పసిపిల్లలు ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... ఏమిటీ దారుణం?

- రచయిత, యోగితా లిమాయే
- హోదా, బీబీసీ న్యూస్
మూడు నెలల వయసున్న తయాబుల్లాలో ఎలాంటి కదలికలూ కనిపించడం లేదు. ముక్కులోని ఆక్సిజన్ పైప్‌ను అతడి తల్లి నిగర్ పక్కకు తీశారు. బాబు శ్వాస తీసుకుంటున్నాడో లేదో ఆమె జాగ్రత్తగా చూశారు.
అయితే, బాబు మరణం అంచులకు చేరుకుంటున్నాడని తెలిసినవెంటనే, ఆమె గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు.
అఫ్గానిస్తాన్‌లోని ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న వెంటిలేటర్ ఒక్కటి కూడా లేదు.
పిల్లల ముక్కుల్లోని ఆక్సిజన్ గొట్టాలను వారి తల్లులు చేతులతో పట్టుకుంటున్నారు. ఎందుకంటే పసిపాపల చిన్న ముఖాలకు సరిపడే ఆక్సిజన్ మాస్క్‌లు ఇక్కడ అందుబాటులో లేవు. ఇక్కడ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేదా వైద్య పరికరాలు చేయాల్సిన పనులను పిల్లల తల్లులే చేస్తున్నారు.
ప్రతిరోజూ అఫ్గానిస్తాన్‌లో చికిత్స అందుబాటులో ఉన్న వ్యాధులతోనే సగటున 167 మంది పిల్లలు మరణిస్తున్నారని ఐరాస బాలల నిధి (యూనిసెఫ్) చెబుతోంది. సరైన సమయంలో వైద్యం అందిస్తే, ఈ మరణాలను అడ్డుకోవచ్చు.
ఈ నంబర్లు చాలా మందిని షాక్‌కు గురిచేస్తున్నాయి. అయితే, పశ్చిమ అఫ్గాన్ ఘోర్ ప్రావిన్స్‌లోని ప్రధాన హాస్పిటల్‌లోని పిల్లల వార్డులోకి అడుగుపెడితే, అసలు ఈ సంఖ్య చాలా తక్కువేమో అనిపిస్తుంది.
ఇక్కడి చాలా గదుల్లో అనారోగ్యంతో పిల్లలు కనిపిస్తున్నారు. ఒక్కో బెడ్డుపై కనీసం ఇద్దరు చొప్పున తీవ్రమైన న్యుమోనియాతో సతమతం అవుతున్నారు. అయితే, ఇక్కడ 60 మంది పిల్లలను చూసుకోవడానికి ఇద్దరు నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
ఒక గదిలో 20 మందికిపైగా చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో కనిపించారు. నిజానికి ఈ పిల్లల ఆరోగ్యాన్ని క్రిటికల్ కేర్‌లో పెట్టి నిత్యం జాగ్రత్తగా గమనిస్తుండాలి. కానీ, ఇక్కడ ఆ సదుపాయాలు అందుబాటులో లేవు.
కానీ, ఘోర్‌లో లక్షల మంది ప్రజలకు అందుబాటులోనున్న కాస్త మెరుగైన ఆసుపత్రి ఇదే. అంటే మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అఫ్గానిస్తాన్‌లో ఆరోగ్య సదుపాయాలు ఎప్పుడూ ప్రజల వైద్య అవసరాలను పూర్తిగా తీర్చే పరిస్థితిలో లేవు. ఇక్కడి ఆసుపత్రులు దాదాపుగా విదేశీ సాయంపైనే ఆధారపడుతుంటాయి. అయితే, ఆగస్టు 2021లో తాలిబాన్లు అధికారంలో వచ్చిన తర్వాత, విదేశీ నిధులు స్తంభించిపోయాయి. గత 20 నెలలుగా ఇక్కడున్న ఆసుపత్రులు, క్లినిక్‌లను మేం సందర్శించాం. ఇవన్నీ దాదాపుగా స్తంభించిపోయే పరిస్థితికి అంచుల్లో ఉన్నాయి.
