తమిళనాడు: సెంగలిపురం ప్రభుత్వ పాఠశాలలో చేరితే బంగారు నాణెం.. ఈ ఆఫర్ ఎందుకు?

- రచయిత, బి. సుదాగర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ స్కూల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచడానికి బంగారు నాణెం, ఇతర బహుమతులు అందజేయాలని నిర్ణయించింది.
కరోనావైరస్ మహమ్మారి కాలంలో తమిళనాడు అంతటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రవేశాల సంఖ్య పెరగడంతో కొన్ని పాఠశాలల్లో కూర్చోవడానికి చోటు కూడా సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
కోవిడ్ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గింది. దీంతో తమిళనాడులో పలు చోట్ల ఒక్కో విద్యార్థికి రూ.1,000, సైకిల్, క్రీడా పరికరాలు అందజేసి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి విద్యార్థుల అడ్మిషన్లను పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు సెంగలిపురం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల మరో అడుగు ముందుకు వేసింది.
విద్యార్థుల అడ్మిషన్లకు ప్రకటన
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కుడవాసల్ యూనియన్ పరిధిలోని సెంగాలిపురం గ్రామంలో 4,000 మంది నివసిస్తున్నారు.
వారి వృత్తి వ్యవసాయం. చాలా మంది వ్యవసాయ కూలీలు.
సెంగలిపురం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొత్తగా చేరిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం నిర్ణయించింది.
పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా ఒక గ్రాము బంగారు నాణెం, ఇతర బహుమతులు అందజేస్తామని సెంగాలిపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. ఈ విషయమై ఓ కరపత్రం ప్రచురించి, పంచిపెట్టారు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ఉచిత వ్యాన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థుల కోసం మంచి మౌలిక సదుపాయాలు, సుశిక్షితులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు.
విద్యార్థులకు 14 రకాల ఉచిత ప్రభుత్వ సంక్షేమ సహాయం, బాలికలకు విద్యా ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యం తదితర అంశాలను ఆ కరపత్రంలో హైలైట్ చేస్తూ ప్రచురించారు.
"మీ ప్రేమ బంగారాన్ని అందిస్తుంది! మీరు బంగారు నాణెం గెలుస్తారు!" అనే కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తూ విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు ఇందిర కృషి చేస్తున్నారు.

పాఠశాలకు అవార్డులు
సెంగలింగపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2008లో జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును గెలుచుకుంది. కర్మవీరర్ కామరాజ్ అవార్డుతో పాటు రూ.25,000, పేరెంట్ టీచర్ అసోసియేషన్ అవార్డుతో పాటు రూ.50,000 అందుకుంది.
అవార్డు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
గత నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో అకడమిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
ఇందులో ఏటా ఫిబ్రవరిలో పాఠశాలకు కావాల్సిన సామగ్రిని గ్రామ ప్రజలు కొనుగోలు చేసి, వేడుకలు నిర్వహించి అందజేస్తారు.
ఈ పాఠశాలకు నాలుగేళ్లలో ఇప్పటివరకు రూ.2 లక్షల విలువైన సామగ్రి అందించారు గ్రామస్థులు.
ఓ 20 మంది కలిసి పాఠశాలకు రూ.20 వేలు డొనేషన్‌గా అందజేశారు.
ఏటా నిర్వహించే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆ డిపాజిట్ ద్వారా వచ్చిన వడ్డీతో బహుమతులు కొనుగోలు చేసి, అందజేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
తాను 2008 నుంచి ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నానని ఇందిర బీబీసీతో చెప్పారు. తనతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు.
తమిళ మాధ్యమంలో 50 మంది విద్యార్థులు, ఆంగ్ల మాధ్యమంలో 92 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.

