చరిత్రలో అతి పెద్ద లాటరీ.. జాక్‌పాట్ రూ.13 వేల కోట్లు.. మూడు నెలలగా విజేతలే లేరు.. చివరికి ఏం చేశారంటే..

పవర్ బాల డ్రా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సామ్ కాబ్రాల్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలో మూడు నెలల పాటు విజేతలు లేకుండా సాగిన ఓ లాటరీ గేమ్‌లో ఈ వారం భారీ ప్రైజ్ మనీని ఈసారి ప్రకటించారు.

ప్రపంచంలోనే లాటరీలో ఇంతవరకు ఎవరూ దక్కించుకోనంత మొత్తం ఇదని చెబుతున్నారు.

'ది పవర్ బాల్ జాక్‌పాట్'లో ఈ శనివారం విజేతకు 160 కోట్ల డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) బహుమతి ఉంటుందని ప్రకటించారు. (పన్నులు మినహాయించకుండా)

ఇంతకుముందు 2016లో 159 కోట్ల డాలర్లను ముగ్గురు పవర్ బాల్ ప్లేయర్లకు ఇచ్చారు.

పవర్ బాల్ ప్లేలో జాక్‌పాట్ గెలుచుకునే సంభావ్యత 29.2 కోట్లలో ఒకరికి ఉంటుంది.

1992లో ప్రారంభమైన ఈ గేమ్ అమెరికాలోని 45 రాష్ట్రాలు, వాషింగ్టన్ నగరం, వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరికోలో ఈ లాటరీ ఉంది.

ఈ లాటరీలో జాక్‌పాట్ గెలుచుకోవాలంటే టికెట్లోని ఆరు అంకెలూ డ్రా తీసిన తరువాత ప్రకటించే ఆరు అంకెలతో సరిపోలాలి.

గత 39 డ్రాలలో ఎవరూ విజేతగా నిలవలేదు.

గోల్డెన్ టికెట్ ఉన్నవారు బహుమతి మొత్తాన్ని మూడు దశాబ్దాల పాటు తీసుకునే అవకాశం ఉంటుంది.

అయితే, సాధారణంగా విజేతలంతా కొంత తక్కువ వచ్చినా ఒకేసారి ఈ బహుమతి మొత్తం అంతా తీసుకుంటారు.

వీడియో క్యాప్షన్, క్యాసినో పెట్టాలంటే ఏయే అనుమతులు కావాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినో పెట్టొచ్చా?

శనివారం ప్రకటించబోయే డ్రాలో గెలిస్తే నగదు బహుమతి 78.24 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6429 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆగస్ట్‌లో చివరిసారి జాక్ పాట్ కొట్టిన విజేతకు దక్కిన మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. ఆగస్ట్‌లో పెన్సిల్వేనియాకు చెందిన ఒకరు 20.69 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1700 కోట్లు) గెలుచుకున్నారు.

చరిత్రలో ఇప్పటివరకు గెలిచిన అతి పెద్ద లాటరీ మొత్తం 2016లో రికార్డైంది. అమెరికాలోని మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి ఈ మొత్తం పంచారు.

వారు నికరంగా 32.78 కోట్ల డాలర్లను (సుమారు రూ. 2600 కోట్లు) పంచుకున్నారు.

విజేతల్లో ఒకరైన రాబిన్సన్ స్థానిక కిరాణా దుకాణంలో ఈ టికెట్ కొనుగోలు చేశారు. లాటరీ డ్రాలో గెలిచిన తరువాత ఆయన 'ఎన్‌బీసీ' న్యూస్‌టుడే షోలో మాట్లాడుతూ... రేపు ఏమవుతుందో చెప్పలేం కాబట్టి ముందుగా నగదు తీసుకున్నట్లు చెప్పారు.

విజేతల్లో మరో ఇద్దరు మౌరీన్ స్మిత్, డేవిడ్ కాల్ష్‌మిడ్‌లు తాము ముందుగానే ఉద్యోగ విరమణ చేస్తామని చెప్పారు. అంతేకాదు... వయసుపైబడుతుండడంతో దాన్నుంచి ఆ ఛాయల నుంచి బయటపడేందుకు మసాజ్‌లు చేయించుకోవడానికి ఈ డబ్బు ఖర్చు చేస్తామన్నారు ఆ ఇద్దరు.

వీడియో క్యాప్షన్, రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)