ప్రియాంకా చోప్రా: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? మహిళలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?

ప్రెగ్నెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శిల్పా చిట్నీస్-జోషి
    • హోదా, బీబీసీ కోసం

“డాక్టర్, నాకు పెళ్లయి మూడేళ్లయింది. నా వయసు 32. మా ఇద్దరికీ విదేశాల్లో చాలా మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అందుకే ఇంకో మూడేళ్లు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నాం. కానీ, ఇంట్లో అందరూ బిడ్డను కనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యం అయితే, తల్లిని కాలేనని అంటున్నారు. నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు" అంటూ ఇషా చాలా టెన్షన్ పడ్డారు.

ఇషాలా కెరీర్, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమవుతున్న అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కెరీర్‌లో అవకాశాలను అందుకుంటూనే, తల్లి అయ్యే అవకాశాలను చేజార్చుకుంటామని భయపడుతుంటారు.

అలాంటి అమ్మాయిలకు కొన్ని కొత్త టెక్నిక్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇషా సంగతే తీసుకుంటే 'ఎగ్ ఫ్రీజింగ్' ఆమెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొన్నేళ్ల క్రితం వరకు దీని గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఇప్పుడిప్పుడే నగరాల్లో అమ్మాయిలు ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకుంటున్నారు. కొంత మంది సెలబ్రిటీలు కూడా దీని గురించి మాట్లాడుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి ప్రస్తావించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. 30లలోకి రాగానే తన తల్లి కోరిక మేరకు ఎగ్ ఫ్రీజింగ్ చేశానని తెలిపారు. 2022లో సరొగసీ ద్వారా ఒక పాపకు తల్లి అయ్యారు ప్రియాంక.

ఇంతకూ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎప్పుడు చేయవచ్చు? వివరంగా తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

అండాల ఉత్పత్తి ఎంత ఉందో తెలుసుకోవాలి

సాధారణంగా మహిళల్లో 30 ఏళ్ల తరువాత సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. 35 దాటాక మరింత వేగంగా క్షీణిస్తుంది.

సంతానోత్పత్తి కోసం అండాశయాలలో తగినన్ని అండాలు ఉత్పత్తి కావడం చాలా అవసరం.

ఆడపిల్లలకు యుక్తవయసుకు వచ్చిన దగ్గర నుంచి అండాల విడుదల వేగం పుంజుకుంటుంది. మెనోపాజ్ దశ వరకు అండోత్పత్తి జరుగుతుంది కానీ, ఆ సమయంలో బలహీనంగా ఉంటుంది.

భారతీయ మహిళలలో సగటున 35 ఏళ్లకు సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది.

సంతానోత్పత్తి అవకాశాలు, అండాల అభివృద్ధి , నాణ్యత మొదలైన విషయాలు తెలుసుకునేందుకు 'యాంటీ-ములేరియన్ హార్మోన్' (AMH) పరీక్ష ఉపయోగపడుతుంది.

ఏఎంహెచ్ టెస్ట్ అండాల విడుదల గురించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మగవారిలో స్పెర్మ్ కౌంట్‌కూ పనికొస్తుంది.

ఏఎంహెచ్ స్థాయి తక్కువగా ఉంటే, అండాల ఉత్పత్తి తక్కువగా ఉందని అర్థం. దీనివల్ల గర్భధారణ కష్టమవుతుంది. అలాగే, గర్భస్రావాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మెనోపాజ్‌కు దాదాపు 13 నుంచి 14 సంవత్సరాల ముందు నుంచి ఏఎంహెచ్ క్షీణించడం ప్రారంభమవుతుంది.

కొన్నిసార్లు జన్యుపరంగా ఏఎంహెచ్ స్థాయులు తక్కువగా ఉండవచ్చు. ఇలాంటివారిలో మెనోపాజ్ త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఏఎంహెచ్ స్థాయి తక్కువగా ఉంటే అండాల నాణ్యత కూడా తగ్గుతుంది. అందుకే గర్భం రావడం, వచ్చినా నిలవడం కష్టమవుతుంది.

ఏఎంహెచ్ స్థాయి తగ్గక ముందే, నాణ్యమైన అండాలను నిల్వ ఉంచుకోవడానికి సహాయపడేదే 'ఎగ్ ఫ్రీజింగ్' ప్రక్రియ.

సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?

ఎగ్ ఫ్రీజింగ్ కోసం, రుతుస్రావం అయిన మొదటి రోజు నుంచి కొన్ని ఇంజెక్షన్లు ఇస్తారు. వేర్వేరు ఇంజెక్షన్లు పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు కొనసాగుతాయి. దీనివల్ల పది నుంచి పదిహేను అండాలు వృద్ధి చెందుతాయని అంచనా. అయితే, ఇది ఒక్కొక్క మహిళలో ఒక్కోలా ఉండవచ్చు. అండాలు తగినంత పరిపక్వం చెందాక, మరొక ఇంజెక్షన్ ఇస్తారు.

సరిగా ముప్పై అయిదు గంటల తరువాత, ఈ అండాలను సోనోగ్రఫీ సహాయంతో బయటకు తీసి, మైక్రోస్కోప్ క్రింద పరీక్షించి, ఆపై ఫ్రీజ్ చేస్తారు.

ఈ ఘనీభవించిన అండాలు చాలా కాలం నిల్వ ఉంటాయి. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు, వాటి చుట్టూ ఉన్న ఐసును కరిగించి, స్పెర్మ్‌తో కలిపితే పిండం ఏర్పడుతుంది. ఇది నిజంగా ఆధునిక వైద్య, సాంకేతిక పరిజ్ఞానం చేసే అద్భుతం.

ఎగ్ ఫ్రీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రక్రియపై పుర్తి అవగాహన ముఖ్యం

కెరీర్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యంగా గర్భధారనను కోరుకునేవారు అండాలను ఫ్రీజ్ చేయవచ్చు. దీనివల్ల అండాల సంఖ్య, నాణ్యత పడిపోకుండా కాపాడుకోవచ్చు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను ఉపయోగించి గర్భం దాల్చవచ్చు.

ఇదే కాకుండా, పిండాన్ని కూడా ఫ్రీజ్ చేయవచ్చు. దీన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు.

ఎగ్ ఫ్రీజింగ్ ఖరీదైన వ్యవహారమే. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది కచ్చితంగా పాటించాలి.

ఎగ్ ఫ్రీజింగ్ చేసే ముందు భాగస్వాముల అంగీకారమే కాకుండా, ఆ మహిళ తల్లిదండ్రుల అంగీకారం కూడా కావాలి. ఈ ప్రక్రియపై వారికి పూర్తి అవగాహన కల్పించాలి.

ఈ కాలంలో పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంత మంది వెంటనే పిల్లలు వద్దునుకుంటారు. కానీ, ఆలస్యం చేస్తే గర్భం దాల్చడం కష్టం కావచ్చు. అలాంటివారికి ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ సహాయపడుతుంది.

గర్భధారణకు స్త్రీ వయసు చాలా ముఖ్యం. ఆలస్యం అవుతుందనుకుంటే, ఏఎంహెచ్ పరీక్ష చేయించుకుని, తగినన్ని అండాలు ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు.

దీని కోసం, దంపతులు బరువును అదుపులో ఉంచుకోవడం, సిగరెట్లు, ఆల్కహాల్, పొగాకు (ఈ-సిగరెట్లు, హుక్కా లాంటివి కూడా) వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టడం చాలా అవసరం.

(గమనిక: రచయిత వైద్యురాలు. ఇది నిర్దిష్ట అంశంపై స్థూలమైన అవగాహన కోసం రాసిన కథనం.)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)