దళితులు: హిందూమతం నుంచి బౌద్ధంలోకి మారిన తర్వాత కుల వివక్ష తగ్గిందా?

- రచయిత, రాక్సీ గగ్డేకర్ చారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలూభాయ్ సర్వయ్య సొంత ఊరు గుజరాత్ ఉనాలోని మోటా సమధియాల. చనిపోయిన పశువుల నుంచి ఆయన చర్మాలను వేరుచేసి మార్కెట్‌లో అమ్ముతుంటారు.
ఆయనకు 60 ఏళ్లు. బాలూభాయ్ తండ్రి కూడా ఇలానే తోళ్ల వ్యాపారం చేసేవారు. ఊరి చివర చనిపోయిన పశువుల నుంచి వచ్చే దుర్వాసన నడుమే వీరు తోళ్లను సేకరిస్తుంటారు.
2016లో బాలూభాయ్ పిల్లలు వాష్రమ్, ముఖేశ్, రమేశ్‌లతోపాటు ఆయన సోదరుడి కుమారుడిపైనా కొందరు గోరక్షకులు దాడిచేశారు.
తోళ్ల కోసం జంతువులను చంపేస్తున్నారని వీరిపై ఆరోపణలు చేశారు. వాటిలో ఎలాంటి నిజమూ లేదని తర్వాత రుజువైంది.
బాలూభాయ్ పిల్లల మీద దాడులపై జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. దీనికి రెండేళ్ల తర్వాత, అంటే 2018 ఏప్రిల్ 24న ఈ కుటుంబం హిందూయిజం నుంచి బౌద్ధానికి మారింది.
గుజరాత్‌లో చాలా మంది ఇలా బౌద్ధానికి మారుతున్నారు. ఇటీవల గాంధీ నగర్‌లోనూ ఒక మత మార్పిడి కార్యక్రమం జరిగింది. ఇందులో దాదాపు 14,000 మంది హిందూయిజాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించారు.
వాష్రమ్ భాయ్‌పై దాడి జరిగి ఐదేళ్లు పూర్తయ్యాయి. బౌద్ధానికి మారిన తర్వాత తమ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు ఈ కుటుంబంతో బీబీసీ మాట్లాడింది.

మా ఊరిలో మార్పుకు అదొక్కటే కారణం కాదు: వాష్రమ్‌భాయ్ సర్వయ్య
ఒకప్పుడు మోటా సమధియాల గ్రామంలో బాలూభాయ్ కుటుంబంతోపాటు ఇతర దళితులు వివక్షను ఎదుర్కొనేవారు. కొన్నిసార్లు అంగన్వాడీ సిబ్బంది కూడా తమ పిల్లలను తీసుకెళ్లడానికి నిరాకరించేవారు.
దుకాణాల దగ్గర కూడా అగ్ర కులాలవారిగా చెప్పుకొనేవారితో కలిసి వీరిని వరుసలో నిలబడనిచ్చేవారు కాదు. వీరికి విడిగా లైను ఉండేది.
అయితే, నేడు పరిస్థితులు చాలా మారాయని ఇక్కడి కుటుంబాలు చెబుతున్నాయి.
ఈ విషయంపై బీబీసీ గుజరాతీతో వాష్రమ్‌భాయ్ సర్వయ్య మాట్లాడుతూ- ‘‘మొదట మా కుటుంబ సభ్యుల ఆలోచనా విధానం కూడా మారిందని చెప్పాలి. మేం కాస్త లాజికల్‌గా ఆలోచిస్తున్నాం. మేం గుళ్లకు వెళ్లడం లేదు. ఖరీదైన ఆచారాలు, సంప్రదాయాలు అనుసరించట్లేదు.. దీంతో మాకు ఖర్చులు తగ్గాయి’’ అని ఆయన చెప్పారు.
ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకునే వాష్రమ్ భాయ్ నేడు మంచి బట్టలు వేసుకుంటున్నారు. తనను తాను మరింత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. ‘‘ఆ దాడి తర్వాత గ్రామంలో వివక్ష తగ్గింది. మేం బౌద్ధానికి మారిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి’’ అని ఆయన అన్నారు.
‘‘ఇదివరకు మేం గ్రామ పెద్దలతో కలిసి టీ తాగేవాళ్లం కాదు. మేం వారితో కలిసి కూర్చునే ధైర్యం కూడా చేసేవాళ్లం కాదు. ఇప్పుడు మేం అందరితో కలిసి ఒకే వేదికను పంచుకుంటున్నాం’’ అని వాష్రమ్‌భాయ్ సర్వయ్య అన్నారు.
‘‘ఇదివరకు మేం దుకాణానికి వెళ్లినప్పుడు, మా డబ్బులపై నీళ్లు చల్లిన తర్వాతే వారు ముట్టుకునేవారు. దూరం నుంచే మాకు సామగ్రి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి కనిపించడంలేదు. అయితే, అందరూ మారారని చెప్పడం లేదు. కానీ, చాలా మందిలో మార్పు వచ్చింది’’ అని ఆయన వివరించారు.
గ్రామస్థుల్లో ఈ మార్పుకు మతం మారడం మాత్రమే కారణం కాదని వాష్రమ్ భాయ్ చెప్పారు.
‘‘2016లో దాడి తర్వాత మమ్మల్ని కలవడానికి మా గ్రామానికి ఆనందీబెన్ పటేల్, రాహుల్ గాంధీ, మాయావతి, శరద్ పవార్ లాంటి పెద్ద నాయకులు వచ్చారు. ఆ ప్రభావం గ్రామ ప్రజలపైనా కనిపించింది’’ అని ఆయన వివరించారు.

