తంజావూరు పెరియ కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ, వీటిలో ‘‘తంజావూరు పెరియా కోవిల్’’ చాలా ప్రత్యేకమైనది. దీని చుట్టూ చాలా కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.

భారత్‌లో అత్యధిక దేవాలయాలున్నది తమిళనాడులోనే. దేశంలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాల పేర్ల చెప్పమని అడిగితే, కళ్లకురిచిలోని తిరువరంగం, మదురైలోని మీనాక్షి అమ్మన్, దారాసురామ్‌లోని ఐరావదేశ్వరార్, రామేశ్వరంలోని రామనాథస్వామి, తంజావూరులోని పెరువుడయార్ దేవాలయం ఆ జాబితాలో తప్పకుండా ఉంటాయి.

వీటిలో తంజావూర్ పెరువుడయార్ దేవాలయం మరింత ప్రత్యేకమైనది. వెయ్యేళ్లనాటి ఈ గుడి అతిపెద్ద గోపురమున్న దేవాలయాల్లో ఒకటి.

క్రీ.శ. 850లో ముథరయ్య రాజును ఓడించి విజయాలయ.. చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయనే చోళ రాజ్యానికి తంజావూరును రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత 176 ఏళ్ల వరకూ ఇది చోళ రాజధానిగానే కొనసాగింది.

ఆ 176 ఏళ్లలో చాలా దేవాలయాలను, కట్టడాలను నిర్మించారు. క్రీ.శ. 1218లో తంజావూరుపై మారవర్మన్ సుందరపాండ్యన్ దండెత్తారు. చోళ ప్రధాన భవంతులతోపాటు మొత్తం నగరాన్ని ఆయన ధ్వంసంచేశారు.

కానీ, కొన్ని దేవాలయాలు మాత్రం ఆ దాడులను తట్టుకొని మనుగడ సాగించాయి. ఆ తర్వాత దిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్లీ తరఫున దక్షిణాదిపై దండయాత్రకు వచ్చిన మాలిక్ కాఫర్ కూడా తంజావూర్‌పై దాడి చేశారు. అప్పుడు కూడా పెరువుడయార్ దేవాలయం దాడులను తట్టుకొని నిలబడగలిగింది.

తంజావూరులో చోళ సామ్రాజ్యం ఏర్పడకముందే, ఇక్కడ తళిక్కులత్తు మహదేవ దేవాలయం, బ్రహ్మకుట్టం దేవాలయం ఉండేవి. అయితే, ఈ ప్రాంతాన్ని విజయాలయ చోళ తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ నీసుంబసూదని దేవతకు మొదట గుడి కట్టించారు.

రాజరాజ చోళ అధికారంలోకి వచ్చిన తర్వాత, చోళనాడు సిరిసంపదలతో విరాజిల్లింది. కాంచీపురంలో రాజసింహం పల్లవ నిర్మించిన కైలాసనాథర్ దేవాలయం రాజరాజ చోళను చాలా ఆకట్టుకుందని, తంజావూరులోనూ ఇలాంటి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన అనుకున్నారని కుడావాయిల్ బాలసుబ్రహ్మణియన్ తన పుస్తకం ‘‘రాజరాజేచరం’’లో రాశారు.

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

ఆ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?

తంజావూర్ పెరువుడయార్ దేవాలయాన్ని రాజరాజ చోళ నిర్మించారని వందల ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండానే పోయింది. దీంతో ఈ దేవాలయం చుట్టూ ఎన్నో కథలు అల్లుకున్నాయి. కలలో ఓ దేవాలయాన్ని చూసిన తర్వాత, ఇక్కడ గుడి కట్టాలని చోళులు భావించారని కొందరు, అడవిని చదునుచేసి ఈ దేవాలయాన్ని కట్టారని మరికొందరు కథలుగా చెప్పుకునేవారు.

అయితే, 1866లో ఇక్కడ భారత పురావస్తు శాఖ కింద పురావస్తు అధ్యయన విభాగం మొదలైంది. ఈ విభాగానికి అధిపతి (చీఫ్ ఎపిగ్రాఫర్)గా జర్మనీకి చెందిన యూజిన్ జూలియన్ థియోడోర్ హాల్ట్స్ నియమితులయ్యారు.

దక్షిణ భారతంలో బయటపడిన చాలా శిలా శాసనాలు, పురావస్తు ఆధారాలను ఆయన అధ్యయనం చేశారు. అశోకుడి శిలా శాసనాలతోపాటు తంజావూరులోని పెరువుడయార్‌లోని శాసనాలను కూడా ఆయన చదవగలిగారు.

అప్పుడే తంజావూరులోని పెరువుడయార్ దేవాలయాన్ని రాజరాజ చోళ కట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మద్రాసు ప్రావిన్స్.. చీఫ్ ఎపిగ్రాఫర్‌గా వళయాత్తుర్ వెంకయ్యను నియమించింది. ఆయన దక్షిణ భారత దేశంలోని శాసనాలపై ఒక పుస్తకం రాశారు. దీనిలో పెరువుడయార్ దేవాలయం గురించి సుదీర్ఘంగా వివరించారు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ కట్టించారని ఆయన స్పష్టంగా రాశారు.

