భగత్ సింగ్ భార్యలాగా నటించి బ్రిటీషర్ల నుంచి ఆయన్ను తప్పించిన దుర్గావతీ దేవి ఎవరు?

దుర్గా దేవి

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

ఫొటో క్యాప్షన్, దుర్గా దేవి
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై జరిపిన లాఠీ ఛార్జీలో ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతి రాయ్ కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత డిసెంబర్ 10, 1928లో దుర్గావతీ దేవీ సారథ్యంలో విప్లవకారులందరూ లాహోర్‌లో సమావేశమయ్యారు.

‘హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’ మానిఫెస్టో రాసిన ఉద్యమకర్త భగవతి చరణ్ వోహ్రా భార్యయే దుర్గావతీ దేవీ.

లాలా లజపతి రాయ్ మరణంపై ప్రతీకారం తీర్చుకోవాలని లాహోర్‌లో జరిగిన సమావేశంలో ఉద్యమకారులు నిర్ణయించారు.

ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ రాసిన ‘వితౌట్ ఫియర్:ది లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్’ అనే పుస్తకంలో ఈ విషయాలను వివరించారు.

‘మీలో స్కాట్ హత్యను ఎవరు చేస్తారు అని దుర్గా దేవీ అడిగారు? భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్‌లు మేం చేస్తామంటూ చేతులు ఎత్తారు.

తొలుత సుఖ్ దేవ్ ఒంటరిగా ఈ హత్య చేయాలనుకున్నారు. కానీ, ఆయనకి సాయం చేసేందుకు మరో నలుగురు ఉద్యమకారులు భగత్ సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, జై గోపాల్‌లు ఎంపికయ్యారు.’’ అని కుల్దీప్ నయ్యర్ తన పుస్తకంలో రాశారు.

డిసెంబర్ 17, 1928న సాయంత్రం 4 గంటలకు బ్రిటన్ అధికారి శాండర్స్‌ను హత్య చేయడం ద్వారా భగత్ సింగ్, రాజ్‌గురులు లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు.

ఆ తర్వాత మూడు రోజులకు సుఖ్ దేవ్, భగవతి చరణ్ వోహ్రా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వోహ్రా పరారీలో ఉన్నారు.

భగత్ సింగ్

ఫొటో సోర్స్, HARPER COLLINS

వోహ్రా ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన భార్య దుర్గా దేవీని ‘మీ దగ్గర ఏమైనా డబ్బుందా’ అని అడిగారు. తన భర్త ఇచ్చిన రూ.500ను సుఖ్ దేవ్‌కి ఇచ్చారు దుర్గాదేవీ. దీంతో పాటు మరో సాయాన్ని కూడా సుఖ్ దేవ్ దుర్గా దేవీని అడిగారు.

కొందర్ని లాహోర్ నగరం నుంచి బయటకు తీసుకెళ్లాలని, వారిని తప్పించడంలో సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆమె లాహోర్‌లోని ఒక మహిళా కళాశాలలో దుర్గా దేవీ హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

సుఖ్ దేవ్, భగత్ సింగ్, రాజ్‌గురు తన ఇంటికి రావొచ్చని దుర్గా దేవీ చెప్పినట్లు మల్వీందర్ జీత్ సింగ్ వారాయిచ్ ‘భగత్ సింగ్, ది ఎటర్నల్ రెబెల్’ అనే పేరుతో రాసిన తన పుస్తకంలో పేర్కొన్నారు.

భగత్ సింగ్

ఫొటో సోర్స్, UNISTAR BOOKS

భార్యభర్తలుగా దుర్గా దేవీ, భగత్ సింగ్

ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ 20న భగత్ సింగ్ అధికారి మాదిరి వస్త్రాధారణ చేసుకుని తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. చొక్కా పైన కోట్ ధరించి, కోట్ కాలర్ కాస్త పైకి పెట్టుకున్నారు. అలా తయారు కావడం వల్ల భగత్ సింగ్ ముఖం సరిగ్గా కనిపించదు.

దుర్గా దేవీ ఖరీదైన చీరను, ఎత్తు చెప్పులు ధరించి, అతని భార్యగా నటిస్తూ భగత్ సింగ్‌తో ప్రయాణించేందుకు వెళ్లారు.