స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీవో)ల కోసం మహిళలు పనిచేయకుండా తాలిబాన్లు తాజాగా ఆంక్షలు విధించారు. దీంతో విదేశీ నిధులు రావడం మరింత కష్టం అవుతోంది. అంటే మరింత మంది పిల్లలు, శిశువులు మరణంతో పోరాడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంటోంది.

నిధులు, వైద్య పరికరాల కొరత ఘోర్ ఆసుపత్రిని తీవ్రంగా వేధిస్తోంది. అయితే, అందుబాటులోనున్న అరకొర పరికరాలతో తయాబుల్లాను బతికించేందుకు వైద్య సిబ్బంది కృషిచేస్తున్నారు.
బాబు పరిస్థితి చూసేందుకు డాక్టర్ అహ్మద్ సమధీ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆయన మొహంలోనూ ఒత్తిడి, నీరసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే బాబు ఛాతీపై స్టెథస్కోప్‌ను పెట్టి గుండె ఎలా కొట్టుకుంటోందో అహ్మద్ చూశారు. పరిస్థితి మరింత జారుతోందని ఆయనకు తెలుస్తోంది.
వెంటనే నర్సు నధిమా సుల్తానీ ఒక ఆక్సిజన్ పంప్‌ను గబగబా తీసుకొచ్చారు. దీన్ని బాబు నోటిలో పెట్టి కృత్రిమంగా శ్వాసను అందించాలని ఆమె చూశారు. మరోవైపు బాబు ఛాతీపై తన వేళ్లతో కాస్త నొక్కుతూ శ్వాస అందేలా చేసేందుకు అహ్మద్ కూడా ప్రయత్నించారు.
తయాబుల్లా పరిస్థితిని తన తాతయ్య ఘవ్సాద్దీన్ అక్కడే ఉండి చూస్తున్నారు. న్యుమోనియా, పోషకాహార లోపంతో తన మనవడు బాధపడుతున్నాడని ఆయనే మాకు చెప్పారు.
‘‘మా ఊరు చార్సద్దా నుంచి ఇక్కడికి బాబును అధ్వానమైన రోడ్డుపై తీసుకురావడానికి మాకు ఎనిమిది గంటలు పట్టింది’’ అని ఘవ్సాద్దీన్ చెప్పారు. వీరి కుటుంబానికి ఎండు రొట్టెలే జీవనాధారం. బాబును ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు కొన్ని భోజనాలను కూడా వీరు త్యాగం చేయాల్సి వచ్చింది.
దాదాపు అరగంటపాటు బాబును బతికించేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆ తర్వాత తయాబుల్లా మరణించాడని అతడి తల్లి నిగర్‌కు నర్సు సుల్తానీ చెప్పారు.
మౌనం రాజ్యమేలుతున్నట్లుగా కనిపించే ఆ ఆసుపత్రి నిగర్ ఏడుపుతో ప్రతిధ్వనించింది. ఆ బాబును దుప్పటిలో చుట్టి ఘవ్సాద్దీన్ చేతుల్లో పెట్టారు. ఆ కుటుంబం అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది.
తయాబుల్లా జీవించుండాల్సింది. ఎందుకంటే అతడికి సోకిన వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది.
‘‘నేను కూడా ఒక తల్లినే. ఒక పాప చనిపోతుంటే, నా సొంత బిడ్డ మరణించినట్లే నాకు అనిపిస్తుంది. ఆ బాబు తల్లి ఏడుస్తున్నప్పుడు నా గుండె బద్దలైనట్లు అనిపించింది’’అని నర్స్ సుల్తానీ చెప్పారు. ఆమె తరచూ 24 గంటలపాటూ పనిచేస్తుంటారు.
‘‘ఇక్కడ వైద్య పరికరాలు లేవు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా లేరు. ముఖ్యంగా మహిళా సిబ్బంది కొరత మరీ ఎక్కువ. ఇక్కడ చాలా మంది పిల్లలను తీవ్రమైన అనారోగ్యంతో తీసుకొస్తున్నారు. అసలు ఏ చిన్నారికి ముందు చికిత్స అందించాలో తెలియడం లేదు. పిల్లలు అలా చనిపోవడాన్ని చూడటం తప్పా, మేమేమీ చేయలేకపోతున్నాం’’అని ఆమె అన్నారు.

