చీకోటి ప్రవీణ్: థాయ్‌లాండ్‌లో అసలేం జరిగింది.. గ్యాంబ్లర్స్ అరెస్టులపై అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, CHIKOTIPRAVEEN444
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో అక్రమంగా క్యాసినోలను నడిపించి వివాదం సృష్టించిన చీకోటి ప్రవీణ్‌తోపాటు 93 మంది తాజాగా థాయిలాండ్‌లో అరెస్టయినట్లు వార్తలు వస్తున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం అర్ధరాత్రి ఓ హోటల్‌లోని మీటింగ్ రూమ్‌లో అక్రమంగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న వారితోపాటు అక్కడకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేశారని థాయ్ మీడియా చెబుతోంది.
తెలుగు మీడియా చానెళ్లలోనూ ఈ అరెస్టులకు సంబంధించిన కథనాలు, వీడియోలు కనిపించాయి.
ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అరెస్టయిన వారిపై వస్తున్న ఆరోపణలు ఏమిటి?

ఫొటో సోర్స్, Chonburi Provincial Police
అక్కడ ఏం జరిగింది?
ఏప్రిల్ 27 నుంచి మే 1 మధ్య థాయ్‌లాండ్‌లోని చంబూరీ ప్రావిన్స్‌లోని బాంగ్ లముంగ్ జిల్లా ఆసియా పటాయా హోటల్‌లో సంఫావో ‘‘మీటింగ్ రూమ్”లో గ్యాంబ్లింగ్ నిర్వహించారు.
మే 1 స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.16 గంటలకు థాయ్ పోలీసులు అక్కడికి వెళ్లారు. మొత్తంగా 93 మందిని అరెస్టు చేశారు. వీరిలో 83 మంది భారతీయులు ఉన్నారు. ఆరుగురు థాయ్ ప్రజలు, నలుగురు మియన్మార్ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
‘‘పక్కా సాక్ష్యాధారాలతోనే గ్యాంబ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మీటింగ్ రూమ్‌లో నాలుగు గ్యాంబ్లింగ్ డెస్కులు, మూడు బ్లాక్ జాక్ డెస్కులు, 25 కార్డ్స్ డెస్కులు కనిపించాయి. సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరించారు’’అని బీబీసీ థాయ్ ఎడిటర్ క్రిడికార్న్ పెడెరెంకుర్కుల్మాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Chonburi Provincial Police
‘‘కొన్ని గ్యాబ్లింగ్ చిప్‌లను (టోకెన్లు) కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టకముందే, ఈ చిప్‌లను భారత కరెన్సీతో కొనుగోలు చేశారు. ఈ చిప్‌ల మొత్తం విలువ రూ.20.91 కోట్ల వరకూ ఉంటుంది. మరో రూ.1.6 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన ఖాతాల వివరాలను రికార్డుచేసే రిజిస్టర్ కూడా దొరికింది. దీని ప్రకారం, వంద కోట్ల రూపాయలకుపైనే చేతులు మారాయని తెలుస్తోంది’’అని క్రిడికార్న్ చెప్పారు.
ఆ మీటింగ్ రూమ్ అద్దె 1,20,000 బాట్లని ఈ గ్యాబ్లింగ్ నిర్వాహకుల్లో ఒకరైన థాయ్ మహిళ సిత్రనన్ పోలీసులకు చెప్పారు. ‘‘గ్యాంబ్లింగ్‌లో పాల్గొనాలంటే ఒక్కొక్కరు మొదట 50,000 బాట్లు చెల్లించాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరోసటి రోజు ఉదయం వరకూ ఇక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ గ్యాబ్లింగ్‌కు అవసరమైన సామగ్రి, ఇతర పరికరాలు, సిబ్బందిని భారత్ నుంచి తీసుకొచ్చాం’’అని ఆమె పోలీసులకు వెల్లడించారు.
‘‘అయితే, థాయ్ స్థానిక పత్రికల్లో చీకోటి ప్రవీణ్ పేరు ప్రస్తావించలేదు. థాయ్ ప్రజలకు ఆయన పేరు పెద్దగా పరిచయం లేదు. అందుకే ఆయన పేరును ఇక్కడి పత్రికలు ప్రస్తావించలేదు’’అని క్రిడికార్న్ చెప్పారు.

ఫొటో సోర్స్, Chonburi Provincial Police
ఏం ఆరోపణలు మోపారు?
పోలీసులు ఈ కేసులో ఎలాంటి అభియోగాలు నమోదు చేశారనే విషయమై బీబీసీ థాయ్ ఎడిటర్ క్రిడికార్న్ వివరించారు, ‘‘పోలీసులు మూడు అభియోగాలను మోపుతున్నారు. వీటిలో మొదటిది అక్రమంగా గ్యాంబ్లింగ్ నిర్వహించడం, రెండోది అనుమతి లేకుండా విదేశీ సిబ్బందిని విధుల్లోకి నియమించుకోవడం. అంటే, గ్యాంబ్లింగ్ క్లర్కులుగా విదేశీయులను నియమించుకోవడం. మూడోది ఆ మీటింగ్ రూమ్‌లో హుక్కాను తీసుకోవడం’’అని ఆమె చెప్పారు.
అయితే, అరెస్టైన వారిలో చీకోటి ప్రవీణ్ ఉన్నారా? అనే విషయంపై థాయ్ పోలీసులను బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
మరోవైపు హైదరాబాద్‌లోని ప్రవీణ్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ‘‘ఆయన థాయ్‌లాండ్‌లోనే ఉన్నారు. ఈ గురువారం ఇక్కడికి రావాల్సింది’’ అని చీకోటి ప్రవీణ్ సన్నిహితులు బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, CHIKOTIPRAVEEN444
చీకోటి ప్రవీణ్ ఎవరు?
