కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరుగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 మిలియన్లకు పైగా ఓటర్లు ఉన్నారు.
మే 10 న పోలింగ్ జరుగుతుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడతాయి.

ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లాగా కర్ణాటక ఎలక్టోరల్ జనాభాలో పురుషుల సంఖ్యకు మహిళల సంఖ్యకు మధ్య విపరీతమైన తేడా లేదు.
2018 నాటి ఎలక్టోరల్ గణాంకాల ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2.58 కోట్లు కాగా, మహిళ ఓటర్ల సంఖ్య 2.52 కోట్లుగా ఉంది. అయితే, ఈ ఓటర్లందరూ ఎన్నికల రోజున ఓటు వేస్తున్నారని చెప్పలేం.
1970, 80లలో కర్ణాటక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు తక్కువగా ఓటు వేసేవారు.
అయితే, 2003 ఎన్నికల తర్వాత ఇందులో మార్పు రావడం మొదలైంది.
పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు వేయడం మొదలుపెట్టారు. దీంతో పురుష, మహిళ ఓటర్ల సంఖ్య మధ్య తేడా తగ్గిపోయింది.
2018 నాటికి సమాన సంఖ్యలో పురుషులు, మహిళల ఓట్లు నమోదు అవుతున్నాయి.

బీజేపీ X కాంగ్రెస్
కర్ణాటకలో బీజేపీ ఎప్పుడూ ఆధిపత్య పార్టీగా లేదు. 1983 ఎన్నికల్లో 224 సీట్లలో బీజేపీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 82 సీట్లు సాధించగా, అందరి కంటే ఎక్కువగా జనతా పార్టీ (జేఎన్‌పీ) ఖాతాలో 95 సీట్లు చేరాయి.
అయితే, 1994లో పరిస్థితులు మరాయి. ఆ ఎన్నికల్లో 40 సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి రన్నరప్‌గా నిలిచింది. 115 సీట్లు సాధించిన జనతా దళ్ పార్టీ విజేతగా అవతరించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జనతా దళ్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఈ ఎన్నికలతో ముగిసింది. 1999 ఎన్నికల నుంచి ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోరుగా మారింది.
2004లో బీజేపీ 79 సీట్లు, కాంగ్రెస్ 65 సీట్లు నెగ్గాయి. ఆ తర్వాతి ఎన్నికల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో బీజేపీ సఫలం అయింది. 2008 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లు గెలిచింది.
అయితే, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనంగా పునరాగమనం చేసింది. మొత్తం 122 సీట్లను గెలుచుకొని బీజేపీని 44 సీట్లకే పరిమితం చేసింది.
2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుపొంది మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 78 సీట్లలో విజయం సాధించింది.

భౌగోళిక స్వరూపం
2013 ఎన్నికల్లో కోస్తా నియోజకవర్గాల్లో బీజేపీ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. కానీ, 2018 వచ్చేసరికి ఆ ప్రాంతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా అధిక నియోజకవర్గాల్లో విజయం సాధించింది. గతంలో ఈ కోస్తా ప్రాంతాలపై కాంగ్రెస్, ఇతరులు గట్టి పట్టును కలిగి ఉండేవారు.
దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ కష్టపడుతోంది. దక్షిణ కర్ణాటకలోని గుండ్లుపేటలో మాత్రమే బీజేపీ గణనీయంగా ఓట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు విజేతగా నిలిచింది.

2018 ఎన్నికల్లో అక్కడ బీజేపీ అత్యధికంగా 36.24 శాతం ఓట్లను సాధించింది. 2013లో ఇది కేవలం 19.89 శాతంగా ఉంది. అయినప్పటికీ, కాంగ్రెస్ ఓట్ల సంఖ్యతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం తక్కువే.
2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ 38 శాతం ఓట్లను సాధించగలిగింది. 2008 నుంచి కాంగ్రెస్ ఓట్ల శాతం స్థిరంగా పెరుగుతోంది.

ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి?
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 36 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) 15 సీట్లు రిజర్వ్ చేశారు. 2018 ఎన్నికల్లో 16 ఎస్సీ స్థానాల్లో, 6 ఎస్టీ సీట్లలో, 82 జనరల్ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీజేపీ విజేతగా నిలిచింది.
దీనికి విరుద్ధంగా జనరల్, ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. అయితే, ఎస్టీ స్థానాల్లో తన పట్టును నిలుపుకుంది. 15 సీట్లకు గానూ 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.
2008 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు సమానంగా 7 చొప్పున ఎస్టీ సీట్లను గెలుచుకున్నాయి. ఎస్సీ స్థానాల విషయానికొస్తే బీజేపీ 22 స్థానాల్లో గెలుపొందింది.
అయితే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది జనరల్ స్థానాలే నిర్ణయించనున్నాయి. ట్రైబల్ సీట్లను ఎక్కువగా గెలుచుకున్నవారికి ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా నిరూపితమైంది.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