భగత్ సింగ్ ఒళ్లో దుర్గా దేవీ మూడేళ్ల కొడుకు శాచి కూర్చున్నారు. వారితో పాటు రాజ్‌గురు కూడా అదే ట్రైన్‌లో తప్పించుకోబోతున్నారు. భగత్ సింగ్, రాజ్‌గురు ఇద్దరి వద్ద కూడా లోడ్ చేసిన రివాల్వర్లు ఉన్నాయి.

లాహోర్ రైల్వే స్టేషన్ అంతా పోలీసులతో నిండిపోయింది. వారి మధ్యలో నుంచి తప్పించుకోవడం సాహసమే.

రంజిత్ అనే పేరుతో భగత్ సింగ్ , సుజాత అనే పేరుతో దుర్గా దేవీ ప్రయాణించేందుకు వెళ్లారు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్లు రైలు ఎక్కే ముందు తప్పనిసరిగా తమ పేర్లను చెప్పాల్సి ఉందని ‘వితౌట్ ఫియర్: ది లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్’ అనే పుస్తకంలో రాశారు.

వీరు తమ కంపార్ట్‌మెంట్‌కి చేరుకున్న తర్వాత, అక్కడ ఉన్న పోలీసు, మరో కొలీగ్‌తో గుసగుసలాడారు. వీరు సాహిబ్‌లని చెప్పారు. ఇదే రైలులో కుటుంబ సమేతంగా కొందరు సీనియర్ అధికారులు కూడా ప్రయాణిస్తున్నారు.

వారికి సర్వెంట్‌లాగా థర్డ్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో రాజ్‌గురు ప్రయాణించారు. డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ఆ తర్వాత కాసేపట్లోనే లాహోర్ స్టేషన్ నుంచి బయలు దేరింది. ఆ సమయంలో బయటికి వచ్చి చూసిన భగత్ సింగ్‌, తనని వెతకడం కోసం రైల్వే స్టేషన్‌లో సుమారు 500 భద్రతా సిబ్బంది మోహరించినట్లు చూశారు.

రాజ్‌గురు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, రాజ్‌గురు

‘కమింగ్ విత్ బ్రదర్’ అంటూ కోల్‌కతాకి టెలిగ్రామ్ పంపిన దుర్గా దేవీ

దుర్గా దేవీ తన ప్రయాణాన్ని మాల్విందర్ జీత్ సింగ్‌కి వివరించారు. ‘‘ఫస్ట్ క్లాస్ కూపేలో మేమందరం ఒంటరిగా ఉన్నాం. కొంత దూరంలో ఒక వృద్ధ దంపతుల జంట మాతో పాటు వచ్చి, ఆ తర్వాత ట్రైన్ దిగిపోయారు. మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారు కానీ, జర్నీ అంతా ఆయన నిద్రపోతూనే ఉన్నారు.

మమ్మల్ని ఎవరూ పరిశీలించడం లేదని మాకు అర్థమైంది. మా ట్రైన్ కాన్పూర్ చేరుకున్నాక, మేం ముగ్గురం కోల్‌కతా ట్రైన్ ఎక్కాం.’’ అని దుర్గా దేవీ చెప్పారు.

ఆ సమయంలో గూఢచారులను తప్పుదోప పట్టించేందుకు భగత్ సింగ్ మొత్తం డ్రామాను ప్లే చేశారు. ఈ విషయం గురించి ఐడీ గౌర్ తన పుస్తకం ‘మార్టిర్స్ యాజ్ బ్రైడ్‌గ్రూమ్‌’లో వివరించారు.

‘‘ప్రయాణమంతా నేచురల్‌గా సాగుతున్నట్లు చేసేందుకు, చాయ్ తాగేందుకు లఖ్‌నవూలోని చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో సాహిబ్ దిగారు. పిల్లలకి పాలు తెచ్చేందుకు సర్వెంట్ కూడా కిందకి దిగారు.

పాలు ఇచ్చిన తర్వాత, రాజ్‌గురు మరో దిక్కుకి వెళ్లారు. అక్కడి నుంచే దుర్గా దేవీ కోల్‌కతాలో ఉంటోన్న ఆమె సహోద్యోగి సుశీల దీదీకి ఒక టెలిగ్రామ్ పంపారు. ‘కమింగ్ విత్ బ్రదర్-దుర్గావతి’ అని రాశారు.