చీకోటి ప్రవీణ్ పేరు 2022 జూలైలో వార్తల్లో మార్మోగింది. అప్పుడు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో ఇలాంటి అక్రమ క్యాసినో ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది.
అప్పట్లో ఈ క్యాసినోల దందాతో భారీగా డబ్బులు చేతులు మారాయనే అనుమానంతో మొదలైన ఆ కేసు విచారణలో ఎన్నో మలుపులు తిరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా అప్పట్లో వినిపించాయి.
మొత్తంగా చీకోటి ప్రవీణ్‌తోపాటు మాధవ్ రెడ్డి ఇంట్లో 16 గంటలపాటు ఈడీ సోదాలు చేసింది. వీరిద్దరూ టూర్ ఆపరేట్లుగా వ్యవహరిస్తూ క్యాసినో వ్యాపారం చేసేవారు. ఫారెన్ ఎక్సెచేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలతో ఆ కేసు మొదలైంది.
క్యాసినో ఆడేందుకు దొడ్డి దారిలో విదేశాలకు సొమ్ము తరలించడం, అలానే అక్కడ గెలుచుకున్న సొమ్మును దొంగతనంగా ఇక్కడకు తీసుకురావడం లాంటి ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది.
చీకోటి ప్రవీణ్ ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లలో ఆయన క్యాసినోలు నిర్వహించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో జూదం నిర్వహిస్తూ ఆయన పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు.
సంక్రాంతి వేడుకలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో ఆయన ఏర్పాటుచేసిన క్యాసినోపై పెద్ద వివాదమే చెలరేగింది.
నేపాల్‌లో ఆయన క్యాసినో నిర్వహించేటప్పుడు కొందరు హీరోయిన్లతోనూ ఆయన ప్రమోషన్లు నిర్వహించారు.
ఈడీ సోదాలు, నోటీసుల విషయంలో గతంలో చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘సాధారణ సోదాల్లో భాగంగానే ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నేను నిర్వహించే క్యాసినోలన్నీ చట్టబద్ధమైనవే’’అని ఆయన చెప్పారు.
ఎందుకు మిమ్మల్ని ఈడీ లక్ష్యం చేసిందని మీరు అంటున్నారు? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఏం చెప్పుకోవాలన్నా నేను ఈడీ అధికారులకే సమాధానం చెబుతాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు’’అని అన్నారు.
ఇది మానసిక సమస్య
ఎందుకు కోట్ల రూపాయలను వెచ్చించి విదేశాలకు వెళ్లి మరీ గ్యాంబ్లింగ్ ఆడుతున్నారనే విషయంపై సైకాలజిస్టు రెడ్డి సాయిబాబా నాయుడుతో బీబీసీ మాట్లాడింది. గ్యాంబ్లింగ్ అనేది ఒక వ్యసనం లాంటిదని ఆయన చెప్పారు.
‘‘చాలా మంది అప్పుడప్పుడు గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. ఇలాంటి వారితో పెద్ద సమస్య ఏమీ ఉండకపోవచ్చు. కానీ, కొందరు మాత్రం ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లర్లు’గా మారతారు. ఇలాంటి వారి జీవితం గ్యాంబ్లింగ్ వల్ల చాలా ప్రభావితం అవుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా దీని పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని చెప్పారు.
దీన్ని మనం ఒక మానసిక సమస్యలా చూడాలని ఆయన అన్నారు. ‘‘ఎందుకంటే గ్యాంబ్లింగ్ ఆడేవారిలో యాంక్సైటీ, స్ట్రెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి బాగా గెలిచినప్పుడు ఒక ‘హై’ వస్తుంది. దాన్ని మళ్లీ చూసేందుకు ఎంతదూరమైనా వెళ్తారు. ఎంత డబ్బునైనా పెట్టేందుకు వెనుకాడరు’’అని ఆయన వివరించారు.
‘‘కొంతమంది గ్యాంబ్లింగ్‌తోపాటు డ్రగ్స్, అతిగా మద్యం సేవించడం లాంటి వ్యసనాలకు కూడా అలవాటు పడుతుంటారు. వీరు గ్యాంబ్లింగ్ నుంచి బయటపడటం మరింత కష్టం’’అని ఆయన చెప్పారు. దీని నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్‌తోపాటు మందులు కూడా కొన్నిసార్లు అవసరం అవుతాయని చెప్పారు.
గ్యాంబ్లింగ్‌కు ఎవరు ఎక్కువ అలవాటు పడతారు?
గ్యాంబింగ్‌కు బానిసలయ్యే ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందనే అంశంపై గ్యాంబ్లింగ్ కమిషన్ ఒక నివేదిక విడుదల చేసింది. దానిలో వివరాల ప్రకారం..
- మహిళలతో పోలిస్తే, పురుషులు గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడే ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.
- ఉద్యోగాలు చేస్తున్నవారితో పోలిస్తే, నిరుద్యోగులు లేదా ఏ పనీ చేయనివారు గ్యాంబ్లింగ్ ఎక్కువగా చేస్తుంటారు.
- 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారికి గ్యాంబ్లింగ్ చేసే ముప్పు మరీ ఎక్కువ.
- ఇతర మానసిక సమస్యలు ఉండేవారు గ్యాంబ్లింగ్ వైపు వచ్చే అవకాశం ఎక్కువ.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















