పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం

పట్టాభిషేకం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమీ మోర్‌లాండ్
    • హోదా, బీబీసీ న్యూస్

కింగ్ చార్లెస్-౩ పట్టాభిషేకం మే6 జరగబోతోంది. ప్రాచీన సంప్రదాయాల్లో జరిగే ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూడబోతున్నారు. అయితే, చాలా దేశాల్లో ఇలాంటి అరుదైన పట్టాభిషేకాలు జరుగుతుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చే రాణి నుంచి ఎవరూ కూర్చోని పవిత్రమైన సింహాసనం వరకూ ప్రపంచంలోని కొన్ని రాచరిక వ్యవస్థలు తమ రాజులు, రాణులను ఎలా పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాయో చూద్దాం.

‘‘రాచరికానికి సంప్రదాయాలు, వేడుకలు మూల స్తంభాల్లాంటివి’’ అని వించెస్టర్ యూనివర్సిటీలోని హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎలీనా వుడాకెర్ అన్నారు.

‘‘ప్రపంచంలోని భిన్న దేశాల్లో భిన్న రకాలైన పట్టాభిషేకాలను మీరు చూడొచ్చు’’అని ఆమె వివరించారు. ‘‘రాచరికం ఉండేచోట మీకు పట్టాభిషేకాలు లేదా బాధ్యతల మార్పిడి లాంటివి కనిపిస్తాయి. ఈ కార్యక్రమాల్లో రాజులు లేదా రాణులు ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తుంటారు. ఇక్కడ కొన్ని ప్రాచీన, పవిత్రమైన వేడుకలు కూడా ఉంటాయి’’ అని ఆమె చెప్పారు.

‘‘తమ సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పడంతోపాటు ప్రజలతో తమకున్న బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి పట్టాభిషేకం ఒక వేదిక లాంటిది’’ అని ఆమె అన్నారు.

థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్

పవిత్రమైన నూనె...

రహస్యంగా తయారుచేసిన ఒక పవిత్రమైన నూనెను కింగ్ చార్లెస్ పట్టాభిషేకంలో ఉపయోగించబోతున్నారు. కాంటెర్బరీ ఆర్చిబిషప్ ఈ నూనెను రాజు తల, ఛాతి, చేతులపై పోస్తారు. చర్చి ఆఫ్ ఇంగ్లండ్కు కూడా అధిపతిగా కొనసాగే రాజు సార్వభౌమతాధికారాన్ని ఈ సంప్రదాయం చాటిచెబుతుంది.

థాయిలాండ్‌లో కూడా ఇలాంటి సంప్రదాయముంది. ఇక్కడ నూనెకు బదులుగా నీటితో కొత్త రాజు లేదా రాణిని అభిషేకిస్తారు. దీన్ని శుద్ధి చేయడానికి ప్రతీకగా చూస్తారు.

దేశంలోని వందకుపైగా ప్రాంతాల నుంచి స్థానిక కాలమానం ప్రకారం 11:52 నుంచి 12:38 మధ్య ఆ నీటిని సేకరిస్తారు. థాయ్ సంప్రదాయంలో ఈ సమయానికి ప్రత్యేక ప్రాధాన్యముంది.

థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ పట్టాభిషేకంలో ఆయన ముందు ఆయన భార్య క్వీన్ సుథిద మోకాళ్లపై నడిచారు. రాజును గౌరవించడానికి దీన్ని ప్రతీకగా చూస్తారు. ఆ తర్వాత శంఖంలో నుంచి నీటిని ఆమెపై చల్లి ఆమెకు రాణి హోదాను రాజు అప్పగించారు.

అసాంటే చక్రవర్తి ఒటుముఫో ఒసెయి టుటు 2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసాంటే చక్రవర్తి ఒటుముఫో ఒసెయి టుటు 2

పవిత్ర సింహాసనం

పురాతనమైన పట్టాభిషేక సింహాసనంపై కింగ్ చార్లెస్ కూర్చోబోతున్నారు.

700 ఏళ్లనాటి ఈ సింహాసనాన్ని సిందూర చెట్టు(ఓక్ ట్రీ) కలపతో చేశారు. స్కాటిష్ రాజుల పట్టాభిషేకంలో ఉపయోగించిన స్టోన్ ఆఫ్ డెస్టినీని ఈ సింహాసనంలో పొదిగారు.

ఘనాలోని అషాంటే రాజ్యాన్ని 1700లలో అషాంటిహేనే రాజులు పాలించేవారు. అషాంటే సంప్రదాయాంలో అత్యంత పవిత్రమైన వస్తువు ‘‘సికా డ్వా కోఫి’’అనే బంగారు సింహాసనం. దీన్ని అషాంటే ప్రజల ఆత్మకు ప్రతిబింబంగా భావిస్తారు.

ఇది చాలా పవిత్రమైనది. అందుకే రాజుతోపాటు ఎవరూ దీనిపై కూర్చోవడానికి వీల్లేదు. పట్టాభిషేకాల సమయంలో కొత్త రాజులు దీని పక్కన కూర్చుంటారు.

అయితే, 1900లలో గోల్డ్ కోస్టు బ్రిటిష్ గవర్నర్ సర్ ఫ్రెడెరిక్ హాడ్జ్‌సన్ ఆ బల్లపై కూర్చుంటానని పట్టుబట్టారు. అది ఎక్కడున్నా పట్టుకురావాలని ఆయన ఆదేశించారు.

అయితే, దీనిపై అసాంటే రాణి తల్లి యా ఆసాంటేవా తిరుగుబాటు లేవనెత్తారు. అయితే, ఆ తిరుగుబాటును బ్రిటిష్ పాలకులు అణచివేశారు. మొత్తానికి ఆ ప్రాంతం బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లింది. మళ్లీ 1935లో ఇక్కడ రాచరికం అమలులోకి వచ్చింది.

