చెంగ్ లీ: చైనా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ఎక్కడ? 1,000 రోజులైనా ఎవరూ ఎందుకు నోరు విప్పడం లేదు?

ఫొటో సోర్స్, NICK COYLE
- రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్
- హోదా, బీబీసీ న్యూస్
‘‘ఒక వ్యక్తిని వెయ్యి రోజులు నిర్బంధించడం అంటే మామూలు విషయం కాదు,’’ అని నిక్ కోయల్ అన్నారు.
ఆయన తన జీవిత భాగస్వామి గురించి చెబుతున్నారు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు చెంగ్ లీ. ఆమె ప్రస్తుతం చైనా జైలులో గడుపుతున్నారు. ఆమెపై మోపిన అభియోగాలను చాలా గోప్యంగా ఉంచారు. ఆమెకు ఇంకా శిక్షకు కూడా ఖరారు చేయలేదు.
చెంగ్ స్నేహితులు, కుటుంబ సభ్యుల తరహాలోనే అసలు ఎందుకు ఆమెను నిర్బంధించారో కచ్చితమైన కారణం తెలియక కోయల్ తలపట్టుకుంటున్నారు.
‘‘ఈ భయానక పరిస్థితి వెనుకున్న అంశాలను తెలుసుకునేందుకు నేను త్వరలోనే చైనాలో అధికారులను కలుస్తాను’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
చైనా ప్రభుత్వ ఇంగ్లిష్ టీవీ స్టేషన్ సీజీటీఎన్‌లో బిజినెస్ రిపోర్టర్‌గా చెంగ్ లీ పనిచేసేవారు. అయితే, 2020 ఆగస్టు 13న ఒక్కసారిగా ఆమెను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చట్టాలకు వ్యతిరేకంగా విదేశాలకు చైనా రహస్యాలను ఆమె చేరవేస్తున్నారని ఆ తర్వాత ఆరోపణలు చేశారు.
మొదటి ఆరు నెలలు ఇతర ఖైదీల నుంచి ఆమెను విడిగా ఉంచారు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితుల్లో ఆమెను నిర్బంధించారు. కనీసం లాయర్‌ను నియమించుకునే అవకాశం కూడా ఆమెకు ఇవ్వలేదు. ఆ ఆరు నెలల తర్వాత ఇతర ఖైదీలతో ఆమెను కలిపారు.

ఫొటో సోర్స్, CONTRIBUTED PHOTO
గత ఏడాది మార్చిలో ఆమె కేసు విచారణ రహస్యంగా జరిగింది. ఆమెను కలిసేందుకు చైనాలోని ఆస్ట్రేలియా రాయబారి గ్రాహమ్ ఫ్లెచర్‌ను కూడా అనుమతించలేదు. అయితే, ఆమెకు శిక్ష విధించడాన్ని మళ్లీమళ్లీ వాయిదావేస్తూ వస్తున్నారు.
ఆమె కేసు విచారణ చేపడుతున్న బీజింగ్ సెకండ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు ప్రతినిధులతో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.
చైనా-ఆస్ట్రేలియా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చీఫ్ కోయల్ ప్రస్తుతం బీజింగ్‌ను విడిచిపెట్టారు. అయితే, చాంగ్‌ను విడిపించేందుకు ఆయన విదేశాల నుంచే ప్రయత్నిస్తున్నారు.
‘‘ఈ విషయంపై ఆస్ట్రేలియాలోని చైనా రాయబారి షియావో ఖియాన్‌ను కలిశాను. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని గత జనవరిలో ఆయన చెప్పారు. ఇప్పటికి దాదాపు ఐదు నెలలు గడుస్తోంది. ఇంకా మేం ఎదురుచూస్తనే ఉన్నాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NICK COYLE
దేశానికి చెందిన రహస్యాలను విదేశాలకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై మరో ఆస్ట్రేలియన్ జర్నలిస్టు యాంగ్ హెంగ్జున్‌ను కూడా చైనాలో నిర్బంధించారు. ఆయనకు కూడా శిక్షను ఖరారు చేయడాన్ని మళ్లీమళ్లీ వాయిదా వేస్తున్నారు.
