కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్: ఈ బ్రిటన్ రాణి అంటే రాజుకు ఎందుకంత అసహ్యం? పట్టాభిషేకానికి రానివ్వకుండా ఆమె ముఖం మీదే ఎందుకు గేట్లు మూయించారు?

కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దహ్లియా వెంటురా
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్, 1821 జూలైన 19న ఉదయం 6 గంటలకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకున్నారు.

ఆమె సిల్వర్ సర్కోటుతో పాటు తలపై ధగధగలాడే వజ్రాల హెడ్ బ్యాండ్‌ను ధరించారు. చేతిలో ఊదారంగు కర్చీఫ్‌ను పట్టుకున్నారు.

రాజుగా కింగ్ జార్జ్-4, రాణిగా ఆమెకు పట్టాభిషేకం జరుగుతున్న రోజు అది.

‘‘వేల గొంతుకలు ‘ద క్వీన్.. ద క్వీన్ ఫరెవర్’ అంటూ నినదించాయి’’ అని ఒక వార్తా పత్రిక నివేదించింది.

అయితే, వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకున్న కరోలిన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ముఖంపైనే తలుపులు వేశారు.

అది చాలా బాధాకరమైన, అవమానకర చర్య. కానీ, అదేమీ ఊహించని చర్య కాదు.

ఆమె లోపలికి రాకుండా ఆమె భర్తే అడ్డుకున్నారు. దీనికి కారణం ఇంట్లో జరిగిన గొడవలు కాదు.

వారిద్దరూ కలిసిన మొదటి క్షణం నుంచే వారిద్దరి మధ్య బంధం ఇలా దారుణంగా మారింది.

జార్జ్-4, కరోలిన్ ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జార్జ్-4, కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్ అన్యోన్యంగా ఉన్నారంటూ ప్రజల కోసం ఈ ఫొటో విడుదల చేశారు. కానీ, వారెప్పుడూ కలిసి లేరు

తొలి చూపులోనే ద్వేషం

1794లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్న జార్జ్ బాగా అప్పుల్లో మునిగిపోయారు. వాటి నుంచి బయటపడేందుకు ఆయనకున్న ఏకైక మార్గం పెళ్లి. అందుకే, ఆయన తన కజిన్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, మహిళలపై ఆయన విపరీతంగా ఖర్చు చేసేవారు. ఖర్చుల కోసం ఆయనకు అందే సొమ్ముతో ఆయన తృప్తి చెందలేకపోయారు.

కానీ, ఆయన చాలా తెలివైనవాడు. కళలు, ఆర్కిటెక్చర్‌లో ఆవిష్కరణలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ప్రతిరోజూ అందమైన దుస్తులు వేసుకోవడంతో పాటు పర్‌ఫ్యూమ్ వాడేవారు.

తనకు కాబోయే భార్యను కలిసిన రోజు ఆయనకున్న ఈ లక్షణాలేవీ హైలైట్ కాలేదు.

ఆయన మేనత్త కూతురు ప్రిన్సెస్ కరోలిన్. కింగ్ జార్జ్-3 కూతురి కుమార్తె ఆమె. జార్జ్‌ను కలవడం కోసం జర్మన్ ప్రావిన్స్ బ్రున్స్‌విక్ నుంచి కరోలిన్ వచ్చారు.

తనకు కాబోయే భర్తను ఆమెకు పరిచయం చేశారు. తొలి చూపులోనే వారి మధ్య ద్వేషం ఏర్పడింది.

ఆమె చాలా అసహ్యంగా ఉన్నట్లు జార్జ్-4 భావించారు. ఆమెను పలకరించి వెంటనే తిరిగి వెళ్లిపోయాడు.

ఆయన తీరుకు దిగ్భ్రాంతి చెందిన ఆమె "దేవుడా! యువరాజు ఎప్పుడూ ఇలాగే ఉంటారా?’’ అని ఆశ్చర్యపోయారు.