ఆ రోజుల్లో సుశీల దీదీ ఇంట్లోనే దుర్గా దేవీ భర్త భగవతి చరణ్ వోహ్రా తలదాచుకునే వారు. ఆ టెలిగ్రామ్ చూసి ఇద్దరూ షాక్‌కి గురయ్యారు’’ అని రాశారు.

భగత్ సింగ్

దుర్గా దేవీని పికప్ చేసుకునేందుకు డిసెంబర్ 22, 1928న కోల్‌కతాలోని హౌరా స్టేషన్‌కి సుశీల దీదీ, భగవతి చరణ్ వోహ్రా వెళ్లారు.

‘‘ఆ సమయంలో భగవతి చరణ్ వోహ్రా పరారీలో ఉండేవారు. వారిని పికప్ చేసుకునేందుకు రైల్వే కూలీ డ్రెస్ వేసుకుని, మోకాళ్ల వరకు ధోతి ధరించి గడ్డంతో స్టేషన్‌కి వచ్చారు.

భార్య దుర్గా దేవీని, కొడుకు శాచిని, భగత్ సింగ్‌ను చూడగానే ఆనందంతో పొంగిపోయారు. ఆ ఆనందంలో ఆయన నోటి నుంచి ‘దుర్గా నేను ఈ రోజు నిన్ను చూశాను’ అన్నారని ‘‘క్రాంతికారి దుర్గా భాభీ’’ అనే పుస్తకంలో సత్యనారాయణ శర్మ రాశారు.

దుర్గాదేవీ అక్టోబర్ 7, 1907న అలహాబాద్‌లోని షాజాద్ పూర్‌లో పుట్టారు. ఆమె తండ్రి బంకే బిహారి లాల్ భట్ అలహాబాద్ జిల్లా జడ్జిగా పనిచేసేవారు.

1918లో తనకి స్వతంత్రోద్యమకారులు భగవతి చరణ్ వోహ్రాతో పెళ్లయింది. డిసెంబర్ 3, 1925న కొడుకు పుట్టారు. తన భర్తతో కలిసి ఉంటోన్న సమయంలో ఆమె ఉద్యమకారులకు సహకారం అందించే వారు.

దుర్గా దేవీ కుటుంబం

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

ఫొటో క్యాప్షన్, భగవతి చరణ్ వోహ్రా, దుర్గా దేవీతో కొడుకు శాచి

‘‘దుర్గా బాభి జైలులోని ఉద్యమకారులకు వస్త్రాలు పంపుతూ, వాటిపై ఆమె కోడ్‌వర్డ్స్ రూపంలో మెసేజ్‌లు రాసేవారు. అలాగే పాలు, ఉల్లి జ్యూస్‌తో పాటు పేపర్‌పై మెసేజ్‌లు రాసి ఉద్యమకారులకు అందజేసేవారు.

పాలు, జ్యూస్ ఎండబెట్టిన తర్వాత అదొక బ్లాక్ పేపర్ మాదిరి కనిపించేది. భూతద్దం పెట్టి చూస్తే దానిపై ఏం రాసుందో జైలులోని ఉద్యమకారులు తేలిగ్గా చదవగలిగేవారు’’ అని సత్యనారాయణ శర్మ చెప్పారు.

1930లో బాంబు పేలుడులో భర్త చనిపోయిన తర్వాత ఆమె ముస్లిం మహిళలాగా ఒక స్నేహితుడి ఇంట్లో దాక్కోవాల్సి వచ్చింది.

ఆమె ఆ సమయంలో తన పార్టీలోని కార్యకర్తల కోసం రెండు సార్లు జైపూర్ నుంచి పిస్టల్స్, రివాల్వర్స్ తెప్పించారు. కానీ, బ్రిటీష్ పోలీసులకు ఆమెపై ఏ మాత్రం అనుమానం రాలేదు.

కోల్‌కతాలో భగత్ సింగ్‌ను వదిలిపెట్టిన తర్వాత, దుర్గా దేవీ లాహోర్‌కి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె తన బోధనా వృత్తిలో తీరిక లేకుండా గడిపారు.

