బెంగళూరు Vs. హైదరాబాద్: ఐటీ రంగంలో ఏది టాప్ సిటీ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బెంగళూరు, హైదరాబాద్.. దేశంలోని ఐటీ రంగానికి రెండు ప్రధాన కేంద్రాలు ఇవి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీలున్న ఈ నగరాలు ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులతో దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలకంగా ఉన్నాయి.
సిలికాన్ వేలీ ఆఫ్ ఇండియా అంటూ దశాబ్దాలుగా పాపులర్ అయిన బెంగళూరుకు కొన్నేళ్లుగా హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
నిజానికి, హైదరాబాద్ కంటే ముందు నుంచే బెంగళూరులో ఐటీ రంగం మొదలైంది.
స్టార్టప్ సంస్కృతిలోనూ హైదరాబాద్ కంటే బెంగళూరు ముందుంది.
కానీ, జీవన వ్యయం పరంగా, ఆఫీస్ స్పేస్ ధరల పరంగా బెంగళూరు కంటే హైదరాబాద్ చౌకైన నగరం కావడంతో ప్రపంచంలోనే అనేక సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.
బెంగళూరుతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో సంస్థల ఏర్పాటుకు ఖర్చు తక్కువ, సదుపాయాలు ఎక్కువ అనే పాయింట్‌ను బలంగా చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో పెట్టుబడులను, పెద్ద సంస్థలను ఆహ్వానిస్తోంది, ఆకర్షిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ దేశవిదేశాలలోని ఏ వేదికపై మాట్లాడినా హైదరాబాద్ అనుకూలతలను బలంగా చెప్తూ ఐటీ రంగ సంస్థలను ఆహ్వానిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
బెంగళూరులో ఐటీ ఎలా మొదలైందంటే...
అమెరికాలోని టెక్సస్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి టెక్నాలజీ కంపెనీ ‘టెక్సస్ ఇన్‌స్ట్రమెంట్స్’ 1984లో బెంగళూరులో తన ‘ఆర్ అండ్ డీ సెంటర్’ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
1985లో ఆ కేంద్రం ఏర్పాటైంది. అది మొదలు బెంగళూరులో ఐటీ విప్లవం మొదలైందని ‘కర్ణాటక ఐటీ పాలసీ 2020-25’లో పేర్కొన్నారు.
2020లో బీఎస్ యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ మంత్రి అశ్వత్థ్ నారాయణ్ నేతృత్వంలో కర్ణాటక ఐటీ పాలసీ 2020-25 రూపొందించారు.
కర్ణాటకలో.. ముఖ్యంగా బెంగళూరులో ఐటీ రంగ విస్తరణ ప్రణాళికలతో పాటు అక్కడి ఐటీ పరిశ్రమ చరిత్రనూ ఆ విధాన పత్రంలో వివరించారు.
బెంగళూరు ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఐటీ క్లస్టర్ అని ఆ డాక్యుమెంట్ పేర్కొంది.
మరోవైపు తాము బెంగళూరులో ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేసిన తరువాత అనేక కంపెనీలు బెంగళూరు బాట పట్టాయని, ఫలితంగా బెంగళూరు ‘సిలికాన్ వేలీ ఆఫ్ ఇండియా’గా మారిందని టెక్సస్ ఇన్‌స్ట్రమెంట్స్ సంస్థ చెప్పింది.
అయితే, 1978లో కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(KEONICS), కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) కలిసి బెంగళూరు నగర సరిహద్దుల నుంచి 18 కిలోమీటర్ల దూరంలో హోసూర్ రోడ్‌లో 332 ఎకరాలు సేకరించి ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేశాయి.
1982లో ఇక్కడ ‘సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా’(STPI) ఏర్పాటైంది. అనంతరం 1982 నుంచి 1986 మధ్య హెచ్‌పీ, సీమెన్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఐటీఐ, మోటోరాల, టాటా, ఎన్టీటీఎఫ్ వంటి అనేక సంస్థలు ఎలక్ట్రానిక్ సిటీ కేంద్రంగా పనిచేయడం ప్రారంభించాయి.
1985లో టెక్సస్ ఇన్‌స్ట్రమెంట్స్ ఇక్కడ ఆర్అండ్‌డీ సెంటర్ నెలకొల్పిన తరువాత మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు బెంగళూరుకు తరలివచ్చాయి.

1992 నాటికి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేసే కంపెనీలు బెంగళూరులో 13 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 5,500కి పైగా చేరుకుంది.
దేశంలోనే కర్ణాటక అతిపెద్ద సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ హబ్ అని ఆ రాష్ట్రం చెప్తోంది. అయితే, కర్ణాటక ఐటీ యాక్టివిటీ అత్యధికంగా బెంగళూరు కేంద్రంగానే సాగుతోంది.
ఇప్పుడు బెంగళూరు ఒక్కటే కాకుండా మంగళూరు, మైసూరు, బెలగావి, హుబ్బళ్లి-ధార్వాడ్‌లకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం ప్రణాళికలు వేస్తోంది.
కాగా.. ఐటీ రంగ అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం అనేక విధానాలు రూపొందించింది.
2002 నాటి ‘మిలీనియం బీపీఓ పాలసీ’ కూడా అందులో ఒకటి.
పెట్టుబడిదారులకు సులభంగా ఉండే విధానాలు రూపొందించడంతో బెంగళూరులో బీపీఓ కంపెనీలు పెద్దసంఖ్యలో ఏర్పడి లక్షలాది మంది ఉద్యోగాలు దొరికాయి.