ఆయన చాలా లావుగా ఉండటంతో పాటు, ఫొటోలో కనిపించినంత అందంగా లేడని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

మూడు రోజుల తర్వాత వారి పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ‘‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’’ బాగా మద్యం తాగారు. పెళ్లి వేడుకలో ఆయనను అతని స్నేహితులు పట్టుకోవాల్సి వచ్చింది.

‘‘ఆయన పెళ్లి జరిగిన రాత్రి ఎక్కువభాగం ఇంట్లోని కుంపటి (ఫయర్ ప్లేస్) దగ్గరే ఉన్నారు. అక్కడే కిందపడిపోయారు. నేను ఆయనను అక్కడే వదిలి వెళ్లాను’’ అని కరోలిన్ చెప్పారు.

తన భార్యతో మూడుసార్లు మాత్రమే శారీరక బంధంలో పాల్గొన్నానని, ఆమెను జీవితంలో మళ్లీ తాకనని ప్రమాణం చేసినట్లు జార్జ్ చెప్పారు. ఆమె రూపం, అపరిశుభ్రత తనకు అసహ్యాన్ని కలిగించాయని ఆయన ఎర్ల్ ఆఫ్ మల్మెస్‌బరీతో అన్నారు.

మరియా ఫిట్జ్‌బర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మరియా ఫిట్జ్‌బర్ట్

రెండో పెళ్లి

కరోలిన్ పరిస్థితి దయనీయంగా మారింది.

భర్త తిరస్కరణతో పాటు ఆమెకు మరో విషయం కూడా తెలిసింది. తన భర్త పదేళ్ల క్రితమే మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆమె తెలుసుకున్నారు.

అయితే, ఇది బహిరంగ రహస్యం.

మరియా ఫిట్జ్‌బర్ట్ ఒక వితంతువు. ఆమె భర్త చనిపోయారు. మొదట్లో ఆమె యువరాజు జార్జ్-4ను తిరస్కరించడానికి ప్రయత్నించారు. కానీ, ఆమెను యువరాజు ఒప్పించారు. ఒకవేళ తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన బెదిరించాడు.

వారి రహస్య బంధం, ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని ఉల్లంఘించింది. మరియా ఒక క్యాథలిక్.

క్యాథలిక్‌ను పెళ్లి చేసుకుంటే వారసత్వంగా రాజ కిరీటం దక్కదు. కాబట్టి, మరియాతో వివాహం కారణంగా జార్జ్‌-4 వారసత్వంగా కిరీటాన్ని పొందలేకపోయారు.

అయితే, రాయల్ మ్యారేజెస్ చట్టం ఆయనను ఆదుకుంది. రాజు అనుమతి లేకుండా 25 సంవత్సరాల వయస్సులోపు జార్జ్-4 పెళ్లి చేసుకోరాదని ఈ చట్టం చెబుతుంది. కాబట్టి మరియాతో ఆయన వివాహాన్ని అధికారికంగా పరిగణించలేదు.

డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ప్రకారం, కరోలిన్‌ను పెళ్లి చేసుకోవాల్సిందిగా జార్జ్-4కు మరియానే సూచించారు. ఉద్దేశపూర్వకంగానే అందంగా లేని కరోలిన్‌ పేరును మరియా సూచించారు. ఎందుకంటే భార్య అందంగా లేకపోతే తన వైపే జార్జ్ ఆకర్షితుడు అవుతాడని ఆమె భావించారు.

జార్జ్, కరోలిన్ మధ్య అన్యోన్య దాంపత్యం లేనప్పటికీ వారికి ఒక కూతురు పుట్టారు. ఆమే ప్రిన్సెస్ షార్లెట్ అగస్టా. బ్రిటిష్ సింహాసనానికి కాబోయే రాణిగా అందరూ ఆమెను భావించారు.

