ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?

ప్రపంచబ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునిగా ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పాల్ సింగ్ బంగా నియామకం
    • రచయిత, రామకృష్ణ వరికూటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునిగా ప్రముఖవ్యాపారవేత్త అజయ్ పాల్ సింగ్ బంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు అంటే ఏంటి? దాని విధులు ఏంటో తెలుసుకుందాం.

ప్రపంచబ్యాంకు అంటే?

ఐబీఆర్‌డీ, ఐడీఏ అనే రెండు సంస్థలను కలిపి ప్రపంచబ్యాంకు అంటారు.

ఐబీఆర్‌డీ: ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్

ఐడీఏ: ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్

ప్రపంచబ్యాంకు ఏం చేస్తుంది?

ప్రధానంగా మూడు పనులు చేస్తుంది.

అప్పులు: వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అప్పులు ఇస్తుంది.

సలహాలు: విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించి మెరుగైన విధానాల రూపకల్పన, అభివృద్ధి వ్యూహాలు వంటి వాటిపై ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది.

పరిశోధన: సామాజిక అంతరాలు, పేదరికం, వాణిజ్యం, అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి పరిశోధనల ద్వారా డేటాను సేకరించి నివేదికలు విడుదల చేస్తుంది.

ప్రపంచబ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచబ్యాంకు గ్రూప్‌లో అయిదు సంస్థలుంటాయి. ప్రపంచబ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది.

ప్రపంచబ్యాంకు గ్రూప్ అంటే?

ప్రపంచబ్యాంకు గ్రూప్‌లో అయిదు సంస్థలుంటాయి. ప్రపంచబ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది.

ఐబీఆర్‌డీ: ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్

ఆదాయం తక్కువగా మధ్యస్థంగా ఉండే అంటే లో, మిడిల్ ఇన్‌కం దేశాలకు అప్పులు ఇస్తుంది.

ఐడీఏ: ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్

ఆదాయం తక్కువగా ఉండే దేశాలకు అప్పులు ఇస్తుంది.

ఐఎఫ్‌సీ: ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్

ప్రైవేటు సెక్టారులోని కంపెనీలకు అప్పులు ఇస్తుంది.

ఎంఐజీఏ: మల్టీలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ

ప్రైవేటు కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది.

ఐసీఎస్‌ఐడీ: ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్‌ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్‌ప్యూట్స్

దేశాలు, ప్రైవేటు కంపెనీల మధ్య విభేదాలు వస్తే వాటిని సామరస్యంగా పరిష్కరించుకునేలా ఐసీఎస్‌ఐడీ సాయం చేస్తుంది.

ప్రపంచబ్యాంకు

ఎప్పుడు ఏర్పడింది?

రెండో ప్రపంచయుద్ధంతో చాలా దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో జపాన్, యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 1944లో జులైలో 44 దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు.

అమెరికాలోని బ్రెట్టన్ ఉడ్స్‌లో ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ)లను ఏర్పాటు చేస్తూ ఆ సమావేశంలో తీర్మానించారు.

1946లో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఇది పని చేస్తోంది.

తొలుత యూరోపియన్ దేశాలకు మాత్రమే అప్పులు ఇచ్చే ప్రపంచబ్యాంకు, 1948 నుంచి ప్రపంచవ్యాప్తంగా రుణాలు ఇవ్వడం ప్రారంభించింది.

ప్రపంచబ్యాంకులో యజమాని ఎవరు?

దీనికి ఒక యజమాని అంటూ ఎవరూ ఉండరు.

ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఇందులో మెంబర్స్‌గా ఉంటాయి. 1944లో 38 సభ్యదేశాలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 189కు చేరింది. భారత్ కూడా అందులో సభ్య దేశమే. 1945 డిసెంబరు 27న అందులో చేరింది.

ప్రపంచబ్యాంకు

ఎవరి వాటా ఎంత?

ప్రపంచబ్యాంకులో అత్యధిక వాటా అమెరికాకు ఉంది. వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఇదీ ఒకటి.

ఇందులో 16.28 శాతం వాటా అమెరికా సొంతం. 4,25,794 ఓట్లు ఉన్నాయి. ఇది మొత్తం ఓట్లలో 15.4 శాతం.

3.26 శాతం వాటాతో భారత్ ఏడో స్థానంలో ఉంది. 3.11 శాతం అంటే 85,987 ఓట్లు ఉన్నాయి.

ప్రపంచబ్యాంకుకు డబ్బులు ఎలా వస్తాయి?

ఈ గ్రూపులోని సంస్థలకు భిన్న మార్గాల్లో ఆదాయం వస్తుంది.

  • స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జించడం
  • బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సేకరించడం
  • ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం
  • ప్రపంచబ్యాంకులోని సభ్యదేశాలు చెల్లించే ఫీజుల నుంచి కొంత ఆదాయం వస్తుంది. అలాగే అమెరికా వంటి సంపన్న దేశాలు చందాలు కూడా ఇస్తుంటాయి.

ఎవరికి అప్పులు ఇస్తారు?

పేద, మధ్యతరగతి దేశాలతోపాటు ప్రైవేటు కంపెనీలకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇస్తుంది. ప్రాజెక్ట్‌కు అవసరమైన మొత్తంలో కొంత మాత్రమే ప్రపంచబ్యాంకు లోనుగా ఇస్తుంది.

ప్రపంచబ్యాంకు

దేని కోసం అప్పులు ఇస్తుంది?

పేద దేశాలు ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు రుణాలు ఇస్తుంది.

