‘నన్ను నేను భారతీయుడిగా భావించను. పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన, నేను భారతీయుడిని అయిపోను’ అన్న అమృత్‌పాల్ సింగ్ ఎవరు? సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని ఎందుకు కోరుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జగ్తార్ సింగ్
- హోదా, రచయిత, సీనియర్ జర్నలిస్టు
‘‘నన్ను నేను భారతీయుడిగా భావించుకోను. పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన, నేను భారతీయుడిని అయిపోను. అది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్.. అంతే.’’
ఇవి ఖలిస్తాన్ మద్దతుదారుడు, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్‌పాల్ సింగ్ వ్యాఖ్యలు.
సిక్కుల కోసం ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్’ను ఏర్పాటుచేయాలంటూ తరచూ డిమాండ్ చేసే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయనపై కొన్ని క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
పంజాబ్‌లో తాజా సామాజిక-రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, ఇంతకీ ఖలిస్తాన్ అంటే ఏమిటి? అసలు మొదటిసారి సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఎప్పుడు వచ్చింది? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
సిక్కులకు స్వయం ప్రతిపత్తి లేదా ఖలిస్తాన్ లాంటి డిమాండ్లు వినిపించేటప్పుడు, అందరి దృష్టీ భారత్‌లోని పంజాబ్ వైపు మళ్లుతుంది.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ జన్మస్థలం నాన్‌కానా సాహిబ్. ఇది ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంటుంది. స్వాతంత్ర్యానికి ముందు భారత్‌లోని పంజాబ్‌తోపాటు ఈ ప్రాంతమంతా కలిసి ఒకే పంజాబ్‌గా ఉండేది. దీన్ని సిక్కులు తమ మాతృభూమిగా భావిస్తారు.
భారత్‌లో సిక్కుల సాయుధ పోరాటం కథ 1995లోనే ముగిసింది.
అయితే, అమృత్‌సర్ ఎంపీ, అకాలీదళ్ నాయకుడు సిమ్రన్‌జీత్ సింగ్ మాన్‌తోపాటు దళ్ ఖాల్సా ప్రతినిధులు కూడా ఖలిస్తాన్‌కు మద్దతుగా ఎప్పటికప్పుడే వ్యాఖ్యలుచేస్తున్నారు. అయితే, శాంతియుత, ప్రజాస్వామ్య విధానాలతో ఈ డిమాండ్‌ను సాధించుకోవాలని వారు పిలుపునిస్తున్నారు.
మరోవైపు అమెరికాకు చెందిన ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ కూడా ఈ డిమాండ్‌ను తరచూ చేస్తోంది. అయితే, భారత్‌లోని పంజాబ్‌లో ఈ సంస్థకు అంత ప్రజాదరణ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
తొలిసారి ఖలిస్తాన్ డిమాండ్ ఎప్పుడు వచ్చింది?
ఖలిస్తాన్ అనే పదం మొదటిసారి 1940లో వినిపించింది. ముస్లిం లీగ్ లాహోర్ డిక్లరేషన్‌కు పోటీగా డాక్టర్ వీర్ సింఘ్ భట్టీ ఓ కరపత్రంలో దీన్ని ఉపయోగించారు.
ఆ తర్వాత, భాషాపరంగా 1966లో పంజాబ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందుగా 1960ల్లోనే కొందరు అకాలీ నాయకులు సిక్కులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన చరణ్ సింగ్ పంఛీతోపాటు సిక్కు నాయకుడు డా. జగ్‌జీత్ సింగ్ చౌహాన్ కూడా 1970ల మొదట్లో సిక్కుల కోసం ఖలిస్తాన్ ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు.
బ్రిటన్‌కు చెందిన డాక్టర్ జగ్‌జీత్ సింగ్ 1970ల్లో ఈ విషయంపై అమెరికా, పాకిస్తాన్‌లలో పర్యటించి, కొందరు సిక్కు నాయకులను కూడా కలిశారు.