ప్రిన్సెస్ షార్లెట్ జన్మించిన మూడు రోజుల తర్వాత జార్జ్ ఒక వీలునామా ప్రకటించారు. అందులో మరియా ఫిట్జ్‌బర్గ్ మాత్రమే తన నిజమైన భార్య అని, తన ఆస్తులకు హక్కుదారు అని జార్జ్ పేర్కొన్నారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ జార్జ్, కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్‌ల వివాహ బంధాన్ని చూపే కార్టూన్ చిత్రం

అధికారిక సందర్భాల్లో మాత్రమే...

జార్జ్ చర్యలతో విరక్తి చెందిన కరోలిన్ అనధికారికంగా ఆయన నుంచి విడిపోయారు. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేరుగా జీవించారు. అధికారిక సందర్భాల్లో మాత్రమే జార్జ్-4తో ఆమె కనిపించేవారు.

అయినప్పటికీ ఆమె పట్ల జార్జ్ విపరీతంగా అసహ్యాన్ని పెంచుకున్నారు.

"ఆమెతో కలిసి ఒకే టేబుల్ మీద కూర్చోవడం కన్నా, నా ఆహారం మీద పాములు, కప్పలు పాకడాన్ని నేను భరించగలను" అని ఆయన ఒక సందర్భంలో అన్నారు.

ఆ తర్వాత కొంతకాలానికే వారు విడిపోయారు.

అధికారికంగా విడాకులు తీసుకోనప్పటికీ వారి వివాహ బంధం అక్కడితో ముగిసినట్లు భావించారు.

తర్వాత కరోలిన్ గురించి పుకార్లు వ్యాపించాయి. ఆమె అనైతికంగా ఒక బిడ్డకు జన్మనిచ్చారనే వదంతులు వచ్చాయి. తర్వాత తన కూతుర్ని చూడకుండా కరోలిన్‌ను నిషేధించారు.

మానసిక ఆరోగ్య కారణాల వల్ల రాజ పదవికి కింగ్ జార్జ్-3 దూరం కావడంతో 1811లో ఆయన కుమారుడు ప్రిన్స్ రీజెంట్‌ అయ్యారు. తర్వాత కరోలిన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు.

1814లో విదేశీ వ్యవహారాల మంత్రి సూచనల మేరకు కరోలిన్ దేశం విడిచి వెళ్లిపోయారు.

ప్రిన్స్ రీజెంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ రీజెంట్‌గా జార్జ్-4 చిత్రపటాన్ని 1822లో థామస్ లారెన్స్ చిత్రించారు

రాణి

దేశం విడిచిపెట్టాక ఆమె సిగ్గులేకుండా ఐరోపాలో తిరుగుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించారని కొంతమంది ఆరోపించారు. ఆమె ఇటలీలోని లేక్ కోమో విల్లాలో స్థిరపడ్డారు. అక్కడ బర్టోలోమియో పెర్గామి అనే సేవకుడు ఆమెకు సేవలు చేసేవారు. ఆయన అందగాడు. అతన్ని ఆమె ప్రేమికుడిగా అందరూ అనుమానించారు

1817లో ప్రసవ సమయంలో ప్రిన్సెస్ షార్లెట్ మరణించారు. ఈ విషయాన్ని జార్జ్ -4కు తెలియనివ్వలేదు. తర్వాత ఈ సంగతి తెలిసి ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు.

ఇంగ్లండ్‌లో ప్రిన్స్ రీజెంట్ జార్జ్-4 తన భార్య నుంచి విడాకులు కోరుకున్నారు. అయితే, కరోలిన్ అనైతికంగా వ్యవహరిస్తున్నారని ధ్రువీకరిస్తేనే ఆయనకు విడాకులు దక్కుతాయి.

ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి బ్రిటిష్ ప్రధానమంత్రి కొందరినీ ఇటలీ పంపించారు.

ఇది జరగడానికి ముందు, 1820 జనవరి 29న కింగ్ జార్జ్ III చనిపోయారు.

దీంతో కరోలిన్, యూకేతో పాటు హనోవర్‌కు రాణి అయ్యారు.

