పాకిస్తాన్: బిలావల్ భుట్టో జననాన్ని బెనజీర్ భుట్టో ఎందుకు గోప్యంగా ఉంచారు?

ఫొటో సోర్స్, REUTERS/AKHTAR SOOMRO
- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో 1988 ఒక మైలురాయి లాంటిది. దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక సైనిక నియంత అదే ఏడాది విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో ఒక నిరంకుశ ప్రభుత్వానికి తెరపడింది. బెనజీర్ భుట్టో నేతృత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అదే ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చింది.
అదే ఏడాది బెనజీర్ భుట్టోకు పాకిస్తాన్ ప్రస్తుత విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జన్మించారు. అప్పట్లో ఆయన జననాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే బెనజీర్ భుట్టో గర్భంతో ఉండటాన్ని అడ్డుపెట్టుకుని ఆమె నేతృత్వంలోని పీపీపీ ఎన్నికల ప్రచారానికి గండి కొట్టాలని సైన్యం ప్రయత్నించింది.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకోవాలని బెనజీర్ భుట్టో తొలుత భావించారని, కానీ అప్పుడే బిలావల్ కడుపులో పడ్డారని ‘‘పొలిటికల్ లీడర్స్ ఇన్ ఏసియా: జెండర్, పవర్, పెడిగ్రీ’’ పేరిట ప్రచురించిన పరిశోధన పత్రంలో ఆండ్రియా ఫ్లెషెన్‌బర్గ్ చెప్పారు.
1988 నవంబరులో బెనజీర్ భుట్టో ప్రసవానికి దగ్గర్లో ఎన్నికల తేదీ వచ్చేలా జియా-వుల్ హక్ ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ఎందుకంటే- గర్భంతో ఉండే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చని ఆయన భావించారు.
కానీ, బెనజీర్ భుట్టో తాను గర్భంతో ఉన్నాననే విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఆ ఎత్తు ఫలించింది. జియా-వుల్ హక్ నిఘా సమాచారమే ఆయన్ను బురిడీ కొట్టించింది. మొత్తంగా 1988 సెప్టెంబరు 21న ఎన్నికలకు రెండు నెలల ముందు బిలావల్ జన్మించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పీపీపీ ఘన విజయం సాధించింది.
బెనజీర్ భుట్టో పాకిస్తాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు తీసుకునేటప్పటికి బిలావల్ వయసు మూడు నెలలు. ఆమె పాకిస్తాన్‌కు మాత్రమే కాదు ముస్లిం ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యం ఎలా గడిచింది?
బిలావల్ జననంతో పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైనట్లు చెప్పుకోవాలి. ఆయన జన్మించేందుకు సరిగ్గా నెల రోజుల ముందు, ‘ఆయన తాతయ్య, మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకు మరణ శిక్ష విధించిన’ జియా-వుల్ హక్ విమాన ప్రమాదంలో మరణించారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తల్లితోపాటు బిలావల్ ఇస్లామాబాద్‌లోని ప్రధాని నివాసానికి మారారు. అక్కడే ఆయన బాల్యం కొంతవరకు గడిచింది.
1988 నుంచి 1996 మధ్య బుబనజీర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. భుట్టో వంశంలో జన్మించినప్పటికీ బిలావల్‌కు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. తన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీని అవినీతి ఆరోపణల మీద జైలులో పెట్టారు. బెనజీర్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 1996లో ఆసిఫ్‌ను అరెస్టు చేశారు. దాదాపు ఎనిమిదేళ్లు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.
‘‘నేను చాలా సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, అప్పుడు నా పక్కన మా నాన్న లేరు. నాకు ఆయన తోడు అవసరమైనప్పుడు, ఆయన్ను నా నుంచి విడదీశారు. మాకు సాధారణ జీవితం అనేదే లేకుండా చేశారు’’ అని బిలావల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
1999 ఏప్రిల్‌లో తన రాజకీయ ప్రత్యర్థి, అప్పటి పాకిస్తాన్ పాలకుడు నవాజ్ షరీఫ్ నుంచి తప్పించుకునేందుకు బెనజీర్ దుబాయ్‌కు మకాం మార్చారు. అప్పుడు ఆమెతోపాటు బిలావల్ కూడా వెళ్లారు. తన టీనేజీ వయసు చాలా వరకూ దుబాయి, లండన్‌లలో గడిచింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్ కాలేజీ నుంచి ‘మోడర్న్ హిస్టరీ అండ్ పాలిటిక్స్’లో ఆయన 2012లో డిగ్రీ పూర్తిచేశారు.