కొన్ని నిమిషాల తర్వాత, పక్క గదిలో తీవ్రమైన అనారోగ్యంతో నోటికి ఆక్సిజన్ మాస్కు తగిలించిన మరో చిన్నారి కనిపించింది. ఆ పాప కూడా శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడుతోంది.
రెండేళ్ల గుల్బదన్ పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్’ అనే గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆరు నెలల క్రితమే తనకు ఈ జబ్బు ఉందని వైద్యులు నిర్ధారించారు.
పిల్లల్లో చాలా మందిని ఈ రుగ్మత వేధిస్తుంది. దీనికి చికిత్స కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ గుండె లోపాన్ని శస్త్రచికిత్సతో సరిచేసేందుకు కావాల్సిన సదుపాయాలు ఘోర్ ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులో లేవు. పాపకు అవసరమైన మందులు కూడా ఇక్కడ లేవు.
గుల్బదన్ నాన్నమ్మ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నారు. మాస్క్‌ను పాప తీసేయకుండా ఆమె జాగ్రత్తగా చూస్తున్నారు.
‘‘పాపను కాబూల్‌కు తీసుకెళ్లేందుకు మేం డబ్బులు అప్పు చేశాం. కానీ, శస్త్రచికిత్సకు సరిపడా డబ్బులు కుదరలేదు. దీంతో ఆమెను వెనక్కి తీసుకువచ్చేశాం’’అని ఆమె చెప్పారు. ఆర్థిక సాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను వీరు ఆశ్రయించారు. అక్కడ వీరి వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారి నుంచి స్పందన రాలేదు.
గుల్బదన్ తలపై చేయివేస్తూ ఆమెకు భరోసా ఇచ్చేందుకు తండ్రి నవ్‌రోజ్ ప్రయత్నించారు. ఆతడి ముఖంలో బాధ కనిపిస్తోంది. ‘‘మా అమ్మాయి ఇప్పుడే మాట్లాడటం మొదలుపెట్టింది. నన్ను, వాళ్ల అమ్మను, ఇతర కుటుంబ సభ్యులను పిలుస్తోంది. కానీ, ఇంతలోనే ఇలా జరిగింది’’అని ఆయన బాధతో చెప్పారు.

‘‘నేను రోజు కూలీని. నాకు నిలకడగా జీతం అంటూ రాదు. నా దగ్గరే డబ్బులుంటే ఆమె ఇంత బాధపడుండాల్సింది కాదు. ఇప్పుడు కనీసం ఒక టీ కొనుక్కు రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు’’అని ఆయన చెప్పారు.
గుల్బదన్‌కు ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందని డాక్టర్ సమధీని నేను అడిగాను.
‘‘ప్రతి నిమిషానికీ రెండు లీటర్ల ఆక్సిజన్ అవసరం. ఒక సిలెండర్ నిండుకున్న వెంటనే, మరో సిలెండర్ దొరక్కపోతే, పాప చనిపోతుంది’’అని ఆయన చెప్పారు.
కాసేపటి తర్వాత, మేం మళ్లీ గుల్బదన్‌ను చూడటానికి వెళ్లాం. అప్పుడు ఆ డాక్టర్ చెప్పినదే నిజమైంది. ఆక్సిజన్ సిలెండర్ నిండుకోవడంతో పాప మరణించింది.
హాస్పిటల్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం డిమాండ్‌కు తగినట్లుగా పనిచేయడం లేదు. ఎందుకంటే రాత్రి మాత్రమే ఇక్కడ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇతర పరికరాలు, ముడి సరకుల కొరత కూడా ఈ కేంద్రాన్ని వేధిస్తోంది.

కొన్ని గంటల వ్యవధిలోనే ఇక్కడ ఇద్దరు పిల్లలు మరణించారు. వీరిద్దరూ చికిత్స అందుబాటులోనున్న వ్యాధులతోనే మరణించారు. ఇలాంటి పరిస్థితులను డాక్టర్ సమధీ, ఇతర సిబ్బంది రోజూ చూస్తూనే ఉంటారు.
‘‘మేం చాలా అలసిపోతుంటాం. ఇలాంటి మరణాలను రోజూ చూడలేకపోతున్నాం. కానీ, రోజూ పరిస్థితులు ఇలానే ఉంటాయి’’అని ఆయన చెప్పారు.