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

క్రీ.శ. 985లో ఉత్తమచోళ మరణానంతరం రాజరాజ చోళ అధికారంలోకి వచ్చారు. అప్పట్లో తంజావూరులో శాంతి విలసిల్లేది. అదే సమయంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించాలని రాజరాజ చోళ భావించారు.

ఈ దేవాలయానికి ప్రధాన శిల్పిగా వీరచోళ కుంజరమల్లనాన రాజరాజ పెరుంధచ్చన్‌ను నియమించారు. ఆయనతోపాటు నిత్తవినోధ పెరుంధచ్చన్, కండరాదిత పెరుధంచ్చన్ కలిసి పనిచేశారు.

తంజావూరు పర్వతాలేమీ లేకుండా సమతలంగా ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయానికి కావాల్సిన రాళ్లను ఎక్కడి నుంచి తీసుకురావాలనే ప్రశ్న ఉత్పన్నం అయింది.

‘‘పుదుకొట్టై జిల్లాలోని కున్నాండర్ ప్రాంతంలోని కొండల నుంచి నల్ల రాళ్లను తెప్పించి ఉండొచ్చు. తంజావూరు నైరుతి ప్రాంతం మినహా అన్నీ వైపులా నదులు కనిపిస్తాయి. అందుకే పెద్ద బండరాళ్లను నైరుతి నుంచి మాత్రమే తీసుకురావడం సాధ్యం. తంజావూరుకు సమీపంలో బండరాళ్లు దొరికే ప్రాంతం కున్నాండర్’’ అని బాలసుబ్రహ్మణియన్ తన పుస్తకంలో రాశారు. ఆయన చెబుతున్న ప్రాంతం తంజావూరుకు 75 కి.మీ.ల దూరంలో ఉంటుంది.

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

పెరువుడయార్ దేవాలయం ప్రవేశమార్గాన్ని ‘‘కేరళందగన్ తిరువాయిల్’’గా పిలుస్తారు. ఈ ప్రవేశ మార్గంపై ఐదంతస్తుల గోపురం కనిపిస్తుంది. దీనికి ముందుగా దక్షిణ భారత దేశంలో ఇంత పెద్ద గోపురాలను నిర్మించినట్లు ఆధారాలు లేవు.

ఆ ద్వారం గుండా లోపలకు వెళ్తే ‘‘రాజరాజన్ తిరు ద్వారం’’ కనిపిస్తుంది. దీనిపై కూడా ఒక గోపురం ఉంటుంది. కానీ, ఇది తొలి గోపురం కంటే కాస్త చిన్నగా కనిపిస్తుంది. ఈ ద్వారానికి వెలుపల పెద్ద ద్వార పాలకుల శిల్పాలు కనిపిస్తాయి. ఇలాంటివి మరో నాలుగు ద్వారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిలో రెండు దక్షిణం దశగా, ఒకటి ఉత్తరం దిశగా, మరొకటి పశ్చిమం దిశగా కనిపిస్తాయి.

రాజరాజ చోళ ఉత్తర ద్వారం నుంచి దేవాలయానికి వచ్చేవారని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ దేవాలయానికి నాలుగు వైపులా భారీ గోడలు కనిపిస్తాయి. మధ్యలో పెరువుడయార్‌తోపాటు కొన్ని చిన్న చిన్న ఆలయాలు మనకు కనిపిస్తాయి.

లోపలుండే మండపాలను ‘‘తిరుచ్చుట్రు మాలిగై’’గా పిలుస్తారు. మొత్తంగా లోపల 36 దేవాలయాలు ఉంటాయి.

దేవాలయ ప్రాంగణంలోనే దేవతలకు కూడా విడిగా గుడులను కట్టే సంప్రదాయం కూడా ఇక్కడి నుంచే మొదలై ఉండొచ్చని బాలసుబ్రహ్మణియన్ తన పుస్తకంలో రాశారు.

తంజావూరు దేవాలయంలోని ప్రధాన గోపురం నిర్మాణ శైలి తమిళనాడులోని దేవాలయ శిల్ప కళకు అద్దం పడుతుంది. ఈ గోపురం కిందే గర్భగుడి ఉంటుంది.

గోపురం పైభాగంలో గుండ్రని ఒక నిర్మాణం కనిపిస్తుంది. దీని చుట్టూ చోళ, నాయక రాజుల కాలంనాటి శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడే శివుడు నాట్యం చేస్తున్న శిల్పం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ గోపురం 13 అంతస్తుల్లో ఉంటుంది. నేల నుంచి 60.4 మీటర్ల ఎత్తు వరకూ ఇది కనిపిస్తుంది

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

ఆ రాయి బరువు 80 టన్నులు ఉంటుందా?

తంజావూరు దేవాలయం ప్రధాన గోపురంపై కనిపించే గుండ్రని నిర్మాణం బరువు 80 టన్నులని, దీన్ని అళగి గా పిలిచే ఓ మహిళ దేవాలయానికి బహుమతిగా ఇచ్చారని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి.

