క్వీన్ ఎలిజబెత్ 2: ఆస్ట్రేలియా గణతంత్ర దేశంగా మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షైమా ఖలీల్
- హోదా, బీబీసీ న్యూస్
''చిన్నప్పటి నుంచీ 'గాడ్ సేవ్ ద క్వీన్' పాట పాడుతూ పెరిగాను. ఇప్పుడు తొలిసారి 'గాడ్ సేవ్ ద కింగ్' పాట పాడుతున్నాను. చార్లెస్ రాజుగా మారడంతో చాలా గర్వంగా అనిపిస్తోంది. కానీ, రాణి మరణ వార్త నన్ను కలచివేసింది'' అని కన్నీళ్లను ఆపుకుంటూ లిటియానా రకరాకటియా టర్నర్ చెప్పారు.
రాజుగా చార్లెస్ 3 ప్రకటన అనంతరం, సిడ్నీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు భారీ తరలివస్తున్న ఆస్ట్రేలియన్లలో ఆమె కూడా ఒకరు. కాన్‌బెర్రాలోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక్కడకు వచ్చినవారు ''గాడ్ సేవ్ ద కింగ్''అని నినదిస్తున్నారు. రాజుగా చార్లెస్ ప్రమాణంతో ఆస్ట్రేలియా చరిత్రతోపాటు రాచరికంతో దేశ సంబంధాల్లోనూ కొత్త అధ్యాయం మొదలవుతోంది.
ఇప్పుడు రాజు చార్లెస్ ఆస్ట్రేలియాకు కూడా దేశాధిపతి. అయితే, రాణి ఎలిజబెత్ 2 లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
''నేను సంతోషంగా ఉన్నాను. మరోవైపు బాధపడుతున్నాను'' అని ఫ్రాన్సెస్ కిన్రాయిడ్ అనే మహిళ బీబీసీతో చెప్పారు. ''రాణి ఇక లేరు. అయితే, ఇప్పుడు కొత్త రాజు వచ్చారు. చార్లీ అన్నీ సవ్యంగా చూసుకుంటారని అనుకుంటున్నాను. చార్లీ కాదు, చార్లెస్''అని నవ్వుతూ ఆమెను ఆమె సరిచేసుకున్నారు.
క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆస్ట్రేలియాలో వరుసగా అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పార్లమెంటు హౌస్‌లో శనివారం రాణి సంస్మరణ సభ ఏర్పాటుచేశారు. మరోవైపు 15 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను రద్దు చేశారు. సెప్టెంబరు 22ను సంతాప దినంగా ప్రకటించారు. మరోవైపు రాణి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు జాతీయ జెండాలను అవనతం చేసే ఉంచాలని ఆదేశించారు. కొత్త నోట్లు, నాణేలపై రాజు చిత్రాన్ని ముద్రిస్తారు.
మరోవైపు రాణి మరణంతో దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చాలన్న చర్చలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
''క్వీన్ పాలనా కాలం ముగియకముందే ఈ విషయంపై మనం ఓటింగ్ నిర్వహించాలని భావించాం. అయితే, ఇప్పుడు రాణి పాలనా కాలం ముగిసింది''అని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ బీబీసీతో చెప్పారు.

ఇప్పుడు వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవచ్చు, కానీ ఇది అనివార్యం అని టర్న్‌బుల్ అన్నారు.
గణతంత్ర వాదానికి గట్టి మద్దతు పలికే రిపబ్లికన్లలో ఆయన కూడా ఒకరు. అయితే, క్వీన్ గురించి ఏబీసీ ఛానెల్‌లో మాట్లాడేటప్పుడు ఆయనకు కన్నీరు వచ్చాయి.
రాచరికంతో ఆస్ట్రేలియా సంబంధాలు కొంచెం సంక్లిష్టమైనవిగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
రాజుగా చార్లెస్ ప్రకటన అనంతరం దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ ఆదివారం మాట్లాడారు. ''రాణికి ఇది నివాళులు అర్పించే సమయం. రాజ్యాంగానికి సంబంధించి పెద్దపెద్ద ప్రశ్నల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం''అని ఆయన అన్నారు.
ఏదో ఒక రోజు రిఫరెండం నిర్వహించక తప్పదని ఆంటోనీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
క్వీన్ ఎలిజబెత్ 70ఏళ్ల పాలనను పురష్కరించుకొని ఈ ఏడాది నిర్వహించిన వేడుకలకు ఒక వారం రోజుల ముందు ''అసిస్టెంట్ మినిస్టర్ ఫర్ రిపబ్లిక్''గా మ్యాట్ థిసిల్‌థ్వైట్‌ను నియమించారు. ఆస్ట్రేలియాను గణతంత్ర రాజ్యంగా మార్చే ప్రక్రియ కోసం ఒక ప్రభుత్వ ఎంపీకి బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి.
ఈ ప్రక్రియల్లో కాస్త అస్పష్టత ఉన్నప్పటికీ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 లేదా 2025లో ఆంటోనీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే, ఈ ప్రక్రియలు వేగం పుంజుకోవచ్చు.
1999లో ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు, ఎక్కువ మంది ''నో''కు మొగ్గుచూపుతూ రాణినే దేశాధినేతగా కొనసాగించారు. రాచరికం నుంచి ఏ తరహా ప్రభుత్వానికి మళ్లాలనే విషయంపై అప్పట్లో రిపబ్లికన్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.
క్వీన్ ఎలిజబెత్‌తో సంబంధాలు మరో కారణం. ఆస్ట్రేలియాకు, రాచరిక వ్యవస్థకు బలమైన సంబంధాలు ఉన్నాయి. క్వీన్ మృతిని తమ కుటుంబంలో ఒక సభ్యురాలి మృతిగా చాలా మంది చెబుతున్నారు.
