కింగ్ చార్లెస్ 3: పదిహేను దేశాలకు రాజు... కానీ ఇంకెంత కాలం కొనసాగగలరు?

ఫొటో సోర్స్, Getty Images
కింగ్ చార్లెస్ 3 ప్రపంచంలోని 15 దేశాలకు చక్రవర్తిగా వ్యవహరిస్తారు. కానీ, ఆయన రాజరికం ఎన్నాళ్లు కొనసాగుతుంది? ఆయన అధిపతిగా ఉన్న చాలా కామన్‌వెల్త్ దేశాల్లో ఇది ఎడతెగని చర్చగా మిగిలిపోయింది. ఆ దేశాలు గణతంత్రం, రాచరికం మధ్య సందిగ్ధంలో ఊగిసలాడుతున్నాయి.
చార్లెస్ 3 రాజుగా కొనసాగుతున్న దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది, రాచరికానికి స్వస్తి చెప్పే అవకాశాలు ఉన్నాయా, ఎన్నికల వ్యవహారం ఎలా సాగుతుంది వంటి అంశాలను బీబీసీ ప్రతినిధులు పరిశీలించారు. ఆ వివరాలు చూద్దాం.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
సెలెస్టినా ఒలులోడే అందిస్తున్న కథనం
అట్లాంటిక్ మహాసముద్రం, కరీబియన్ సముద్రం మధ్య ఉన్న రెండు ద్వీపాల కలయిక ఈ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. కరేబియన్ దీవుల్లో ఆంగ్లేయులు మొదట స్థిరపడ్డది ఇక్కడే.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశానికి స్వతంత్రం వచ్చి 40 ఏళ్లు అయినా, దాని జాతియత గుర్తింపుపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బ్రిటన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండాలా లేదా గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవాలా అన్నది ప్రశ్న.
ఈ దేశంలో జాతీయ క్రీడ సహా బ్రిటన్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
అక్కడ రసవత్తరంగా సాగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లి కొందరితో మాట్లాడాను.
కొంతమంది తమ అభిప్రాయం చెప్పారు కానీ, వారు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు.
షర్లీన్ మార్టిన్ అనే యువతి కింగ్ చార్లెస్ 3 దేశాధినేతగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటో తెలియట్లేదని అన్నారు.
"చైనీస్, తైవానీస్ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇంగ్లండ్ కంటే ఎక్కువ పట్టించుకుంటారు. మరి, బ్రిటన్ ఆధిపత్యం ఎందుకో అర్థం కాదు" అన్నారామె.
సాయంత్రం స్థానిక బార్‌కు వెళ్లి మరికొంతమందిని కదిపాను. బార్ మేనేజర్ జూలియాన్ మార్టన్ మాట్లాడుతూ, ఇది తమ దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయమని అన్నారు.
"గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం వల్ల మేం మా సొంత మార్గంలోకి అడుగుపెట్టినట్టు అవుతుంది. మా వ్యవహారాలు మేం నిర్వహించుకోగలమని ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది" అన్నారాయన.
జూలియాన్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ రాబర్ట్స్ తన స్నేహితుడి మాటను అంగీకరిస్తూనే, కొంత భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. కరోనావైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి అంత తొందరేమీ లేదని ఆయన అంటున్నారు.
బార్బడోస్ లాంటి కరీబియన్ దేశాలతో పోలిస్తే సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఇంకా "కొత్తగా స్వతంత్రం వచ్చిన దేశమే. కాబట్టి మార్పుకు ఇంకా సమయం పట్టవచ్చు" అని అన్నారు.
బార్బడోస్ దేశాన్ని ఒకప్పుడు "లిటిల్ ఇంగ్లండ్" అని పిలిచేవారు. 2021లో ఆ దేశం గణతంత్రం రాజ్యంగా ప్రకటించుకుని మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది.

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో మార్పు రావాలంటే అక్కడి రాజ్యాంగం ప్రకారం రిఫరెండం నిర్వహించాలి. ప్రజలు గణతంత్ర వ్యవస్థకు అనుకూలంగా ఓటు వేయాలి. అప్పుడే మార్పు సాధ్యం.