అయితే, ఈ వాదనలో నిజంలేదని బాలసుబ్రహ్మణియన్ స్పష్టంచేశారు. ‘‘మేం పైవరకు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాం. ఇదేమీ ఒక రాయి కాదు. చిన్నచిన్న రాళ్లతో ఈ గుండ్రని రాతి నిర్మాణం కట్టారు’’ అని తన పుస్తకంలో ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ గోపురాన్ని ఎలా నిర్మించారో స్పష్టంగా చెప్పే శాసనాలేవీ అందుబాటులోలేవు.

సారప్పళ్లం అనే పట్టణంలో ఈ దేవాలయం పైకప్పుకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయని, వీటిని అక్కడి నుంచి తీసుకొచ్చి పైకి తీసుకెళ్లారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.

అయితే, ఈజిప్టులో పిరమిడ్ల నిర్మాణంలో ఉపయోగించినట్లే ఇక్కడ కూడా ‘స్పైరల్ ర్యాంప్’ను ఉపయోగించి గోపురాన్ని నిర్మించి ఉండొచ్చని బాలసుబ్రహ్మణియన్ అభిప్రాయపడ్డారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ర్యాంప్‌ను తొలగించి ఉండొచ్చని చెప్పారు.

మరోవైపు పైకప్పు నీడ నేలపై పడదని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే, మీరు దేవాలయం దగ్గరకు వెళ్లి చూస్తే అది తప్పని తెలుస్తుంది.

పెరువాడయార్ దేవాలయం ముందుండే నంది రోజురోజుకూ పెరుగుతుందని కూడా చెబుతుంటారు. కానీ, దీనిలో కూడా నిజంలేదు.

నిజానికి ఈ నందిని దేవాలయం నిర్మించిన తర్వాతే ఇక్కడ ప్రతిష్టించారు. రాజరాజ కాలంలో నిర్మించిన నంది ప్రస్తుతం ‘‘తిరుచుట్టు’’లో కనిపిస్తుంది.

తంజావూరు పెరియా కోవిల్

ఫొటో సోర్స్, KALANIDHI

ఎంతో అందంగా..

రాజరాజ చోళ సోదరి కుందవై తన తండ్రి సుందర చోళ, తల్లి వనవన్ మాధవి విగ్రహాలను గుడిలో పెట్టినట్లు ఒక శాసనం చెబుతోంది. ప్రస్తుతం ఆ విగ్రహాలు మనకు లోపల కనిపించవు.

రాజరాజ చోళ, ఆయన భార్య లోగామదేవిలు బతికుండగానే వారి కంచు విగ్రహాలను గుడిలో పెట్టినట్లు కూడా శాసనాలు చెబుతున్నాయి. అయితే, 20వ శతాబ్దంలో అవి ఇక్కడి నుంచి మాయమయ్యాయి.

దక్షిణంవైపు ప్రవేశ ద్వారానికి మెట్ల దగ్గర కూడా రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ విగ్రహాలు కనిపిస్తాయి.

తంజావూరు దేవాలయం భారత్‌లోని అతిగొప్ప దేవాలయాల్లో ఒకటి. దీనిలో ఎంతో అందమైన శిల్పాలు కనిపిస్తాయి. అంతేకాదు అద్భుతమైన పెయింటింగ్స్ కూడా ఉంటాయి.

రాజరాజ చోళ కాలంలో ఈ దేవాలయం మొత్తం బహుశా పెయింటింగ్స్‌తో నిండి ఉండొచ్చు. ప్రస్తుతం ఇవి ప్రధాన దేవాలయం లోపల మాత్రమే కనిపిస్తున్నాయి.

తంజావూరు నాయక రాజులు చేతికి వచ్చినప్పుడు, చోళ పెయింటింగ్స్‌ స్థానంలో వారు తమ కొత్త పెయింటిగ్స్ వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అవి కూడా ధ్వంసమయ్యాయి. చోళుల కాలం నాటి పెయింటింగ్స్‌కు మళ్లీ జీవం పోసేందుకు పురావస్తు విభాగం ప్రత్యేక ప్రాజెక్టు కూడా చేపట్టింది.

ఈ దేవాలయం నిర్మాణ శైలి అద్భుతంగా అనిపిస్తుంది. దీనిలోని రాళ్ల మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చక్కగా అమర్చారు. పైనుండి పడే విపరీత ఒత్తిడిని తట్టుకునేలా వాటిని సిద్ధంచేశారు.

అయితే, గర్భగృహంలో కనిపించే లింగాకారాన్ని ముందు పెట్టిన తర్వాతే, చుట్టుపక్కల గోడలను నిర్మించి ఉండొచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ప్రధాన దేవాలయం చుట్టుపక్కల గోడలు, బయట కనిపిస్తున్న కొన్ని కట్టడాలను నాయక రాజుల హయాంలో నిర్మించారు.

వీడియో క్యాప్షన్, ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)