గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట...బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు, అధికారులు

పట్టా తీసుకుంటున్న గంగమ్మ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీఐ ఇలియాస్ అహ్మద్ సమక్షంలో పట్టాను తీసుకుంటున్న గంగమ్మ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

చేసిన అప్పుకు బదులుగా తోటను పోగొట్టుకున్న అనకాపల్లి జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళ గంగమ్మకు పోలీసులు న్యాయం చేశారు.

రావికమతం మండలంలోని రొచ్చుపనుకుల గ్రామానికి చెందిన గంగమ్మకు అప్పిచ్చిన షావుకారు ఆమె దగ్గర నుంచి జీడి మామిడి తోటను '99ఏళ్ల' లీజుకు రాయించుకున్నారనేది ఆరోపణ. ఈ విషయం మీద మే 10వ తేదీన బీబీసీ కథనం రాసింది.

షావుకార్లు చేస్తున్న వడ్డీ వ్యాపారం వల్ల ఆదివాసీలు ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారో? వారి తోటలను షావుకార్లు ఏ విధంగా 99ఏళ్ల లీజుకు రాయించుకుంటున్నారనే అంశాలను బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కథనాన్ని ఇక్కడ క్లిక్ చేసి చదవచ్చు.

అయితే, భూమి పట్టాలు తీసుకుని కుటుంబ సమేతంగా స్వగ్రామనికి వస్తుండగా, గంగమ్మ ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గంగమ్మ భర్త తీవ్ర గాయాలతో మృతి చెందారు. గంగమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు, మరికొందరు గ్రామస్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి

అంతకు ముందు....

బీబీసీ కథనాల మీద స్పందించిన స్థానిక ఎమ్మార్వో ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ ఇలియాస్ అహ్మద్... మే 13న అంటే శనివారం రొచ్చుపనుకులు గ్రామానికి వెళ్లారు. అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు. నేడు అంటే 14న షావుకార్లను, ఆదివాసీలను కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆదివాసీ, రైతు, వ్యవసాయ సంఘాల నాయకులు కూడా వచ్చారు.

పోలీసులు, ఎమ్మార్వో జోక్యంతో రైతు గంగమ్మ డి-పట్టా, పాసుబుక్, 99 ఏళ్లకు సంతకం పెట్టించుకున్న లీజు అగ్రిమెంటులను షావుకారు నర్సీపట్నం శ్రీను వెనక్కి ఇచ్చేశారు. అలాగే తెల్లయ్య (ఎకరా), సోమయ్య (1.94 ఎకరాలు)లకు కూడా తోట పత్రాలను వెనక్కి ఇప్పించారు.

ఇంకా ఎవరివైనా పత్రాలు షావుకార్ల వద్ద ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలని... వారి పట్టాలు, పాసు పుస్తకాలు తిరిగి ఇప్పిస్తామని సీఐ ఇలియాస్ అహ్మద్ బీబీసీతో అన్నారు. అలాగే ప్రాంసరీ నోట్లు రాయించుకున్న వారు, చట్ట ప్రకారం వాటి కాలపరిమితి ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని చెప్పారు.

రొచ్చుపనుకుల గ్రామంలోని అప్పులు ఊబిలో చిక్కుకున్న ఆదివాసీలకు న్యాయం జరిగేలా పోరాడతామని, వారికి సాయం చేస్తామని వ్యవసాయ సంఘాల నాయకులు తెలిపారు. రొచ్చుపనుకుల ఆదివాసీలు ఇకపై అప్పులు, వడ్డీ కింద షావుకార్లకు జీడిపిక్కలు ఇవ్వరని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్ కుమార్ బీబీసీతో అన్నారు.

"నా పట్ట తిరిగి దక్కుతుందని అనుకోలేదు. నా పట్టా తిరిగి నాకు దక్కేలా చేసిన అందరికి రుణపడి ఉంటాను. ఇకపై నా తోటకి నేనే యాజమానురాలిని" అని గంగమ్మ బీబీసీతో అన్నారు. మా కుటుంబమంతా మా తోటలోనే పని చేసుకుంటామని, ఇకపై ఎవరి తోటలోకి కూలీకి వెళ్లనవసరం లేదని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఆదివాసీ రైతులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆదివాసీ రైతులు

అసలేం జరిగింది?

రొచ్చుపనుకులు గ్రామం మొదట్లోనే గంగమ్మ ఇల్లు. 2018లో ప్రభుత్వ పథకం కింద గంగమ్మకు ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందింది.

అయితే, అది ఇంటి నిర్మాణానికి సరిపోలేదు. దాంతో పిక్కలు అమ్మే షావుకారు వద్దే 2 లక్షల రూపాయలు అప్పు చేశారు.

"పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు, ఆ గుడిసెలో ఉండటం ఇబ్బందిగా మారింది. అప్పుడే ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్కీం వచ్చింది. ఇల్లు పూర్తి చేసేందుకు షావుకారు వద్ద 2019లో 2 లక్షల రూపాయల అప్పు చేశాను.''

''అప్పు, వడ్డీ కలిపి 7.5 లక్షలైందంటూ కిందటి ఏడాది మా జీడితోట పట్టాను పట్టుకుపోయాడు. పట్టా అడిగితే భూమి మీది కాదు, తోట మీది కాదు అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం తోట పిక్కలు కూడా షావుకారే ఏరుకున్నాడు.''