చైనాలో ‘‘స్టేట్ సీక్రెట్’’ అనే దానికి స్పష్టమైన నిర్వచనం అంటూ ఏమీలేదు. ప్రభుత్వం దేన్ని కావాలంటే దాన్ని దీనిలో చేర్చొచ్చు.
కోవిడ్-19 వ్యాప్తి తర్వాత మళ్లీ అంతర్జాతీయ వ్యాపార పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అయితే, విదేశీయులను ‘‘స్టేట్ సీక్రెట్’’లను వెల్లడిస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు చేయడం దీనికి సవాల్‌గా మారుతోంది.
కెనడియన్లు మైఖెల్ కోవ్రిగ్, మైఖెల్ స్పావర్‌లను కూడా 2018 నుంచి 2021 వరకు ఇలానే నిర్బంధించారు. హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝౌపై కెనడా చర్యలకు బదులుగా వీరిద్దరినీ నిర్బంధంలోకి తీసుకున్నారు.
అయితే, వాంఝౌను తమ దేశానికి పంపించాలనే అభ్యర్థనను అమెరికా వెనక్కి తీసుకున్న గంటల్లోనే ఆ ఇద్దరు కెనడియన్లనూ చైనా విడిచిపెట్టింది.
ఆ తర్వాత కూడా చైనాలో విదేశీ కంపెనీలపై ఒత్తిడి కొనసాగుతోంది.
ఆరు వారాల క్రితం, ఒక ఫార్మా కంపెనీకి చెందిన జపాన్ ఎగ్జిక్యూటివ్‌ను చైనాలో నిర్బంధించారు. ఆయన గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. కొన్ని అంతర్జాతీయ కార్పొరేట్ రీసెర్చ్ సంస్థల్లోనూ ఇటీవల సోదాలు జరుగుతున్నాయి.
చైనాలో పెట్టుబడులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని చాలామంది మదుపరులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని భారీ మార్కెట్ వారిని ఆకర్షించేలా చేస్తోంది.
ఆస్ట్రేలియా, చైనా సంబంధాలు కొన్ని ఏళ్లుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా వైన్, బార్లీ, సముద్ర ఆహారంపై చైనా ఆంక్షలు విధించింది. అయితే, ఆస్ట్రేలియాలో చైనా మూలాలూన్న వారు దాదాపు 5 శాతం వరకూ ఉంటారు. అయినప్పటికీ, రెండు దేశాల సంబంధాల్లో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఈ ఒడిదొడుకుల మధ్య ‘‘చెంగ్ లీ’’ నిర్బంధం మరింత ఆందోళనకర పరిణామంగా మారింది.
కొన్ని ఏళ్లుగా చైనా మూలాలున్న విదేశీ పాస్‌పోర్టు దారుల విషయంలో చైనా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
చెంగ్ లీ చైనా మూలాలున్న మహిళ కాబట్టి ఆస్ట్రేలియాలో ఆమె గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరని చైనా ప్రభుత్వం భావించి ఉండొచ్చు. కానీ. వాస్తవానికి అలా జరగలేదు.
ఆమెను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆమె పిల్లల్లో ఒకరు వయసు తొమ్మిది, మరొకరిది 11. వారు తమ తల్లిని చూడలేకపోతున్నారనే ఆందోళన ఆస్ట్రేలియాతోపాటు చాలా దేశాల్లో ప్రతిధ్వనించింది.
‘‘వ్యాపారుల నుంచి రాజకీయ నాయకులు, సామాన్యుల వరకూ.. ఇలాంటి అన్యాయాన్ని ఏ ఆస్ట్రేలియన్ కూడా సహించడు’’అని నిక్ కోయల్ అన్నారు.
ఈ కేసులో ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఆందోళనలను శాంతింపచేసేందుకు చైనా విదేశాంగ శాఖ ప్రయత్నించింది.
