కాళికా దేవిపై యుక్రెయిన్ ప్రభుత్వం వివాదాస్పద ఫొటో.. దాన్ని తొలగించి, క్షమాపణలు ఎందుకు చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్ రక్షణ శాఖ కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో కాళికాదేవి ఫొటో పోస్ట్ చేసింది. అది అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. పోస్ట్ వివాదాస్పదం కావడంతో యుక్రెయిన్ ప్రభుత్వం దాన్ని తొలగించి భారతదేశానికి క్షమాణలు చెప్పింది.
ట్విటర్‌లో కాళికాదేవి ఫొటో పొస్ట్ చేస్తూ, 'వర్క్ ఆఫ్ ఆర్ట్' (కళ పనితనం) అని రాసింది యుక్రెయిన్ ప్రభుత్వం. దానికి, భారత్‌లో తీవ్ర స్పందన రావడంతో ఆ ట్వీట్‌ను తొలగించింది.
దీనిపై మంగళవారం యుక్రెయిన్ విదేశీ వ్యవహారాలశాఖ ఉప మంత్రి ఎమిన్ జెపర్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
"కాళికా దేవి రూపాన్ని వక్రీకరించే విధంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసినందుకు మేం చింతిస్తున్నాం. యుక్రెయిన్ దేశ ప్రజలు భారత సంస్కృతిని గౌరవిస్తారు. మద్దతిస్తారు. ఫొటోను తొలగించాం. పరస్పర గౌరవంతో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు యుక్రెయిన్ కట్టుబడి ఉంది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/ EMINE DZHEPPAR
కాళికాదేవి రూపాన్ని వక్రీకరించడం అవమానకరమని, ఇది 'హిందూఫోబియా' అంటూ యుక్రెయిన్ చర్యపై భారత్‌లో విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలపై ఇది దాడి అని భారత సమాచార, ప్రసార శాఖ సలహాదారు కంచన్ గుప్తా అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యుక్రెయిన్ మంత్రి ఎమిన్ జెపర్ ఇటీవలే భారత్ పర్యటనకు వచ్చారు. నిరుడు యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తరువాత యుక్రెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్ రావడం అదే తొలిసారి.
"భారత్ మద్దతు కోరుతూ యుక్రెయిన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిల్లీ వచ్చారు. దాని వెనుక ఉన్న యుక్రెయిన్ అసలు ముఖం ఇది. కాళికాదేవి పోస్టర్‌తో ప్రోపగాండా చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలపై దాడి" అని కంచన్ గుప్తా విమర్శించారు.
గతంలోనూ వివాదాలు
యుక్రెయిన్ చేసిన "అవమానం" ఆశ్చర్యం కలిగించలేదని రాజకీయ, విదేశీ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ సువ్రోకమల్ దత్తా అన్నారు.
"యుక్రెయిన్ హిందూ సంస్కృతిపై, కాళికాదేవిపై బురదజల్లడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలా చేసింది. ఇకపై కూడా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కాళికాదేవిని అసభ్యకరంగా చూపించిన తీరు కొత్తేమీ కాదు. యుక్రెయిన్ ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగానే వ్యవహరించింది. 1998లో అటల్ బిహార్ వాజ్‌పేయి నేతృత్వంలో అణుపరీక్షలు నిర్వహించినప్పుడు యుక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆ దేశం పాకిస్తాన్ పక్షం వహిస్తుందన్నది తెలిసిన విషయమే. ఇదే అంశం భారత్ పట్ల వ్యతిరేకతను కొంతవరకు సూచిస్తుంది" అని డాక్టర్ దత్తా అభిప్రాయపడ్డారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి భారత్ తటస్థంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
"రష్యాను భారత్ వ్యతిరేకించాలని యుక్రెయిన్ డిమాండ్ చేసింది. కానీ, భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శించింది. దీన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోయింది" అని దత్తా అన్నారు.
సమాచార, ప్రసార శాఖ సలహాదారు కంచన్ గుప్తా ఒక ట్వీట్‌లో యుక్రెయిన్ వైఖరిపై విరుచుకుపడ్డారు.
"మీరు (యుక్రెయిన్) ఐరాసలో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 1998 అణు పరీక్షల తరువాత భారత్‌కు వ్యతిరేకంగా యూఎన్ఎస్‌సీ ఆంక్షలకు ఓటు వేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, ఐరాస జోక్యం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. భారత్ మీద ప్రయోగించేందుకు పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్ముతారు. అయినా, మీరు భారత్ సహాయం కోరుతున్నారు" అంటూ ఆయన విమర్శించారు.
