సూడాన్: 'బోటు నైలు నది దాటేప్పుడు సంతోషం, బాధ' -బీబీసీ రిపోర్టర్ ప్రమాదకర ప్రయాణం

బీబీసీ అరబిక్ రిపోర్టర్

"నా కుటుంబ భద్రత కోసం మాతృభూమిని విడిచి వెళ్లక తప్పని పరిస్థితి. బోటు నైలు నది దాటేప్పుడు.. ఇక్కడి నుంచి బయటపడుతున్నామన్న సంతోషం ఒకవైపు, సొంత గడ్డను వదిలివెళ్తున్నామనే బాధ మరోవైపు."

బీబీసీ అరబిక్ రిపోర్టర్ మొహమద్ ఉస్మాన్ తన జీవితమంతా సూడాన్‌లోనే గడిపారు. గత నెలలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడు, ఆయన అక్కడి విషయాలను రిపోర్ట్ చేశారు. కానీ రానురాను పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. తన మాతృభూమిని వదిలి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సూడాన్ నుంచి ఈజిప్ట్ వెళ్లేందుకు ప్రమాదకరమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ కథ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

సొంత గడ్డను విడిచి వెళ్లాలనే కఠిన నిర్ణయం

రానున్న రోజుల్లో జరగబోయే వినాశనాన్ని తెలియజేసేలా సూడాన్ రాజధాని ఖార్టూమ్ నగరంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, ఒందుర్‌మన్, ఖార్టూమ్ బహ్రి ప్రాంతాల్లో సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇరువర్గాలూ బలగాలను మోహరిస్తున్నాయి.

పేలుళ్ల శబ్దాలు రోజురోజుకీ దగ్గరవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు ప్రజలను బెదిరిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. కార్లు దొంగతనం, దోపిడీలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.

ఇవన్నీ, దేశం విడిచి వెళ్లిపోవాలన్న బాధాకరమైన నిర్ణయం తీసుకునేందుకు కారణమయ్యాయి.

ఒక జర్నలిస్టుగా, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియజేయడం చాలా ముఖ్యం.

కానీ, ఎక్కడికీ వెళ్లే అవకాశం లేదు. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదు. అదీకాక, నా కుటుంబ భద్రత దృష్ట్యా ఇక్కడి నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి.

సూడాన్
ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ 15న యుద్ధం మొదలైన దగ్గర నుంచి చాలామంది సూడాన్ విడిచిపెట్టి వెళ్లిపోయారు

ఏప్రిల్ 28న మా ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాం. ఆ సమయంలో రెండు బలగాల మధ్య ఘర్షణలు కొద్దిగా స్తబ్దుగా ఉంటాయి.

ఒందుర్‌మన్ పట్టణం నుంచి ఈజిప్ట్ వెళ్లేందుకు మరికొందరితో కలిసి బస్సులో దేశ సరిహద్దులకు బయలుదేరాం.

ప్రయాణం ప్రారంభించిన పది నిమిషాలకే ఒక యుద్ధ విమానం కనిపించింది. అదే సమయంలో మాకు దగ్గరగా ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు యుద్ధ విమానం లక్ష్యంగా కాల్పులు జరిపాయి.

మేం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేందుకు సాయుధ బలగాలు మా బస్సుని చుట్టుముట్టాయి.

మా వైపు తుపాకులు గురిపెట్టడంతో నా భార్య, పిల్లలు భయపడిపోయారు. బస్సులో తనిఖీలు చేశాక, వదిలేశారు. కొద్ది నిమిషాల తర్వాత మరో బృందం మా బస్సుని ఆపింది. అయితే, అక్కడి నుంచి త్వరగానే బయటపడ్డాం.

ఒందుర్‌మన్ సమీప ప్రాంతాలు దాటిన తర్వాత, వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఆర్ఎస్‌ఎఫ్ బలగాలకు చెందిన వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి.

సూడాన్ ఆర్మీ యుద్ధ విమానాల నుంచి తప్పించుకునేందుకు ఆర్ఎస్ఎఫ్ బలగాలు కొన్నిచోట్ల చెట్ల కింద వాహనాలను పెట్టుకుని ఉన్నాయి.

ఈజిప్ట్ బోర్డర్ వైపు వెళ్తున్న కొద్దీ మిలిటరీ బలగాల గస్తీ తగ్గి, సాధారణ పరిస్థితి కనిపించింది.

మహిళలు నడుపుతున్న చాలా దుకాణాలు, కేఫ్‌లు తెరిచే ఉన్నాయి. రద్దీగా కూడా ఉన్నాయి. ప్రజారవాణా సర్వీసులు పనిచేస్తున్నాయి. కాకపోతే గతంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి.

భద్రతా దళాలు లేకపోవడంతో సాధారణ చెక్‌పోస్టుల వద్ద ఆయుధాలతో తిరుగుతున్న గ్యాంగుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.

సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో, దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగాయి.

అయితే, అలాంటి వాటి గురించి ముందుగానే మాకు సమాచారం ఉండడంతో వాటి నుంచి తప్పించుకోగలిగాం.