''మమ్మల్ని తోటలోకి రానివ్వకుండా, మరొకరిని తోట పనులకు పెట్టుకున్నాడు. కనీసం మా తోటను చూసే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది" అంటూ గంగమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సొంత తోటలోకి రానివ్వకపోవడంతో గంగమ్మ కుటుంబమంతా వేరే వాళ్ల తోటల్లో కూలీలుగా పని చేస్తున్నారు.

జీడిపిక్కలు
ఫొటో క్యాప్షన్, వడ్డీ కింద షావుకార్లు జీడిపిక్కలను జమ చేసుకుంటారని బాధితులు చెబుతున్నారు.

జీడిపిక్కల మాటున వడ్డీ వ్యాపారం

జీడిపిక్కలు కొనడానికి వచ్చే షావుకార్ల ప్రధాన వ్యాపారం జీడిపిక్కలు కాదు, వడ్డీ వ్యాపారమే అని రొచ్చుపనుకులు గ్రామంలో పర్యటించినప్పుడు తెలిసింది.

వారానికి ఒకసారి వచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం, సీజన్లో జీడిపిక్కలు కొనుక్కుపోవడం చేస్తుంటారు. జీడిపిక్కలు కొనుక్కుపోయే సందర్భంలోనే ఆదివాసీలు తమ అవసరాల కోసం వీరి వద్ద అప్పులు తీసుకుంటారు.

ఇలా తీసుకునే అప్పులకు స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టించుకుంటారని, కానీ, తమకు ఎలాంటి పేపర్లు ఇవ్వరని ఆదివాసీలు చెప్పారు. అలాగే గంగవ్వకు కూడా ఎటువంటి కాగితాలు ఇవ్వలేదు.

ఇల్లు పూర్తి కాలేదు, తోట కూడా పోయింది

ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశామని, కానీ ఆ ఇల్లు కూడా పూర్తి కాలేదని గంగమ్మ చెప్పారు.

"మేం ఇంటి నిర్మాణానికి తీసుకున్న 2 లక్షలు గుర్తుంది. ఇప్పుడు వడ్డీతో కలిపి 7.5 లక్షలంటున్నారు. మా జీడితోట పట్టా కూడా పట్టుకుపోయారు. ఇల్లు కూడా పూర్తి కాలేదు. జీడితోట కూడా పోయింది.'' అని గంగమ్మ వాపోయారు.

ఇక ఇల్లు పూర్తి చేయడం మా వల్ల కాదు. సగం సగం పూర్తైన ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు.

''మా పట్టా ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదు. 99 ఏళ్లకు రాయించుకున్నామని చెప్తున్నారు. మా ఆయన, కొడుకు, కూతురుతో పాటు నా సంతకాలు ఏవో పేపర్ల మీద పెట్టించుకున్నారు" అని గంగమ్మ చెబుతున్నారు.

''వాళ్లు ఏ పేపర్లు మీద సంతకాలు పెట్టించుకున్నారో మాకు తెలియదు. ప్రస్తుతం మా వద్ద ఎప్పుడో తీయించుకున్న పట్టా జిరాక్స్ కాపీ ఒక్కటే ఉంది. ఒరిజినల్ పట్టా అడిగితే షావుకారు చాలా అవమానకరంగా మాట్లాడారు'' అని గంగమ్మ పిల్లలు తెలిపారు.

తెల్లకాగితం మీద షావుకారు రాసిచ్చిన లెక్క
ఫొటో క్యాప్షన్, తెల్లకాగితం మీద షావుకారు రాసిచ్చిన లెక్క

అసలెవరీ షావుకార్లు?

రొచ్చుపనుకులు గ్రామంతో పాటు చుట్టు పక్కలున్న తాటిపర్తి, రాయిపాడు, పెద్దగరువు ఇలా అనేక గ్రామాల్లో జీడిపిక్కలను కొనేందుకు మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. వాళ్లంతా ఆదివాసీలు కానివారే.

ఆర్థిక బలంతో పాటు రాజకీయ అండదండలు ఉండడంతో వారిని షావుకార్లు అని ఆదివాసీలు పిలుస్తుంటారు. వాళ్లు వడ్డీలకు అప్పులు కూడా ఇస్తుంటారు. స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టించుకుంటారు.

కొన్నాళ్ల తర్వాత అసలు ఎంత? వడ్డీ ఎంతైంది? మొత్తం బకాయి ఎంత ఉందని ప్రత్యేకంగా అడిగితే చిన్న తెల్లకాగితంపై రాసిస్తారు.

అది ఎన్ని లక్షల అప్పైనా కూడా అరటావు కూడా లేని తెల్లకాగితంపైనే రాసిస్తారని చెబుతూ ఆ కాగితాలను చూపించారు ఆదివాసీలు.

ఆ కాగితం ఎందుకూ పనికి రాదనే విషయం వారికి తెలియదు. అయితే, ఆ పేపరునే ఆదివాసీలు షావుకారు ఇచ్చిన కాగితం అంటూ దాచుకుంటున్నారు.

తమను వడ్డీల పేరుతో మోసం చేస్తున్నారని ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదు. పైగా వడ్డీ కింద జీడిపిక్కల బస్తాలను షావుకార్లకే ఇచ్చేస్తున్నారు. ఆ పిక్కలకు షావుకారు కట్టిందే ధర, మార్కెట్ రేటుతో సంబంధం ఉండదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)