1978లో కొందరు యువ సిక్కు నేతలు కలిసి దళ్ ఖాల్సాను ఏర్పాటుచేశారు. వీరి లక్ష్యం సిక్కుల కోసం ఖలిస్తాన్ ఏర్పాటుచేయడమే.

ఫొటో సోర్స్, Getty Images
భిండ్రాంవాలే ఖలిస్తాన్‌ను డిమాండ్ చేశారా?
స్వర్ణ దేవాలయం లేదా ‘శ్రీ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్’లో మాకాం వేసిన సాయుధులను బయటకు రప్పించేందుకు భారత సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన అనంతరం తొలి సిక్కుల సాయుధ పోరాటం ముగిసింది. 1984లో కొనసాగిన దీన్ని ‘‘ఆపరేషన్‌నే బ్లూ స్టార్’’గా పిలుస్తుంటారు.
చాలా మంది మిలిటెంట్లకు స్ఫూర్తిగా నిలిచిన జర్నైల్ సింగ్ భిండ్రాంవాలే కూడా ఆ ఆపరేషన్‌లోనే మరణించారు.
అయితే, భిండ్రాంవాలే ఎప్పుడు సిక్కులకు ప్రత్యేక దేశం లేదా ఖలిస్తాన్ కోసం స్పష్టంగా డిమాండ్ చేయలేదు. అయితే, ‘‘శ్రీ దర్బార్ సాహిబ్ మీద జరిగే దాడే, ఖలిస్తాన్‌కు పునాదులు వేస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు 1973నాటి శ్రీ ఆనంద్‌పుర్ సాహిబ్ తీర్మానాన్ని ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని అకాలీ దళ్ వర్కింగ్ కమిటీ కూడా ఆమోదించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆనంద్‌పుర్ సాహిబ్ తీర్మానం ఏమిటి?
1973నాటి ఆనంద్‌పుర్ సాహిబ్ తీర్మానం ఏం చెబుతోందంటే.. ‘‘సిక్కు మతం (పంత్) రాజకీయ లక్ష్యం ఏమిటో తెలియాలంటే దేవుడి వాక్కులను పరిశీలించాలి. సిక్కుల చరిత్రలోని ప్రతి పేజీలో, ప్రతి సిక్కు గుండెలో ఇది కనిపిస్తుంది. సిక్కుల కోసం జియో-పొలిటికల్ ఎన్విరాన్‌మెంట్, ఒక పొలికటల్ సెటప్‌ను ఏర్పాటుచేయాలని ఇది సూచిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరేందుకు శిరోమణి అకాలీదళ్ కృషి చేయాలి.’’
అయితే, భారత రాజ్యాంగానికి లోబడి, రాజకీయ నిబంధనలను అనుసరించి అకాలీదళ్ పనిచేస్తుంది.
ఇక్కడ ఆనంద్‌పుర్ సాహిబ్ తీర్మాన లక్ష్యం ఏమిటంటే, సిక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలి. అంతేకాని ప్రత్యేక దేశం కాదు.
1977లో తమ జనరల్ హౌస్ మీటింగ్‌లో అకాలీదళ్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
అయితే, అక్టోబరు 1978లో లూధియానా కాన్ఫెరెన్స్‌లో దీని నుంచి అకాలీదళ్ వెనక్కి తగ్గింది. ఈ కాన్ఫెరెన్స్ సమయంలో అకాలీ దళ్ అధికారంలో ఉంది. అప్పుడే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గుర్‌చరన్ సింగ్ తోరా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ మద్దతుతో సిక్కులకు స్వయం ప్రతిపత్తి కోసం రిసొల్యూషన్ నంబరు -1ను తీసుకొచ్చారు. ఆనంద్‌పుర్ సాహిబ్ తీర్మానంలో కొన్ని మార్పులుచేస్తూ దీన్ని ప్రవేశపెట్టారు.