సుశీల దీదీ

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

ఫొటో క్యాప్షన్, సుశీల

సార్జెంట్ టేలర్ హత్య

1930 నాటికి, భారతదేశమంతటా విప్లవ కార్యకలాపాలు వేగంగా జరగడం లేదని భావించిన చంద్రశేఖర్ ఆజాద్, దుర్గాదేవి, విశ్వనాథ్ వైశంపాయన్, సుఖదేవ్‌లను బొంబాయికి పంపాడు. అక్కడ వాళ్లు పోలీసు కమీషనర్ లార్డ్ హేలీని చంపాలని నిర్ణయించారు.

లామింగ్టన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ సమీపంలో వారు కారు పార్క్ చేశారు. మలబార్ హిల్ నుండి ఒక కారు రావడం చూశారు. కారుపై గవర్నర్ జెండా ఉంది. అందులోంచి ఓ ఆంగ్ల అధికారి కారు దిగాడు.

‘‘షూట్ అని పృథ్వీసింగ్ ఆజాద్ ఆదేశించారు. దుర్గాదేవి వెంటనే కాల్పులు ప్రారంభించారు. సుఖ్‌దేవ్ కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సార్జెంట్ టేలర్, అతని భార్య మరణించారు.

దుర్గాదేవి డ్రైవర్ వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఈ ఘటన తర్వాత వారు కాన్పూర్ బయలుదేరారు’’ అని సత్యనారాయణ శర్మ రాశారు.

"మేము బొంబాయి నుండి బయలుదేరినప్పుడు, చాలా భయపడ్డాం. తర్వాత దుర్గాభాభి ఈ సంఘటన గురించి నాకు చెప్పారు. మమ్మల్ని చూసి చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ సక్సెస్ అయినట్లయితే చంద్రశేఖర్ ఆజాద్ సంతోషించేవారు. హేలీకి బదులు సార్జెంట్‌ను, అతని భార్యను చంపడంతో ఆయక కాస్త పశ్చాత్తాపపడ్డారు. తర్వాత మామూలు మనిషి అయ్యారు’’ అని శర్మ రాశారు.

దుర్గా దేవీ

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

భగత్ సింగ్‌ను కలవడానికి లాహోర్ నుంచి దిల్లీకి...

భగత్‌ సింగ్‌ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరే రోజున ఆయన్ను కలవడానికి దుర్గాదేవి దిల్లీకి వచ్చారు.

"నేను సియాల్‌కోట్‌లో ఉన్నప్పుడు, సుశీలా దీదీతో కలిసి రెండు రోజుల్లో దిల్లీకి చేరుకొమ్మని ఒక మెసెంజర్ ద్వారా నా భర్త నుండి నాకు ఉత్తరం వచ్చింది. మేము లాహోర్‌కు బస్సులో వెళ్ళాము. అక్కడి నుండి రాత్రిపూట రైలులో బయలుదేరి ఏప్రిల్ 8 తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నాము.

అక్కడ ఖుదేసియా గార్డెన్‌కి వెళ్లాం. మమ్మల్ని కలవడానికి సుఖ్‌దేవ్ భగత్ సింగ్‌ని తీసుకువచ్చారు’’ అని ఆమె మల్విందర్ జీత్ సింగ్ వారాయిచ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుర్గాదేవి చెప్పారు.

"సుశీలా దీదీ తన వేలిని కోసుకుని రక్తంతో భగత్ సింగ్ తిలకం పూసింది. భగత్ సింగ్ ఏ మిషన్ మీద వెళ్తున్నాడో మాకు అప్పుడు తెలియదు. అతను ఏదో పెద్ద పని మీద వెళ్తున్నాడనే భావన మాకు కలిగింది.

అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు. అప్పుడు భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్ పోలీస్ కార్లో తీసుకెళ్తున్నట్లు చూశాను. నా కొడుకు శాచి నా ఒడిలో కూర్చోని, భగత్ సింగ్ ని చూడగానే లంబూ చాచా అని గట్టిగా అరిచాడు.

నేను వెంటనే నా చేత్తో అతని నోటిని మూసేశారు. శాచి గొంతు విని భగత్ సింగ్ కూడా మావైపు చూశాడు’’ అని ఆమె చెప్పారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మహాత్మా గాంధీని కలిసిన దుర్గాదేవి

భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులకు మరణశిక్ష విధించినప్పటి నుండి, చంద్రశేఖర్ ఆజాద్ ఈ మరణశిక్షను ఆపడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. మహాత్మా గాంధీని కలవడానికి దుర్గాదేవిని దిల్లీకి పంపాలని నిర్ణయించారు.

