పుతిన్‌ను హత్య చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నించిందని ఆరోపించిన రష్యా

క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్లను మాస్కోలో నేల కూల్చినట్లు రష్యా ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నించిందని ఆరోపించింది. ఆ డ్రోన్లతో తనకు సంబంధం లేదని యుక్రెయిన్ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా నియామకం

    అజయ్ బంగా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అజయ్ బంగా

    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త, మాజీ మాస్టర్‌కార్డు అధినేత అజయ్ బంగా నియమితులయ్యారు.

    ‘‘ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈరోజు బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను ఎంపిక చేశారు. జూన్ 2, 2023 నుంచి ఆయన ఐదేళ్ల పదవీ కాలం ప్రారంభమవుతుంది’’ అని తెలుపుతూ ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనను జారీ చేసింది.

    ఈ ఏడాది ఫిబ్రవరి 23న అజయ్ బంగా నామినేషన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు.

    అజయ్ బంగా దశాబ్దానికి పైగా ప్రముఖ క్రెడిట్ కార్డు కంపెనీ మాస్టర్ కార్డుకు సారథ్యం వహించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌కి వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.

    వాతావరణ మార్పుల విషయంలో ప్రైవేట్ రంగంతో కలిసి ప్రపంచ బ్యాంకు పనిచేసేందుకు అజయ్ బంగా అనుభవం బాగా సాయపడుతుందని కొందరు నిపుణులు చెప్పారు.

    భారత్‌లో పుట్టిన అజయ్ బంగాకి అమెరికా పౌరసత్వం ఉంది. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేసే వారు.

    మాస్టర్‌కార్డులో చేరకముందు అజయ్ బంగా నెస్లే, సిటీ గ్రూప్‌లో వర్క్ చేశారు. 2021లో మాస్టర్‌కార్డులో పదవీ విరమణ చేశాక, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో చేరారు.

  3. స్పాంటేనియస్ సెక్స్ బాగుంటుందా... ప్లాన్ చేసుకుని చేసే శృంగారం మరింత బాగుంటుందా?

  4. ద్రవ్యోల్బణం దెబ్బకు చిత్తు అవుతున్న వీరిని ఆదుకునేదెవరు?

  5. బ్రేకింగ్ న్యూస్, ‘పుతిన్‌ను చంపేందుకు యుక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది’ – రష్యా

    రష్యా అధికారిక నివాసం

    ఫొటో సోర్స్, Neighbors. Yakimanka-Zamoskvorechye/Telegram Channel

    తమ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు మాస్కోలోని రష్యా అధ్యక్ష అధికారిక నివాసంపై యుక్రెయిన్ రెండు డ్రోన్లతో దాడి చేసిందని రష్యా ఆరోపించింది.

    ఎలక్ట్రానిక్ రాడార్ వ్యవస్థ సాయంతో ఈ డ్రోన్లను కూల్చివేశామని రష్యా అధ్యక్ష అధికారిక నివాసం(క్రెమ్లిన్) తెలిపింది.

    ఆ సమయంలో పుతిన్ అధికారిక నివాసంలో లేరని ఆయన ప్రతినిధి దిమిత్రీ పిస్కోవ్ ఆ దేశ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

    అయితే భవంతికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు.

    బుధవారం ఉదయం సెంట్రల్ మాస్కోలో పొగ కమ్ముకున్న ఫుటేజీలు రష్యన్ సోషల్ మీడియాలో కనిపించాయి.

    మే 9న విక్టరీ డే పరేడ్ జరగడానికి కాస్త ముందుగా ఈ ఘటన జరిగింది. ఈ ఈవెంట్‌కి విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతారని అంచనాలున్నాయి.

    అయితే, ఈ పరేడ్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని క్రెమ్లిన్ చెప్పినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి.

    వీడియో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందంటూ మాస్కో విడుదల చేసిన వీడియో
  6. వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’

  7. సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?

  8. 'మండల ఆర్ట్‌'తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కశ్మీర్ యువతి

  9. కాళికా దేవిపై యుక్రెయిన్ ప్రభుత్వం వివాదాస్పద ఫొటో.. దాన్ని తొలగించి, క్షమాపణలు ఎందుకు చెప్పింది?

  10. అమరావతి, ఇతర అంశాలపై సిట్ ఏర్పాటు మీద హైకోర్టు స్టేను పక్కనబెట్టిన సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    రాజధాని అమరావతి 'భూ కుంభకోణం' సహా పలు ఆరోపణల మీద కేబినెట్ సబ్‌కమిటీ, సిట్ ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

    హైకోర్టు స్టేను సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడి హయాంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని అమరావతి 'భూ కుంభకోణం' సహా పలు ఆరోపణలపై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు ఉత్తర్వు ఇచ్చింది.

    ఆ ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును పక్కనబెట్టింది.

    నేటి తీర్పు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట.

