'క్వీన్ ఎలిజబెత్ 2పై ప్రేమ, క్యూపై అభిమానం': మర్యాదగా, ఓపికగా క్యూలో నిల్చోవడం అంటే బ్రిటిషర్లకు ఎందుకంత ఇష్టం?

రాణి శవపేటికను దర్శించడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణి శవపేటికను దర్శించడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు

మర్యాదగా, ఓపికగా క్యూలో నిల్చోవడం అంటే బ్రిటిషర్లకు ఎందుకంత ఇష్టం?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. సెప్టెంబర్ 14, బుధవారం నాడు రాణి ఎలిజబెత్ 2 శవపేటిక ఊరేగింపు జరిగింది. బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మిన్‌స్టర్ వరకు సుమారు 40 నిమిషాల పాటు ఈ ఊరేగింపు సాగింది. రాణికి తుదినివాళి అర్పించడం కోసం, ఆమె శవపేటికను దర్శించడానికి వందలాది బ్రిటిషర్లు ఊరేగింపు దారిలో వివిధ ప్రదేశాల్లో క్యూలు కట్టారు. ఓపికగా గంటల తరబడి నిల్చున్నారు. ఈ క్యూల ఫొటోలను చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బుధవారం, థేమ్స్ నది ఒడ్డున సుమారు 7 కి.మీ. పొడవున్న క్యూ కనిపించింది. వెనకాల టవర్ బ్రిడ్జి ఉంది. ముందు వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలస్ ఉంది.

"మేం రెండు ఉన్నతమైన బ్రిటిష్ సంప్రదాయాలను గౌరవిస్తున్నాం.. క్వీన్‌ను ప్రేమించడం, క్యూను అభిమానించడం" అని యార్క్ ఆర్చిబిషప్ స్టీఫెన్ కాట్రెల్ బుధవారం అన్నారు.

ఇవి, బహుశా క్వీన్ శవపేటికను చూసేందుకు నిశ్శబ్దంగా, ఓపికగా నిరీక్షించిన వేలాదిమంది మనసులోని మాటలు కావచ్చు.

61 ఏళ్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు క్లార్ లినాస్ తన స్నేహితులతో కలిసి 12 గంటలు క్యూలో నిల్చున్నారు.

ఆ నిరీక్షణ వాళ్లకు విలువైనది. హాల్‌లో గార్డులు మారడం చూసారు. క్వీన్ గార్డుల స్థానంలో కొత్త సైనికుల బృందం వచ్చే ఒక కార్యక్రమం అది. ఇది వాళ్లు ఊహించనిది. దీనివలన క్వీన్‌తో మరి కొన్ని క్షణాలు గడిపే అవకాశం దక్కింది.

"అద్భుతంగా, ఉద్వేగభరితంగా అనిపించింది. ఎంతో అందంగా నిర్వహించారు. రాణికి సరైన వీడ్కోలు చెపాలనుకున్నాం. అందుకు ఆమె అర్హురాలు" అని క్లార్ అన్నారు.

క్యూలో ఓపికగా నిల్చున్న జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యూలో ఓపికగా నిల్చున్న జనం

రాణి శవపేటిక ఊరేగింపును చూడడానికి తరలి వచ్చినవారి కోసం, క్యూలో నిల్చున్న వారి కోసం అనేక ఏర్పాట్లు చేశారు.

వివిధ ప్రదేశాల్లో 500 కంటే ఎక్కువ పోర్టబుల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. క్యూలో ఉన్నవారి కోసం కొన్ని రెస్టారెంట్లు, దుకాణాలను ఎక్కువసేపు తెరిచి ఉంచారు. కొన్ని రాత్రంతా ఉన్నాయి.

వికలాంగులకు మెట్లు లేని దారి ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించడానికి లైవ్ క్యూ ట్రాకర్ ఏర్పాటు చేశారు.

యూట్యూబ్ లైవ్ ట్రాకర్

ఫొటో సోర్స్, UK Government / Google / YouTube

ఫొటో క్యాప్షన్, యూట్యూబ్ లైవ్ ట్రాకర్

బ్రిటిష్ సంప్రదాయాలు తెలిసినవాళ్లకి, క్యూలో ఉన్నవారి కోసం వివిధ రకాల ఏర్పాట్లు చేయడం, సహాయం అందించడం కొత్తేం కాదు.

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ప్రత్యేకంగా 30 పేజీల క్యూ గైడెన్స్ బుక్‌ను ఉంది. లోపలికి ప్రవేశించడానికి క్రమ పద్ధతిలో క్యూలో ఎలా నిలబడాలో తెలియజెప్పే వివరాలు ఇందులో ఉన్నాయి.

