ఏసీ: ఆ ఒక్క పనిచేస్తే కరెంటు బిల్లు సగం తగ్గుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఏసీ(ఎయిర్ కండిషనర్) వాడితే కరెంటు బిల్లుకు రెక్కలు వస్తాయి. మరి ఈ బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనిపై ఏసీల నిపుణుడితో బీబీసీ మాట్లాడింది.
ఏసీ సామర్థ్యం తగ్గకుండా, రిపేర్లు రాకుండా ఎలా వినియోగించాలో కె. లీలాప్రసాద్ కొన్ని సూచనలు చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన ఎయిర్ కండీషనింగ్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు.
ఆయన చేసిన ఏడు ముఖ్యమైన సూచనలు ఇవీ!

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
1. ఏసీ విద్యుత్ ఖర్చు తగ్గాలంటే ఏంచేయాలి?
ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేసుకోవాలా? అవసరం లేదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఏసీ కోసం అయ్యే విద్యుత్ ఖర్చులో ఇదే కీలకమైన అంశం. ఎందుకంటే ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకుంటే దాదాపు 50 శాతం వరకు విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ఏసీలో టెంపరేచర్‌ను 24 నుంచి 26లో పెట్టి, ఫ్యాన్‌ను మినిమం స్పీడ్‌లో ఉంచాలి. అలా చేయడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఎందుకంటే గదిలో ఉన్న గాలిని ఏసీ క్రమంగా బరువుగా మారుస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ వేయడం వల్ల గాలి రూం అంతా స్ప్రెడ్ అవుతుంది. దాంతో గది త్వరగా చల్లబడుతుంది. కరెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆరు గంటల పాటు ఏసీని వినియోగిస్తే...12 యూనిట్లు ఖర్చు అయితే, ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేస్తే 6 యూనిట్లే ఖర్చవుతుంది. దీంతో ఏసీ వినియోగంతో అయ్యే విద్యుత్ ఖర్చులో 50 శాతం ఆదా అవుతుంది.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
2. కూలింగ్ తగ్గుతుంటే ఏంచేయాలి?
చాలా సార్లు మనం వినియోగించే ఏసీలో తగినంత కూలింగ్ రావడం లేదని ఎక్కువగా వింటుంటాం. కూలింగ్ తగ్గుతుందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ముందుగా ఫిల్టర్స్ చెక్ చేసుకోవాలి. అవి బ్లాక్ లేకుండా శుభ్రంగా ఉంటే బ్లోయర్ మోటారు సామర్థ్యం మేర తిరుగుతోందా, లేదా అనేది చూసుకోవాలి. అది కూడా బాగుంటే కంప్రెషర్ సరిగా పని చేస్తోందా, లేదా అనేది చూసుకోవాలి. అది కూడా బాగానే పని చేస్తుంటే ఏసీ గ్యాస్ పైప్‌లో లీక్ అవుతోందని, వెంటనే దానిని సరిచేసి గ్యాస్ నింపుకోవాలని అర్థం. ఇలా ఒక్కో స్థాయిలో చూసుకుంటూ వెళ్లాలి. గ్యాస్ లీకవుతూ ఉంటే... క్రమంగా కూలింగ్ తగ్గిపోతుంది. అది గమనించాలి.
3. వెంట వెంటనే ఆన్, ఆఫ్ చేస్తే ఏమవుతుంది?
ఏసీ వినియోగదారులు ముఖ్యంగా ఏసీ ఆన్, ఆఫ్ మధ్య కాస్త సమయం ఉండేటట్లు చూసుకోవాలి. ఏసీ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మధ్యలో కనీసం 2 నుంచి రెండున్నర నిమిషాల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి. ఆఫ్ చేసిన వెంటనే ఆన్ చేసినా, ఆన్ చేసిన వెంటనే మళ్లీ ఆఫ్ చేసినా కూడా యూనిట్‌పై ఓవర్ లోడ్ పడుతుంది. దాని వల్ల ఏసీలో ఉండే ఫ్యూజ్ పాడైపోయి, లోపలుండే ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోయే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
4. సర్వీసింగ్ ఎన్నిసార్లు చేయించాలి?