సూడాన్

ఫొటో సోర్స్, Getty Images

ఖార్టూమ్ నుంచి సరిహద్దుకు ప్రయాణిస్తున్నప్పుడు దారిలో సూడాన్ భద్రతా దళాలు నిర్వహించే సెక్యూరిటీ చెక్‌పోస్టులు కనిపించలేదు.

వాటికి బదులు పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కనిపించాయి. అవన్నీ ఉత్తర ప్రాంతంలోని నగరాలైన మెరోవ్, డొంగోలా, వాడి హల్ఫా వైపు వెళ్లే ప్రయాణికులతో నిండిపోయి ఉన్నాయి.

మేం కూడా వాడి హల్ఫా వెళ్లాలనుకున్నాం. అక్కడికి చేరేందుకు 24 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

పాడైపోయిన రోడ్లు, ఎడారి నుంచి వేడిగా వస్తున్న గాలులు, ఇసుకతో ఆ ప్రయాణం చాలా భయంకరంగా సాగాంది.

రాత్రికి డొంగోలాలోని ఒక కేఫ్ వద్ద ఆగి నిద్రపోయేందుకు మంచాలు అద్దెకు తీసుకున్నాం. ఆరుబయట తీవ్రమైన చలిలో ఎలాంటి దుప్పట్లు లేకుండానే పడుకున్నాం.

వాడి హల్ఫా నగరంలో అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపించింది. ఖార్టూమ్‌లో హింస కారణంగా పారిపోయి వచ్చిన వేల కుటుంబాలు హోటళ్లు దొరక్క, తలదాచుకునే చోటు లేక ఇబ్బందులు పడుతున్నాయి.

సూడాన్

ఫొటో సోర్స్, MOHAMED OSMAN/ BBC

మహిళలు, చిన్నారులు బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లలోనే నేలపై పడుకుని కనిపించారు.

నాలుగు రోజుల నుంచి తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నట్లు 50 ఏళ్ల మహిళ చెప్పారు.

పగలు తీవ్రమైన ఎండ, రాత్రిళ్లు విపరీతమైన చలిలోనే గడపాల్సి వస్తోందని ఆమె అన్నారు. ఈజిప్ట్‌కి వెళ్లేందుకు తన కొడుక్కి వీసా కోసం ఆమె అక్కడ ఎదురుచూస్తున్నారు.

బోర్డర్ వద్ద సూడాన్‌తో పాటు భారత్, యెమెన్, సిరియా, సెనెగల్, సోమాలియాకు చెందిన మరొందరిని కూడా కలిశాను. వాళ్లలో ఎక్కువ మంది ఖార్టూమ్‌లోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్రికా విద్యార్థులు.

"ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలని" ఘనాకి చెందిన ఓ యువకుడు చెప్పాడు. అతడు ఖార్టూమ్‌లో తుపాకుల కాల్పులు, బాంబు పేలుళ్లను చూసి చాలా భయపడ్డాడు.

వాడి హల్ఫా నగరంలో శరణార్థులకు సాయం చేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాడి హల్ఫా నగరంలో శరణార్థులకు సాయం చేస్తున్నారు

అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజల్లో దయాగుణం కనిపించింది. సూడాన్ - ఈజిప్ట్ బోర్డర్‌కి తరలివస్తున్న వారికి వాడి హల్ఫా, దాని సమీప ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. డబ్బులు అడగకుండానే ఆహారం, నీళ్లు అందిస్తున్నారు.

పదుల సంఖ్యలో శరణార్థులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లు వాడి హల్ఫా నగరానికి చెందిన బదేరి హుసేన్ చెప్పారు. ఆయనకు అక్కడ పెద్ద ఇల్లు ఉంది.

''శరణార్థులకు సాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. వాళ్లు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వారికి అధికారులు ఎలాంటి సాయం చేయడం లేదు'' అని హుసేన్ చెప్పారు.

బోర్డర్ వద్ద కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పెద్ద సంఖ్యలో బస్సులు, ప్రైవేట్ కార్లతో ట్రాఫిక్ జామ్ అయింది. బోర్డర్ దాటాలనుకునే వ్యక్తుల కంటే సిబ్బందే ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ కేవలం ఒకే ఒక్క టాయిలెట్ ఉంది.

బోర్డర్ దాటి వెళ్లేందుకు అవసరమైన అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసుకున్నప్పటికీ, ఈజిప్ట్‌లోని అబు సింబెల్ వెళ్లే చివరి బోటు సాయంత్రం 5 గంటలకు ఆపేయడంతో, రాత్రి అక్కడే నిద్రించాల్సి వచ్చింది. చాలా ఇబ్బందిపడ్డాం.

ఆ రాత్రి చలిలో గడిపిన తర్వాత మరుసటి రోజు ఉదయం బోటులో ఈజిప్ట్ బయలుదేరాం.

బోటు నైలు నది దాటేప్పుడు.. ఒకవైపు ఇక్కడి నుంచి బయటపడుతున్నామన్న సంతోషం, మరోవైపు సొంత గడ్డను వదిలివెళ్తున్నామనే బాధ ఒకేసారి కలిగాయి.

నా భార్య, పిల్లలను రక్షించుకోగలిగినందుకు సంతోషంగా ఉన్నాను. కానీ, యుద్ధం లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను వదిలేసి రావడం బాధగా ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)