దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ

ఏసు పునరుత్థానం

ఫొటో సోర్స్, Avalon Studio

ఇటీవల కెన్యాలోని ఎడారిలో 80కి పైగా మృతదేహాలు దొరికాయి. ఇంటర్నేషనల్ చర్చ్ ఆఫ్ ది గుడ్ న్యూస్‌కు చెందిన వీరంతా ఆకలితో చనిపోవడం ద్వారా ఏసును చేరుకోవాలని భావించారు. ఆకలితో చనిపోవడం ద్వారా ‘స్వర్గాని’కి చేరుకోవచ్చని ఆ సంస్థ బోధిస్తుంది.

ఇలాంటి వాటిని నమ్మి ప్రజలు చనిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి వందల మంది చనిపోయారు.

జిమ్ జోన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జిమ్ జోన్స్
సూదులు, పేపర్ కప్పులు

ఫొటో సోర్స్, Getty Images

పీపుల్స్ టెంపుల్:

1950లలో ‘‘ది పీపుల్స్ టెంపుల్’’ అనే మత సంస్థను అమెరికాలో స్థాపించారు. జాతులకు, దేశాలకు అతీతంగా ‘‘సోషలిస్ట్ పారడైజ్’’ను స్థాపించాలనేది ఆ సంస్థ నాయకుడు జిమ్ జోన్స్ లక్ష్యం.

1975లో వెనెజ్వేలాకు దగ్గర్లో ఉండే గయానాకు 900 మందిని జిమ్ తీసుకెళ్లారు. అక్కడ జోన్స్‌టౌన్ అనేదాన్ని స్థాపించారు. మైమరపించే తన ప్రసంగాలతో ఎంతో మందిని జిమ్ ఆకట్టుకున్నారు.

జిమ్‌ను ఆరాధించడం మొదలు పెట్టిన ఆయన ఫాలోవర్లు ఆ తరువాత మూఢభక్తులుగా మారారు. దాంతో జిమ్ ఒక దేవునిగా మారాడు. దాంతో జిమ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

ఆయన తమ సమూహంలోని వారినే హింసించేవారనే వార్తలు కూడా వచ్చాయి. ‘‘వైట్ నైట్స్’’ అనే పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో సామూహిక ఆత్మహత్యలకు ప్రేరేపించేవారు. సైనెడ్ కలిపిన సోడా ఉన్న సిరంజీలు, పేపర్ కప్పులు జోన్స్‌టౌన్‌లో కనిపించాయి.

ఈ విషయాలు తెలిసి విచారణ కోసం జోన్స్‌టౌన్‌కు వెళ్లిన కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు లియో రేయాన్‌ను పీపుల్స్ టెంపుల్ సభ్యులు కాల్చి చంపారు. దాంతో చివరి సామూహిక ఆత్మహత్యకు ఏర్పాటు చేయాలని జిమ్ ఆదేశించారు.

సైనెడ్ కలిపిన సోడా తీసుకోవడం వల్ల మొత్తం 900 మంది చనిపోయారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా మరికొందరిని బలవంతంగా చంపేశారు. చనిపోయిన వారిలో 300 మంది పిల్లలు కూడా ఉన్నారు.

మరి కొందరు దాక్కొని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. చరిత్రలో ఇదొక పెద్ద సామూహిక ఆత్మహత్యగా నిలిచిపోయింది.

డేవిడ్ కొరేష్

ఫొటో సోర్స్, CBS

ఫొటో క్యాప్షన్, డేవిడ్ కొరేష్
పిల్లలు, మహిళతో డేవిడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్ 10 మంది పిల్లలకు తండ్రి అయినట్లు భావిస్తున్నారు
కాలిపోతున్న కాంప్లెక్స్

ఫొటో సోర్స్, Getty Images

బ్రాంచ్ డేవిడియన్

క్రైస్తవ మతం ఆధారంగా పుట్టికొచ్చిందే బ్రాంచ్ డేవిడియన్ అనే సంస్థ. 1955లో టెక్సాస్‌లో ఇది ప్రారంభమైంది. సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ బ్రాంచ్ డేవిడియన్స్ నుంచి ఇది పుట్టుకొచ్చింది.

ఏసు తిరిగి వచ్చి భూమి మీద ‘‘దైవ రాజ్యాన్ని’’ స్థాపిస్తాడని వీరు నమ్ముతుంటారు.

1981లో వెర్నన్ హోవెల్ అనే యువకుడు బ్రాంచ్ డేవిడియన్‌లో చేరారు. ఆ తరువాత కొంత కాలానికి ఆ సంస్థకు నాయకునిగా ఎదిగారు. తన పేరును డేవిడ్ కోరెష్‌గా మార్చుకున్నారు.