తనకు విధించిన మరణశిక్షను నిలిపివేయించే ప్రయత్నాలను భగత్ సింగ్ వ్యతిరేకించినప్పటికీ, ఫిబ్రవరి 26, 1931న గజియాబాద్‌లోని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రఘునందన్ శరణ్, దుర్గాదేవి, సుశీలా దేవిలతో కలిసి రాత్రి 11 గంటలకు దరియాగంజ్‌లోని డాక్టర్ అన్సారీ కాటేజ్‌కు చేరుకున్నారు. గాంధీ అక్కడే బస చేసి ఉన్నారు.

‘‘జవహర్‌లాల్ నెహ్రూ కాటేజ్ వెలుపల నడుచుకుంటూ వస్తున్నారు. ఇద్దరు మహిళలను లోపలికి తీసుకెళ్లారు. చంద్రశేఖర్ ఆజాద్ సూచన మేరకు తాను కలవడానికి వచ్చానని, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరి శిక్షను ఆపడానికి ప్రయత్నించాలని దుర్గాభాభి గాంధీజీకి చెప్పారు.

ఈ ముగ్గురి మరణశిక్షను మార్చగలిగితే, విప్లవకారులు మీ ముందు లొంగిపోతారన్న ఆజాద్ సందేశాన్ని కూడా చెప్పారు. కానీ గాంధీజీ ఈ సూచనను అంగీకరించలేదు.

తనకు వ్యక్తిగతంగా భగత్ సింగ్ అంటే ఇష్టమని, అయితే అతని పద్ధతులతో ఏకీభవించనని అన్నారు’’ అని దుర్గాదేవి జీవిత చరిత్రలో సత్యనారాయణ శర్మ రాశారు.

గాంధీజీ సమాధానం దుర్గాదేవికి నచ్చకపోవడంతో ఆయనకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దుర్గా దేవీ

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

దుర్గాదేవి అరెస్టు

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను 1931 మార్చి 23న ఉరితీశారు. దీనికి కొన్ని రోజుల ముందు అంటే 1931, ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ కూడా పోలీసు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలను కోల్పోయాడు.

ఆ సమయంలో దుర్గాదేవి పోలీసులకు లొంగిపోయి ఇతర మార్గాల ద్వారా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 1931 సెప్టెంబరు 12న లాహోర్ వార్తాపత్రికలలో దీని గురించి దుర్గాదేవి ఒక ప్రకటన చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఆమె ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. తర్వాత దుర్గాదేవి ఒక ఇంటర్వ్యూలో ఈ ఘటన గురించి చెప్పారు.

“పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి మూడు లారీలలో వచ్చారు. లాహోర్ కోటకు తీసుకెళ్లారు. మీ గురించి మాకు అంతా తెలుసు. మీ రికార్డులన్నీ మా వద్ద ఉన్నాయి అని అన్నారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉంటే, నన్ను విచారించండి, లేకపోతే వదిలేయండి అన్నాను’’ అని వివరించారు.

కానీ, మొదటి రోజే ఆమెను భయంకరమైన మహిళా నేరగాళ్లతో కలిపి జైల్లో ఉంచారు. పోలీసులు ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలను సేకరించలేక పోవడంతో 1932 డిసెంబర్ లో జైలు నుండి విడుదలయ్యారు. అయితే మూడేళ్లపాటు లాహోర్ దాటి వెళ్లరాదని నిషేధం విధించారు.

1936లో దుర్గాదేవి లాహోర్ నుండి గజియాబాద్‌కు వెళ్లి ప్యారేలాల్ బాలికల ఉన్నత పాఠశాలలో టీచింగ్ ప్రారంభించారు. 1940లో లఖ్‌నవూలో మాంటిస్సోరి పాఠశాలను స్థాపించారు.

ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ భవనాన్ని ప్రారంభించారు. అనారోగ్యం కారణంగా 1983 ఏప్రిల్ నుంచి దుర్గాదేవి స్కూలు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 1999 అక్టోబర్ 15 న కన్ను మూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)