ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా మే 9 వరకూ హీట్‌వేవ్‌లు ఉండబోవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి మే నెలలో దేశంలోని భిన్న ప్రాంతాల్లో హీట్‌వేవ్‌లు విజృంభిస్తుంటాయి. కొన్నిచోట్ల 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి.
మార్చి నెల నుంచే దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతుంది. ఏప్రిల్ నుంచి మే, జూన్ నెలల మధ్య సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తుంటాడు.
అయితే, ఈ సారి హీట్ వేవ్‌లు ఏప్రిల్ 11 నుంచి 20 మధ్య మాత్రమే నమోదైనట్లు భారత వాతావరణ విభాగం డేటా చెబుతోంది.
ఒక్క దక్షిణ భారత దేశంలో మాత్రమే కాదు, ఉత్తరాది, పశ్చిమం, మధ్య, తూర్పు భారత్‌లోని చాలా ప్రాంతాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి.
ప్రస్తుతం ఏప్రిల్ 29 నుంచి మే 2 మధ్య దక్షిణం నుంచి తూర్పు వరకూ, ఉత్తరం నుంచి మధ్య భారతం వరకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పది డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
మరోవైపు వాయువ్య భారతంలో కొన్నిచోట్ల హిమపాతం.. మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో దీనిపై భిన్న చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ ఏడాది వేసవి ఉండదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మారుతున్న వాతావరణ పరిస్థితులు
సాధారణంగా మే మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకూ వెళ్తుంటాయి.
కానీ, కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదు అవుతున్నాయి.
ఈ పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వాతావరణ మార్పల వల్ల ఇలాంటి కొత్త మార్పులు మరిన్ని మనం చూస్తామని నిపుణులు చెబుతున్నారు.
యూరప్‌లో దీనికి భిన్నంగా కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

ఫొటో సోర్స్, TWITTER/ WEATHERMAN NAVDEEP DAHIYA
కొత్త రికార్డులు..
మారుతున్న వాతావరణ పరిస్థితులపై వాతావరణ నిపుణుడు నవ్‌దీప్ దహియా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘వేసవి బదులుగా మళ్లీ శీతాకాలం వస్తోంది’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఉత్తర భారత దేశంలోని ధర్మశాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కేవలం 8.9 డిగ్రీలు మాత్రమే నమోదయ్యాయని, దిల్లీలో గరిష్ఠం 26.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని ఆయన చెప్పారు. దిల్లీలో సాధారణంగా కంటే 13 డిగ్రీలు కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
అలానే పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పది నుంచి 17 డిగ్రీల తేడా కనిపిస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల నడుమ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తమిళనాడు, కేరళలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి.
గత 24 గంటల్లో తమిళనాడులోని భిన్న ప్రాంతాల్లో 90 మి.మీ. వర్ష పాతం నమోదైనట్లు మే 3న ఐఎండీ తెలిపింది.

ఫొటో సోర్స్, TWITTER @CLOUDMETWEATHER
పాకిస్తాన్ నుంచి అల్పపీడనం
ఈ మార్పులపై వాతావరణ విభాగం నిపుణుడు కుల్‌దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని చెప్పారు.
ప్రస్తుతం మేఘాలయతోపాటు రాష్ట్రానికి పొరుగున్న ఈశాన్య ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పాకిస్తాన్‌లో ఏర్పడిన అల్ప పీడనం వాయువ్య భారత దేశం వైపుగా కదలడంతో భారీ వర్షాలు, వడగళ్ల వానలు మరిన్ని కురుస్తాయని వాతావరణ అంచనాల సంస్థ ‘‘క్లౌడ్‌మెట్‌వెదర్’’ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇవి కొత్త మార్పులు’’
గతంలో నమోదైన కనిష్ఠ రికార్డులను ప్రస్తుత మే నెల బద్దలుకొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోందని ‘‘లైవ్ వెదర్ ఆఫ్ ఇండియా’’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శుభమ్ చెప్పారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కొన్ని సంవత్సరాలుగా మే నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పడిపోలేదని ఆయన చెప్పారు. సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లో నజీబాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కేవలం 20.5 మాత్రమే నమోదయ్యాయని ఆయన వివరించారు.
ఫిబ్రవరి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గడం లాంటి పరిణామాలపై వాతావరణ నిపుణులు అధ్యయనం చేపడుతున్నారు.
ఎందుకంటే గత ఫిబ్రవరి.. 1901 తర్వాత అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన ఫిబ్రవరిగా రికార్డు సృష్టించింది.
మరోవైపు ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్లు చూపిస్తున్న ఉపగ్రహ చిత్రాలను కూడా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
మే 9 వరకూ ఇలానే..
మే తొమ్మిదో తేదీవరకూ పరిస్థితులు ఇలానే ఉంటాయని ఐఎండీ సీనియర్ సైంటిస్టు రాజేంద్ర కుమార్ జనమణి బీబీసీతో చెప్పారు.
‘‘వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులు ఇది ఇలానే కొనసాగుతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతాయి’’అని ఆయన చెప్పారు.
‘‘2020లోనూ ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో హీట్‌వేవ్‌లు అంతకుముందు ఏడాది ఉన్నట్లుగా ఆ ఏడాదిలో నమోదుకాలేదు’’అని ఆయన వివరించారు.
భూమి వేడెక్కుతోంది..
భారత్‌లోని వాతావరణ పరిస్థితుల్లో ప్రస్తుతం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. భూమి మొత్తంగా చూసినప్పుడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతోనే ఈ మార్పులు సంభవిస్తున్నట్లు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు భారత్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే, దీనికి భిన్నంగా ఉత్తర ఆసియా, యూరప్, కెనడాలలో విపరీత ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.
వాతావరణంలో మార్పుల వల్ల తుపానులు, వరదలు, కరవులు సంభవించే ముప్పు రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ మార్పులు హిమాలయాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తంజావూరు పెరియా కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?
- వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’
- సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