బిలావల్ చదువు పూర్తి కావడానికి కొన్ని ఏళ్ల ముందే, అంటే 2007లో రావల్పిండిలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతున్న బిలావల్ తల్లి బెనజీర్‌ను హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన జీవితం తలకిందులైంది. పుట్టుకతోనే భుట్టో వంశానికి బిలావల్ వారసుడు. అయితే, 19 ఏళ్ల వయసుకే తల్లి, తాతయ్య స్థానాలను భర్తీ చేయాల్సి వస్తుందని ఆయన ఊహించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
బిలావల్ ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుంటున్నప్పుడే బెనజీర్ మరణించారు. దీంతో తల్లి చివరి కోరిక ప్రకారం పీపీపీకి చైర్మన్‌గా బిలావల్ పేరును ప్రకటించారు. అయితే, పార్టీకి నామమాత్రపు అధిపతిగా ఆయన కొనసాగేవారు. వెనుక నుంచి తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ కథను నడిపించేవారు.
పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై తండ్రితో బిలావల్‌కు కొన్ని విభేదాలు ఉండేవని షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పొలిటికల్ సైన్స్ డీన్ డాక్టర్ రియాజ్ షేక్ చెప్పారు.
‘‘బిలావల్‌కు భాష, సంస్కృతి అడ్డుగోడల్లా ఉండేవి. ఎందుకంటే చాలాకాలం ఆయన తల్లితోపాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. దీంతో తాతయ్య, తండ్రి పెరిగిన వాతావరణానికి ఆయన దూరమయ్యారు. ఆసిఫ్ అలీ జర్దారీ అన్నింటిలోనూ ఆచితూచి వ్యవహరించే వ్యక్తి. బిలావల్ మాత్రం తన భావాలను స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పాలని అనుకునేవారు. కొన్నిసార్లు దీని వల్ల భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని, ఇలాంటి సాహసాలు చేయకూడదని తండ్రి భావించేవారు’’ అని రియాజ్ చెప్పారు.
2007లో పాకిస్తాన్‌ను ఉగ్రవాద దాడులు, మిలిటెన్సీ కుదిపేశాయి.
‘‘బిలావల్ సురక్షితంగా ఉండాలని తండ్రి భావించేవారు. అందుకే ఆయన్ను మాతృభూమికి దూరంగా ఉంచేవారు. అదే సమయంలో పీపీపీలో బిలావల్‌కంటూ ఒక స్థానం, పేరు సంపాదించాలని అనుకునేవారు’’ అని రియాజ్ వివరించారు.

ఫొటో సోర్స్, JOHN MOORE
రాజకీయ ప్రవేశం ఇలా..
2012లో అధికారికంగా బిలావల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013 పీపీపీ ఎన్నికల ప్రచారానికి ఆయన నేతృత్వం వహించారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన కనీస వయసు ఆయనకు ఇంకా రాలేదు. పాకిస్తాన్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి. దీంతో 2018 ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు.
‘‘ఇలాంటి జీవితాన్ని నేను కోరుకోలేదు. మా అమ్మ కూడా ఇలాంటి జీవితాన్ని తాను కోరుకోలేదని చెప్పేది. ఆ జీవితమే ఆమెను ఎంచుకుందని వివరించేది. నా విషయంలోనూ అదే నిజం’’ అని 2018లో థట్టాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయిటర్స్ వార్తా సంస్థతో బిలావల్ చెప్పారు. సింధ్ ప్రావిన్స్‌లో థట్టా ఒక తీర నగరం. భుట్టోలకు సింధ్ ఒక కంచుకోట లాంటిది.
బెనజీర్, బిలావల్‌ల రాజకీయ జీవితం ఒకేలా కనిపిస్తుందని పీపీపీ రాజకీయాలను దశాబ్దాల నుంచి నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ నయిచ్ చెప్పారు.
‘‘తండ్రి లేదా తల్లిని కోల్పోయిన తర్వాత వీరిద్దరూ అనుకోకుండానే రాజకీయాల్లో అడుగుపెట్టారు. బెనజీర్‌తో పోలిస్తే బిలావల్‌కు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంటనే ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. బెనజీర్ మాత్రం ఎన్నికల్లో విజయం కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది’’ అని ఆయన వివరించారు.