దీనిలో ఏం చెప్పారంటే.. ‘‘భారత్ ఒక సమాఖ్య. ఇక్కడ భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిసి జీవిస్తున్నాయని శిరోమణి అకాలీదళ్ అర్థం చేసుకోగలదు. ఇక్కడ మైనారిటీల ప్రాథమిక, మతపరమైన, భాషా హక్కులను పరిరక్షించేందుకు, వీరి ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేందుకు, ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగ వ్యవస్థలు కృషిచేయాలి. ఇక్కడి సమాఖ్య వ్యవస్థను పటిష్ఠం చేయడంతోపాటు కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, హక్కులను పునర్‌నిర్వచించాల్సిన అవసరముంది’’అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు అధికారికంగా డిమాండ్ వచ్చింది?
ఖలిస్తాన్ కోసం అధికారికంగా డిమాండ్‌ను 1986 ఏప్రిల్ 29న జాయింట్ ఫ్రంట్ పంథక్ కమిటీ ఆఫ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ చేసింది.
ఈ కమిటీ రాజకీయ లక్ష్యం ఏమిటంటే.. ‘‘ఈ పవిత్రమైన రోజు అకాల్ తఖ్త్ సాహిబ్ నుంచి మేం ఒక డిమాండ్ చేస్తున్నాం. అన్ని దేశాలు, ప్రభుత్వాల ముందు మేం సగౌరవంగా ప్రకటిస్తున్నాం. నేటి నుంచి ఖలిస్తాన్ అనేది ఖాల్సా పంత్‌ల మాతృభూమి. ఇక్కడ ఖాల్సా నిబంధనలకు అనుగుణంగా సిక్కులు జీవిస్తారు. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించడంలో కీలక బాధ్యతలను సిక్కులే తీసుకుంటారు. అందరి మేలు కోసం పనిచేస్తూ, నిబంధనలకు అనుగుణంగా వీరు జీవిస్తారు’’అని పేర్కొన్నారు.
1989లో జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ ఐపీఎస్ అధికారి సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ ఈ డిమాండ్ కోసం పనిచేశారు. ప్రస్తుతం ఈయన సంగ్రూర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా ప్రమాణం చేసేటప్పుడు భారత్ సమగ్రతను కాపాడతానని ఆయన ప్రమాణం చేశారు. కానీ, ఖలిస్తాన్‌కు మద్దతుగా ఆయన మీడియాలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అకాలీదళ్ ఏం చెబుతోంది?
1992లో అధికారికంగా అకాలీదళ్ కూడా ఈ డిమాండ్‌ను చేసింది. ఈ విషయంలో 1922 ఏప్రిల్ 22న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు వీరు ఒక మెమొరాండాంను కూడా సమర్పించారు.
దీనిలో చివరి పేరాలో.. ‘‘సిక్కుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను కాపాడేందుకు, వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేందుకు పంజాబ్‌లో వలస పాలనకు ముగింపు పలకడం అనివార్యం. ప్రపంచంలోని ఇతర స్వతంత్ర దేశాల్లానే సిక్కులకూ ఒక దేశం కావాలి’’అని పేర్కొన్నారు.
‘‘ప్రజల స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి తీసుకొచ్చిన తీర్మానాలకు అనుగుణంగా, సిక్కులకు కూడా వివక్ష, వలసవాదం, బానిసత్వంల నుంచి విముక్తి కావాలి’’అని వివరించారు.
ఈ మెమొరాండాన్ని సమర్పించేటప్పుడు సమ్రన్‌జీత్ సింగ్ మాన్, ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గురుచరణ్ సింగ్ తోరా అక్కడే ఉన్నారు. అయితే, ఆ తర్వాత అటు ప్రకాశ్ సింగ్ బాదల్, ఇటు గురుచరణ్ సింగ్ తోరా దీని గురించి మాట్లాడనే లేదు.
మరోవైపు అకాలీ దళ్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. పంజాబ్ అనేది సిక్కులకు మాత్రమే కాదు. ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. అయితే, ఈ విషయంలో అకాలీదళ్ ఎలాంటి తీర్మానాన్ని ఆమోదించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అమృత్‌సర్ తీర్మానం ఏమిటి?