    "ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసేది కాదు" అని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

    రెండు ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు తప్పుగా అర్థంచేసుకుందంటూ రాష్ట్రం చేసిన వాదనలు సమర్థనీయమని ధర్మాసనం చెప్పింది.

    చంద్రబాబు నాయుడు హయాంలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ అధికారి కె. రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    గత ప్రభుత్వం ప్రారంభించిన నీటిపారుదల, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై, అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపే బాధ్యతను ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది.

  11. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షికి అస్వస్థత

    రంగన్న

    ఫొటో సోర్స్, UGC

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    కుటుంబ సభ్యులు ఆయన్ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత, మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

    గత కొన్నేళ్లుగా వాచ్‌మాన్ రంగయ్య ఆస్తమాతో బాధపడుతున్నారు. నిన్న ఊపిరి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో పులివెందుల నుంచి తిరుపతికి తరలించారు.

    ప్రస్తుతం రంగన్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

    రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు రంగన్న వాగ్మూలం ఇస్తూ కీలక విషయాలను ప్రస్తావించారు.

  12. పాకిస్తాన్: బిలావల్ భుట్టో జననాన్ని బెనజీర్ భుట్టో ఎందుకు గోప్యంగా ఉంచారు?

  13. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ వెలుపల ఒక వ్యక్తి అరెస్ట్

    బకింగ్‌హామ్ ప్యాలెస్‌

    ఫొటో సోర్స్, Getty Images

    లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోకి షాట్‌గన్ కాట్రిడ్జ్‌లు విసిరారన్న అనుమానంతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    మంగళవారం స్థానిక సమయం రాత్రి 7.00 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే సిబ్బంది ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు చెప్పారు.

    ప్యాలెస్ బయట ఒక వ్యక్తి ఆయుధంతో కనిపించడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని సోదా చేయగా ఒక కత్తి బయటపడిందని, తుపాకీ లేదని చెప్పారు.

    ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

    ప్రస్తుతానికి దీన్ని తీవ్రవాదుల చర్యగా పరిగణించట్లేదు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనిగా భావిస్తున్నారు.

    ఇది జరిగినప్పటికీ, శనివారం జరగబోయే పట్టాభిషేకం వేడుకల రిహార్సల్స్ ఆటకం లేకుండా కొనసాగాయి.

    ఆ వ్యక్తిని అరెస్టు చేసిన సమయంలో కింగ్, క్వీన్ కన్సార్ట్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో లేరు.

  14. శ్రీకాకుళం: రాళ్ల లారీ వెళ్తుండగా కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన

    శ్రీకాకుళం

    ఫొటో సోర్స్, UGC

    శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది.

    ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగిపడింది.

    1929లో దీనిని నిర్మించారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

    ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలు క్రింద పడిపోయాయి.

    బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు.

    వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  15. 'ది కేరళ స్టోరీ'పై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందన కోరిన కేరళ హైకోర్టు

    ది కేరళ స్టోరీ

    ఫొటో సోర్స్, THE KERALA STORY

    'ది కేరళ స్టోరీ' సినిమాపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ కేరళ హైకోర్టులో విచారణలో ఉంది.

    దీనిపై కేంద్ర ప్రభుత్వం, సినిమా ప్రొడ్యూసర్లు తమ స్పందన తెలియజేయాలని మంగళవారం కోర్టు కోరినట్టు ఏఎన్ఐ తెలిపింది.

    జస్టిస్ ఎన్ నాగరేశ్, మొహమ్మద్ నియాస్ సీపీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, తదుపరి పరిశీలనకు పంపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అడ్వకేట్ అనూప్ వీఆర్ 'ది కేరళ స్టోరీ' సినిమాపై స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ సినిమాలో ముస్లిం కమ్యునిటీని, కేరళ రాష్ట్రాన్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయని, తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని వాటిని తొలగించాలని పిటిషన్‌లో కోరారు.

    "నిజ జీవిత గాథల ఆధారంగా సినిమాను రూపొందించామని చెబుతున్నారు. ఇది, కేరళలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని సూచిస్తున్నట్టు ఉంది. ఇలా చెప్పడం కేరళ రాష్ట్రాన్ని, ప్రజలను అవమానించడమే. కేరళ రాష్ట్రం మతసామరస్యానికి, లౌకిక దృక్పథానికి పెట్టింది పేరు. ఈ సినిమా రాష్ట్రంలో ఉన్న మతసామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీస్తుంది. టీజర్ సినిమా సారాంశాన్ని చెబుతుంది. ఉద్దేశపూర్వకంగానే కేరళకు వ్యతిరేకంగా ఇందులో చూపించారని తెలుస్తోంది. ఈ సినిమా ముస్లిం వర్గాన్ని ముఖ్యంగా మహిళల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ది కేరళ స్టోరీ అని టైటిల్ పెట్టడం ద్వారా రాష్ట్రంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.

  16. ఏసీ: ఆ ఒక్క పనిచేస్తే కరెంటు బిల్లు సగం తగ్గుతుందా?