వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
టోక్యో ఒలింపిక్స్ 2021 తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే, ఆ సమయంలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయనతో ఉన్న ప్రమాదం గురించి, తమల్ని బెదిరిస్తోన్న తీరును తాను ప్రధానికి వివరించామని చెప్పారు.
ఆందోళన చెందవద్దని, అధికారులతో మాట్లాడతానని ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత వారిని మందలించినట్లు చెప్పారు.
ఆ విషయం తెలిసి బ్రిజ్‌భూషణ్ అనుయాయులు తనకు ఫోన్ చేసి, ప్రధాని మోదీకి ఎలా ఫిర్యాదు చేస్తావంటూ బెదిరించేవారని వినేశ్ ఫోగట్ చెప్పారు.
ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై మరింత వివరణగా క్రీడా శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి లాంటి ఒక ఉన్నత స్థాయిలోని వ్యక్తితో మాట్లాడేటప్పుడు, కొన్ని విషయాలు చెప్పేందుకు బెరుకుగా ఫీలవుతామని తనకు అలాగే జరిగిందన్నారు.
కానీ, ప్రధానితో చెప్పలేని విషయాలను తాను క్రీడా మంత్రికి చెప్పినట్లు చెప్పారు. క్రీడా శాఖ మంత్రిని కలిసి ఇంటికి వెళ్లే లోపలే ఆ విషయాలన్ని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి తెలిసిపోయాయని తెలిపారు. దీంతో తాను షాక్‌కి గురైనట్లు చెప్పారు.
అయితే, క్రీడలు, క్రీడాకారులు తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకరని ఇటీవల క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేసినట్లు వినేశ్ చెప్పారు. ఈ విషయంలో అసలు రాజీపడేది లేదని మంత్రి అన్నారని తెలిపారు.
ఆందోళన చేస్తోన్న రెజ్లర్లను అనురాగ్ ఠాకూర్ కలిశారు. మంత్రి వారిని కలిసినప్పటికీ, నిరసనలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన వినేశ్, తన లైఫ్ కూడా ప్రమాదంలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ కమిటీలోని సభ్యులను కలిసేందుకు కూడా సవాలుగా మారిందని ఆమె తెలిపారు.
‘‘నాకు మరో విషయం అర్థం కావడం లేదు. కమిటీకి మేరీ కోమ్‌ను అధ్యక్షురాలిగా నియమించే ముందు, ఆమె అందుబాటులో ఉంటారో ఉండరో ఎందుకు అడగలేదు. ఆమె ఎప్పుడూ అందుబాటులో లేరు’’ అని వినేశ్ చెప్పారు.
అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు దగ్గర్లో ఉన్న సమయంలో, క్రీడాకారులు రోడ్లపైకి వచ్చి కూర్చుంటే.. ‘‘కనీసం వీటన్నింటి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? అన్నది మాకు తెలియదు. క్రీడల్లో అత్యంత ప్రతిభ చూపే వారందరం ప్రస్తుతం ఇక్కడ కూర్చుని ఉన్నాం.’’ అని వినేశ్ అన్నారు. ఒక వ్యక్తి అంత బలంగా ఎలా మారగలడు అని ఆమె ప్రశ్నించారు.
ఒకవైపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు రెజ్లర్లు దీనిపై అంతకుముందే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దీంతో పాటు, బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌తో రెజ్లర్లు కలిసి దిగిన ఫోటోలు మీడియాలో వస్తున్నాయి. ఈ ఫోటోలు వెలుగులోకి రావడంతో, వారి ఉద్దేశాలేంటి అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తూ వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లు, కోచ్‌లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. రెజ్లర్లు తనపై చేస్తోన్న ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొట్టిపారేస్తున్నారు.

‘ప్రధానమంత్రికి నేను కొన్ని విషయాలు చెప్పాను’
బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తోన్న నిరసనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో, దిల్లీ పోలీసులు ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు.
అయినప్పటికీ, రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, దిల్లీ పోలీసులు తనను ఇంకా సంప్రదించలేదని, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీబీసీ ప్రతినిధి అనంత్ ఝణాణేతో జరిపిన సంభాషణలో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర ప్రభుత్వంలోని ఏ కీలక మంత్రి కూడా ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.
