన్ ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు తమ దేశంలో పరిస్థితులు సర్దుకుంటే చాలని ఆమె భావిస్తున్నారు.

‘‘అక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ప్రజలంతా అన్నీ వదిలేసుకొని పారిపోతున్నారు’’ అని నూన్ అన్నారు.
ఈ పరిస్థితులకు కారణమైన ఇద్దరు మిలిటరీ నాయకులకు ఆమె ఒక సందేశాన్ని ఇస్తున్నారు.
‘‘వారు ఇప్పటికే చాలా మంది అమాయకుల ప్రాణాలు తీశారు. వారి మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ యుద్ధాన్ని వారు తక్షణమే ఆపేయాలి’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















