హైదరాబాదులో చదివిన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా జో బైడెన్ ఎందుకు ఎంచుకున్నారు?

అజయ్ బంగా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజయ్ బంగా
    • రచయిత, మిచెల్ ఫ్లూరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాస్టర్‌కార్డ్ సంస్థ మాజీ అధిపతి అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తక్కువ ఆదాయ దేశాలు రుణాలను అధిగమించేందుకు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రపంచ బ్యాంకు సహయం అందిస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు. ఈ పదవిని పొందిన తొలి ఇండియన్-అమెరికన్ ఈయనే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో డేవిడ్ మాల్‌పాస్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వాతావరణ మార్పుల విషయంలో ఆయన వైఖరిపై వివాదాలు నెలకొనడంపై అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.

మాల్‌పాస్ స్థానంలో అజయ్ బంగా జూన్ 2 నుంచి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి పదవీ కాలం అయిదేళ్లు.

అజయ్ బంగా భారతదేశంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ఆర్మీలో అధికారి. బంగా మొదట్ నెస్లే, సిటీ గ్రూప్‌లలో పనిచేశారు. తరువాత మాస్టర్‌కార్డ్ కంపెనీలో చేరి పదేళ్లకు పైగా అందులోనే పనిచేశారు. బంగాకు అమెరికా పౌరసత్వం ఉంది.

అజయ్ బంగా "మార్పు తీసుకురాగల నాయకుడని", ప్రపంచ బ్యాంకును నడింపించగల అనుభవం ఉన్నవారని జో బైడెన్ అన్నారు.

"పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం ప్రపంచ బ్యాంకు ప్రధాన లక్ష్యాలు. వీటిని అందుకోవడంలో ఎదురయ్యే అంతర్జాతీయ సవాళ్లను అధిగమించేందుకు బ్యాంకు నిరంతరం విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతోంది. ఈ దిశలో అజయ్ బంగా సంస్థను సమర్థవంతంగా నడిపించగలరు" అని బైడెన్ అన్నారు.

బైడెన్

ఫొటో సోర్స్, EPA

"అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే దిశలో అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని" ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అన్నారు.

ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలకు కోట్లాది రూపాయలు రుణాలుగా ఇస్తుంది.

ప్రపంచ బ్యాంకులో అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన అమెరికా.. బ్యాంకు అధ్యక్షుడిని ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

దీని గురించి గతంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫిర్యాదు చేశాయి.

"ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లందరి ఆమోదంతో అజయ్ ఎన్నికయ్యారు. వరల్డ్ బ్యాంక్ మెంబర్‌షిప్ నుంచి ఆయనకు పూర్తి మద్దతు ఉంది" అని ఒక అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ బ్యాంకు రుణ సహాయం పెంచాలని అమెరికా, ఇతర ధనిక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 1 ట్రిలియన్ డాలర్లు అవసరం అవుతాయని అంచనా.

ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న 100 బిలియన్ డాలర్లు (సంవత్సరానికి) ఈ లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నాయి.

అయితే, వాతావరణ మార్పులపై ఎక్కువగా దృష్టి పెడితే, పేదరిక నిర్మూలన కుంటుపడుతుందని దిగువ ఆదాయ దేశాలు కలవరపడుతున్నాయి.

కరోనా కారణంగా ఇప్పటికే ఈ దేశాలు ద్రవ్యోల్బణం, అధిక రుణాల వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బంగా ఈ అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే అదనపు ఖర్చుపై స్పష్టమైన సమాచారం లేకుండానే, ఈ సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మార్చిలో బంగా బీబీసీతో మాట్లాడుతూ, బ్యాంకు ఒక "ఉత్ప్రేరకం"గా పనిచేస్తూ "ఆలోచనతో నాయకత్వం వహించాలని" అన్నారు.

"ఈ లక్ష్యాలను అందుకోవడానికి ప్రైవేటు రంగం సహాయం కూడా కావాలి" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)