‘‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను ప్రధాన మంత్రిని కలిశాను. నేను కొన్ని విషయాలను ఆయనకు చెప్పాను. ఆ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారని అన్నాను. కానీ లైంగిక వేధింపుల గురించి ప్రధానితో నేను ఓపెన్‌గా చెప్పలేదు. ఆ తర్వాత వారు నన్ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారు. మానసికంగా వేధింపులకు గురి చేశారు’’ అని వినేశ్ అన్నారు.
ప్రధానికి ఈ విషయాలు చెప్పినప్పుడు, ఆయన తనని ఆందోళన చెందవద్దని అన్నారని, తామున్నామని చెప్పినట్లు వినేశ్ తెలిపారు. ఎవరూ వేధించకుండా చూస్తామని భరోసా ఇచ్చారని అన్నారు.
’ఆ తర్వాత బ్రిజ్ భూషణ్‌ను ప్రధాని మందలించి ఉంటారు. అప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ మనుషులు ఫోన్‌లో మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు. ప్రధానికే చెబుతావా? ఎంత ధైర్యం? పెద్ద ప్లేయర్ అయిపోయానని అనుకుంటున్నావా? నీకు గుణపాఠం చెబుతాం అంటూ బెదిరించారు. 24 గంటల్లోపే మాకు క్రీడా మంత్రి నుంచి ఫోన్ వచ్చింది.
వచ్చి కలవాలని మాకు చెప్పారు. ఈ సమస్య ఏంటో చూడాలని క్రీడా మంత్రికి కచ్చితంగా ప్రధాని చెప్పి ఉంటారు. నేను వెళ్లి క్రీడా మంత్రిని కలిశాను. అన్ని విషయాలను సమగ్రంగా వివరించాను. ప్రధానికి చెప్పని విషయాలనూ క్రీడామంత్రికి చెప్పాను. కానీ, ఈ విషయాలన్ని మంత్రి నుంచి బయటికి వచ్చాయి. ఆ సమయంలో చాలా షాక్‌కి గురయ్యా. ఎవర్ని నమ్మకూడదని భావించా’ అని వినేశ్ ఫోగట్ చెప్పారు.
రెజ్లర్ల ధర్నాపై ప్రధానాంశాలు
- పతకాలు పొంది దేశానికి పేరు తెచ్చిన రెజ్లర్లు ప్రస్తుతం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చున్నారు.
- వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మలిక్ నేతృత్వంలో ఈ నిరసన జరుగుతోంది.
- ఈ నిరసనలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వారు లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తున్నారు.
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు.
- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసి మూడు నెలలు కావొస్తున్నా, ఇంకా తమకు ఎలాంటి న్యాయం దక్కలేదని రెజ్లర్లు చెప్పారు.
- దీంతో మరోసారి ధర్నాకు దిగాలని నిర్ణయించినట్లు తెలిపారు.

లైఫ్ కూడా ప్రమాదంలో...
తన జీవితం ప్రమాదంలో ఉన్నట్లు వినేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఒకవేళ ఆయన(బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్) బయట ఉంటే, మేమెలా రెజ్లింగ్ ఆడగలం. మేం మా బాధను తెలిపాం. అలా తెలపకూడదా? మా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్ చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన స్థానంలో ఒక సాధారణమైన వ్యక్తి ఉండుంటే, ఇప్పటికి ఆయన్ని అరెస్ట్ చేసేవారా? లేదా?’’ అని వినేశ్ ప్రశ్నించారు.
రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంది. రెజ్లర్లు తమ నిరసన తెలియజేస్తోన్న ప్రాంతం చుట్టూ పోలీసు బారికేడ్ పెట్టారు. బారికేడ్ దాటి లోపలికి వెళ్లే సామాన్య ప్రజల్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వారి బ్యాగ్‌లను సునిశితంగా పరిశీలిస్తున్నారు.