విద్యార్థుల అడ్మిషన్లను పెంచే కార్యక్రమం
ఈ పాఠశాలలో ప్రతి ఏడాది అడ్మిషన్లను పెంచేందుకు విద్యార్థుల నమోదు అవగాహన ర్యాలీ, విద్యార్థుల పరిచయాలు, సెలవు తీసుకోని విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ ఏడాది పాఠశాలలో చేరబోయే విద్యార్థులందరికీ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
''ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల నమోదు తక్కువగా ఉంటోంది. నిరుడు 152 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది 142 మంది మాత్రమే ఉన్నారు. వచ్చే ఏడాది విద్యార్థుల నమోదును పెంచేందుకు బహుమతులు అందజేస్తాం'' అని ఇందిర చెప్పారు.
పుస్తకాలు, నోట్లు, యూనిఫారాలు సహా 14 వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని ఇందిర చెప్పారు.
"ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం కాబట్టి ఇది మాది. మేం అందరం కలిసి విద్యార్థుల నమోదును పెంచడానికి కృషి చేస్తున్నాం. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 75 మంది విద్యార్థులను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని తెలిపారు.
ఈ విద్యాసంవత్సరంలో సెంగలిపురం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో చేరే విద్యార్థులలో ఒకరికి ఒక గ్రాము బంగారు నాణెం, మిగిలిన వారికి రూ.250 విలువైన ఇతర బహుమతులు అందజేస్తామని ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు.
ఆ గ్రాము బంగారాన్ని ప్రధానోపాధ్యాయులు, మిగతా బహుమతులను పాఠశాలలోని ఐదుగురు ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో ఇవ్వనున్నట్లు చెప్పారు.

పిల్లలను వాహనంలో తీసుకెళ్లాలని కోరిన తల్లిదండ్రులు
ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అప్పులు చేసి చదివించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
చదువుకోవడానికి చిన్నపిల్లలు కిలోమీటరున్నర నడిచి రావాల్సి వస్తోందని, తమ పిల్లలను వాహనంలో తీసుకెళ్లాలని పేరెంట్స్ కోరారు.
ప్రధానోపాధ్యాయులు ఇందిర మాట్లాడుతూ.. ''ఈ ఏడాది వారి కోరికను నెరవేర్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల సాయంతో వ్యాన్ కొనుగోలు చేయనున్నాం. అన్నవాసల్, పుదుకుడితో పాటు సమీపంలోని కొన్ని పట్టణాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురాబోతున్నాం'' అని చెప్పారు.
వికలాంగ విద్యార్థులపై తాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, వారు చదువుకునేలా ప్రోత్సహిస్తామని ఇందిర తెలిపారు.
పాఠశాలలో విద్యార్థులకు 2017 నుంచి 2020 వరకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అల్పాహారం అందించారు.
ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమం వస్తోంది. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి కావాల్సినవి అందజేస్తున్నామని ఇందిర తెలిపారు.
‘‘బహుమతులు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా, గ్రామ ప్రజలతో ఉపాధ్యాయులు మాట్లాడి పాఠశాల అభివృద్ధి కోసం చేయగలిగినంత చేస్తున్నాం. బహుమతులు ఇవ్వడం వల్ల విద్యార్థుల నమోదు పెరిగింది’’ అని ఇందిర అంటున్నారు.
అప్పుల భారం తగ్గించుకునేలా తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా పాఠశాల కృషి చేస్తోందని తెలిపారు.
ప్రాథమిక విద్య మంచి జీవితానికి నాంది అవుతుందని, అందుకే పాఠశాలలో ప్రవేశానికి ప్రాధాన్యమిస్తూ బహుమతులు అందజేస్తున్నామని ఇందిర చెప్పారు.

