ఆంధ్రప్రదేశ్: ఏటా వేల మంది రాయలసీమ కూలీలు గుంటూరుకు ఎందుకు తరలివస్తున్నారు..

వలస కూలీలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

రాయలసీమలోని భూములకు సాగునీటి వసతి కల్పిస్తామని వరుసగా ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఆచరణ రూపం దాల్చడం లేదు. కృష్ణా, తుంగభద్ర లాంటి నదీ జలాల వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. వరుస ప్రభుత్వాల తరుపున కొన్ని ప్రయత్నాలు జరిగినా.. అవి పూర్తిగా ఫలించడం లేదు.

ఫలితంగా ఏటా వేలాది మంది కూలీలు, చిన్న రైతులు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో ప్రస్తుతం గుంటూరు, పల్నాడు జిల్లాలలో వేలమంది కనిపిస్తున్నారు.

గుంటూరు మిరప పంటకు ప్రసిద్ధి. ఈ మిరప తోటల్లో పనిచేసే కూలీల్లో ఎక్కువమంది రాయలసీమకు చెందిన వారే. అందులోనూ కర్నూలు జిల్లా ఆధోని, డోన్, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుంచి ఎక్కువ మంది తరలివస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.

తరాలు మారుతున్నా కూలీల వలసలకు మాత్రం ముగింపు కనిపించడం లేదు. పిల్లా, పాపలతో వచ్చి తాత్కాలిక గుడిసెల్లో జీవించే వారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉంటారు.

వలస కూలీలు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, గుంటూరు నుంచి తిరిగివస్తున్న వలస కూలీలతో మంత్రాలయం సమీపంలో మాట్లాడుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

అక్కడ పనుల్లేవు...

గుంటూరు జిల్లా మేడికొండూరులో రోడ్డును అనుకుని తాత్కాలిక గుడిసెల్లో వందల మంది కూలీలు కనిపిస్తారు. రోడ్డు వెంబడే టెంట్లు వేసుకుని వీరు జీవిస్తుంటారు. రోజుకు మహిళా కూలీలకు రూ. 400, పురుషులయితే రూ. 600 చొప్పున కూలీ దక్కుతుందని చెబుతున్నారు.

దీనికోసం ఉదయం 6గం.ల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేయాల్సి ఉంటుంది. మధ్యలో భోజన విరామం గంటన్నర ఉంటుంది.

"అక్కడ పనుల్లేవు. పిల్లా, పాపలతో మా యజమానితో సహా ఇక్కడికి వచ్చేశాం. మూడు నెలల నుంచి ఇక్కడే వండుకుని తింటూ పనులు చేసుకుంటున్నాం. ఉదయం 4గం.లకు లేచి వంట వండుకుని రెండు పూటలకు సరిపడా తెచ్చుకుని పొలంలోకి వచ్చేస్తాం. ఇక్కడే తిని సాయంత్రం వరకూ పనిచేస్తాం. పాకలు వేసి ఇచ్చారు. నీళ్లు ఇస్తారు. మళ్లీ సాయంత్రం వెళ్తున్నప్పుడు కట్టెలు ఏరుకుని ఇంటికి పోతాం. రాత్రికి రొట్టెలు చేసుకుని తిని పడుకుంటాం" అని బండారి వీరమ్మ అనే మహిళా కూలీ తన దినచర్య గురించి బీబీసీకి వివరించారు.

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలోని సుగూరు గ్రామానికి చెందిన వీరమ్మ పిల్లలు, భర్తతో సహా గుంటూరు జిల్లా మేడికొండూరు ప్రాంతానికి పనుల కోసం వచ్చేశారు.

తమకు నాలుగు ఎకరాల భూమి ఉందని, వర్షాధారం పంటగా జొన్న, కొంత వరి పండిస్తుంటామని ఆమె తెలిపారు.

వేసవిలో పనులు ఉండవు కాబట్టి, తామంతా గుంటూరు జిల్లాకు ఏటా వలస వస్తుంటామని వీరమ్మ బీబీసీతో అన్నారు.

వలస కూలీలు

ఏటా వేలాదిగా...

వీరమ్మ లాంటి వలస కూలీలు వేల మంది గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని మిరపతోటల్లో పనులు చేస్తూ కనిపిస్తారు. వారిలో ఎక్కువమంది రాయలసీమ నుంచి వలస వచ్చిన వారే. ఏటా సంక్రాంతి తర్వాత మిరప తోటల్లో పనులు కోసం గుంటూరు ప్రాంతానికి వచ్చి, ఆ తర్వాత మే నెల వరకూ పనులు చేస్తుంటారు. మళ్లీ తమ ప్రాంతంలో వర్షాల సమయానికి తిరిగి వెళతారు.