అకాలీదళ్ (అమృత్‌సర్)కు చెందిన సిమ్రన్‌జీత్ 1994లో తమ లక్ష్యాలను మారుస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సంతకం చేశారు. అయితే, దీనిపై ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకం చేయలేదు.
శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ మార్గదర్శకంలో 1994 మే 1న ఈ తీర్మానాన్ని ఆమోదించారు. దీన్నే అమృత్‌సర్ తీర్మానంగా పిలుస్తుంటారు.
‘‘భారత ఉపఖండంలో భిన్న సంస్కృతులు కలిసి జీవిస్తున్నాయని శిరోమణి అకాలీ దళ్ నమ్ముతోంది. ఇక్కడ ప్రతి సంస్కృతికీ వారికంటూ సొంత చరిత్ర, వారతస్వ సంపద ఉన్నాయి. ఇక్కడి ప్రతి సంస్కృతీ పరిఢవిల్లేలా ఉపఖండ సమాఖ్య వ్యవస్థను పునర్‌వ్యవస్థీ కరించాల్సిన అవసరముంది. ఇక్కడ పునర్‌వ్యవస్థీకరణ సాధ్యంకాకపోతే, శిరోమణీ అకాలీదళ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు. కేవలం ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేయడం తప్పా..’’అని దానిలో వ్యాఖ్యానించారు.
ఈ తీర్మానంపై కెప్టెన్ అమరీందర్ సింగ్, జగ్‌దేవ్ సింగ్ తల్వండీ, సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, కల్నల్ జస్‌మేర్ సింగ్ బాలా, భాయ్ మన్‌జీత్ సింగ్, సుర్జీత్ సింగ్ బర్నాలా సంతకం చేశారు.
ప్రపంచ పటం ఖలిస్తాన్ కోసం..
నేడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తోపాటు చాలా దేశాల్లోని సిక్కులు ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ దేశాల్లోని సంస్థలకు భారత్‌లోని పంజాబ్‌లో అంత ప్రజాదరణ లేదు.
‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ అనేది అమెరికాకు చెందిన సంస్థ. వేర్పాటువాద డిమాండ్లను ఎత్తిచూపిస్తూ 2019 జులై 10న భారత ప్రభుత్వం దీన్ని యూఏపీఏ చట్టం కింద నిషేధించింది.
ఆ తర్వాత 2020లో ఖలిస్తాన్ సంస్థలకు చెందిన తొమ్మిది మందిని టెర్రరిస్టులుగా భారత ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు 40 ఖలిస్తాన్ అనుకూల వెబ్‌సైట్లనూ నిషేధించింది.
సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ 2007లో అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలో అడ్వొకేట్‌గా పనిచేస్తున్న పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్న గుర్‌పట్వంత్ సింగ్ పన్ను నేతృత్వంలో ఇది పనిచేస్తూ వచ్చింది.
ఖలిస్తాన్‌కు మద్దతుగా ‘‘రిఫరెండం 2020’’ను నిర్వహించాలని పన్ను ప్రత్యేక ప్రచారాలు చేపట్టారు.
జత్యేదార్, అకాల్ తఖ్త్ ఏం చెబుతున్నాయి?
అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం కేంద్రంగా పనిచేసే అకాల్ తఖ్త్ సిక్కుల మతానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దీని అధిపతిని జత్యేదార్‌గా పిలుస్తారు. నలుగురు తఖ్త్‌లతో కలిసి ఆయన పనిచేస్తారు. వీరు కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకుంటారు.
ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2020లో అకాల్ తఖ్త్ జత్యేదార్ జియానీ హర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఖలిస్తాన్ డిమాండ్ న్యాయమైనదేనని వ్యాఖ్యానించారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘సిక్కులు ఆ ఊచకోత (1984 ఆపరేషన్ బ్లూస్టార్)ను ఎప్పటికీ మరచిపోలేరు. ఖలిస్తాన్‌ను కోరుకోని సిక్కు ఉండడు. ప్రభుత్వం ఖలిస్తాన్ ఇస్తే, మేం స్వీకరిస్తాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