పాఠశాల గురించి తల్లిదండ్రులు ఏమంటున్నారు?
ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తల్లి గీత బీబీసీతో మాట్లాడుతూ.. "పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించి నీటి సౌకర్యం కల్పించారు. ప్రైవేటు పాఠశాలల కంటే ఎక్కువగా పోటీలు, పండుగలు నిర్వహిస్తున్నారు. మా పిల్లలను ఉత్సాహపరుస్తూ బహుమతులు ఇస్తున్నారు.
మేం వ్యవసాయ కూలీ పనులకు వెళుతున్నాం. మా పిల్లలకు ఉదయం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు.
మా పిల్లలు ఇంగ్లీషు బాగా మాట్లాడటం, రాయడం చూస్తుంటే గర్వంగా ఉంది. తల్లిదండ్రులుగా మేం కూడా పాఠశాల కోసం మా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తాం.
విద్యార్థులకు బహుమతులు ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనివల్ల విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది'' అన్నారు.
''కుడవాసల్ జిల్లాలో 92 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో 5,872 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుడవాసల్ ఏరియాలోని సెంగలిపురం ప్రాథమిక పాఠశాలలోనే అత్యధికంగా (142 మంది) విద్యార్థులు ఉన్నారు’’ అని కుడవాసల్ జిల్లా విద్యాశాఖాధికారి జయలక్ష్మి వెల్లడించారు.
సమీపంలోని అన్నవాసల్, తిరుమంగళం తదితర పట్టణాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 25లోపే ఉందని తెలిపారు.
ఈ పాఠశాలలో తమిళం, ఇంగ్లిష్ మాధ్యమాల్లో విద్యను బోధించడం వల్ల విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉందన్నారు జయలక్ష్మి.
నిజానికి ఇక్కడ ప్రిన్సిపాల్ కాకుండా మరో నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో అక్కడికి మరో టీచర్‌ను కేటాయించామన్నారు.
ఇపుడు మొత్తం పాఠశాల స్టాఫ్ సంఖ్య ఏడుకు చేరిందని ఆమె చెప్పారు.
''కూడవాసల్ ప్రాంతంలో విద్యార్థులు బడి మానేయడాన్ని పూర్తిగా తగ్గించాం. ఒక విద్యార్థి చదువు మానేస్తే, ఆ స్టూడెంట్ సమస్యపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటే, తనకు 'నిర్బంధ ప్రాథమిక విద్య'ను అందించే అవకాశం కలుగుతుంది'' అని జయలక్ష్మి తెలిపారు.

బహుమతులపై విద్యావేత్తలు ఏమంటున్నారు?
''ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచేస్తున్నారని విద్యాశాఖాధికారులు అపోహ పడుతున్నారు. విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ఎలాగైనా పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించాలని వాళ్లు యోచిస్తున్నారు. ఐఏఎస్ అధికారులకు విద్యపై పూర్తి అవగాహన అవసరం'' అని విద్యావేత్త ప్రిన్స్ గజేంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం గురించి చెబుతుంది. ఆర్టికల్ 21 స్వేచ్ఛా జీవితం గురించి తెలియజేస్తుంది. ఇది గౌరవప్రదమైన జీవితానికి హామీగా జీవనోపాధి హక్కు గురించి మాట్లాడుతుంది. అలాంటి మంచి విద్యను పిల్లలకు అందించాలి'' అని అన్నారు.
కొన్ని పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా, మరికొన్నింటిని ప్రత్యేక పాఠశాలలుగా వర్గీకరించారని, అలాంటప్పుడు అందరికీ సమానమైన విద్య ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.
“తల్లిదండ్రులను ఆకర్షిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి బహుమతులు ఇవ్వడం విద్యాభివృద్ధికి ఉపయోగపడదు. విద్యారంగం అభివృద్ధి చెందాలంటే పాఠశాల విద్యాశాఖకు ప్రతి తరగతికి ఒక టీచర్, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.పీఈటీ , క్రీడా పరికరాలు కావాలి, బహుమతులు కాదు’’ అని గజేంద్రబాబు అభిప్రాయపడ్డారు.
''5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలు అక్షరాస్యత కోసం కాకుండా ఆడుతూ, పాడుతూ పాఠశాలకు రావాలి. పిల్లలను ఆకర్షించాలనుకుంటే సౌకర్యవంతమైన ప్లేగ్రౌండ్ నిర్మించండి. పాఠాలు చెప్పండి. అంతేకాకుండా విద్యార్థులు సంతోషంగా ఆడుకోవచ్చనే భరోసా టీచర్స్ ఇవ్వాలి. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు ఎక్కువగా బోధనపై దృష్టిపెడతారు. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా బలవంతంగా పాఠాలు చెప్పి, ప్రభుత్వం కోరే సమాచారం పంపుతున్నారు. ప్రతి ఉద్యోగానికి పర్మినెంట్ సిబ్బందిని నియమించి ఉపాధ్యాయులు బాగా పనిచేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి'' అని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
- అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య: వారిని కాల్చి చంపిన నిందితుల నేర చరిత్ర ఏమిటి?
- లూసిడ్ డ్రీమింగ్ : మనం కోరుకున్న కలలు కనొచ్చా? ఎలా?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- 'సైన్స్ ఆఫ్ మనీ': డబ్బును అర్థం చేసుకుంటే సగం కష్టాలు తగ్గినట్టే... ఎలాగంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