దీనిపై విలేకరులతో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడారు. ‘‘ఈ కేసులో చైనా అధికారులు చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. చెంగ్ లీ హక్కులు కూడా ఉల్లంఘన కాకుండా చూస్తున్నారు’’అని వాంగ్ చెప్పారు.
ఆమెను అదుపులోకి తీసుకుని రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. మళ్లీ ఆయన మాట్లాడుతూ ‘‘ఈ కేసులో తగిన సమయంలో తీర్పు వస్తుంది’’అని అన్నారు. ఆయన స్పందించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసులో తీర్పు రాలేదు.
ఆరోపణలంటే శిక్ష పడినట్లే...
చైనాలో నేరారోపణలు మోపడం అంటే దాదాపుగా శిక్ష పడినట్లే. ఇక్కడ నేరాలు రుజువయ్యే రేటు దాదాపు వంద శాతం ఉంటుంది. ఇక్కడి లాయర్లు శిక్ష వీలైనంత తక్కువగా పడేందుకు మాత్రమే పనిచేస్తుంటారు.
ఇక విదేశీయుల విషయానికి వస్తే, తమ పౌరులను విడిపించేందుకు ఆయా ప్రభుత్వాలు చైనాతో చర్చలు జరుపుతుంటాయి. దీని కోసం ఒక్కోసారి ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటాయి.
ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటొనీ ఆల్బనీస్ తమ దేశానికి పర్యటనకు వచ్చి, రెండు దేశాల సంబంధాలను గాడినపెడతారని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఆ పర్యటన జరగాలంటే మొదట చెంగ్ లీ, యాంగ్ హెంగ్జున్‌ల కేసులను పరిష్కరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం అడగొచ్చు.
ఇప్పటికే ఈ కేసులను చాలాసార్లు చైనా ప్రభుత్వం ఎదుట ప్రస్తావించామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.
కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి లండన్ వెళ్లిన ఆంటొనీ అక్కడ ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు. ‘‘మేం చైనాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. కానీ, మా మార్గంలో చాలా అడ్డుగోడలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యంలో ఆంక్షలను ఎత్తివేయాలని. అదే సమయంలో చెంగ్ లీ లాంటి ఆస్ట్రేలియన్ల కేసుల్లో న్యాయం జరగడంలేదు. ఇవన్నీ నేను నేరుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌నే అడుగుతున్నాను’’అని ఆయన అన్నారు.
ఆయన నేరుగా జిన్‌పింగ్ పేరును ప్రస్తావించడాన్ని బీజింగ్ అధికారులు గమనించకుండా ఉండరు.
చెంగ్ లీ కెరియర్‌లో ఎక్కువ భాగం తాను జన్మించిన చైనా, తన కుటుంబం ప్రస్తుతం జీవిస్తున్న ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషిచేశారు.
అయితే, నేడు ఆమె కేసు చైనా, ఆస్ట్రేలియాలను మరింత దూరం చేస్తోంది. ఇలా జరగాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు.
ఆమెను కేవలం ఆస్ట్రేలియా దౌత్యవేత్తలు మాత్రమే నెలలో ఒక అరగంట సేపు కలవగలుగుతున్నారు. వీరి ద్వారానే ఆమె చెప్పాలనుకునే మాటలు బయటకు వస్తున్నాయి. తన పిల్లలకు దూరంగా ఉండటంతో ఆమె ఎంత వేదన అనుభవిస్తున్నారో దౌత్యవేత్తలే మీడియాకు వివరిస్తున్నారు.
ప్రస్తుతం 11, 14 ఏళ్ల వయసున్న తమ పిల్లలకు తల్లి లోటు లేకుండా చూసేందుకు తను చాలా కష్టపడాల్సి వస్తోందని నిక్ కోయల్ చెబుతున్నారు. ‘‘పిల్లల కోసమైనా ఈ కేసు త్వరగా పరిష్కారం అవుతుందని నేను ఆశిస్తున్నాను’’ అని నిక్ కోయల్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