ఆసుపత్రిలోని భిన్న గదుల్లోకి వెళ్లినప్పుడు అత్యవసర వైద్య సాయం అవసరమున్న చాలా మంది పిల్లలు కనిపించారు. వారిలో ఏడాది వయసున్న సజద్ కూడా ఒకరు. న్యుమోనియా, మెనింజైటిస్‌తో బాధపడుతున్న అతడు శ్వాస తీసుకోలేకపోతున్నాడు.
మరో బెడ్‌పై ఇర్ఫాన్ కనిపించారు. అతడు కూడా శ్వాస తీసుకోవడం కష్టం అవుతోంది. దీంతో మరో ఆక్సిజన్ పైపును అతడికి ముక్కులో పెట్టి దాన్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకోవాలని అతడి తల్లి జియారాకు సూచించారు.
బాబు ముక్కులో రెండు గొట్టాలను చేత్తో పట్టుకుంటున్నప్పుడు ఆమె కంటి నుంచి కన్నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి. మంచుతో రోడ్లు మూసిపోకపోయింటే, నాలుగు రోజుల ముందే బాబును ఆసుపత్రికి తీసుకొచ్చే వాళ్లమని ఆమె చెప్పారు.
చాలా మంది ఆసుపత్రికి కూడా చేరుకోలేకపోతున్నారు. మరికొందరు ఆసుపత్రికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఉండకూడదని భావిస్తున్నారు.
‘‘పది రోజుల క్రితం ఒక బాబును విషమ పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చారు. అతడికి మేం ఇంజక్షన్ ఇచ్చాం. కానీ, అతడి అనారోగ్యాన్ని నయంచేసే ఔషధాలు మా దగ్గర లేవు. దీంతో ఆ బాబును వాళ్ల నాన్న ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఒకవేళ చనిపోవాల్సిన పరిస్థితి వస్తే, ఇంటి దగ్గరే తను చనిపోతాడని తన తండ్రి మాతో అన్నాడు’’అని నర్స్ సుల్తానీ చెప్పారు.

ఘోర్‌లో మాకు కనిపించిన పరిస్థితులు అఫ్గానిస్తాన్‌లో తీవ్ర సంక్షోభంలోనున్న ఆరోగ్య సదుపాయాలను కళ్లకుకడుతున్నాయి. 2021లో తాలిబాన్లు అధికారంలోకి రాకముందు, ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉండేవి.
ఇప్పుడు కనీసం ఒక్క వెంటిలేటర్‌ను కూడా నడిపించే స్థితిలో ఇక్కడి ఆసుపత్రులు లేవు. అయితే, కొన్ని మానవతా సంస్థలు ఇస్తున్న సాయంతో ఇక్కడి సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు, కొన్ని ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ మందులు డిమాండ్‌కు సరిపడా లేవు.
ఇప్పటికే అరకొరగా వస్తున్న నిధులు కూడా నిలిచిపోయే ముప్పుంది. మహిళలపై తాలిబాన్లు ఆంక్షలు విధిస్తూ పోతే ఆ నిధులను కూడా నిలిపివేస్తామని అంతర్జాతీయ సహాయ సంస్థలు చెబుతున్నాయి.
అఫ్గానిస్థాన్‌కు అవసరమైన నిధుల్లో కేవలం ఐదు శాతం మాత్రమే అంతర్జాతీయ సంస్థల నుంచి అందుతోంది.
ఘోర్ ఆసుపత్రికి సమీపంలోని కొండల్లో ఒక శ్మశానం దగ్గరకు మేం వెళ్లాం. ఇక్కడ సమాధుల్లో సగం పిల్లలవే కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో కచ్చితంగా చెప్పే అంచనాలు లేవు. కానీ, పిల్లల సమాధులు ఇక్కడ భారీగా కనిపిస్తున్నాయి.
(అదనపు రిపోర్టింగ్ ఇమోజెన్ ఆండెర్సన్, సంజయ్ గంగూలీ)
ఇవి కూడా చదవండి:
- తంజావూరు పెరియా కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?
- వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’
- సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















