మీపై పిడుగు పడుతుందో, లేదో పావు గంట ముందే చెప్పే యాప్

ఫొటో సోర్స్, EarthCam
వర్షాల సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏటా చాలా మంది పిడుగులు పడి చనిపోతున్నారు.
పిడుగు అంటే?
వానలు పడేటప్పుడు ఒకోసారి మబ్బుల నుంచి అత్యంత శక్తిమంతమైన విద్యుత్ విడుదల అవుతుంది. అది భూమికి చేరినప్పుడు దాన్ని పిడుగు అంటారు. ఆ సమయంలో భారీ ఉరుములు, మెరుపులు వస్తుంటాయి.
పిడుగులు ఎలా పుడతాయి?
మబ్బుల మీద ఎండ వేడి అధికంగా పడటం వల్ల అందులోని పాజిటివ్(+) చార్జ్ కలిగిన ప్రోటాన్లు మేఘాల పై తలానికి చేరుకుంటాయి. నెగిటివ్(-) చార్జ్ కలిగిన ఎలక్ట్రాన్లు మేఘాల కింద తలంలో స్థిరపడతాయి.
పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అనేవి పరస్పరం ఒకదానినొకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి. అందువల్ల మబ్బు కింద ఉపరితంలో నెగిటివ్(-) చార్జ్‌ను కలిగి ఉండే ఎలక్ట్రాన్లు, భూమి మీద పాజిటివ్(+) చార్జ్ కోసం వెతుకుతూ ఉంటాయి. అలాగే భూమి మీద ఉండే పాజిటివ్(+) చార్జ్ కూడా నెగిటివ్(-) చార్జ్ కోసం వెతుకుతూ ఉంటుంది.
ఇలా తీవ్రత పెరిగి మేఘం నుంచి నెగిటివ్(-) చార్జ్ విడుదలైనప్పుడు అది భూమి వైపుకు ప్రయాణించి, దొరికిన పాజిటివ్(+) చార్జ్‌తో కలుస్తుంది. అప్పుడు విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. అప్పుడు పిడుగు పడుతుంది.
ఎత్తైన భవనాలు, చెట్ల మీద ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి.

ఫొటో సోర్స్, Alex Gregg
ముందుగానే తెలుసుకోవడం ఎలా?
భారత్‌లో సాధారణంగా వానా కాలంలో అంటే జూన్-సెప్టెంబరు మధ్య పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. ఒకోసారి ఏప్రిల్, మే నెలల్లో అకాల వానల వల్ల కూడా పిడుగుపాటు సంభవిస్తుంటుంది.
పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. రానున్న 15 నిమిషాల్లో మనం ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ(ఐఐటీఎం) ఈ యాప్‌ను 2020లో రూపొందించింది.
పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్‌వర్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వ్యక్తుల జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది.
పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ యాప్ చెబుతుంది.

ఫొటో సోర్స్, @NDMAINDIA

ఫొటో సోర్స్, NURPhoto
ఎలా ఉపయోగించాలి?
‘‘గూగుల్ ప్లే స్టోర్’’ లేదా ‘‘యాపిల్ యాప్ స్టోర్’’ నుంచి Damini: Lightning Alert అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకున్నాక, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్ కోడ్ వంటి సమాచారం ఇవ్వాలి.
మీ జీపీఎస్ లొకేషన్ తెలుసుకోవడానికి యాప్‌కు అనుమతి ఇవ్వాలి.
మీరు ఉన్న ప్రదేశం చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్‌ను యాప్ గీస్తుంది. పిడుగు పడే అవకాశం ఉంటే 15 నిమిషాల ముందు హెచ్చరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
యాప్‌లో రంగులు - వాటి అర్థాలు:
ఎరుపు: మరో 5 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
పసుపు: మరో 5-10 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది.
నీలం: మరో 10-15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే సర్కిల్ నీలం(బ్లూ) రంగులోకి మారుతుంది.

ఫొటో సోర్స్, Alex Gregg
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- పెద్దపెద్ద ఉరుములు వినిపించినప్పుడు ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసేయాలి. అరగంట పాటు ఇంట్లోనే ఉండాలి.
- బయట ఉంటే దగ్గర్లోని భవనాల్లోకి వెళ్లాలి. ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.
- కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.
- భూమి పొడిగా ఉన్న చోటకు వెళ్లాలి.
- వేలాడే తీగలకు దూరంగా ఉండాలి.
- కొండలు, కరెంటు స్తంభాలు, చెట్లు ఎక్కడం చేయకూడదు. బహిరంగ ప్రాంతాలు, చెరువులు వంటి వాటి సమీపంలో ఉండకూడదు. చెట్ల కింద నిలబడకూడదు.
- మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టకూడదు. అలాగే వాటిని ఉపయోగించకూడదు.
- స్నానం చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం చేయకూడదు.
- ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉందో చూశారా...
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- ఆంధ్రప్రదేశ్: బిందెడు నీళ్ళ కోసం నానా అవస్థలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా మహిళలు
- మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు....
- హంతకులు పుడతారా, తయారవుతారా? ఒక మనిషి మరో మనిషిని ఎందుకు చంపుతారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








