పాకిస్తాన్: 'పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హిందూ యువకుడు మృతి'.. అసలేం జరిగింది?

కమల్ మహేశ్వరీ

ఫొటో సోర్స్, MAHESWARI FAMILY

ఫొటో క్యాప్షన్, కమల్ మహేశ్వరీ
    • రచయిత, రియాజ్ సోహైల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కరాచీ

“ఇంట్లో శవం ఉన్నప్పుడు, పెళ్లి పనులు ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఇంట్లో 'మాయో' (వివాహ సమయంలో చేసే హల్దీ లాంటి కార్యక్రమం) వేడుకలకు బదులుగా, కమల్ అంత్యక్రియలు జరుగుతున్నాయి.’’

చమన్ లాల్ మహేశ్వరీ నాతో మాట్లాడుతున్నప్పుడు, 18 ఏళ్ల కమల్ మహేశ్వరీ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకువెళుతున్నారు.

మే 2 మంగళవారం రాత్రి జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కమల్ మహేశ్వరీ చనిపోయినట్లు చెబుతున్నారు.

ఈ ఘటన తర్వాత కరాచీలోని మహేశ్వరీ సంఘం, న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేసింది.

ఈ నిరసన నేపథ్యంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మొబైల్‌ ఫోన్‌ లాక్కొని పారిపోయినట్లు తమకు సమాచారం అందిందని అంతకుముందు పోలీసులు అన్నారు.

దొంగలను వెంబడిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, అప్పుడు ఒక దొంగ చనిపోయారని, మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.

ప్రాథమిక విచారణ అనంతరం కమల్ మహేశ్వరీ తండ్రి కిషన్ మహేశ్వరీ విజ్ఞప్తి మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

‘‘పోలీసులు అబద్ధం చెబుతున్నారు’’ అని ఆయన అంటున్నారు.

‘‘మా అబ్బాయి కమల్, నా స్నేహితుడి కొడుకు అనిల్‌ కలిసి కమిటీ డబ్బులు వసూలు చేయడానికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు వాళ్లు తిరిగి వస్తున్నారు. న్యూ టౌన్ ఏరియాకు రాగానే వారిని పోలీసులు ఆపారు. వాళ్ల దగ్గర 80 వేల రూపాయలు, పియానో కీబోర్డు తీసుకున్నారు’’ అని కిషన్ మహేశ్వరీ తన ఫిర్యాదులో చెప్పారు.

‘‘అనిల్‌ను లోపలకు రమ్మని, కమల్‌ను పరిగెత్తమని పోలీసులు చెప్పారు. అలా పరిగెడుతున్న నా కొడుకును కాల్చి చంపారు. అనిల్, కమల్ మీద తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కమల్, అనిల్ స్టేషన్‌లో ఉన్నారని పోలీసులు నాకు ఫోన్ చేశారు. కానీ నేను వెళ్లేసరికి కమల్ చనిపోయి ఉన్నాడు. వాడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు చెప్పారు’’ అని కిషన్ మహేశ్వరీ అన్నారు.

ప్రాథమిక విచారణ తరువాత సంబంధిత సబ్-ఇన్‌స్పెక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తారిఖ్ బీబీసీకి తెలిపారు.

మహేశ్వరీ కుటుంబ సభ్యులు

కమల్, అనిల్ ఇద్దరూ టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఉండేవారని కిషన్ మహేశ్వరీ బంధువు చమన్ లాల్ బీబీసీతో అన్నారు.

‘‘ఆ రోజు ఆ ప్రాంతంలో కరెంటు లేదు. తనతోపాటు లైటు తీసుకెళ్లాడు. ఇంట్లో శుభకార్యం వల్ల అందరూ ఆ పనిలో ఉన్నారు. వాళ్ల ఫోన్లను పోలీసులు స్విచాఫ్ చేశారు. కమల్ మృతదేహాన్ని మార్చురీలో పెట్టారు. ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు కమల్ మరణాన్ని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించినట్లు తెలిసింది’’ అని చమన్ లాల్ చెప్పారు.

ఆఫీసులో అటెండర్‌గా కమల్ పని చేస్తూ ఉండేవారు. తండ్రి డ్రైవర్.తల్లి ఇళ్లల్లో పని చేస్తూ ఉంటారు.

మే 3న కిషన్ మహేశ్వరీ సోదరుని కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా, అది కాస్త వాయిదా పడింది.

పాకిస్తాన్ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరాచీలో ఎన్‌కౌంట్లు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

కరాచీలో ఇదే తొలిసారి కాదు

ఎన్‌కౌంటర్‌ పేరుతో కరాచీ పోలీసులు యువకులను చంపినట్లు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అటువంటి కేసుల్లో నకీబుల్లా మెహసూద్ ఎన్‌కౌంటర్ ప్రధానమైంది.

‘‘చట్టవ్యతిరేకంగా హత్యలు చేయడమనేది పోలీసు వ్యవస్థల్లో భాగం అయిపోయింది. నకీబుల్లా హత్య తరువాత 2018-2019 మధ్య ఆ ట్రెండ్ కాస్త తగ్గింది. కానీ 2021, 2022 గణాంకాలు చూస్తే మళ్లీ పెరిగినట్లుగా కనిపిస్తోంది. 2021లో 53 మందిని చంపగా 2022లో ఆ సంఖ్య 100 దాటింది’’ అని కరాచీ పోలీసుల మీద పరిశోధనలు చేస్తున్న వార్విక్ యూనివర్సీ ప్రొఫెసర్ డాక్టర్ జోహా వాసిమ్ అన్నారు.

దేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం చక్కదిద్దలేక పోవడమే ఇందుకు కారణమని జోహా అంటున్నారు.

‘‘ఒకోసారి తమ అధికారాన్ని చూపించేందుకు ఇలా చేస్తుంటారు. ప్రతి ఏడాది ఎన్ని ఎన్‌కౌంటర్లు జరుగుతాయో ఆ రిపోర్టును పోలీసులు వెల్లడిస్తుంటారు. తాము చేసిన నేరాలను ఎవరూ విచారించరనే ధైర్యం పోలీసులకు ఉంది. అందుకే వాళ్లు బహిరంగంగానే ఇలాంటివి చేస్తుంటారు’’ అని జోయా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)