ధర్నాలో కూర్చునేందుకు ఉపయోగించే తివాచీలను రోడ్డు ప్లాట్‌ఫామ్‌పైనే పెడుతున్నారు. దీంతో కొన్నిసార్లు తెలిసి తెలియకుండానే కొందరు వీటిపై నుంచి షూ, చెప్పులతో నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఎండైనా, వాన అయినా, దోమలు కుడుతున్నా.. రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ధర్నా చేస్తోన్న ప్రాంతంలో కరెంట్ సరిగ్గా లేకపోవడంతో, చాలా మంది తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
నిరసనలు కొనసాగుతున్నప్పటికీ, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు.
‘‘నేనెలాంటి అన్యాయం, తప్పుడుగా ప్రవర్తించలేదు. ఎవరిని నేను వేధించలేదు. నా ఫ్యామిలీ పిల్లలాగానే వారిని చూశాను. వారికి ఎంతో ప్రేమను పంచాను, గౌరవాన్ని ఇచ్చాను. ఇది మా దురదృష్టం. అదే ప్రేమ, గౌరవం ఇప్పుడు మా మెడకు చుట్టుకుంది’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బీబీసీతో అన్నారు.
పోక్సో కేసు నమోదైనప్పటికీ ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని అడిగితే, దాన్ని దిల్లీ పోలీసులనే అడగాలని బ్రిజ్ భూషణ్ చెప్పారు.
ఇది తమ పార్టీకి ఎలాంటి హాని చేయదని, తన గౌరవానికి ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.

నిరసనలకు ఇతరుల మద్దతు
‘‘ఎందుకు వారు ఇంతకాలం అభియోగాలు మోపలేదు? ఎందుకు రెజ్లర్లు విచారణ కోసం ఆగడం లేదు. ఎందుకు వారు ధర్నా చేస్తున్నారు? దిల్లీ పోలీసులను వారు నమ్మడం లేదా? నా రాజీనామా దిల్లీకి సాయం చేస్తుందా? అక్కడితో పోలీసు విచారణ ఆగిపోతుందా? జ్యూడిషియరీ కంటే మనం పెద్దవాళ్లమా? నేరస్తుడిగా నేను రాజీనామా చేయను’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు నిరసన ప్రాంతానికి వస్తూ.. రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్నారు.
తుగ్లకబాద్‌కి చెందిన సానియా కబడ్డి క్రీడాకారిణి. తాను కూడా వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపారు. సానియా మూడేళ్లుగా కబడ్డి ఆడుతున్నారు.
‘‘తొలుత కబడ్డి నా హాబీగా ఉండేది. ఇప్పుడు నేను దీన్ని ఆడాలనుకుంటున్నాను. కబడ్డిలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అయితే, ఈ రోజు వారికి జరిగింది, రేపు మనకీ జరగొచ్చు. అమ్మాయిలందరూ వచ్చి, ఇక్కడ కూర్చుని వారికి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చాను, రేపు నేను నా టీమ్ మొత్తాన్ని తీసుకొస్తాను’’ అని సానియా చెప్పారు.
దిల్లీ కరోల్ బాగ్‌కి చెందిన రాహుల్ బిల్వారా కూడా తన ఆరేళ్ల కూతురితో కలిసి నిరసన వద్దకు వచ్చారు.
15 నుంచి 20 ఏళ్లుగా రెజ్లర్ బజరంగ్ పునియా గురించి తెలిసిన ఇమ్రాన్ క్లెర్ కూడా స్పందించారు.
‘‘ఆయనను మేము దేవుడిగా కొలుస్తాం. రాష్ట్ర స్థాయిలో మెడల్ తీసుకొచ్చినప్పుడే మేము ఆయన్ని ఒక గొప్ప రెజ్లర్‌గా భావించాం. ఇప్పుడు ఆయన ఒలింపిక్ విజేత. ఈ పిల్లల బాధలను వినాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. వారు చాలా పెద్ద సెలబ్రిటీలు. సెలబ్రిటీలుగా చెప్పుకుంటోన్న వాళ్ల పిల్లలు ఎవరైనా వీళ్లలా దేశం కోసం పతాకం తీసుకొచ్చారా? ’’ అని ఇమ్రాన్ క్లెర్ ప్రశ్నించారు.
తనకు నిస్సహాయురాలిననే భావన వస్తున్నట్లు వినేశ్ బాధపడ్డారు. క్రీడలను రాజకీయాలు అధిగమిస్తున్నట్లు ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














