చైనా: జ్వరం రోగికి చికిత్స చేసినందుకు డాక్టర్ అరెస్ట్

కోవిడ్

ఫొటో సోర్స్, VCG/VCG VIA GETTY IMAGES

చైనాలోని ఝోకో నగరంలో జ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి చికిత్స చేసినందుకు ఒక వైద్యుడిని అరెస్ట్ చేశారు. దీనికి కారణం.. ఆ చికిత్స చేసిన ఆస్పత్రిలో ఫీవర్ క్లినిక్ లేకపోవటమే.

చైనాలో కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులు.. ప్రత్యేకంగా నిర్దేశించిన ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

గో అనే ఇంటిపేరున్న ఆ డాక్టర్ మీద.. ‘‘అంటు వ్యాధుల నిరోధం, నియంత్రణకు అవరోధం కల్పించార’’నే అనుమానంపై అభియోగాలు నమోదు చేశారు.

చైనా జీరో-కోవిడ్ విధానాన్ని అమలు చేస్తోంది. కరోనాను నిర్మూలించటానికి కఠిన వ్యూహాన్ని అనుసరిస్తోంది.

హెనాన్ ప్రావిన్స్‌లో అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం.. గో గత ఏడాది అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ ఝోకో నగరంలోని ఒక ఆస్పత్రిలో జ్వరానికి చికిత్స చేశారు.

వీడియో క్యాప్షన్, టీకా పంపిణీలో ఎక్కడ పొరపాటు జరిగింది? అందరికీ వ్యాక్సీన్ ఎందుకు అందట్లేదు?

గో వైస్-డైరెక్టర్‌గా ఉన్న ఆ ఆస్పత్రిలో ఫీవర్ క్లినిక్‌లు లేవు.

చైనాలో కోవిడ్ తరహా లక్షణాలున్న రోగులకు.. ఫీవర్ క్లినిక్‌లు లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయటానికి వైద్యులకు అనుమతి లేదు.

అలాంటి రోగులను ఫీవర్ క్లినిక్‌లకు పంపించాల్సి ఉంటుంది. 2002లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వ్యాపించినపుడు.. దాని వ్యాప్తిని నిరోధించటానికి తొలుత ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.

ఈ నిబంధనలు ఉండగా.. జ్వరం రోగికి తన ఆస్పత్రిలోనే చికిత్స చేయించాలని గో ఎందుకు నిర్ణయించుకున్నారో, ఈ విషయం ఎలా బయటపడిందో వివరాలు తెలీదు.

ఈ కేసులో దోషిగా తేలితే గోకు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చునని ప్రభుత్వ షిన్‌హువా వార్తా సంస్థ చెప్పింది.

వీడియో క్యాప్షన్, కరోనా వ్యాక్సీన్‌లో అయస్కాంతం, మైక్రో చిప్ ఉన్నాయా? - Fact Check

చైనాలో కోవిడ్ విజృంభణ, వ్యాప్తి తరచుగా కొనసాగుతూనే ఉంది. షియాన్, యుఝో వంటి నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో ఇటీవలే పూర్తి లాక్‌డౌన్ విధించారు.

జనవరి చివర్లో చైనా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు పతాక స్థాయికి చేరుకునే సమయమిది. ఫిబ్రవరి వరకూ కోట్లాది మంది ప్రయాణాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటూ కదలవద్దని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు.

మరోవైపు.. వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు బీజింగ్ సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో జీరో-కోవిడ్ వైఖరిని చైనా కొనసాగించగలుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)