గ్రామస్థుల దృష్టిలో మేం ఇప్పటికీ అంతే: జయంతీభాయ్
వాష్రమ్ భాయ్ గ్రామం మోటా సమధియాలకు నాలుగు కి.మీ.ల దూరంలో గంగాడ్ గ్రామం ఉంటుంది.
గంగాడ్‌లో జయంతీభాయ్ తాపీ పని చేస్తుంటారు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో కలిసి 2018లో జయంతీభాయ్ కూడా వాష్రమ్ భాయ్‌తోపాటు బౌద్ధాన్ని స్వీకరించారు.
బౌద్ధానికి మారిన తర్వాత జీవితంలో ఎలాంటి మార్పు కనిపించిందని ఆయన్ను ప్రశ్నించినప్పుడు వాష్రమ్‌భాయ్ కంటే భిన్నమైన సమాధానాన్ని జయంతీభాయ్ చెప్పారు.
‘‘మతం మారిన తర్వాత మనమేమైనా మారిపోతామా? గ్రామస్థుల దృష్టిలో మేం కూడా అంతే. నేటికీ మా గ్రామంలో పెద్ద కులాల వారు మమ్మల్ని ఇంటికి రానివ్వరు. మా ఇంటికి కూడా వారు రారు. పండుగలు, వేడుకల్లోనూ మమ్మల్ని విడిగా పెడతారు. మేం దళితులమని మాకు పదేపదే ఇవి గుర్తుచేస్తుంటాయి’’ అని ఆయన అన్నారు.
అయితే, బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత తన ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన చెప్పారు. 2014 నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలు గ్రామంలో ప్రచారం చేసేందుకు ఆయన పనిచేస్తున్నారు. అంబేడ్కర్‌పై సినిమాలు, డాక్యుమెంటరీలనూ గ్రామంలో వేసేందుకు ఆయన సాయం చేస్తున్నారు.
‘‘నా దగ్గర నాలుగు పుస్తకాలు మాత్రమే ఉండేవి. కానీ, నా ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం మెడికల్, పారా-మెడికల్, ఇంజినీరింగ్ చదువుతున్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో మా కుటుంబం నడుస్తోంది’’ అని ఆయన చెప్పారు.
అమ్రేలీ జిల్లాలోని ధారీ పట్టణంలో నివసించే నవల్‌భయ్ కూడా జయంతీభాయ్‌లానే అభిప్రాయం వ్యక్తంచేశారు. 2018లో నవల్‌భాయ్ బౌద్ధాన్ని స్వీకరించారు.
‘‘బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ, సమాజం మమ్మల్ని చూసే కోణంలో ఎలాంటి మార్పూ రాలేదు. ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఈ కుల వివక్ష నాకు కనిపిస్తోంది. మతం మారడంతో వివక్ష దూరం కాదు’’ అని ఆయన చెప్పారు.

‘బౌద్ధాన్ని స్వీకరించకపోతే, ఇక్కడి వరకూ వచ్చేవాడిని కాదు’
జునాగఢ్‌లోని రెకారియా గ్రామానికి చెందిన మనీష్ భాయ్ పర్మార్ 2013లో బౌద్ధానికి మారారు. దశాబ్దం తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘నేను సమాజం గురించి మాట్లాడటం లేదు. నా కుటుంబం గురించి మాత్రమే చెబుతున్నాను. మేం జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. ఎప్పటిలానే నెలనెలా పండగలు వస్తున్నాయి. కానీ, మేమేమీ వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీంతో పిల్లల చదువుకు డబ్బులు మిగులుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.
మనీష్ భాయ్ నలుగురు పిల్లల్లో ఒకరు ఎంఎస్సీ పూర్తిచేశారు. మరొకరు రాజ్‌కోట్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఇంకొక అబ్బాయి ఇంజినీరుగా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాలుగో కొడుకు చదువుకుంటున్నారు.
‘‘బౌద్ధంలోకి మారిన తర్వాత, పిల్లల చదువు, భవిష్యత్‌పై మేం ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టాం. పిల్లలు కూడా చదువు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారు’’ అని మనీష్‌భాయ్ చెప్పారు.
తాము బౌద్ధంలోకి మారకపోతే, జీవితంలో ఇంతవరకు వచ్చేవాళ్లంకాదని మనీష్ భాయ్ అన్నారు.