ఏసీ వినియోగంలో సర్వీసింగ్ చాలా ముఖ్యమైనది. ఏడాదిలో రెండు సార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి. వేసవిలో ఏసీని ఎక్కువ వాడతాం కాబట్టి, వాడే ముందుగా సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. దాని వల్ల ఏసీ సామర్థ్యం పెరుగుతుంది. వేసవి ముగిసిన తర్వాత ఏసీ మెకానిక్‌తో పని లేకుండా మనమే దాని ఫిల్టర్లు క్లీన్ చేస్తూ ప్రిలిమినరీ సర్వీసింగ్ చేయవచ్చు. ఏసీలో ఉండే ఫిల్టర్లను బ్రష్ లేదా వాటర్‌తో క్లీన్ చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ ఆ ఫిల్టర్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఏసీ మళ్లీ వినియోగించినప్పుడు కంప్రెషర్‌పై లోడ్ తగ్గి, కరెంట్ ఖర్చు ఆదా అవుతుంది.
5. సర్వీసింగ్ చేయించకపోతే ఏమవుతుంది?
ఏసీని సర్వీసింగ్ చేయడం ద్వారా దాని జీవితకాలం పెరుగుతుంది. దానితో పాటు సామర్థ్యమూ పెరుగుతుంది. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోకపోతే, ఏసీ పని చేసినా కూడా విద్యుత్ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. క్రమంగా కంప్రెషర్ పాడై రిపేర్లు రావడం, ఆ తర్వాత కంప్రెషర్ కాలిపోవడం జరుగుతుంది. అప్పుడు వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
6. సర్వీసింగ్‌కు ఎంతవుతుంది?
ఏసీ సర్వీసింగ్ చేసిన వెంటనే దానిని ఆన్ చేయకూడదు. ముందుగా సర్వీసింగ్ సమయంలో వాడిన నీరు అంతా ఆరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. నీటితో పాటు సోప్ సొల్యూషన్ కూడా వాడతారు. అది కూడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏసీ యూనిట్‌లో ఎక్కడ నీటి బిందువులు లేకుండా చూసుకోవాలి. అలా చేయడం వల్ల ఏసీ కంప్రెషర్‌పై ఒత్తిడి లేకుండా ఉంటుంది.
మీరున్న ప్రాంతాన్ని బట్టి ఏసీ సాధారణ సర్వీసింగ్‌కు రూ.500 నుంచి రూ. 600 వరకు తీసుకుంటారు. వాటర్ సర్వీసింగ్ అన్నీ చేస్తే రూ. 1000 వరకు చార్జ్ చేస్తారు. వాటర్ సర్వీసింగ్ వల్ల ఏసీ పనితీరు మెరుగవుతుంది. కూలింగ్ కూడా తొందరగా వస్తుంది.
7. విడిభాగాలు ఎప్పుడు మార్చాలి?
ఏసీ పార్ట్స్ రీప్లేస్‌మెంట్ అనేది మన చేతుల్లో ఉండదు. అది మనకు వచ్చే విద్యుత్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే విద్యుత్ ఏ అంతరాయం లేకుండా వస్తే ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులుంటే కెపాసిటర్స్ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పాడవుతాయి. ఏసీలో ఉండే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సాధారణంగా చెడిపోయే అవకాశం ఉండదు. ట్రాన్స్ ఫార్మర్స్ నుంచి హై ఓల్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే చెడిపోయే అవకాశం ఉంటుంది. హై ఓల్టేజ్ మనం చూసుకోకుండా ఉంటే స్టెబిలైజర్స్ ఉన్నప్పటికీ కంప్రెషర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఏసీని వాడకపోతే పాడవుతుందని అనుకుంటారు. అటువంటిదేమీ ఉండదు.
కూలర్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బడ్జెట్, నిర్వహణ వ్యయం లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కూలర్లు వాడేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
కూలర్లు సమర్థవంతంగా పని చేయాలంటే గదికి మంచి వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవాలి.
ఎయిర్ కూలర్ల నీటి ట్యాంకును వారానికి ఒకసారైనా డిటర్జెంట్‌తో క్లీన్ చేసుకోవాలి.
కూలర్‌లో నీళ్లు అయిపోతే కూలింగ్ ప్యాడ్స్ ఆరిపోయి దుర్వాసన వస్తుంది. కూలర్‌లో నీళ్లు అయిపోయాయని తెలియచేసే అలారం యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
కూలింగ్ ప్యాడ్స్ పూర్తిగా తడిచేటట్లు చూసుకోవాలి, లేకపోతే గాలి చల్లగా రాదు.
కూలర్ ఆన్‌లో ఉండగా నీరు నింపకూడదు. అలే చేస్తే ఎలక్ట్రానిక్ భాగాలపై నీరు చిమ్మి అవి పాడయ్యే అవకాశం ఉంది.
వాతావరణంలో నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్ కూలర్ల కంటే, ఎయిర్ కండిషనర్లు వినియోగించడమే మంచిది.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