ప్రజలకు సురక్షితమైన మంచినీటి అందేలా చూడటం, అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చేయడం, మహిళల అభ్యున్నతి వంటివి ఆ సంస్థ లక్ష్యాలుగా ఉంటాయి.

అడవుల సంరక్షణ, రోడ్లు, రైల్వే, పోర్టుల నిర్మాణం, ఆరోగ్యసేవల విస్తరణ, వ్యవసాయం వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులకు అప్పులు ఇస్తుంది.

అప్పు ఇచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఉదాహరణకు A అనే దేశం కొత్తగా ఒక రైల్వే లైను ఏర్పాటు చేయాలనుకుంది. అందుకు రూ.5,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది.

ఆ దేశం ప్రపంచబ్యాంకు వద్ద కొంత రూ.3,000 కోట్లు అప్పు తీసుకోవాలనుకుంది. అందుకు ఆ దేశం ముందుగా ప్రాజెక్టు వివరాలను ప్రపంచబ్యాంకుకు సమర్పించాలి.

ఆ ప్రాజెక్టును ప్రపంచబ్యాంకు పూర్తిగా స్టడీ చేస్తుంది. ఆ రైల్వే లైను వేయడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే లాభం ఏంటి? పేదలకు, మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది? పర్యావరణం మీద పడే ప్రభావం ఎంత? మిగతా నిధులు ఎలా సేకరిస్తున్నారు? వంటి ప్రశ్నలను ప్రపంచబ్యాంకు అడుగుతుంది.

సమీక్ష తరువాత ప్రాజెక్టు నచ్చితే A దేశంతో ప్రపంచబ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. ప్రాజెక్టు కాలపరిమితి, వడ్డీ రేటు, అప్పు ఎలా తీర్చాలి, ఎప్పటిలోగా తీర్చాలి వంటి అంశాలు అందులో ఉంటాయి.

ఆ తరువాత లోను మంజూరు చేస్తారు. రైల్వే లైను నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విడతల వారీగా డబ్బులు ఇస్తూ ఉంటారు.

ప్రపంచబ్యాంకు

ప్రపంచబ్యాంకు వడ్డీ రేట్లు:

సాధారణంగా 12ఏళ్ల నుంచి 50ఏళ్ల గడువుతో ప్రపంచబ్యాంకు అప్పులు ఇస్తూ ఉంటుంది. 2022-23 నాలుగులో త్రైమాసికంలో వివధ రకాల రుణాలకు సంబంధించి 1.28 శాతం నుంచి 2.73శాతం మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి.

ఇది అమెరికా డాలర్లలో. ఆయా దేశాల కరెన్సీతో వడ్డీ రేట్లను కన్వర్షన్ కూడా ఉంటుంది.

సర్వీసు చార్జీలు, ఇతర ఫీజులు కూడా ఉంటాయి.

వ్యక్తులకు అప్పులు ఇస్తారా?

ప్రపంచబ్యాంకు పర్సనల్ లోన్లు ఇవ్వదు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులకు మాత్రమే అది అప్పులు ఇస్తుంది.

ప్రపంచబ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచబ్యాంకు గ్రూప్ అధ్యక్ష పదవికి సభ్యదేశాలకు చెందిన వారిని మాత్రమే నామినేట్ చేస్తారు.

ప్రెసిడెంట్‌ను ఎలా ఎన్నుకుంటారు?

ప్రపంచబ్యాంకు గ్రూప్ అధ్యక్ష పదవికి సభ్యదేశాలకు చెందిన వారిని మాత్రమే నామినేట్ చేస్తారు.

ప్రపంచబ్యాంకులో ప్రతి దేశం తన తరపున ఒక గవర్నర్‌ను నియమిస్తుంది. ఈ గవర్నర్లు తమకు నచ్చిన అభ్యర్థులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ద్వారా నామినేట్ చేస్తారు.

మొత్తం నామినేషన్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పరిశీలించి మూడు పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తారు.

తుది జాబితాలో ఉన్నవారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రెసిడెంట్‌గా ఎంపికైన వ్యక్తి పేరును ప్రకటిస్తారు.

అమెరికన్లే ఎందుకు?

ప్రపంచబ్యాంకులో అమెరికా వాటా చాలా ఎక్కువ. దానికుండే ఓటింగ్ పవర్ కూడా ఎక్కువే. పైగా ప్రపంచబ్యాంకుకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చే దేశం అమెరికానే. ఈ కారణాల వల్ల ఎప్పుడూ అమెరికా అధ్యక్షుడు నామినేట్ చేసిన వ్యక్తులే ప్రపంచబ్యాంకు అధ్యక్షులు అవుతుంటారు.

ప్రపంచబ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ప్రెసిడెంట్ విధులు ఏంటి?

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సలహా మేరకు ప్రెసిడెంట్ పని చేస్తారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డుకు ప్రెసిడెంట్ చైర్‌పర్సన్‌గా ఉండొచ్చు. కాకపోతే ఓటింగ్ పవర్ ఉండదు.

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు సమానంగా విడిపోతే అప్పుడు ప్రెసిడెంట్ ఓటు వేయొచ్చు.

గవర్నర్ల బోర్డు మీటింగులో పాల్గొనవచ్చు.

ప్రపంచబ్యాంకు గ్రూపులోని అన్ని సంస్థలకు ఆయన ఎక్స్‌ అఫిషియో చైర్‌పర్సన్‌గా ఉంటారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సలహామేరకు నియామకాలు చేపట్టడం, తొలగించడం వంటివి ప్రెసిడెంట్ చేస్తారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నిర్ణయిస్తే ప్రెసిడెంట్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)