వీర్యానికి కోవిడ్ టెస్టు చేస్తే ఏం తెలిసిందంటే..

వీర్య కణాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పురుషుల్లో వీర్య కణాలపై కరోనావైరస్ ప్రభావం చూపుతున్నట్లు ఎయిమ్స్ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కోవిడ్ సోకిన తర్వాత వీర్యం నాణ్యత పడిపోతోందని తేలింది.

ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంగళగిరి, పట్నా, దిల్లీ వైద్యులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆలోచన అలా మొదలైంది..

కరోనా వైరస్ సోకితే మనిషిలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతున్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ వైరస్ పురుషుల్లో సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇదే కో‌ణంలో ఎయిమ్స్ వైద్యులు పరిశోధన చేశారు.

ఈ పరిశోధన చేపట్టడానికి గల కారణాలను మంగళగిరి ఎయిమ్స్ ఫిజియాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్.పి.దీపాంకర్ బీబీసీకి వివరించారు.

‘‘గతంలో వచ్చిన ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు పురుషుల వీర్యం నాణ్యతపై ప్రభావం చూపేవి. సార్స్-కోవ్-2 వైరస్ విషయంలోనూ ఏమైనా ప్రభావం పడుతోందా.. అనే ఆలోచన నాకు వచ్చింది.

కరోనా వైరస్ వీర్యం నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే విషయాన్ని అధ్యయనం చేయాలనుకున్నాం.

అంతేకాదు, కరోనా వచ్చిన తర్వాత పురుషుడు తన భాగస్వామితో సెక్స్ చేస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పరిశోధన చేపట్టాం’’ అని సతీష్ చెప్పారు.

వీర్య కణాలు

ఫొటో సోర్స్, Getty Images

రెండుసార్లు వీర్యం శాంపిల్స్ సేకరణ

కొవిడ్ సోకిన పురుషుల నుంచి వీర్యం సేకరించడం పరిశోధనకు కీలకం.

ఇందుకు బిహార్‌లోని పట్నా ఎయిమ్స్‌లో రిజిష్టర్ చేసుకున్న 19 నుంచి 45 సంవత్సరాల వ్యక్తులను గుర్తించారు.

2020 అక్టోబర్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య అందులో 30 మంది (కోవిడ్ సోకిన వ్యక్తులు) నుంచి వీర్యం శాంపిల్స్ సేకరించారు.

ఆ తర్వాత వారి నుంచే 74 రోజుల తర్వాత మరోసారి వీర్యం శాంపిల్స్ (నమూనాలు) తీసుకున్నారు.

కరోనా పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

వీర్యానికి కొవిడ్ టెస్టు చేసినప్పుడు ఏం తెలిసింది?

వీర్యం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే ఆ రెండు సార్లు నెగిటివ్ వచ్చిందని వారు వెల్లడించారు.

ఆ తర్వాత వీర్యంలో కణాల సంఖ్య, వీర్యం పరిమాణం, కణాల కదలిక, చిక్కదనం, ఫ్రక్టోజ్ స్థాయిలు సహా వివిధ రకాల అంశాలను పరిశీలించినట్లు డాక్టర్ సతీష్ తెలిపారు.

కరోనా వైరస్‌లో ఉండే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ2) అనేది మనిషి శరీర కణాల్లోకి వైరస్ ప్రవేశించేందుకు కీలకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

ఏసీఈ2 రిసెప్టార్స్ అనేవి పురుషుల లైంగిక అవయవాలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే సార్స్ కోవ్ -2 వైరస్ టెస్టిస్ వంటి అవయవాల్లో ఎక్కువగా ఉండేందుకు వీలుందని ఎయిమ్స్ పరిశోధకులు గుర్తించారు.

పరిశోధకులు

ఫొటో సోర్స్, Getty Images

వీర్యం నమూనాల్లో నాణ్యత ఎలా ఉంది?

ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలను పరిశోధకులు గుర్తించారు.

రెండు నమూనాలలో నాణ్యతలో తేడాలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ సతీష్ బీబీసీకి చెప్పారు.

ఆ నమూనాల్లో వచ్చిన ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే..

మొదటి సారి శాంపిల్స్ ఇచ్చిన 40 శాతం మందిలో అంటే.. 12 మందిలో వీర్య కణాల సంఖ్య నిర్దేశిత స్థాయి కంటే (39 మిలియన్ కౌంట్ ఉండాలి) తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండోసారి శాంపిల్స్‌కు వచ్చేసరికి ముగ్గురిలోనే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

వీర్య కణాల కదలికలు మొదటిసారి 22 మందిలో తక్కువగా ఉండగా.. రెండోసారి తీసుకున్న శాంపిల్స్ విశ్లేషణలో పది మందిలో తక్కువగా ఉన్నట్లు తేలింది.