1950 జూన్ 26న వింబుల్డన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవ వేడుకలకు టిక్కెట్‌ కొనుగోలు చేయడానికి వచ్చిన బ్రిటిషర్లు క్యూలో వేచి చూస్తూ కాలక్షేపానికి పేకాట ఆడుతున్న దృశ్యం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1950 జూన్ 26న వింబుల్డన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవ వేడుకలకు టిక్కెట్‌ కొనుగోలు చేయడానికి వచ్చిన బ్రిటిషర్లు క్యూలో వేచి చూస్తూ కాలక్షేపానికి పేకాట ఆడుతున్న దృశ్యం

రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచీ...

బ్రిటిషర్లకు క్యూలు అంటే ఉన్న అభిమానం ఇప్పటిది కాదు. కనీసం గత శతాబ్దపు మధ్య కాలం నుంచి వీళ్లు పద్ధతిగా క్యూలో నిల్చోవడం చూడవచ్చు.

జార్జ్ ఆర్వెల్ 1947లో రాసిన వ్యాసం 'ది ఇంగ్లీష్ పీపుల్‌'లో, మొదటిసారి బ్రిటన్ చూడడానికి వచ్చిన పర్యటకుడి మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేశారు.

"కొత్తగా బ్రిటన్‌కు వచ్చే సందర్శకుడు మా సౌమ్యత చూసి నోరెళ్లబెట్టేస్తాడు. ఇంగ్లిష్ ప్రజలు పద్ధతి, వ్యవహారం, తోసుకోవడాలు, గొడవపడడాలు లేకపోవడం, క్యూలలో పొందికగా నిల్చునే పద్ధతి కచ్చితంగా అబ్బురపరుస్తుంది" అని ఆర్వెల్ అంటారు.

అయితే, పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ సమాజానికి క్యూలో నిలబడే పద్ధతిని నేర్పిందని కొందరు చరిత్రకారులు అంటారు. ఆ సమయంలో గ్రామాల నుంచి పట్టణాలకు తరలివచ్చినవారి సంఖ్య అమాంతంగా పెరిగింది. రోజువారీ జీవితం మారిపోయింది.

వాస్తవానికి, బుద్దిగా క్యూలో నిల్చునే బ్రిటిషర్ల నాగరిక ప్రవర్తనను రూపుదిద్దింది రెండవ ప్రపంచ యుద్ధమని డాక్టర్ కేట్ బ్రాడ్లీ అంటారు. బ్రాడ్లీ, కెంట్ విశ్వవిద్యాలయంలో సామాజిక చరిత్ర, సాంఘిక విధానంలో లెక్చరర్‌గా ఉన్నారు.

2013లో ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "ప్రజలు విపరీతమైన కష్టాల్లో ఉండి, పేదలు సహాయం కోసం క్యూలో నిలబడి వేచి చూడాల్సిన అగత్యం కలిగింది. అప్పుడే పద్ధతిగా, ఓపికగా క్యూలో నిలబడడం అలవాటయింది" అని ఆమె అన్నారు.

"అప్పట్లో, 'నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, నీ సమయం వచ్చే వరకు వేచి చూడు' అన్నది ముఖ్య ప్రచారం. అనిశ్చితి నెలకొని ఉన్న సమాజంలో పరిస్థితులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ప్రచారాన్ని చేపట్టింది" అని డాక్టర్ బ్రాడ్లీ వివరించారు.

1938 జూన్ 29న సగం ధరకు టీ, పంచదార కొనుగోలు చేసేందుకు లండన్‌లోని సెల్ఫ్రిడ్జ్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌ ముందు క్యూలో నిల్చున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1938 జూన్ 29న సగం ధరకు టీ, పంచదార కొనుగోలు చేసేందుకు లండన్‌లోని సెల్ఫ్రిడ్జ్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌ ముందు క్యూలో నిల్చున్న మహిళలు

పద్ధతిగా, మర్యాదగా, స్వచ్ఛందంగా క్యూలో నిల్చునే ప్రవర్తనను బ్రిటిషర్లు గొప్పగా చెప్పుకుంటారు.

బుధవారం రాణి శవపేటిక ఊరేగింపు కోసం ఏర్పడిన క్యూను పొగుడుతూ ట్విట్టర్‌లో ఓ త్రెడ్ ప్రారంభమైంది. అది విపరీతంగా వైరల్ అయింది. ఒక్క బుధవారమే దాన్ని 25,000 యూజర్లు షేర్ చేశారు.

కొంతమందికి 'ఇది క్యూ పట్ల బ్రిటిష్ ప్రజల సెంటిమెంటును' సూచిస్తుంది.

"క్యూ అనేది బ్రిటిష్‌నెస్ విజయం. అద్భుతం అది.. "

"క్యూలకు ఇది గని. అదొక ఆర్ట్. అది కవిత్వం. ఇది అన్ని క్యూలను ముగించే క్యూ" అంటూ ట్వీట్లు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)