క్వీన్ ఎలిజబెత్‌ 2ను భారత్ ఎలా గుర్తు చేసుకుంటోంది? సంతాపదినం ప్రకటించడంపై భిన్న వాదనలు ఎందుకు?

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల సంతాపదినం ప్రకటించడంపై భిన్న వాదనలు

రాణి ఎలిజబెత్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఆదివారం భారత్ అంతటా జాతీయ జెండాలను అవనతం చేశారు.

ఆమె మన కాలపు ప్రముఖ వ్యక్తి అని ప్రశంసించారు ప్రధాని మోదీ. ఆమె ప్రీతిపాత్రురాలని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ.

అయితే సంతాపదినాన్ని ప్రకటించడంపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వలసవాద పాలనకు ప్రతీకగా నిలిచిన వ్యక్తికి గౌరవం ప్రకటించడం అవసరమా అనే వారూ లేకపోలేదు.

బీబీసీ సౌత్ ఏషియా కరస్సాండెంట్ యోగితా లిమయే అందిస్తున్న కథనం.

ఇదొక సంతాపదినం. రాణి ఎలిజబెత్ గౌరవార్థం దేశమంతటా జాతీయ జెండాలను అవనతం చేశారు.

తూర్పు తీరాన ఇసుకపైన ప్రత్యేక నివాళి అర్పించారు. ఒకప్పుడు రాణి ఎలిజబెత్ కుటుంబం పాలించిన నేల ఇది.

స్వాతంత్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో, ఇక్కడి ప్రజలకు, బ్రిటన్ రాజరికపాలనకూ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

1961లో రాణి భారత్‌ను సందర్శించినప్పుడు ఇక్కడి పరిస్థితులు వేరు. చరిత్రకారిణి రాణా సఫ్వీ రాణిని చూసిన సందర్భాన్ని ఇలా గుర్తుచేసుకుంటున్నారు.

‘‘అందమైన కథలు వింటూ పెరిగి పెద్దయిన ఆ రోజుల్లో రాణి అంటే మాకు ఓ అద్భుతం. అప్పుడు నేను మొదటిసారి రాణిని చూశాను. ఆమె వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ నాకు ఇప్పటికీ గుర్తే. ఆమె చూట్టూ గార్డ్స్ గుర్రాలపై ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆమెలో సామ్రాజ్యవాదాన్ని, అది వలసదేశాలపై సాగించిన దోపిడీనే చూస్తాం తప్ప అప్పటిలా రాణిని, ఆమె కుటుంబాన్ని ఓ అద్భుతంలా మాత్రం చూడలేం’’ అన్నారు రాణా సఫ్వీ.

రాణికి ఒక రోజు సంతాపం ప్రకటించడాన్ని మీరెలా చూస్తారని నేనామెని అడిగాను.

‘‘తన బాధ్యతలను, కర్తవ్యాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించిన రాణికి నివాళి అర్పించినంత మాత్రాన మనం సామాజ్ర్యవాదాన్ని లేదా వలసవాదాన్ని సమర్థించినట్టు కాదు’’.

కొద్ది రోజుల క్రితమే ఆవిష్కరించిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం.. ఇంతకుముందు ఇక్కడ ఎలిజబెత్ రాణి తాతగారైన కింగ్ జార్జ్ ద ఫిఫ్త్ విగ్రహం ఉండేది. దీనిని ఆవిష్కరిస్తూ, ఇక బానిసత్వం చరిత్ర పుటల్లో చేరిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని బట్టి వలసవాద పాలనను భారత్ ఎలా చూస్తుందో, రాణి మరణంపై స్పందనల్లో మౌనానికి కారణమేమిటో అర్థం చేసుకోవచ్చు.

కానీ పొరుగున ఉన్న నేపాల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి ప్రజల్లో కొందరికి బ్రిటిష్ రాజరికం పట్ల అప్యాయత ఎక్కువ.

దాదాపు 200 ఏళ్లకు పైగా, ఇక్కడి గూర్ఖా ప్రాంత ప్రజలు బ్రిటిష్ సైన్యంలో సేవలందించారు. వేడుకల సమయంలో రాణి వెంట ఎల్లప్పుడూ ఇద్దరూ గూర్ఖా సైనికులు ఉండేవారు.

మేజర్ భువన్ సింగ్ లింబు, ఆయన తండ్రి విడివిడిగా రాణికి ముప్పై ఏళ్ల పాటు సేవంలందించారు.

‘‘డ్యూటీలో నా చివరి రోజు ఆమె ఈ మెంబర్ ఆఫ్ విక్టోరియన్ ఆర్డర్ బహూకరించారు. అప్పుడే ఆమె మొదటిసారి మాకు దగ్గరగా వచ్చారు. నా దగ్గరకు వచ్చారు. ఆమె నా మెడల్స్ చూశారు, ద ఫోక్ లాండ్స్ మెడల్ చూసి ఓహ్ మీరు ఫోక్‌లాండ్స్‌లో పనిచేశారా అని అడిగారు. నేను యెస్, యువర్ మేజెస్టీ అన్నాను. మనం ఓ గొప్ప మనిషిని కోల్పోయాం. మేం ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’ అని రిటైర్డ్ బ్రిటిష్ గూర్ఖా మేజర్ భువన్ సింగ్ లింబు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)