బర్టోలోమియో పెర్గామి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోలిన్, బర్టోలోమియో పెర్గామి మధ్య సంబంధం ఉందంటూ వచ్చిన అనేక కార్టూన్లలో ఇది ఒకటి

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జార్జ్ పట్టాభిషేక ఘట్టం వచ్చింది. అయితే, పట్టాభిషేకంలో తన భార్యగా కరోలిన్‌ను ఆయన ఊహించుకోలేకపోయారు. ఆ ఆనంద క్షణాలను ఆయన కరోలిన్‌తో పంచుకోవాలని ఏమాత్రం అనుకోలేదు.

దాని కోసం ఆమెను రాచరికానికి దూరం చేసేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ప్రార్థనల నుంచి ఆమెను మినహాయించారు. రాజకుటుంబం కోసం ఆదివారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కరోలిన్ పేరును ప్రస్తావించొద్దని మతాధికారులను ఆదేశించారు.

రాణిగా సింహాసనాన్ని అధిష్టించడానికి, ప్రజల జయజయధ్వానాల మధ్య కరోలిన్ లండన్‌కు తిరిగి వచ్చారు.

రాణికి మద్దతుగా పోటెత్తిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోలిన్ ఆఫ్ బ్రున్స్‌విక్‌కు మద్దతు తెలిపేందుకు లండన్‌లోని ఆమె నివాసం వద్దకు ప్రజలు తరలివచ్చినట్లు చూపే ఈ చిత్రాన్ని 1821లో మాథ్యూ డుబార్గ్ చిత్రించారు

ఆ చర్యతో జార్జ్-4 ఆగ్రహంతో ఊగిపోయారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఒక పిటిషన్‌ను ప్రవేశపెట్టారు.

పెర్గామితో ఆమె అక్రమ సంబంధం ఏర్పరచుకుందని ఆరోపిస్తూ ఆమెను ఎంతో గొప్పదైన కరోలిన్ అమేలియా ఎలిజబెత్ అనే టైటిల్‌కు దూరం చేయాలని, ఆమెకున్న విశేషాధికారాలు, హక్కులు, అధికారాలను తొలగించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. తనకు, ఆమెకు మధ్య వివాహాన్ని అధికారికంగా రద్దు చేయాలని అందులో కోరారు.

తన తప్పులు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆయన చట్టపరమైన మార్గాన్ని వదిలిపెట్టి పార్లమెంట్‌ను ఆశ్రయించారు.

కానీ, కరోలిన్‌కు శ్రామిక, మధ్యతరగతి వర్గాలు, రాడికల్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఆమెకు అనుకూలంగా 800 పిటిషన్లు, మిలియన్ సంతకాలను సేకరించారు.

తర్వాత జరిగిన పరిణామాలతో ఆమెను రాణిగా ఎవరూ తిరస్కరించలేకపోయారు.

పాంప్లెట్స్

ఫొటో సోర్స్, THE TRUSTEES OF THE BRITISH MUSEUM

ఫొటో క్యాప్షన్, కరోలిన్‌ను రాణిగా సమర్థించే కరపత్రాలు

గత్యంతరం లేక

అప్పులు తీర్చడం కోసమే కరోలిన్‌ను పెళ్లి చేసుకున్న జార్జ్-4 చివరకు ఆమెను రాణిగా అంగీకరించాల్సింది వచ్చింది. అయితే, రాణిగా ఆమెకు పట్టాభిషేకం జరుగకుండా ఆయన అన్ని విధాలుగా ప్రయత్నించారు.

ఆమె వ్యక్తిత్వానికి అనుగుణంగా పట్టాభిషేకం ఏర్పాట్లు జరిగాయి. పట్టాభిషేకానికి మొత్తం 33 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, ఆమె దుస్తుల ఖరీదే 3.5 మిలియన్ డాలర్లు. అంటే నేటి మారకంలో చెప్పాలంటే ఆమె ధరించిన దుస్తుల విలువ రూ. 28 కోట్ల పైమాటే.