జపాన్ చక్రవర్తి పట్టాభిషేకంలోనూ ఇలాంటి సంప్రదాయం మనకు కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్ చక్రవర్తి పట్టాభిషేకంలోనూ ఇలాంటి సంప్రదాయం మనకు కనిపిస్తుంది.

బ్రిటన్ రాజుకు పవిత్ర నూనెను పూసే సంప్రదాయం చాలా రహస్యంగా జరుగుతుంది. ఇది బయట ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక పందిరి లాంటి నిర్మాణాన్ని వేస్తారు. ఆ సంప్రదాయం చివర్లో ‘‘గాడ్ సేవ్ ద కింగ్’’అని అక్కడున్నవారు గట్టిగా అరుస్తారు.

జపాన్ చక్రవర్తి పట్టాభిషేకంలోనూ ఇలాంటి సంప్రదాయం మనకు కనిపిస్తుంది.

అక్కడ రాజు బయటివారికి కనిపించకుండా ఉండేందుకు ఊదా కుంగ కర్టెన్లు వేస్తారు. అక్కడే ఆయన పట్టాభిషేక పత్రాన్ని చదివుతారు. అప్పుడు ఆయన పసుపు-నారింజ రంగు వస్త్రాలు ధరిస్తారు. ప్రత్యేక వేడుకల సమయంలో రాజులు మాత్రమే ఇలాంటి బట్టలు వేసుకుంటారు.

ఆ తర్వాత అందరూ ‘‘బాంజాయ్’’అని గట్టిగా అరుస్తారు. అంటే ‘‘రాజుకు జై’’అని అర్థముంది.

అప్పట్లో జపాన్ చక్రవర్తి పట్టాభిషేకానికి వందల మంది విదేశీ అతిథులతోపాటు చార్లెస్ కూడా హాజరయ్యారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాచరికంలో కొత్త శకం.. సింహాసనానికి కింగ్ చార్లెస్ ప్రస్థానం సాగిందిలా

బ్రిటన్‌లో పట్టాభిషేకం కోసం రాజు లేదా రాణికి ప్రత్యేక బట్టలు తయారుచేస్తారు. వెస్ట్ మినిస్టెర్ అబేలోకి వారు అడుగుపెట్టేటప్పుడు పొడుగైన ఎరుపు రంగు వెల్వెట్ వస్త్రాలు వేసుకుంటారు. అయితే, కార్యక్రమం చివర్లో మరొక వస్త్రాన్ని ధరిస్తారు.

1953లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేక సమయంలో ఆమె ఏడు మీటర్ల పొడవైన సిల్కు గౌను ధరించారు. దీనిపై బ్రిటన్, కామన్వెల్త్ దేశాల చిహ్నాలను బంగారం, వెండితో ఎంబ్రాయిడరీ చేయడానికి 3,500 గంటల సమయం పట్టింది.

దక్షిణాఫ్రికాలోని శక్తిమంతమైన ఎనిమిది మంది రాజుల్లో జూలూ కింగ్ ఒకరు. ఆయన కూడా పట్టాభిషేక సమయంలో ప్రత్యేకమైన వస్త్రాలు ధరించారు.

తమ పూర్వీకుల ఆశీర్వాదం కోసం మొదట రాజు ఒక పశువుల శాలలోకి ప్రవేశించి ప్రార్థనలు చేస్తారు. తమపై ఆశీర్వాదముందని చాటిచెప్పేందుకు వారు వేటాడిన సింహం తోలును కప్పుకుంటారు.

2022లో కింగ్ మిసుజులు కా జ్వెలిథినీ తన పట్టాభిషేక సమయంలో చిరుతపులి తోలు, పక్షుల ఈకలతో చేసిన వస్త్రాలు వేసుకున్నారు. ఆయన హోదాను గుర్తిస్తూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సెర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్‌ను కూడా అందించారు.

లెస్టీ-౩

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెస్టీ-౩

దూడ చర్మంతో కిరీటం

పట్టాభిషేకంలో కిరీటాలకు ప్రత్యేక స్థానముంటుంది. రాజును పాలకుడిగా ప్రజలకు చూపించే చిహ్నమిదీ.

బ్రిటన్‌లో కింగ్ చార్లెస్‌కు సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని పెడతారు. బంగారంతో తయారుచేసిన ఈ కిరీటంలో కెంపులు, నీలమణులను పొదిగారు. కేవలం పట్టాభిషేక సమయంలోనే దీన్ని ఆయన పెట్టుకుంటారు.

పట్టాభిషేకం చివర్లో 1.06 కేజీల బరువున్న ఇంపీరియల్ స్టేట్ క్రౌన్‌ను ఆయనకు తొడుగుతారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభంతోపాటు కొన్ని అధికారిక కార్యక్రమాలలోనూ ఈ కిరీటాన్ని రాజు పెట్టుకుంటారు.

లెసోతోలో కొత్త రాజుకు దూడ చర్మంతో చేసిన పట్టీని తలకు కడతారు. దీనిపై పక్షుల ఈకలను అలంకరిస్తారు.

జంతు చర్మాలతోపాటు బంగారం తీగలతో మొసలి ఆకారాన్ని ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాన్ని కూడా రాజు ధరిస్తారు.

లెస్టీ-౩ పట్టాభిషేకం రాజధాని నగరం మసేరులోని ఒక స్పో్ట్స్ స్టేడియంలో జరిగింది. దీనికి చార్లెస్‌తోపాటు అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా కూడా హాజరయ్యారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ కొత్త రాజు చార్లెస్ 3 జాతినుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఏమన్నారంటే..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)