పుల్వామా దాడిపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ ఏమన్నారు? భారత్‌ను పాకిస్తాన్ ఎందుకు నిందిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది.
2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడి విషయంలో భారత ప్రభుత్వాన్ని సత్యపాల్ నిందించారు.
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి 'వ్యవస్థ అసమర్థత, నిర్లక్ష్యం' ఫలితమేనని శుక్రవారం ప్రసారమైన ఈ ఇంటర్వ్యూలో మాలిక్ ఆరోపించారు.
ఆ దాడికి సీఆర్‌పీఎఫ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆయన నిందించారు.
తమ సిబ్బందిని తరలించేందుకు విమానాలను సమకూర్చాలని సీఆర్‌పీఎఫ్ ప్రభుత్వాన్ని కోరిందని, అయితే హోం శాఖ అందుకు నిరాకరించిందని మాలిక్ చెప్పారు.
అప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు.
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో భారత ప్రభుత్వం సరైన భద్రతా తనిఖీలు చేయలేదని మాలిక్ ఆరోపించారు.
ఆ దాడికి నిఘా సంస్థల వైఫల్యమే కారణమని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ నుంచి 300 కిలోల ఆర్‌డీఎక్స్‌తో కూడిన ట్రక్కు 10 నుంచి 15 రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో తిరుగుతూనే ఉందని, దాని గురించి ఇంటెలిజెన్స్‌కు క్లూ ఎలా లభించలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే'
ఈ దాడి తర్వాత జిమ్ కార్బెట్ పార్క్ నుంచి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని సత్యపాల్ గుర్తుచేసుకున్నారు. ఈ సమస్యలను మోదీతో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ విషయంలో మౌనంగా ఉండాలని, ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దని ప్రధాని మోదీ కోరారని సత్యపాల్ తెలిపారు.
ఎన్‌ఎస్‌ఏ (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని మాలిక్ అన్నారు.
ఈ దాడికి పాకిస్తాన్‌ను నిందించడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను పొందడమే ప్రభుత్వ ఉద్దేశమని అప్పుడే తనకు అర్థమైందని ఈ ఇంటర్వ్యూలో మాలిక్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఏమంటోంది?
కాగా, పుల్వామా దాడిపై మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.
భారత్‌ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించడం, దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకురావడం భారత నాయకత్వానికి అలవాటని పాక్ ఆరోపణలు గుప్పించింది.
పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేరుతో ఆదివారం ఆ ప్రకటన విడుదలైంది.
''భారతీయ నాయకత్వం తనను తాను బాధిత దేశంగా చూపించుకోవడానికి, దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ ఎజెండాను ఎలా ప్రచారం చేస్తుందో ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ సమాజం తాజా విషయాలను గమనించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న తప్పుడు, మోసపూరిత ప్రచారంపై దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం.
తాజాగా వెల్లడైన విషయాలపై భారత్ సమాధానం చెప్పాలి. పుల్వామా దాడి తర్వాత ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగింది, దానికి భారత్ బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది.
భారత్ తప్పుడు కథనాలను పాకిస్తాన్ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. రెచ్చగొట్టే చర్యలను గట్టిగా, బాధ్యతాయుతంగా ఎదుర్కొంటుంది" అని పాకిస్తాన్ ఆ లేఖలో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