దాదాపుగా ఒక్క కర్నూలు జిల్లా నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేలమంది వలస కూలీలుగా పనులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. తమ సంఘం సర్వే నిర్వహించి వారి సమస్యలు గుర్తించిందని, ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి పరిష్కారం లేదని అంటున్నారు.

"తరతరాలుగా ఇలా వలస కూలీలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూలీలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది వారి చిన్నప్పుడు తమ బడి మానేసి తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వలస వచ్చినా వారే. ఇప్పుడు వారి పిల్లలను కూడా వెంటబెట్టుకుని వస్తున్నారు. స్థానికంగా వారి గ్రామాల్లో నీటి వసతి ఏర్పాటు చేస్తే ఏడాది పొడవునా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అది జరగడం లేదు. అందుకే పనుల కోసం పొట్ట చేతబట్టుకుని వలసలు పోతున్నారు" అని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు.

వలస కూలీలకు తగిన రక్షణ కూడా లేకుండా పోతోందని ఆయన బీబీసీతో అన్నారు. సరైన వసతి సదుపాయాలు కూడా లేక అరకొర ఏర్పాట్ల మధ్య గడుపుతుంటారని, ప్రభుత్వమే అలాంటి వారికి వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెంకటేశ్వర్లు అంటున్నారు.

వలస కూలీలు

‘ఇక్కడ నీళ్లున్నాయి పనులున్నాయి.. అక్కడ లేవు’

తమ పొలాలకు సాగునీరు అందిస్తే తాము వలసలు రావాల్సిన అవసరం ఉండదని ప్రకాశ్ అనే వలస కూలీ అన్నారు. ఆదోని తాలూకాకు చెందిన ఆయన 12 ఏళ్లుగా ఏటా ఇలా వలస వస్తున్నట్లు బీబీసీకి తెలిపారు.

"మా పొలాలకు నీళ్లు వస్తాయని చెబుతూనే ఉన్నారు. కానీ వర్షం వస్తే పొలం పండుతుంది. లేదంటే ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లు వదిలి రావాల్సి వస్తోంది. ఇక్కడ నీళ్లున్నాయి కాబట్టి పొలాలు పండుతున్నాయి. పంటలున్నాయి కాబట్టి పనులు దొరుకుతున్నాయి. అందుకోసమే మేము వస్తున్నాం. మా పొలాలకు కూడా నీళ్లు ఇస్తే మా పనులే మాకు సరిపోతాయి"అని ప్రకాశ్ తన అభిప్రాయం పంచుకున్నారు.

ఎమ్మెల్యేలు, నాయకులు మాటలు చెప్పడమే తప్పా.. తమ ఊళ్లలో కాలువల ద్వారా నీటి చుక్క చూస్తామన్న ఆశ తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలువలు తవ్వినా అవి కూడా ఉపయోగం లేకుండా పోయాయని వివరించారు.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

సదుపాయాలపై దృష్టి పెడతాం...

గుంటూరు జిల్లాకు ఏటా వేలాది మంది వలస కూలీలు వస్తున్నట్టు గుర్తించామని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వారికి రేషన్ ద్వారా సరుకుల పంపిణీలో ఆటంకాలు లేకుండా చేశామని అన్నారు. పింఛన్లు, ఇతర సదుపాయాలపై కూడా ప్రభుత్వానికి నివేదించి దృష్టి పెడతామని బీబీసీకి తెలిపారు.

కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో వలస కూలీల కోసం అక్కడి ప్రభుత్వాలు కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా వసతి సదుపాయం వంటివి స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఏపీలో కూడా అలాంటి ప్రయత్నం జరగాలనే డిమాండ్ ఉంది.

"రేషన్ సరుకులు అందరికీ అందించే ఏర్పాట్లు చేశాం. వలస కూలీలున్న ప్రాంతంలో కూడా రేషన్ వాహనాల ద్వారా వారికి రేషన్ అందిస్తున్నాం. తద్వారా వారికి మేలు జరుగుతోంది. కొందరికి పింఛన్లు కూడా స్థానికంగా అందించాలనే ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోంది. పనిచేస్తున్న చోటనే వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఉన్న అవకాశాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది’’అని వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

వలస కూలీలకు స్థానికంగా ప్రభుత్వమే వసతి ఏర్పాటు చేయాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు, గుంటూరులో మిరపతోటలు సహా వివిధ జిల్లాల్లో వేల మంది రాయలసీమ కూలీలు పనిచేస్తుంటారు. వలసల నివారణకు రాయలసీమలో నీటి సదుపాయం మెరుగుపరచడం వంటి శాశ్వత చర్యలు తీసుకుంటూనే తాత్కాలికంగా వలస వచ్చిన వారందరికీ తగిన వసతి, రక్షణ ఏర్పాట్ల మీద దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి ఆ ఊరంతా ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)