2018లో పీపీపీ పంజాబ్‌లో తుడిచిపెట్టుకుపోయింది. దేశ ప్రధాని పీఠాన్ని శాసించడంలో పంజాబ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, సింధ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన ఆధిక్యాన్ని పార్టీ సంపాదించగలిగింది. భవిష్యత్తులో ప్రధాని కావాలనే ఆలోచనలో ఉన్న బిలావల్ ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2018లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంటులో బిలావల్ ప్రసంగించారు. ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్’’ అంటూ విమర్శించారు. అంటే ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యం మద్దతుందని పరోక్షంగా చెప్పారు. ఆ తర్వాత ఆ పదం చాలా పాపులర్ అయ్యింది.
సైన్యం మద్దతు లేకుండా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుండేవారు కాదని చాలా మంది ప్రత్యర్థులు ఆ పదాన్ని ఉపయోగించారు.
2019లో నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్‌కు బిలావల్ చైర్మన్ అయ్యారు. మానవ హక్కులపై బిలావల్ ఆలోచనలు పీపీపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయని పీపీపీ సీనియర్ నాయకుడు రబ్‌నవాజ్ బలోచ్ చెప్పారు.
‘‘మతపరమైన మైనారిటీలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మీడియా స్వేచ్ఛ కోసం ఆయన మాట్లాడేవారు. మిలిటెన్సీని ఆయన బహిరంగంగా ఖండించేవారు. దీంతో యువతలో ఆయనకు ప్రజాదరణ పెరిగింది’’ అన్నారు.
2019 తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ పూర్తిగా తెరవెనక్కు వెళ్లిపోయారు. దీంతో పార్టీ బాధ్యతలను మొత్తంగా బిలావల్ తన భుజాలపై వేసుకున్నారు. పార్టీపై ఆయనకు మరింత పట్టు వచ్చింది.
ఎన్నికల ప్రచారంలోనూ బిలావల్ ప్రధాన పాత్ర పోషించారు. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) ఏర్పడటంలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించడంలో పీడీఎం విజయవంతమైంది.
విదేశాంగ మంత్రిగా పర్యటనలపై ప్రశంసలు, విమర్శలు
2022లో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి పదవి చేపట్టిన తర్వాత, రెండు డజన్లకుపైగా విదేశీ పర్యటనలు ఆయన చేశారు. భిన్న అంతర్జాతీయ వేదికలపై ఆయన పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు.
అయితే, ఈ విదేశీ పర్యటనలతో పాకిస్తాన్‌పై చాలా ఆర్థిక భారం పడుతోందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విమర్శలు చేస్తుంటుంది. ఈ పర్యటనల విషయంలో బిలావల్‌పై ప్రశంసలు కూడా కురుస్తుంటాయి.
విదేశాంగ మంత్రిగా బిలావల్ దూకుడు, వాక్చాతుర్యం తన తాతయ్య జుల్ఫికర్ అలీ భుట్టోను గుర్తు తెస్తుంటాయి. ఆయన కూడా 1960లలో విదేశాంగ మంత్రిగానే ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే, బిలావల్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని రాజకీయ నిపుణుడు జహీద్ హుస్సేన్ చెబుతున్నారు.
‘‘బిలావల్‌కు తన తాతయ్య తరహాలో అనుభవం, దౌత్యపరమైన చాకచక్యం లేవు. బిలావల్ తన ప్రతిభ ఏమిటో ఇంకా నిరూపించుకోలేదు’’ అని ఆయన అన్నారు.
‘‘బిలావల్ ఒకేసారి రెండు టోపీలు పెట్టుకుంటున్నారు. ఒకవైపు విదేశాంగ మంత్రిగా, మరోవైపు పీపీపీ అధిపతిగా కొనసాగుతున్నారు. దీని వల్ల విదేశాంగ విధానాలపై ఆయన పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు. నిజానికి విదేశాంగ మంత్రికి విదేశాంగ విధానమే తొలి ప్రాధాన్యం కావాలి. నేడు దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో విదేశాంగ మంత్రి మరింత ఎక్కువ దృష్టి పెట్టాలి’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో అనుబంధం ఏమిటి?
బిలావల్ భుట్టో జర్దారీ 2012లోనే దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీతో కలిసి భారత్‌కు వచ్చారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను వీరు సందర్శించారు. అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కూడా వీరు కలిశారు.
ఆ తర్వాత తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ బిలావల్ వరుస ట్వీట్లు చేశారు. ‘‘ప్రతి పాకిస్తానీలోనూ కాస్త భారతీయత, ప్రతి భారతీయుడిలోనూ కాస్త పాకిస్తానీయత కనిపిస్తుంది’’ అని ఆయన అన్నారు. భారతీయులు శాంతి, సామరస్యంలో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. దీనిపై భారత్ మీడియా ఆయనన్ను ప్రశించింది.
ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఆయన భారత్‌లో అడుగుపెడుతున్నారు. ఆయన వైఖరి గతం కంటే నేడు పూర్తి భిన్నంగా కనిపించొచ్చు. అదే సమయంలో భారత్ దీన్ని స్వీకరించే విధానంలోనూ మార్పులు ఉండొచ్చు.
ఇప్పటికే ద్వైపాక్షిక బంధాలు గాడి తప్పడంతో కాస్త ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో బిలావల్ కూడా పరిస్థితిని కాస్త జటిలం చేశారు. 2022 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
‘‘పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రం లాంటిది’’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నాడు వ్యాఖ్యానించారు. దీనిపై బిలావల్ మాట్లాడుతూ.. ‘‘మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒసామా బిన్ లాడెన్ చనిపోయారు. కానీ, గుజరాత్ అల్లర్ల ‘కసాయి’ భారత్‌కు ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు’’ అన్నారు.
బిలావల్ వ్యాఖ్యలపై భారత్‌లోని మోదీ మద్దతుదారుల నుంచి విపరీతమైన స్పందనలు వచ్చాయి. కొందరైతే బిలావల్ తలపై భారీ నజరానా కూడా ప్రకటించారు. కానీ, ఆ వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్ ప్రజల్లో ఆయన రేటింగ్ పేరిగింది. ఆ తర్వాత కూడా బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.
‘‘నేను వాస్తవాలను మాట్లాడాను. ఆ వ్యాఖ్యలు నేను ఒక్కడినే అంటున్నానని అనుకోవద్దు. ‘గుజరాత్ కసాయి’అనే పదాన్ని నేను కొత్తగా సృష్టించలేదు. చరిత్రలో ఏం జరిగిందో చెబితే, ఏదో వ్యక్తిగతంగా దాడి చేస్తున్నానని వారు అనుకుంటున్నారు’’ అని బిలావల్ వ్యాఖ్యానించారు.
చరిత్రను చూసుకుంటే భుట్టోల పీపీపీ భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తునట్లు కనిపిస్తుంది. కానీ, బిలావల్ తీరు చాలా మందికి కాస్త భిన్నంగా కనిపిస్తోంది.
‘‘భారత విదేశాంగ మంత్రి రెచ్చగొట్టి ఉండొచ్చు. కానీ, బిలావల్ మరీ అంత తీవ్రంగా స్పందించి ఉండాల్సింది కాదు’’ అని జాహిద్ హుస్సేన్ అన్నారు.
కుటుంబ పాలన
పాకిస్తాన్‌లో భుట్టో కుటుంబాన్ని భారత్‌లో గాంధీల కుటుంబంతో పోలుస్తుంటారు. ఈ రెండు కుటుంబాలకు మద్దతు పలికేవారితోపాటు విమర్శించేవారు కూడా ఉన్నారు.
‘‘వంశ పారంపర్య రాజకీయాలను మీరు విమర్శించొచ్చు. కానీ, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పాకిస్తాన్ ప్రజలే’’ అని గత ఏడాది సీసీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ వ్యాఖ్యానించారు.
1972లో ఇందిరా గాంధీతో కలిసి సిమ్లా ఒప్పందంపై బిలావల్ తాతయ్య జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు. బిలావల్ తల్లి 1989లో రాజీవ్ గాంధీకి ఇస్లామాబాద్‌లో ఆతిథ్యమిచ్చారు. దీంతో చాలా మంది రాజీవ్ గాంధీ, బిలావల్‌ల మధ్య పోలికలు చూస్తుంటారు. ఎందుకంటే వీరిద్దరూ తల్లి మరణం తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు.
మే 4న గోవాలో అడుగుపెట్టడంతో ఈ సారి భారత్ పర్యటనను బిలావల్ మొదలుపెడుతున్నారు. తనపై భారత్‌లో వ్యతిరేకత ఉందని, హెచ్చరికలు కూడా వస్తున్నాయని తెలిసినప్పుడు కావాలంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ను పంపించొచ్చు. కానీ, తానే నేరుగా రావాలని బిలావల్ నిర్ణయించుకున్నారు. దీన్ని కీలకమైన నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
గోవాలో రెండు దేశాల మధ్య దైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేకపోవచ్చు. అయితే, భారత నాయకులతో బిలావల్ ఎలా నడుచుకుంటారో ప్రజలు నిశితంగా గమనిస్తారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఉపయోగించే మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. భవిష్యత్ భారత్-పాకిస్తాన్ సంబంధాలను నిర్దేశించడంలో ఈ పర్యటన ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















