ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్: దెయ్యాలు కాకుండా సాధారణ విషయాలతో ప్రేక్షకులకు దడ పుట్టించిన దర్శకుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తుషార్ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి రంగంలో మార్గదర్శకులు కొందరు ఉంటారు. వారు వేసే ముద్ర ఎప్పటికి చెరిగిపోదు. వారి గుర్తింపు కాలంతో పాటు కొనసాగుతుంది. సినిమాలకు సంబంధించి ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అలాంటి ఒక వ్యక్తి. సినీ మాంత్రికుడు.
హిచ్‌కాక్ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా 'సైకో'. సస్పెన్స్-థ్రిల్లర్ సినిమా నిర్వచనాన్నే మార్చేసింది ఈ సినిమా.
ఒక తరం ముందు వారిని అడిగితే, సైకో సినిమా వాళ్లను ఎంత భయపెట్టిందో విపులంగా చెబుతారు. కానీ, ఇందులో దెయ్యాలు, భూతాలు లేవు. సాధారణ విషయాలే ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడతాయి.
బ్రిటిష్-అమెరికన్ దర్శకుడు అయిన హిచ్‌కాక్ 1899 ఆగస్టు 13న జన్మించారు. 1980 ఏప్రిల్ 29న కన్నుమూశారు. తొలి చిత్రం 1925లో విడుదలైంది. చివరి చిత్రం 1976లో వచ్చింది.
51 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. నాజీ క్యాంప్ వంటి సీరియస్ అంశాలపై డాక్యుమెంటరీలు తీశారు. టీవీ కోసం షోలను నిర్మించారు. 1955 నుంచి 1965 వరకు 'ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రెజెంట్స్' అనే ఫేమస్ టీవీ షో వచ్చేది.
ఆయన తీసిన సినిమాలు మొత్తం 46 ఆస్కార్ నామినేషన్లను అందుకున్నాయి. వీటిల్లో 6 ఆస్కార్ విజేతలుగా నిలిచాయి. 1940లో తీసిన 'రెబెకా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకుంది. అయిదుసార్లు ఉత్తమ దర్శకుడిగా నామినేట్ అయ్యారు. కానీ, ఒక్కసారి కూడా గెలవలేదు.
హిచ్‌కాక్‌ను సినీ మాంత్రికుడని, జీనియస్ అని పిలుస్తారు.
హిచ్‌కాక్ ఇంగ్లాండ్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పండ్లు, కూరగాయలు అమ్మే దుకాణాన్ని నడిపేవారు. అక్కడి నుంచి హిచ్‌కాక్ అమెరికా చేరుకుని, హాలీవుడ్‌లో దిగ్దర్శకుడిగా పేరు సంపాదించారు. ఆ ప్రయాణం విశేషాలేంటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా నిడివి ఎంత ఉండాలి?
దీని గురించి హిచ్‌కాక్ చెప్పిన ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది.
"ఒక సినిమా నిడివి మనిషి మూత్రాశయం ఓపిక పట్టగలిగినంత సేపు ఉండాలి" అన్నారాయన.
హిచ్‌కాక్ సినిమాలు పదునైన హాస్యానికి, వ్యంగ్యానికి ప్రసిద్ధి. పై వాక్యం కూడా ఆయన అదే స్టైల్‌లో చెప్పారని విశ్లేషకులు అంటారు.
అంతేకాకుండా, ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా, మానవ శరీర ధర్మాలను కలుపుకుని పనిచేస్తారన్నదానికి పై వాక్యం ఉదాహరణ.
మరో కారణం, ఆయనకు తన సినిమాలపై ఉన్న భరోసా కావచ్చు. తన సినిమా పూర్తయేవరకు ప్రేక్షకులు సీటు నుంచి కదలరన్న విశ్వాసంతో ఆ వాక్యం చెప్పి ఉంటారు. కానీ, నా ఉద్దేశంలో ఆయన కొంత తప్పు అంచనా వేశారు.
హిచ్‌కాక్ సినిమాలు చూస్తూ ప్రేక్షకుడు సడన్‌గా లేచి నిల్చుంటాడు. ఒక్కోసారి భయంతో ముడుచుకుపోతాడు. క్లైమాక్స్ ఎంత పకడ్బందీగా తీస్తారంటే, ఎంత అర్జంట్ అయినాప్రేక్షకుడు సీటు వదిలి వెళ్ళలేడు.
కాబట్టి ఆయన భాషలోనే, కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే.. హిచ్‌కాక సినిమాలు చూస్తూ ప్రేక్షకులు సీటు నుంచి కదలరు అన్నది తప్పు.
హిచ్‌కాక్ తీసిన వెర్టిగో, సైకో, బర్డ్స్ వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయంటే అతిశయోక్తి కాదు.

