ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్‌-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?

టిడ్కో ఇల్లు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. అమరావతి రైతులు ఆందోళనకు దిగుతున్నారు.

వారి అభ్యంతరాలను లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పేరుతో రాజధాని భూములను పేదలకు పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం.

ఇప్పటికే భూములు చదును చేసే పనిలో సీఆర్డీయే ఉంది. మరోవైపు లబ్ధిదారులను ఎంపిక చేసి, పట్టాలను సిద్ధం చేసే కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు రెడీ అయ్యారు.

‘‘ఆర్ 5 జోన్’’ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పటికే అమరావతి జేఏసీ న్యాయస్థానాలను ఆశ్రయించింది.

ప్రస్తుతం ఈ కేసు ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది. విచారణ సాగుతోంది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తున్న తీరు ఆసక్తిగా మారుతోంది.

మరోవైపు రాజధాని ప్రాంత పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తై నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందించకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

అదే సమయంలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి ఆటంకాలు పెట్టడం తగదంటూ బహుజన జేఏసీ చెబుతోంది.

ఇంతకీ ఆర్5 జోన్ ఏమిటీ, అక్కడే ఇళ్ల నిర్మాణం ఎందుకూ అనేది చర్చనీయాంశమవుతోంది.

ఇళ్ల స్థలాలు

ఆర్ 5 జోన్ ఏమిటి?

ఏపీ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు రెండేళ్ల క్రితం ఓసారి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అప్పట్లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. మధ్యలోనే ఈ ప్రయత్నం విరమించుకుంది.

ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో సీఆర్డీయే చట్టం-2014కి మార్పులు చేసింది. కీలకమైన రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఆర్ 5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేసింది.

సీఆర్డీయే చట్టంలోని సెక్షన్ - 53(డి) ప్రకారం ల్యాండ్ ఫూలింగ్ కింద సమీకరించిన మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. చట్టంలోని సెక్షన్ 41లో మార్పులు చేసి కొత్త జోన్ తీసుకొచ్చింది. దాన్నే ఆర్ 5 జోన్‌గా పేర్కొంది.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని భూములు U1 రిజర్వ్ జోన్‌గా ఉండేవి. తొలుత కాలుష్య రహిత పరిశ్రమల జోన్, టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, బిజినెస్ పార్క్ జోన్ వంటి వాటి పరిధిలో ప్రస్తావించారు.

2022లో తీసుకొచ్చిన చట్ట సవరణల ప్రకారం ఆయా గ్రామాల భూములను ఆర్ 5 జోన్‌గా పేర్కొని, 900.97 ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఆందోళన

అభ్యంతరం ఎందుకు?

గత ఏడాది చేసిన చట్టాలకు అనుగుణంగా 2023 మార్చి 31న ప్రభుత్వం జీవో నెం. 45 విడుదల చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని 48,128 మందికి ఇళ్ల పట్టాలు అందించి, ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టు పేర్కొంది. దానికోసం 1134.59 ఎకరాలు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.

తొలుత ఆర్5 జోన్ ఏర్పాటుని కూడా అమరావతి రైతులు వ్యతిరేకించారు. వాటి మీద కోర్టులను ఆశ్రయించారు. అయినా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోలేకపోయారు. దాంతో తాజాగా పేదలకు ఇళ్లపంపిణీ కోసమంటూ మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోని ఐదు గ్రామాల్లో ఉన్న భూములను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఆర్డీయే అధికారులు ఆయా భూములను చదును చేసి, తుప్పలు తొలగించే ప్రక్రియ ప్రారంభించగానే రైతులు అడ్డుకునే యత్నం చేశారు. ఆ సందర్భంలో కొందరిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

"మేం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ నిర్మాణం పూర్తి చేస్తే ఇంకా 10వేల ఎకరాలు మిగులుతుంది. వాటిని ఇష్టారీతిలో వాడుకోవచ్చు. కానీ మాకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా, వాటిలో తుప్పలు తొలగించకుండా పేదలకు భూములు పంచుతామని అనడం ఏమిటీ.. భూములిచ్చిన రైతులకు న్యాయం చేసి, ఇతరులకు ఏం చేసినా ఎవరూ మాట్లాడరు, కానీ మా నోట్లో మట్టికొట్టి, ఎవరికో పంచుతామనడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం" అంటూ కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు లంక సుధాకర్ అన్నారు.