నిజానికి, మిగిలిన ఎనిమిది కరేబియన్ దేశాల్లో ఒక్క బెలిజ్ తప్ప అన్నిటికీ రిఫరెండం నిర్వహించడం ఒక్కటే మార్గం. బెలిజ్‌లో జాతీయ అసెంబ్లీ నిర్ణయం తీసుకోగలదు.
అయితే, ఈ దేశాలలో రిఫరెండం నిర్వహించే పద్ధతుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. సెయింట్ లూసియా, బహామాస్, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లలో మెజారిటీ ఓట్లు దేనికి వస్తే అదే గెలిచినట్టు.
కానీ, ఆంటిగ్వా అండ్ బార్బుడా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ దేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.
2009లో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ రిఫరెండం నిర్వహించారు. నలభై ఐదు శాతం ఓటర్లు రాచరికాన్ని కాదని గణతంత్రానికి ఓటు వేశారు. క్వీన్ ఎలిజబెత్ 2 స్థానంలో సొంత అధ్యక్షుడు ఉండాలని కోరుకున్నారు. కానీ, ఈ ఓటు శాతం మూడింట రెండు వంతుల కంటే చాలా తక్కువ. అందుకే ఆ నిర్ణయం గెలవలేదు.
కాబట్టి, కరీబియన్ దేశాల్లో ఇది అంత సులువైన నిర్ణయం కాదు. అందుకే చర్చలు ఎడతెగకుండా కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా
టిఫనీ టర్న్‌బుల్ అందిస్తున్న కథనం
సిడ్నీ వీధుల్లో నడుస్తూ గమనిస్తే, తమ దేశానికి కొత్త రాజు వస్తున్నాడన్న సందడి ఏమీ కనిపించలేదు.
బార్‌లో ఒక వ్యక్తితో మాట్లాడితే, కొత్త రాజు పట్టాభిషేకం ఎప్పుడో కూడా తెలీదని చెప్పారు. ఒక విద్యార్థి, అదంటే ఏంటో కూడా తెలీదన్నారు.
"నేనేం పట్టించుకోను. మాకది అనవసరం" అన్నారు ఒక 73 ఏళ్ల వ్యక్తి.
దీన్నిబట్టి ఆస్ట్రేలియాలో వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
శనివారం రాత్రి ఈ దేశంలోని ముఖ్యమైన కట్టడాలు, ఆనవాళ్లు ఉదారంగు కాంతిలో వెలిగిపోతాయి. కానీ, ఆరోజు జరిగే వేడుక గురించి చర్చ లేదా ఆసక్తి పెద్దగా కనిపించట్లేదు.
టీవీలో ప్రత్యేక కార్యక్రమాలు, కవరేజీ కూడా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాచరికపు వివాహాలు, రాణి అంత్యక్రియలు చూపించినంతగా పట్టాభిషేకానికి ప్రాముఖ్యం కనిపించడం లేదు.
కింగ్ చార్లెస్3 కి క్వీన్ ఎలిజెబెత్ 2 అంత పాపులారిటీ లేకపోవచ్చు. కానీ, రాజు పట్టాభిషేకం జరగబోతున్న సమయంలోనే, ఆస్ట్రేలియాలో రిపబ్లిక్ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటోంది.
పాతికేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో నిర్వహించిన రిఫరెండంలో ఎక్కువమంది రాచరికానికి ఓటు వేశారు. కానీ, అప్పటి నుంచి గణతంత్రానికి మద్దతు పెరుగుతూ వస్తోంది.
దేశం "గణతంత్రం కావడం" అనివార్యం అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇంతకుముందు అన్నారు. నిరుడు ఆ దిశలో జూనియర్ స్థాయిలో ఒక మంత్రిని కూడా నియమించారు. ఇది చరిత్రాత్మకంగా తొలి అడుగు.

ఫొటో సోర్స్, Getty Images
పక్కనే ఉన్న న్యూజీలాండ్‌ది కూడా ఇదే కథ. తనకు గణతంత్ర వ్యవస్థపైనే విశ్వాసం ఉందని, తమ దేశం ఏదో ఒకరోజు తప్పకుండా "రాచరికం" నుంచి బయటపడుతుందని ఆ దేశ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ఈమధ్యే అన్నారు.