బెంగళూరులోని కొన్ని పేరున్న టెక్ కంపెనీలు
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, అమెజాన్, విప్రో, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, శాంసంగ్ ఆర్‌అండ్‌డీ సెంటర్, హెచ్‌పీ, డెల్ సంస్థలు బెంగళూరులో ఉన్నాయి.
వీటితో పాటు సిస్కో, సీమెన్స్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, కేప్ జెమిని, ఫిలిప్స్, డెలాయిట్, ఇంటెల్, హెచ్‌సీఎల్, ఎస్ఏపీ, నోకియా వంటి సంస్థలు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ ఐటీ మైత్రీవనం నుంచి హైటెక్ సిటీ వరకు
హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణ 1995 నుంచి మొదలైంది. అంతకుముందు 1990 ప్రాంతాలలోనే అమీర్‌పేట్‌లోని మైత్రీవనం కేంద్రంగా చిన్నచిన్న సాఫ్ట్‌వేర్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీఐఐసీ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ‘హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిటీ’(హైటెక్ సిటీ)ని నెలకొల్పింది.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు 1998లో బిల్‌గేట్స్ ‘మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్’ హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. అమెరికాలోని హెడ్ క్వార్టర్స్ తరువాత తమకు ఇదే అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ అని మైక్రోసాఫ్ట్ సంస్థ తన వెబ్‌సైట్లో పేర్కొంది.
అనంతరం 2000లో డెలాయిట్, 2003లో సీఏ టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలూ హైదరాబాద్‌లో తమ కేంద్రాలు ఏర్పాటుచేశాయి. అనంతరం అమెజాన్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి సంస్థలూ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించాయి.
అనంతర కాలంలో వచ్చిన ప్రభుత్వాలూ ఐటీ రంగానికి పెద్ద పీట వేయడంతో హైదరాబాద్ ఐటీ సంస్థలకు పట్టగొమ్మలా మారిపోయింది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాధాపూర్ తదితర ప్రాంతాలన్నీ ఐటీ సంస్థలు, ఆ రంగ ఉద్యోగులతో నిత్యం కిటకిటలాడుతుంటాయి.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతా అదే జోరు కొనసాగుతూ వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బయట ఇతర తెలంగాణ నగరాల్లోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు మార్గం వేయడంతో 2016లో వరంగల్ ఐటీ ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటైంది.
తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి 2023-24 బడ్జెట్‌లో రూ. 365 కోట్లు కేటాయించింది.
ఇందులో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 150 కోట్లు కేటాయించగా ‘వీహబ్’కు రూ. 7.95 కోట్లు, టీ హబ్‌కు రూ. 2 కోట్లు, ఇన్నోవేషన్ సెల్‌కు రూ. 8.8 కోట్లు, సాఫ్ట్‌నెట్‌కు రూ. 22.86 కోట్లు, టీఎలక్ట్రానిక్స్‌కు రూ. 8 కోట్లు కేటాయించారు.
కాగా ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ ముందుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ చెప్పింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నాటికి రూ. 57,258 కోట్లుగా ఉన్న ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 2022 నాటికి రూ. లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని తెలంగాణ బడ్జెట్‌లో వెల్లడించారు.
2014లో తెలంగాణలో 3,23,396 మంది ఐటీ ఉద్యోగాలలో ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 8,27,124కి పెరిగింది.
యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలకు వెలుపల అతిపెద్ద ఆఫీసులు ఏర్పాటు చేసింది హైదరాబాద్‌లోనే.
మరోవైపు ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కు పరిమితం చేయకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించే ఆలోచనతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ టవర్లు నిర్మించారు.
స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో టీహబ్, వీహబ్ ఏర్పాటుచేశారు.

హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలు
గూగుల్, అమెజాన్, ఐబీఎం, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, జెన్‌పాక్ట్, కేప్ జెమిని, క్వాల్‌కామ్, ఒరాకిల్, డెలాయిట్, డెల్, హెచ్‌సీఎల్, సేల్స్ ఫోర్స్, సీఏ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. యాపిల్, ఇన్ఫోసిస్, ఫేస్‌బుక్ వంటి సంస్థల నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి.

