పుల్వామా దాడి : మమ్మల్నిలా చదువుకోనివ్వండి - కశ్మీరీ విద్యార్థులు

భారత్‌లో బయట చదువుకుంటున్న చాలా మంది కశ్మీరీ విద్యార్థులకు పుణె ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.
పుల్వామా దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలు భయంతో వణికిపోతున్నారు.
దీంతో మహారాష్ట్రలో కశ్మీరీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి హలీమా ఖురేషీ పుణెలోని కొంతమంది కశ్మీరీ విద్యార్థులతో మాట్లాడారు.
ఒకరు చేసిన నేరానికి వేరేవారిపై దాడులు చేయడం న్యాయం కాదని.. అయమన్ అమీన్ అనే విద్యార్థి అభిప్రాయపడ్డారు.
అంతమంది జవాన్ల ప్రాణాలు కోల్పోయినందుకు మేమూ బాధపడుతున్నామని చెప్పారు.
"బాధ ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ ఒకరి నేరానికి వేరే ఎవరికో శిక్ష వేయడంలో సంతోషం ఏముంది. అది న్యాయం కూడా కాదు. కశ్మీరీ విద్యార్థులను మీరు ప్రశాంతంగా చదువుకోనిస్తేనేగా మంచి జరిగేది. మంచి విషయాలకు మద్దతిస్తే మంచే జరుగుతుంది" అని అమీన్ చెప్పారు.

దేశంలో ఎక్కడ ఎలా ఉన్నా పుణెలో మాత్రం తాము సురక్షితంగా ఉన్నామని ఇక్కడ చదువుతున్న పుణె విద్యార్థులు చెబుతున్నారు.
"పుల్వామాలో అలా జరగడం దురకృష్టకరం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బయటున్న కశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులను టార్గెట్ చేసుకుంటున్నారు. కశ్మీర్లో ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోవడంతో అందరూ పనుల కోసం బయటికి వెళ్తున్నారు. మాక్కూడా అలాగే జరుగుతుందేమో అని ఇక్కడ మేం కూడా చాలా భయపడ్డాం. మనసులో ఆ భయంతోనే బయిటికి వెళ్లాం. కానీ, మాకు అలాంటివేం జరగలేదు.

నర్గీస్ వనీ అనే మరో విద్యార్థిని కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరికీ తాము కశ్మీరీలమనే విషయం తెలిసినా ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదన్నారు.
"నేను బయటికి వెళ్లి సగం దార్లో నుంచే తిరిగొచ్చేశాను. ఈమె కశ్మీరీ అని తెలిస్తే నాపైన దాడి చేస్తారనుకున్నా. మా చెల్లి కూడా అక్కా మనం జిమ్‌కెళ్తే ట్రెడ్ మిల్ ఇస్తారా, ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మని చెబుతారేమో అంది. కానీ అలాంటిదేం లేదు, అందరూ మామూలుగానే ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కలవారికీ మేం కశ్మీరీలమని కూడా తెలుసు. కానీ ఎవరి ప్రవర్తనలో కూడా కాస్త కూడా మార్పు రాలేదు. కశ్మీర్ బయట ఎక్కడైనా ఉండాలనే అనుకుంటే, మేం పుణెలోనే ఉండాలని కోరుకుంటాం" అన్నారు నర్గీస్.

పుణెలో వాతావరణం దేశమంతా ఉంటే బాగుంటుందని ఇక్కడి కశ్మీరీ విద్యార్థులు కోరుకుంటున్నారు. తమను ప్రశాంతంగా చదువుకోనివ్వాలని అడుగుతున్నారు.
"పుణెలో ఉన్నట్లే అన్నిచోట్లా ఉండాలని మేం కోరుకుంటున్నాం. అప్పుడే విద్యార్థులు ఎక్కడైనా బాగా చదువుకోగలరు. చదువుకోడానికి వచ్చిన విద్యార్థులను చదువుకోనివ్వండి, వాళ్లు తమ పని పూర్తైతే తిరిగి వెళ్లిపోతారు" అని ఓవేస్ వని అనే కశ్మీరీ విద్యార్థి చెప్పారు.
ఇవి కూడా చదవండి
- పుల్వామా దాడి: చైనా మౌనం, పాకిస్తాన్ నేతల ఉద్రిక్త ప్రకటనలు
- #BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?
- 'మిలిటెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించిన కాంగ్రెస్' అనే ప్రచారంలో నిజమెంత...
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- పుల్వామా దాడి: పాకిస్తాన్‌ను దారికి తెచ్చే ఆ ‘మాస్టర్ స్ట్రోక్’ను మోదీ కొడతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









