అమృత్‌పాల్ సింగ్: పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు పోలీసుల అనుమానాలు.. ఇప్పటి వరకు ఏం జరిగింది?

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌పాల్ సింగ్ కోసం మూడు రోజులుగా పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది.

సింగ్ సారథ్యంలోని ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ కార్యకర్తల మీద ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు 114 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తొలి రోజు 78 మందిని, రెండో రోజు 34 మందిని, మూడో రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమృత్‌పాల్ సింగ్‌కు చాలా సన్నిహితులు అని చెబుతున్న అయిదుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిలో అమృత్‌పాల్ సింగ్ బాబాయి హర్జీత్ సింగ్ కూడా ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద ఆ అయిదుగురు మీద కేసులు నమోదు చేశారు. వీరినిలో అస్సాంలోని దిబ్రూగర్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు. హర్జీత్ సింగ్ ఇంకా దారిలోనే ఉన్నట్లు వెల్లడించారు.

పోలీసుల సోదాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దొరికాయి. వాటి మీద ఏకేఎఫ్ అంటే ‘‘ఆనంద్‌పుర్ ఖల్సా ఫౌజీ’’ అని బ్రాండ్ లోగో ఉంది. అమృత్‌పాల్ సింగ్ ఇంటి గేటు మీద కూడా ఇది కనిపిస్తుంది.

‘‘వారిస్ పంజాబ్ దే’’ సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలతోపాటు ఈ కేసులో ఐఎస్ఐ ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఐజీ సుఖ్‌చైన్ గిల్ వెల్లడించారు.

మంగళవారం వరకు పంజాబ్‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలు నిలిపివేసే ఉంటాయని పోలీసులు తెలిపారు.

తుపాకులు

ఫొటో సోర్స్, ANI

ఈ కేసులో ఇంత వరకు ఎంత మందిని అరెస్టు చేశారు?

ఐజీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ ప్రకారం ఇప్పటి వరకు అమృత్‌పాల్ సన్నిహితుల్లో 114 మంది అరెస్టు చేశారు.

అమృత్‌పాల్ సింగ్ బాబాయి పాత్ర ఏమిటి?

మార్చి 19 రాత్రి అమృత్‌పాల్ సింగ్ బాబాయి హర్జీత్ సింగ్‌ను ఆయన డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు జలంధర్ రూరల్ ఎస్‌ఎస్‌పీ స్వర్ణదీప్ సింగ్ తెలిపారు.

అమృత్‌పాల్ సింగ్‌కు హర్జీత్ సింగ్ మెంటార్‌గా ఉన్నారు. దుబాయిలో ఆయన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ ఉన్నారు?

అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నారని, ఇంకా దొరకలేదని ఐజీ గిల్ తెలిపారు. ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఎన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు?

9 ఆయుధాలు, ఒక .315 బోర్ రైఫిల్, ఏడు 12 బోర్ రైఫిల్స్, ఒక రివాల్వర్, రకరకాల సామర్థ్యం గల 373 బుల్లెట్లు లభించాయని పోలీసులు తెలిపారు.

అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో కొందరు నిరసనలకు దిగారు. మొహాలీలో క్వామీ ఇన్సాఫ్ మోర్చా కార్యకర్తలు నిరసన చేపట్టారు. సుమారు 100 మంది ఉన్న ఆ ప్రదర్శన ప్రస్తుతానికి శాంతియుతంగా జరుగుతోంది.

భారీ స్థాయిలో పోలీసులను సైతం అక్కడ మోహరించారు.

మార్చి 21న చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని కర్నల్‌లోని సిక్కు సంస్థలు హరియా సిక్కులకు పిలుపునిచ్చాయి. చంఢీగర్‌తోపాటు పంజాబ్‌లోని అనేక జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు.

అనేక చోట్ల పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి.

‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌పాల్ సింగ్‌ను కోర్టులో హాజరుపర్చాలంటూ ‘‘వారిస్ పంజాబ్ దే’’ న్యాయసలహాదారుడు ఇమాన్ సింగ్ ఖారా, పంజాబ్-హరియాణా హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల కస్టడీలో అమృత్‌పాల్ సింగ్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు.

అయితే ఇంకా అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేయలేదని పంజాబ్ ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆదివారం పంజాబ్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

శనివారం సాయంత్రం షా కోట్‌లోని గురుద్వారా సాహిబ్‌లో అమృత్‌పాల్ సింగ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అతను తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అమృత్‌పాల్ సింగ్ గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో పోలీసులు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.

గ్రామాల్లోని గురుద్వారాల వద్ద పోలీసులను మోహరించారు. ఫేక్ న్యూస్, పుకార్లు నమ్మొద్దని వారు కోరుతున్నారు.

అమృత్‌పాల్ సింగ్ మద్దతుదార్లు

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌పాల్ సింగ్ మీద కేసులేంటి?

‘‘వారిస్ పంజాబ్ దే’’ కార్యకర్తల మీద నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని జలంధర్ పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, హత్య, పోలీసుల మీద దాడి, ప్రభుత్వ ఉద్యోగులను వారి డ్యూటీ చేయకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలు వారి మీద ఉన్నాయి.

ఫిబ్రవరి 2న అజ్నాలా పోలీసు స్టేషన్ మీద ‘‘వారిస్ పంజాబ్ దే’’ కార్యకర్తలు చేసిన ‘దాడి’పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అంతర్జాతీయంగా స్పందనలు

లండన్‌లోని భారత హై కమిషన్ వద్ద మూడు రంగుల జెండాను కొందరు తీసేశారు. వారంతా ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని ఉన్నారు. ఈ ఘటన మీద బ్రిటన్‌ ప్రభుత్వానికి భారత్ తన నిరసన తెలిపింది.

‘‘భారత్‌లో పౌరహక్కులను కాలరాస్తున్నారు’’ అంటూ కెనడాలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)