‘నేడు కొత్త గుర్తింపు’
కుల వివక్షను నిర్మూలించాలంటే దళితులు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. వారికి ఈ వలస కొత్త గుర్తింపును ఇస్తుందని చెప్పారు.
1936 మే 31న మహర్ కాన్ఫరెన్స్‌లో వలసల గురించి అంబేడ్కర్ మాట్లాడారు.
‘‘హిందూయిజం కేవలం పేరుకే మారితే దళితుల గుర్తింపులో ఎలాంటి మార్పూ రాదు. దళితులు తమ ఐడెంటిటీని మార్చుకోవాలంటే మొదట తమ ఇంటిపేర్లలోనే మహర్, చోకమేళా లాంటివి వదిలిపెట్టాలి. కొత్త ఇంటిపేర్లు ఎంచుకోవాలి. ఆ తర్వాత మార్పు అదే వస్తుంది’’ అని ఆయన అన్నారు.
సూరత్‌లో ఉండే 40 ఏళ్ల చంద్రమణి ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన బౌద్ధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. 1956లో ఆయన తాతయ్య అంబేడ్కర్‌తో కలిసి బౌద్ధంలోకి మారారు.
‘‘మొదట మత మార్పిడి, ఆ తర్వాత ఇంటి పేరు మార్పు, చివరగా వలసలను అంబేడ్కర్ సూచించారు. మా తాతగారు కూడా అలానే మతం మారారు. ఆ తర్వాత ఇంటిపేరు మార్చుకున్నారు. చివరగా నాగ్‌పుర్ నుంచి ముంబయికి వచ్చారు’’ అని చంద్రమణి చెప్పారు.
‘‘మా నాన్న రైల్వే గార్డుగా పనిచేసేవారు. మేం అంతా రైల్వే కాలనీలో ఉండేవాళ్లం. అక్కడ కుల వివక్ష ఎప్పుడూ కనిపించలేదు. ఆ తర్వాత మేం సూరత్‌కు వచ్చాం. ఇక్కడ మా అన్నయ్య డాక్టర్, అక్క లాయర్ అయ్యారు. నేను ఇంజినీరింగ్ పూర్తిచేశాను. బౌద్ధంలోకి మారడంతో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PAVAN JAISHWAL
బౌద్ధం పరిష్కారం చూపిస్తుందా?
బౌద్ధంతో కుల వివక్షకు సమాధానం లభిస్తుందని చాలా మంది చెబుతున్నారు. అయితే, అన్నిసార్లూ మత మార్పిడే దీనికి సమాధానం కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
దీనిపై దళిత ఉద్యమకర్త మార్టిన్ మెక్‌వాన్ మాట్లాడుతూ.. ‘‘బౌద్ధానికి మారిన తర్వాత కూడా చాలా మంది కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. మతం మారిన తర్వాత అదే గ్రామంలో జీవించేవారి గుర్తింపు పెద్దగా ఏమీ మారదు. అందుకే మతం మారిన తర్వాత కూడా చాలా మంది కుల వివక్షను ఎదుర్కొంటున్నారు’’ అని ఆయన చెప్పారు.
దీనికి దళిత రచయిత, ఉద్యమకారుడు చందూభాయ్ మెహ్రియా ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ‘‘దళితుల్లోనూ సబ్-క్యాస్ట్ సిస్టమ్ ఉంది. బౌద్ధం కూడా దీనిని మార్చలేకపోతోంది. అందుకే ప్రస్తుత కుల వ్యవస్థకు బౌద్ధాన్ని పరిష్కారంగా చెప్పలేం’’అని ఆయన చెప్పారు.
దళిత నాయకురాలు ప్రీతీబెన్ వాఘేలా మాట్లాడుతూ.. ‘‘కొంతమందిలో బౌద్ధం ద్వారా ఒక కొత్తరకమైన మత ఛాందసవాదం వస్తోంది. ఎందుకంటే కొంతమంది తమ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బౌద్ధంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా మంది ఏదో మతం మారాలని బౌద్ధంలోకి వెళ్తున్నారు. కానీ, దాన్ని పూర్తిగా స్వీకరించడం లేదు.. అనుసరించడం లేదు’’అని అన్నారు.
గుజరాత్ బౌద్ధ అకాడమీ జనరల్ సెక్రటరీ రమేశ్ బైంకర్ దీనిపై కాస్త భిన్నంగా స్పందించారు. ‘‘బౌద్ధం ప్రధాన లక్ష్యం ఏమిటంటే మనిషిలో మార్పు తీసుకురావడం. వారిలో ఆత్మవిశ్వాసం స్థాయిలను పెంచడం కూడా. బౌద్ధులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో మార్పును వారు చూస్తారు. మిగతావారు ఏం అనుకుంటున్నారో వారికి అవసరం లేదు. ఎందుకంటే అలాంటి అభిప్రాయాల నుంచి వారికి బౌద్ధం విముక్తి కల్పిస్తుంది’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