"మేం పేదలకు వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వమే రాజధాని ప్రాంత పేదలను వదిలేసి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తీసుకొస్తామని చెప్పడమే మోసం" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇళ్ల స్థలాలు చదును చేస్తున్న దృశ్యం

ప్రభుత్వం ఏమంటోంది?

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలంటూ అమరావతి జేఏసీ తరఫున పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసు విచారణను మే 2 నాటికి వాయిదా వేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వ హయంలోనే దాదాపు పూర్తయింది. తుది మెరుగులు దిద్ది, మంచినీరు, విద్యుత్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి వాటిని అప్పగించాల్సి ఉండగా నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ నానుతోంది.

ఓవైపు పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లు అందించకుండా, మరోవైపు పేదలకు ఇళ్ల నిర్మాణం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని పిటిషనర్లు కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు సీఆర్డీయే అధికారులు ఆర్ 5 జోన్ లో భూములు చదును చేస్తున్నారు. బుల్డోజర్ల సహాయంతో ఇళ్ల స్థలాలకు అనుగుణంగా తయారుచేస్తున్నారు.

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పట్టాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

"ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులను గుర్తించాం. కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తాం. కానీ ఈలోగా పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. పేదలందరికీ ఇళ్లు నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న పేదల ఇళ్లు సిద్ధమవుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది" అని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆయా సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల జాబితా సిద్ధమైందని, తుది పరిశీలన తర్వాత పట్టాలు రెడీ అవుతాయని ఆయన బీబీసీకి తెలిపారు.

అమరావతి

అమరావతి విధ్వంసమే అసలు లక్ష్యం: టీడీపీ

పేదలకు ఇళ్ల నిర్మాణం అంటూ పైకి చెబుతున్నప్పటికీ అమరావతి ప్రణాళిక విధ్వంసమే ప్రభుత్వ అసలు లక్ష్యమని టీడీపీ ఆరోపిస్తోంది. పేదలను ఉద్ధరించాలనే ఆలోచనే ఉంటే 5,024 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎందుకు ఇళ్లు అప్పగించలేదని తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.

"పేదలందరికీ ఇళ్లు అంటే ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా అమరావతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. రాజధాని అభివృద్ధి అయితే అన్ని రకాల ప్రజలు అమరావతికి వస్తారు. కానీ అందుకు విరుద్ధంగా పేదల వాడలు కట్టడం ద్వారా మాస్టర్ ప్లాన్ అమలుకాకుండా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అది కూడా ప్రతిపాదిత సచివాలయం వంటి వాటికి సమీపంలో పేదల ఇళ్లస్థలాల కోసం ఆతృత చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుందని" ఆయన వ్యాఖ్యానించారు.

విజయవాడ, గుంటూరు కి చెందిన పేదలను మందడం, ఐనవోలు తరలించాలని ఆలోచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి మీద కక్షతో జగన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొడతారని, న్యాయస్థానం కూడా తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని శ్రావణ్ కుమార్ అన్నారు.

అమరావతి

పేదల ఇళ్లకి అడ్డంకులు తగవు: బహుజన జేఏసీ

అమరావతి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని బహుజన జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్ధతుగా అంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు చేస్తున్న ఆందోళనలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటూ నినదిస్తున్నారు.

"29 గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అమరావతిలో బహుజనులు ఉండకూదని కొందరి దురాశ. అందుకే ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా లబ్దిదారులందరికీ పట్టాలు అందిస్తారు. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకోలేరు. రాష్ట్రమంతా పేదల ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కానీ అమరావతి వాసులకు అలాంటి అవకాశం వద్దని కొందరు వాదిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు సాగవు. " అంటూ బహుజన జేఏసీ నేత ఎన్ జోషీ ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ లక్ష్యాలతో కొందరు పేదలకు సొంత గూటికి అడ్డంకులు సృష్టించడం మానుకోవాలని ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి: