కర్ణాటక: బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై రాజకీయ వివాదం

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలో బీజేపీకి దెబ్బకు దెబ్బ అనే పరిస్థితి ఎదురైంది. బజ్‌రంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్‌పై మాటల దాడికి స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వహించడంతో అక్కడ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
మే 10వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో కాంగ్రెస్ పార్టీ పోల్చడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
పీఎఫ్ఐని బీజేపీ నేతలు తీవ్రవాద సంస్థగా పిలుస్తారు. భారత్‌లో ఇప్పటికే పీఎఫ్ఐ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
అంతకుముందు రోజు, ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్-యూసీసీ)ని తీసుకొస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది.

ఫొటో సోర్స్, ANI
గత అయిదు రోజులుగా కర్ణాటకలో ప్రతీరోజూ మూడు నుంచి నాలుగు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన తన వైఖరిని మార్చారు. తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడకుండా తన దృష్టినంతా హనుమాన్, బజ్‌రంగ్ దళ్‌పైకి మళ్లించారు.
‘‘గతంలో వారు శ్రీరాముడిని (అయోధ్యలో) బంధించారు. అప్పుడు వారికి రాముడు సమస్యగా అనిపించాడు. ఇప్పుడు బజ్‌రంగ్‌బలి పేరును స్మరించేవారిని బంధించాలని అనుకుంటున్నారు’’ అని మోదీ అన్నారు.
కాంగ్రెస్ తాజా చర్యలు, తీవ్రవాదం పట్ల వారి బుజ్జగింపు విధానానికి కొనసాగింపు అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసింది. ‘‘కోట్లాది మంది హనుమాన్ భక్తులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. మనల్ని కాపాడేది హనుమంతుడే. మా హృదయాల్లో కొలువై ఉన్న జజ్‌రంగ్ బలిని మీరు బజ్‌రంగ్ దళ్‌తో పోలుస్తూ అవమానించారు. అవమానించడానికి ఒక హద్దు ఉంటుంది’’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.
2008లో మంగళూరులో చర్చ్‌లపై జరిగిన దాడిలో కర్ణాటకలోని బజ్‌రంగ్ దళ్ ప్రమేయం ఉంది. అక్కడ తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఈ ఘటన జరిగింది.
గోసంరక్షణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
ఉడిపిలో బీజేపీ యువ మోర్చా సభ్యుడొకరు, ఒక చిన్న వ్యాన్‌లో పశువులను తరలిస్తుండగా మరణించారు.
కలిసి పార్టీలు చేసుకుంటున్న లేదా బస్సులలో వెళ్తున్న యువతీ యువకులను మోరల్ పోలీసింగ్ పేరిట ఇబ్బంది పెట్టారంటూ బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలపై అనేక కేసులు దాఖలు అయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
ప్రధాన సమస్యలకు దూరంగా
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ 5 హామీలను పేర్కొంది.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దగా వ్యహరిస్తోన్న మహిళలకు నగదు, డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి రెండేళ్ల వరకు భత్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రిజర్వేషన్ పరిమితిని 50 నుంచి 75 శాతానికి పెంచడంతో పాటు బీజేపీ రద్దు చేసిన 4 శాతం ముస్లిం కోటాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది.
గ్రామ దేవతల కోసం రూ. 20 వేల ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని 1.8 లక్షల గుళ్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది.
ఏప్రిల్ 29 నుంచి కర్ణాటకలో 30-35 బహిరంగ సమావేశాల్లో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
ఖర్గే మొదట ఆయనను ఒక విషపూరిత పాముగా పిలిచారు. మూడు రోజుల అనంతరం చిట్టాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రియాంక్ ఖర్గే ఆయనను ‘‘విలువలేని పుత్రుడు’’ అని అన్నారు. వీరిద్దరూ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడుతూ ఉండేది.
ప్రధాని మోదీని మణిశంకర్ అయ్యర్ ‘‘చాయ్ వాలా’’ అనే పిలిచినప్పుడు ఎదురైన పరిస్థితులను ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎదుర్కోనుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అయ్యర్ చేసిన ఆ వ్యాఖ్య బీజేపీకి భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.

ఫొటో సోర్స్, ANI
‘‘మోదీ పోలిక సరికాదు’’
జాగ్రన్ లేక్‌సిటీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి బీబీసీతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీ తమకు విధేయులుగా ఉన్న, సెక్యులర్ ఎజెండాను అనుసరించే మద్దతుదారులకు ప్రాధాన్యత ఇస్తోంది. కానీ, ఇది ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం లాంటిది. చాలా నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు తమ ఎజెండాను రూపొందిస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ లేవనెత్తుతున్న అంశాలకు కాంగ్రెస్ బదులిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే చివరి ఆరు రోజుల ఎన్నికల ప్రచారం మరింత క్లిష్టంగా మారుతుంది’’ అని బీబీసీతో భోపాల్‌లోని జాగ్రన్ లేక్‌సైడ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బజరంగ్‌దళ్‌ని బజరంగ్ బలితో పోల్చడం సరికాదని మైసూర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ముజఫర్ అసాదీ అన్నారు.
‘‘హనుమాన్ చాలీసాను పారాయణం చేసే ప్రతీ వ్యక్తీ బజ్‌రంగ్ దళ్‌కు చెందినవారై ఉండక్కర్లేదు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన వారందరిపై కఠిన వైఖరిని అవలంబించింది. అయితే, అందులో ఒక సంస్థ లేదా పార్టీ పేరును ప్రస్తావించి ఉండకూడదు. మోదీపై విమర్శల విషయంలో కూడా కాంగ్రెస్ కాస్త నిగ్రహం పాటించి ఉండాల్సింది’’ అని ఆయన అన్నారు.
ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళి సందర్భంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న బీజేపీ హామీపై కూడా అసదీ ప్రశ్నలు లేవనెత్తారు.
" రాష్ట్రమంతా జరుపుకునే సంక్రాంతి లేదా మారమ్మ పండుగకు బీజేపీ ఇలాంటి సౌకర్యాన్ని కల్పించలేదు. కేవలం ఆ మూడు పండుగలకే గ్యాస్ ఇస్తామని చెప్పింది. ఇందులో మతపరమైన భావం ఉంది. కర్ణాటకలోని ప్రతీ గ్రామంలో, మారమ్మ గుడి ఉన్న ప్రతీ చోట మారమ్మ పండుగను జరుపుకుంటారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
అసలైన సమస్యలు
గత 15 ఏళ్లుగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం వంటివి అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయని ప్రొఫెసర్ శాస్త్రి అన్నారు.
‘‘ఓటు వేసేటప్పుడు ఓటరు మనసులో ఏముంటుందో ఊహించడం నాలాంటి రాజకీయ విద్యార్థికి చాలా కష్టం. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల వంటి ఈ మూడు ప్రధాన సమస్యలతో ప్రజల జీవితాలు ప్రభావితం అయ్యాయి. ఓటు వేసే సమయంలో ఓటరు ఈ మూడు సమస్యల గురించి ఆలోచించి ఓటు వేస్తాడా? అనేది చెప్పడం చాలా కష్టం’’ అని ఆయన వివరించారు.
ప్రొఫెసర్ శాస్త్రి, లోక్‌నీతి నెట్‌వర్క్ సహ డైరెక్టర్ కూడా. ప్రజల మానసిక స్థితిపై లోక్‌నీతి నెట్‌వర్క్ సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాల్లో ప్రజల్లో వర్గ విభేదాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.
‘‘సంపన్నులు, బీజేపీ వైపు మొగ్గుతున్నారు. ఆర్థికంగా బలంగా లేని వారు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. ఎన్నికలకు చాలా కాలం ముందే ఈ రెండు వర్గాల వారు తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్నారనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది’’ అని శాస్త్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