యూదుల రాజు పేరు డేవిడ్. పర్షియా తొలి చక్రవర్తి ‘‘సైరస్ ది గ్రేట్’’ను హీబ్రూలో కోరెష్ అంటారు. అలా వారిద్దరు పేర్లు కలిసి వచ్చేలా డేవిడ్ కోరెష్ అని వెర్నన్ పేరు పెట్టుకున్నారు.

తనను తాను చివరి ప్రవక్తగా డేవిడ్ కోరెష్ ప్రకటించుకున్నారు. ఆయన బోధనలు చాలా మందిని ఆకర్షించాయి. ‘‘దేవుని సైన్యం’’ అనే పేరుతో కొందరిని పోగేసి ఆయుధాలు సేకరించడం ప్రారంభించారు డేవిడ్ కోరెష్. ‘‘మౌంట్ కార్మెల్’’గా పిలిచే డేవిడియన్ కాంప్లెక్స్ అందుకు వేదికగా మారింది.

‘‘ఆధ్యాత్మిక వివాహాలు’’ అనే పద్ధతిని డేవిడ్ తీసుకొచ్చారు. దాని ద్వారా బ్రాంచ్ డేవిడియన్‌లోని అన్ని వయసుల ఆడవారితోఆయన లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. అలా 10 మందికిపైగా పిల్లలకు డేవిడ్ తండ్రి అయి ఉంటారని భావిస్తున్నారు.

లైంగిక దోపిడి, ఆయుధాల అక్రమరవాణా వంటి ఆరోపణలతో 1993లో అమెరికా పోలీసులు డేవిడియన్ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టారు.

51 రోజుల పాటు ఆ ముట్టడి కొనసాగింది. చివరకు 1993 ఏప్రిల్ 19న రెండు వర్గాల మధ్య తుది పోరు జరిగింది. ఈ క్రమంలో కొద్ది గంటల తరువాత డేవిడియన్ కాంప్లెక్స్‌లో భారీ మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో అది పూర్తిగా కాలిపోయింది. సుమారు 79 మంది ఫాలోవర్లు చనిపోయారు.

అంతకుముందే బుల్లెట్ తగిలి డేవిడ్ కోరెష్ చనిపోయాడు. అది హత్య లేక ఆత్మహత్య అనేది తెలియలేదు. మంటలు ఎలా వ్యాపించాయో కచ్చితంగా తెలియలేదు. డేవిడ్ కోరెష్, ఆయన అనుచరులే అందుకు కారణమని అధికారులు తెలిపారు.

మార్షల్ యాపిల్ వైట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్షల్ యాపిల్ వైట్
పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

హెవెన్స్ గేట్

ఇంటర్నెట్ శకం మొదలైన తరువాత ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ఎదిగిన తొలి మత సంస్థగా హెవెన్స్ గేట్‌ను చూస్తుంటారు. 1970ల తొలినాళ్లలో మార్షల్ యాపిల్ వైట్, ఆయన భార్య బొనీ నెటెల్స్ ఆ సంస్థను స్థాపించారు.

అమెరికా వ్యాప్తంగా ‘‘ది క్రూ’’ పేరిట వారు అనుచరులను సంపాదించుకున్నారు. సదరన్ కాలిఫోర్నియా కేంద్రంగా వారు కార్యకలాపాలను విస్తరించడం ప్రారంభించారు.

ఎక్కువ మందికి తమ విశ్వాసాలు చేరేలా వారు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకున్నారు. వారికి అదొక ఆదాయవనరుగా కూడా మారింది. తానే ఏసు అవతారాన్నని, దేవుడు ఏలియన్ అని ఆయన ప్రచారం చేసేవారు. ‘‘ప్రపంచ అంతం’’ దగ్గర్లోనే ఉందని చెప్పేవారు.

‘‘పరలోకం వెళ్లాలంటే ఆత్మలు ప్రస్తుత దేహాన్ని వదలాలి’’ అంటూ ఆయన తన ఫాలోవర్లను నమ్మించారు. అలా వారంతా అధిక డోసులో మత్తు కలిగించే మందులు తీసుకునేలా ప్రేరేపించారు. అలా హెవెన్స్ గేట్‌ సభ్యులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆ సమయంలో హేలీ-బాప్ తోక చుక్క భూమికి దగ్గరగా వెళ్తోంది. విశ్వంలోని కొత్త లోకానికి ఆ తోక చుక్క తమను తీసుకెళ్తుందని వారు భావించారు. అలా ఆత్మలకు ‘విముక్తి’ కలిగించుకున్నారు.

1997 మార్చి 26న 39 శవాలను పోలీసులు గుర్తించారు. అందులో యాపిల్ వైట్ మృతదేహం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)