ఫొటో సోర్స్, Getty Images
'మీరు చూసేది ఒక కథ, అనుభవంలోకి వచ్చేది మరొకటి'
"హిచ్‌కాక్ సినిమాల్లో రెండు కథలు ఉంటాయి. తెరపై చూసేది ఒకటి, అనుభవంలోకి వచ్చేది మరొకటి" అని సినీ విమర్శకుడు ప్రొఫెసర్ డేవిడ్ థోర్బర్న్ అంటారు.
డయల్ ఎమ్ ఫర్ మర్డరర్ (1954) చూస్తే మనకూ ఈ విషయం బోధపడుతుంది. సినిమా మొదలైన క్షణమే మనల్ని కట్టిపడేస్తుంది. ఒక్క నిమిషం కూడా బ్రేక్ తీసుకోవలనిపించదు. ప్రతీ సీనుకూ.. తరువాత ఏం జరుగుతుందని ఊహిస్తూ ఉంటాం. ఈ ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతుంది.
లైఫ్ బోట్ (1944) సినిమాలో, నాజీ సైనికులు పెద్ద ఓడను నీళ్లల్లో ముంచేస్తారు. అందులో నుంచి ప్రాణాలతో బయటపడిన వారు లైఫ్ బోట్ సహాయంతో ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తారు. సినిమా ఇక్కడ మొదలవుతుంది. ఆ పడవలోకి కొందరు అపరిచితులు ఎక్కుతారు. అప్పటినుంచి మన ఆలోచనలు మొదలవుతాయి. ఇంత చిన్న పడవలో అంత పెద్ద సముద్రాన్ని దాటి ఒడ్డుకు ఎలా చేరుకుంటారన్న ఉత్కంఠ మొదలవుతుంది.
యుద్ధ వాతావరణం, పడవలో అపరిచితులు.. తమషాగా ఉంటుంది. చివరికి ఒక మంచి సినిమా చూశామన్న సంతృప్తి కలుగుతుంది.
రెబెకా (1940) కథ చాలా సూటిగా ఉంటుంది. సాధారణ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ధనవంతుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ ఇంట్లో తనను ఆదరిస్తారో, లేదో అని ఆలోచిస్తుంటుంది. క్రమంగా మనం కథలో లీనమైపోతాం. ఆ అమ్మాయితో పాటూ మనమూ కథలో భాగం పంచుకుంటాం. ఆమెకు ఏం జరుగుతుంది, ఆమె ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ సినిమాలో మునిగిపోతాం.
నోటోరియస్ (1946) గూఢచారుల ప్రేమకథ. ఒక అమెరికన్ ఏజెన్సీ ఓ మిషన్ కోసం ఒక జర్మన్ అమ్మాయిని ఎంపిక చేస్తుంది. ఆమెను తీసుకొచ్చిన ఏజెంట్ ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. నాజీల గురించి సమాచారం కోసం అమెరికా రహస్య మిషన్ అది. ఎన్నో చిక్కుముడుల మధ్య ప్రేమికులు ఇద్దరూ ఒకటవుతారా, లేదా అన్నది కథాంశం. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిక్కుముడుల్లో మనమూ చిక్కుకుపోయి, ఉద్వేగంతో కుర్చీ అంచున కూర్చుంటాం.
రియర్ విండో (1954) ఒక థ్రిల్లర్. నార్త్ బై నార్త్‌వెస్ట్ (1959) పూర్తి మసాలా ఎంటర్‌టైనర్.
ది స్ట్రేంజర్స్ ఆన్ ట్రైన్ (1951) చాలా అందమైన చిత్రం. ఇదొక థ్రిల్లర్ కానీ, అందులోని హాస్యం చక్కిలిగిలి పెడుతుంది. సినిమాలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో హాస్యాన్ని పండించడం చూస్తే నవ్వాపుకోలేం.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా నిర్మాణంలో మెళకువలు ఎలా నేర్చుకున్నారు?
హిచ్‌కాక్ మూకీ చిత్రాల యుగాన్నీ చూశారు, ఆపై టాకీల యుగాన్నీ చుశారు. దాని తర్వాత కలర్ సినిమాలూ చూశారు. అందులో పనిచేశారు. ఆయన 51 ఏళ్లు ప్రొఫెషనల్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనకు సినిమా మేకింగ్ టెక్నిక్ మీద ఎంత అవగాహన ఉందో ఇది చెబుతుంది.
సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆయన మనసులో పూర్తిగా రూపుదిద్దుకుంటుందని చెబుతారు. ఆయన సినిమాల స్టోరీ బోర్డు, షెడ్యూల్ అన్నీ ప్లాన్ ప్రకారం సాగుతాయి.