ఆస్ట్రేలియాలో రాచరికం నామమాత్రంగానే ఉంది. చాలాకాలం క్రితమే తమ దేశం బ్రిటన్ నీడలోంచి బయటికొచ్చి సొంత గుర్తింపును సంపాదించుకుందని ఆ దేశ ప్రజలు చెబుతున్నారు.
ఆదిమవాసులు, టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులపై కొనసాగుతున్న వలసరాజ్యం ప్రభావం కూడా ఈ వ్యతిరేకతకు ఒక కారణమని మరికొందరు చెబుతున్నారు.
అయితే, ఆస్ట్రేలియా గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరి కొన్నేళ్లు పట్టవచ్చు.
మొదట, రాజ్యాంగంలో ఆదిమవాసుల గుర్తింపుపై రిఫరెండం నిర్వహించే యోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.
దేశాధ్యక్షుడిని ఎలా ఎన్నుకోవాలన్న విషయంపై కూడా సందిగ్ధం ఉంది. ప్రజలు ఎన్నుకుంటారా లేక పార్లమెంటు ఎన్నుకుంటుందా అనేది ఇంకా తేలలేదు.
అయితే, ఇటీవల జరిగిన పోల్స్ చూస్తే గణతంత్రానికి వస్తున్న మద్దతు, కావాలసిన దాని కన్నా తక్కువగానే కనిపిస్తోంది. మెజారిటీ ఆస్ట్రేలియన్లు ఓటు వేయాలి. ఆ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కనీసం నాలుగు పూర్తిగా మద్దతు తెలపాలి.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా
జెస్సికా మర్ఫీ అందిస్తున్న కథనం
కెనడా విషయంలో రాచరికంపై "నిరాసక్తత" కనిపిస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మీద చూపించిన ఆప్యాయత కింగ్ చార్లెస్ విషయంలో కనిపించట్లేదు.
కెనడాలో రాచరికం నుంచి పక్కక్కు తప్పుకునే ఆలోచనలు పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఏప్రిల్‌లో జరిపిన ఒక సర్వేలో, సగం కంటే ఎక్కువ జనాభా గణతంత్రానికి ఓటు వేశారు.
ప్రతి అయిదుగురిలో ఇద్దరు పట్టాభిషేకం గురించి తమకు ఆసక్తి లేదని చెబుతున్నారు.
దీనిపై ఆ దేశంలో పెద్దగా వేడుకలు కూడా ప్లాన్ చేయలేదు. రాజధాని ఒట్టావాలో ఒక గంట వేడుక చేస్తారు. దేశంలో ప్రభుత్వ కట్టడాలు పచ్చని లైట్లతో నింపుతారు.
నిరుడు క్వీన్ చనిపోయిన తరువాత, కింగ్ చార్లెస్ సింహాసనం అధిష్టించడంపై, రాచరికం నుంచి బయటపడడంపై కెనడాలో చర్చలు కాస్త జోరందుకున్నాయి.
ముఖ్యంగా క్యూబెక్‌లో ప్రతికూలత ఎక్కువగా ఉంది. క్యూబెక్‌లో చారిత్రకంగా ఫ్రెంచ్ మాట్లాడే జనాభా ఎక్కువ.
కిందటి ఏడాది క్యూబెక్ దీనికి సంబంధించి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. శాసనసభ సభ్యులు ఇష్టముంటే చక్రవర్తికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేయవచ్చు లేదంటే లేదు. ఇందులో బలవంతం లేదనే చట్టాన్ని తీసుకొచ్చింది.
అయితే, ఆస్ట్రేలియా, బార్బడోస్ లేదా జమైకా దేశాల్లాగా కెనడాలో అధికారికంగా గణతంత్రంపై చర్చలు జరగడంలేదు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారాలంటే హౌస్ ఆఫ్ కామన్స్, పార్లమెంట్‌లో సెనేట్ కూడా ఓటు వేయాలి. అలాగే 10 ప్రావిన్స్‌లు ఏకగ్రీవంగా సమ్మతించాలి. ఇది సాధించడం చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తంజావూరు పెరియా కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?
- వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’
- సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