కింగ్ చార్లెస్-3 వ్యక్తిత్వం, మంచితనం గురించి ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నా, ఇదివరకటిలా పరిస్థితులు ఉండబోవన్నది మాత్రం స్పష్టమని విశ్లేషణలు వస్తున్నాయి.
''ఇది కీలక ఘట్టం. మన చరిత్రలో ఇది కూడా భాగం. అందుకే ఇక్కడికి వచ్చాను'' అని చార్లెస్‌ను రాజుగా ప్రకటించిన అనంతర కార్యక్రమానికి వచ్చిన మహిళ ఎసెల్ ఫాక్స్ చెప్పారు.
''ప్రజాస్వామ్యంతో మనం ఎటువైపు వెళ్తున్నాం? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అదే సమయంలో మనం రాణికి నివాళులు అర్పించాలి''అని ఆమె అన్నారు.

చాలా మంది ఆస్ట్రేలియన్లకు ఇది కాస్త క్లిష్టమైన అంశమే. స్వతంత్రంగా మారాలనే జాతీయ కాంక్ష ఒకవైపు, రాణిపై ప్రేమ మరోవైపు వారిని లాగుతున్నాయి.
ఆస్ట్రేలియా రిపబ్లిక్ మూవ్‌మెంట్ చైర్మన్ పీటర్ ఫిట్జ్‌సైమన్స్ మాట్లాడుతూ.. ''కింగ్ చార్లెస్-3 మీద నాకు చాలా గౌరవముంది. వ్యక్తిగతంగా ఆయనపై నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. అయితే, రాణికి ఇచ్చినంత ప్రేమ, విధేయత ఆయనకు లభించకపోవచ్చు'' అని అన్నారు.
దేశ అధినేతగా రాణి ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ, ఆస్ట్రేలియాలో ఎన్నో మార్పులు వచ్చాయి.
''నేటి యువత ఎక్కువగా చార్లెస్ కంటే రాచకుటుంబంలోని యువతతో కనెక్ట్ అవుతారు'' అని ఫైనాన్స్ మేనేజర్, అకౌంటెంట్ ఎమ్మా స్టాంటన్ చెప్పారు.
రాజుకు కూడా ఆస్ట్రేలియన్లు ఒక అవకాశం ఇవ్వాలని స్టాంటన్ అభిప్రాయపడ్డారు. అయితే, చార్లెస్ కంటే కొత్త జనరేషన్ వ్యక్తిని-విలియం- రాజుగా చూడాలని ఆస్ట్రేలియన్లు కొరుకుంటున్నారని ఆమె అన్నారు.
''నాది, ప్రిన్స్ హ్యారీది ఒకే వయసు. నేటి తరం రాజ కుటుంబ వ్యక్తుల ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి''అని ఆమె వివరించారు.
మరోవైపు క్వీన్ ఎలిజబెత్ 2కు ఆస్ట్రేలియా ఆదివాసులతోనూ మంచి సంబంధాలున్నాయి. వారిలో చాలా మంది నేడు రాణికి సంతాపం ప్రకటిస్తున్నారు. మరికొందరు మాత్రం వలసవాదంలో చోటుచేసుకున్న బాధాకరమైన ఘటనలు, అప్పట్లో హింసను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
క్వీన్ పాలన మొదలైనప్పుడు, ఇక్కడి ఆదివాసీలను జనగణనలోనూ లెక్కించలేదు. అయితే 70ఏళ్ల తర్వాత రాజుగా చార్లెస్‌ను ప్రకటించే వేడుకలో ఆదివాసీల స్వాగతాన్ని కూడా ఏర్పాటుచేశారు.
''ఆమె 1954లో ఇక్కడికి వచ్చినప్పుడు.. ఆమె ఒక బ్రిటిష్ రాణి. ఇది కూడా ఒక బ్రిటిష్ దేశమే'' అని అప్పటి రాణి పర్యటన గురించి టర్న్‌బుల్ చెప్పారు.
''నేటితో పోలిస్తే, అదొక భిన్నమైన ఆస్ట్రేలియా''అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, కొంతమంది ఇప్పటికీ దేశ సుస్థిరతకు రాచరికం అవసరమని అభిప్రాయపడుతున్నారు. రాచరిక వ్యవస్థకు గట్టి మద్దతు పలికేవారిలో జాష్ రాబ్ ఒకరు. కొత్త రాజుకు ఆస్ట్రేలియా ఒక అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
''మనం ఈ వ్యవస్థను కొనసాగించాలి. కొత్త రాజుతో బంధం బలపడేందుకు సమయం పడుతుంది. ఇప్పటివరకు చార్లెస్ అన్నీ సరైన దిశలోనే చేస్తూ వచ్చారు''అని ఆయన అన్నారు.
ఇక్కడ అన్ని ప్రశ్నలూ దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదే సమయంలో బాధాకరమైన వలసవాద చరిత్ర, దానిలో రాచరిక పాత్ర గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతుంటాయి.
అయితే, నేడు రాణి మరణంతో ఒక వ్యక్తి, వ్యవస్థల మధ్య భావోద్వేగపరమైన ఎడబాటు కనిపిస్తోంది.
''మనం రాణిని ప్రేమించవచ్చు. అయినప్పటికీ మనది స్వతంత్ర దేశమని చెప్పడానికి వెనుకాడకూడదు. మన దేశాధిపతి మనలో ఒకరై ఉండాలి'' అని టర్న్‌బుల్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