ఫొటో సోర్స్, tcs
ఇండియాలో ఐటీ సెక్టార్ ఎప్పుడు మొదలైంది?
భారతదేశంలో మొట్టమొదటి ఐటీ కంపెనీ 1967లో ఏర్పాటైంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయి కేంద్రంగా 1967లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యకలాపాలు ప్రారంభిచింది.
భారత్‌లోని మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ జోన్ కూడా ముంబయిలోనే 1980లో ప్రారంభమైంది.
సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో ఎవరెక్కడ
ఐటీ రంగ అభివృద్ధికి కొలమానంగా చూసే సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పరిమాణం పరంగా చూస్తే బెంగళూరు దేశంలోని మిగతా అన్ని నగరాల కంటే ముందుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం ఐటీ ఎగుమతులలో అత్యధికంగా కర్ణాటక నుంచే ఉన్నాయి. ఆ తరువాత స్థానాలలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలున్నాయి.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి దేశ ఐటీ ఎగుమతులలో కర్ణాటక వాటా 34.2 శాతం కాగా మహారాష్ట్ర వాటా 20.4 శాతం, తెలంగాణ వాటా 15.6 శాతం అని ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ’ గణాంకాలు చెప్తున్నాయి.

బెంగళూరే టాప్
కర్ణాటక అయినా, తెలంగాణ అయినా అక్కడి ఐటీ రంగమంతా రాజధాని నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది.
కాబట్టి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పరిమాణం పరంగా చూస్తే హైదరాబాద్ కంటే బెంగళూరు ముందున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
అదేసమయంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటేసింది.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐటీ రంగంలో 4.5 లక్షల మందికి ఉద్యోగాలు రాగా అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. బెంగళూరులో 1.47 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
మరోవైపు తెలంగాణలో 2014 నాటికి 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా 2022 నాటికి వారి సంఖ్య 8.7 లక్షలకు చేరిందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

కేటీఆర్, కర్ణాటక నేతల మధ్య ట్వీట్ వార్
బెంగళూరు, హైదరాబాద్‌ల విషయంలో ఏడాది కిందట రెండు రాష్ట్రాల నేతల మధ్య ట్విటర్ వేదికగా చర్చ జరిగింది.
హౌసింగ్.కామ్, ఖాతా బుక్ సంస్థల వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ చేసిన ఓ ట్వీట్‌తో ఈ చర్చ మొదలైంది.
ఆయన ట్వీట్ తరువాత హైదరాబాదా? బెంగళూరా? ఏది బెస్ట్ అనే చర్చ ట్విటర్‌లో సాగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బెంగళూరులోని స్టార్టప్‌లు బిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నా రోడ్లు బాగులేవని, సదుపాయాలు లేవని, కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని, నీటి సరఫరా కూడాఅంతంతమాత్రమేనని ఆరోపిస్తూ రవీశ్ నరేశ్ ట్వీట్ చేశారు.
కాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దానికి స్పందిస్తూ.. ‘ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్‌కు వచ్చేయండి. మా దగ్గర మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. మా ప్రభుత్వం ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే మూడు ఐలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేటీఆర్ అలా ట్వీట్ చేయడంతో కర్ణాటకకు చెందిన ప్రతిపక్ష కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించారు.
2023 నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత బెంగళూరు పునర్వైభవం సాధిస్తుందని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
శివకుమార్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ‘అన్నా.. నాకు కర్ణాటక రాజకీయాలు తెలియవు. అక్కడ ఎవరు గెలవబోతున్నారో పెద్దగా తెలియదు. కానీ, మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. మన దేశ ప్రజల భవిష్యత్తు, యువతరానికి ఉపాధి కల్పన కోసం హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నా. హలాల్, హిజాబ్ వంటి వాటిపై కాకుండా మౌలిక సదుపాయాలు, ఐటీ, వాణిజ్యాలపై దృష్టి పెడితే మంచిది’ అని కేటీఆర్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు.
మరోవైపు కేటీఆర్ అలా స్పందించడాన్ని కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ బొమ్మై తప్పుపట్టారు.
బెంగళూరుతో హైదరాబాద్‌ను పోల్చడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఏది బెటర్?
మెర్సర్ సంస్థ ఏటా విడుదల చేసే ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే’ 2019లో ఇచ్చిన ర్యాంకింగులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో హైదరాబాద్ 143వ ర్యాంకులో ఉండగా బెంగళూరు 149వ ర్యాంకులో ఉంది.
వ్యక్తిగత భద్రత ర్యాంకింగ్‌లలో కూడా బెంగళూరు కంటే హైదరాబాద్ ముందుంది.
హైదరాబాద్ 109వ ర్యాంకులో ఉండగా బెంగళూరు 116 ర్యాంకులోఉంది.
ప్రపంచంలోని వివిధ నగరాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా మెర్సర్ సంస్థ ఇచ్చిన ర్యాంకులలో బెంగళూరు 178వ స్థానంలో ఉండగా హైదరాబాద్ 192వ స్థానంలో ఉంది.
ఈ ర్యాంకుల ప్రకారం బెంగళూరులో కంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తరచూ వీటినే హైదరాబాద్ సానుకూలాంశాలుగా చూపిస్తూ ఐటీ సంస్థలను, పెట్టుబడులను ఆహ్వానిస్తుంటారు.
(ఆధారం: కర్ణాటక ఐటీ పాలసీ 2020-2025, తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్, కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(KEONICS), సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా-ఎస్టీపీఐ , నాస్కామ్, గ్లాస్‌డోర్)
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