కాళికాదేవి పోస్టర్ వివాదంలో సోషల్ మీడియాలో పలువురు భారతీయులు తీవ్రంగా స్పందించారు. చాలా మంది యుక్రెయిన్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత్‌ను ఎగతాళి చేస్తే సహించేది లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్
రష్యాకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా మాట్లాడేందుకు భారత్‌ను ఒప్పించడానికి యుక్రెయిన్ మంత్రి ఎమిన్ జెపర్ భారతదేశానికి వచ్చారు. కానీ ఆమె విజయం సాధించలేకపోయారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా, నాటో దేశాలు ఆంక్షలు విధించాలని ఇదే మంత్రి చాలాసార్లు డిమాండ్ చేశారని డాక్టర్ దత్తా చెప్పారు.
"ఈ మొత్తం వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని భారతదేశం ఎప్పుడూ చెబుతోంది. యుక్రెయిన్ రష్యాను ఒంటరిని చేస్తూ, భారత్ తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. భారత్ అలా చేయలేదు. దీన్ని జీర్ణించుకోలేక యుక్రెయిన్ భారత వ్యతిరేక పక్షం వహించింది" అని ఆయన అన్నారు.
కశ్మీర్ విషయంలో యుక్రెయిన్ పాకిస్తాన్‌కు మద్దతిచ్చింది. కశ్మీర్‌లో లేదా ఇతరత్రా అంతర్జాతీయ వేదికలపై తీవ్రవాదాన్ని ఎప్పుడూ ఖండించలేదు.
"ఇలాంటి వైఖరితో ఆ దేశం భారత్‌కు అనుకూలంగా మంచి మాటలు చెబుతోందని, ఈ దేశ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం చూపిస్తుందని అనుకోవడం కల్ల" అని దత్తా అభిప్రాయపడ్డారు.
యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా కఠిన వైఖరి తీసుకోవాలని డాక్టర్ దత్తా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"భారత్‌కు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా యుక్రెయిన్ ఎలా అయితే ఒక అజెండా అమలు చేస్తోందో, అలాగే భారత ప్రభుత్వం యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ వేదికపై యుక్రెయిన్‌ను నిలదీయాలి" అని ఆయన అన్నారు.
తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు.
యుక్రెయిన్ పోస్ట్‌కు కారణాలు ఆపాదించడం అనవసరమని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పొరపాటున జరిగిందా?
యుక్రెయిన్ భారతదేశానికి వ్యతిరేకమని కచ్చితంగా నిరూపించలేం. హిందూ సంస్కృతి గురించి తెలియకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని భారత విదేశీ వ్యవహారాలశాఖ భావిస్తోంది. యుక్రెయిన్ ఆ ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు కోరింది కాబట్టి, భారత ప్రభుత్వానికి అది చాలు.
హిందూ సంస్కృతిపై అవగాహన లేకపోవడం వల్ల గతంలో జరిగిన పొరపాట్లు చాలానే ఉన్నాయి.
ఈ మధ్య ఆస్ట్రేలియా, కొన్ని పశ్చిమ దేశాలలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వీటిని భారత ప్రభుత్వం ఖండించింది.
హిందువులపై, వారి సంస్కృతిపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని పలు హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీన్ని "హిందూఫోబియా" అంటున్నాయి
ఇప్పుడిప్పుడే హిందూఫోబియాకు వ్యతిరేకంగా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు పిలుపునిస్తున్నాయి.
అమెరికాలోని జార్జియా రాష్ట్రం కిందటి నెలలో "హిందూ-వ్యతిరేక మూర్ఖత్వాన్ని" ఖండిస్తున్నట్టు ఒక తీర్మానంలో పేర్కొంది. అలా చేసిన మొదటి అమెరికా రాష్ట్రం జార్జియానే.
ఇవి కూడా చదవండి:
- బెంగళూరు Vs. హైదరాబాద్: ఐటీ రంగంలో ఏది టాప్ సిటీ?
- పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం
- చీకోటి ప్రవీణ్: థాయ్‌లాండ్‌లో అసలేం జరిగింది... గ్యాంబ్లర్స్ అరెస్టులపై అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు?
- వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్లోదా, హైదరాబాద్లోదా?
- ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఆలస్యంగా తల్లి కావాలనుకునే అమ్మాయిలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