వేడుకకు కరోలిన్ రాకుండా అడ్డుకోవడం కోసం కిరాయికి బాక్సర్లను కూడా ఏర్పాటు చేశారు.

సరైన ఆహ్వానం లేకుండా ఎవరినీ లోపలికి పంపించవద్దంటూ గేట్ కీపర్లకు ఆదేశాలు జారీ చేశారు.

రాణి అక్కడికి చేరుకోగానే వారు రాజుచెప్పిన విధంగానే ఆమెను ద్వారం దగ్గరే అడ్డుకున్నారు. కానీ, కరోలిన్ చాలా పట్టుదలగా ఉన్నారు.

‘‘బయట నుంచి తలుపును గట్టిగా కొట్టిన శబ్ధం విని మేం ఉలిక్కి పడ్డాం. ఆ తర్వాత బయట నుంచి ‘నేను రాణిని, తలుపు తెరవండి’ అంటూ గట్టిగా అరుపు వినిపించింది’’ అని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగే పట్టాభిషేకం కోసం హాజరైన అతిథుల్లో ఒకరైన ఎలిజబెత్ రాబర్ట్‌సన్ గుర్తు చేసుకున్నారు.

జార్జ్ 4 పట్టాభిషేకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెస్ట్‌మినిస్టర్ అబేలో జార్జ్-4 (1762-1880) పట్టాభిషేకం

‘‘ఆమె చాలా కోపంగా ఉన్నారు. నన్ను లోపలికి రానివ్వండి, నేను మీ రాణిని. నేను బ్రిటన్ రాణిని అంటూ గట్టిగా అరుస్తున్నారు.

అక్కడే రాజు దగ్గర ‘‘ద లార్డ్ హై చాంబర్‌లేన్’’ ఉన్నారు. పక్కనే ఉన్న లెఫ్టినెంట్‌ను చూస్తూ ‘మీ పని మీరు చేయండి, తలుపులు మూసేయండి’’ అంటూ చాంబర్‌లైన్ గట్టిగా అరిచారు. వెంటనే అక్కడున్నవారు రాణి ముఖం మీదే తలుపులు వేశారు’’ అని ఎలిజబెత్ చెప్పారు.

తలుపులు తెరవాల్సిందిగా రాణి పదేపదే అడిగారు. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. చివరకు ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

తన భర్త చేతిలో రాణి భరించిన చివరి బహిరంగ అవమానం అదే అయింది.

ఆ మరుసటి రాత్రి ఆమె అనారోగ్యానికి గురై మంచం పట్టారు. ఆమె విషం తీసుకున్నట్లు గ్రహించారు.

విషం తాగిన తర్వాత 19 రోజుల పోరాటం అనంతరం 1821 ఆగస్టు 7వ తేదీన కరోలిన్ మరణించారు.

చిన్నపేగులో సమస్య కారణంగా ఆమె మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. బహుశా ఆమె క్యాన్సర్ బారిన పడి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

చనిపోయాక ఆమె శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా బ్రున్స్‌విక్‌కు పంపించేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కానీ, ఆమె అంటే ఇష్టపడేవారంతా అలా జరుగకుండా అడ్డుకున్నారు. ఆమె అంత్యక్రియల ఊరేగింపు లండన్ వీధుల గుండా జరిగేలా వారు చేశారు. ఆమె అంత్యక్రియల ఊరేగింపులో ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఆమెకు వీడ్కోలు పలికారు.

కానీ, ఆమె చివరి కోరికను ఎవరూ నెరవేర్చలేకపోయారు. ఆమె పడిన ఇబ్బందులకు గుర్తుగా ఆమె సమాధిపై ‘‘కరోలిన్ ఆఫ్ బ్రూన్స్‌విక్: ద వూండెడ్ క్వీన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్‌డమ్’’ అని రాసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)