వీర్యం చిక్కదనం విషయంలో మొదటి శాంపిల్స్ లో 26 మందిలో తక్కువగా ఉంది. రెండో శాంపిల్స్ విషయంలో పెద్దగా మార్పులు రాలేదు.

వీర్య కణాల వైటాలిటీ రేటు 29 మందిలో 58 శాతం కంటే తక్కువగా ఉంది. రెండో శాంపిల్ విశ్లేషించినప్పుడు 26 మందిలో తక్కువగా ఉందని కనుగొన్నారు.

పీహెచ్ స్థాయి 7.2 నుంచి 7.8 మధ్య ఉండాలి.. కానీ, రెండు సందర్భాలలోనూ 8.1గా ఉంది.

మొదటి శాంపిల్స్ లో వీర్యకణాల తల భాగంలో 43.6 శాతం తేడా వచ్చినట్లుగా గుర్తించగా.. రెండో శాంపిల్స్ లో 38.2శాతం తేడా వచ్చిందని కనుగొన్నారు.

పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వీర్యంలో కరోనా వైరస్ ఆనవాళ్ల లేవని తేలింది. అయినప్పటికీ, వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రెగ్నెన్సీ ప్లాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి?

పరిశోధన ఫలితాలపై డాక్టర్ సతీష్ బీబీసీతో మాట్లాడారు.

‘‘కొవిడ్ సోకిన రోగుల్లో వీర్యం నాణ్యత చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. 74 రోజుల తర్వాత కూడా కొంతమేర మాత్రమే మెరుగుపడింది. అయినప్పటికీ వీర్యకణాల సంయోజనం, చిక్కదనం, ల్యూకోసైట్స్ వంటివి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి.

అందుకే రెండో నమూనా విశ్లేషణలో వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నట్లు మాకు వచ్చింది.

పురుషుల్లోని సంతానోత్పత్తి వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, వీర్యం నాణ్యత తగ్గిపోతోందని మా అధ్యయనంలో తేలింది.

ఈ ప్రభావం కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల వరకు ఉంటుందని అంచనా వేశాం.

అప్పటివరకు ప్రెగ్నెన్సీ (గర్భధారణ) వంటివి ప్లాన్ చేసుకోకపోవడం మంచిది’’ అని డాక్టర్ సతీష్ బీబీసీతో అన్నారు.

ఈ అధ్యయన ఫలితాలు అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ విభాగం నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించింది.

డాక్టర్ సతీశ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ సతీశ్ దీపాంకర్

ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు ఎవరు?

ఈ అధ్యయనంలో మూడు రాష్ట్రాల్లోని ఎయిమ్స్ వైద్యులు భాగస్వాములయ్యారు.

మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యులు సతీష్ పి.దీపాంకర్, అఫ్రీన్ బేగం.హెచ్.ఇతగి, పట్నాలోని ఎయిమ్స్ వైద్యులు త్రిభువన్ కుమార్, బిజయా.ఎన్.నాయక్, యోగేష్ కుమార్, అసిమ్ సర్ఫరాజ్, అమితాకుమారి, ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మోనాశర్మ అధ్యయనంలో పాల్గొన్నారు.

వీర్య కణాలు

ఫొటో సోర్స్, Getty Images

వీర్యం నాణ్యత ఎలా పెంచుకోవాలి?

కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీర్యం నాణ్యత పెంచుకోవడం సా‌‍ధ్యమవుతుందా..? ఇదే వి‌షయంపై ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ సి.మల్లికార్జున్‌తో బీబీసీ మాట్లాడింది..

‘‘వైరల్ ‌ఇన్ఫెక్షన్ సోకినప్పుడు టెస్టిస్ పై ప్రభావం పడుతుంది. ఆ సమయంలో వీర్యం ‌‍నాణ్యత తగ్గుతుంది.

కొవిడ్ సైతం వైరల్ ‌‍ఇన్‌ఫెక్ష‌న్ కావడంతో వీర్యం నాణ్యతలో తేడా వచ్చే అవకాశం ఉంది.

90 రోజుల తర్వాత సా‌ధార‌‍ణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

వీర్యంలో నా‌ణ్యత పెంచేందుకు ప్రత్యేకంగా పో‌‍షకాహారమంటూ ఉండదు. ఒత్తిడి లేని ఆరోగ్యకర జీవన వి‌‍ధానం గడపాలి’’ అని డాక్టర్ మల్లికార్జున్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)