"హిచ్‌కాక్‌ను సెట్స్‌లో చూసేవాళ్లు ఏమంటారంటే.. సినిమా మొత్తం ఆయన బుర్ర లోంచి బయటికొస్తున్నట్టు ఉంటుంది" అని డేవిడ్ థోర్బర్న్ చెబుతారు.
హిచ్‌కాక్ సినిమాల్లోకి రాక ముందు బ్రిటిష్ ఆర్మీకి చెందిన రాయల్ ఇంజినీరింగ్‌లో చేరారు. టెక్నిక్‌కు సంబంధించిన విద్య అక్కడ నేర్చుకున్నారు. దీనివల్ల ఫిల్మ్ మేకింగ్‌లో లైటింగ్, సౌండ్, వాతావరణం, సెట్ టెక్నిక్స్‌లో ఆయన ప్రావీణ్యం సంపాదించారు.
కథను టెక్నాలజీతో ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించేవారని ఆయన ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
'డ్రామా సినిమాలో ఉండాలి, సెట్స్‌లో కాదు'
1919లో హిచ్‌కాక సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆనాటి దర్శకులు అన్ని రకాల మెళకువలు నేర్చుకోవాల్సి వచ్చేది.
నాలుగైదు సంవత్సరాల తరువాత, హిచ్‌కాక్‌కు ఒక చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. మొదటి చిత్రం 1925లో విడుదలైంది. ఆ తర్వాత సుమారు 15 సంవత్సరాల పాటు లండన్లో సినిమాలు తీశారు.
1938-39లో నిర్మాత డేవిడ్ సెల్జ్నిక్ ఆయన్ను హాలీవుడ్‌కు పిలిచారు. దర్శకుడిగా ఆయన మొదటి అమెరికన్ చిత్రం 'రెబెకా' విజయవంతమైంది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ కూడా గెలుచుకుంది.
హిచ్‌కాక్ ఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన టెక్నిక్ గురించి మాట్లాడుతూ, "అమెరికా వచ్చిన తరువాత ఒకసారి మరొక దర్శకుడి సెట్‌కు వెళ్లాను. అక్కడ పరిస్థితి చూస్తే సెట్‌లో మొత్తం డ్రామా కనిపిస్తోంది. కానీ తెర మీద డ్రామా లేనేలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిచ్‌కాక్ సినిమాల్లో భయం..
చాలా మంది ఫిల్మ్‌మేకర్స్ థ్రిల్, స్పీడ్, షాకింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి మంచి చిత్రాలను రూపొందించారు.
కానీ హిచ్‌కాక్ హారర్‌కు భిన్నమైన కోణాన్ని ఇచ్చారు. దెయ్యాలు మాత్రమే కాదు, సాధారణ విషయాలు కూడా ప్రేక్షకులను భయపెడతాయని చూపించారు.
హారర్ సినిమాల్లో కూడా హాస్యం పండించవచ్చని నిరూపించారు.
హిచ్‌కాక్ చిత్రాల్లోని పాత్రలు నిరంతరం భయం నీడలో నడుస్తూ ఉంటాయి. వాళ్లు పిరికివాళ్లు కాదు, కానీ వారికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి.
ఒక్కోసారి కథలో వాతావరణం మొత్తం భయంతో నిండిపోతుంది. చాలా సార్లు క్లైమాక్స్, తరువాత యాంటీక్లైమాక్స్ టెక్నిక్ ఉపయోగించి టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తారు.
"నా సినిమాల్లో సబ్జెక్ట్‌లాగే నా స్వభావం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ, నేను శాంతంగా ఉంటాను. చట్టాన్ని గౌరవిస్తాను. హాస్యాన్ని ఇష్టపడతాను. నాకు మంచి హ్యూమర్ సెన్స్ ఉంది" అని హిచ్‌కాక్ ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులపై హిచ్‌కాక్ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులు, వారి సినిమాలపై హిచ్‌కాక్ ప్రభావం ఎంత?
సైన్స్‌పై న్యూటన్ ప్రభావం లేదా క్రికెట్‌పై డాన్ బ్రాడ్‌మాన్ ప్రభావం ఎంత అన్నట్టు ఉంటుంది ఈ ప్రశ్న.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా 'జాస్' అయినా, రిడ్లీ స్కాట్ తీసిన 'ఏలియన్' అయినా హిచ్‌కాక సినిమాల ప్రభావం కనిపిస్తుంది.
బ్రేకింగ్ బాడ్, బెటర్ కాల్ సోల్ వంటి ఇటీవలి హాలీవుడ్ సిరీస్‌లలో దర్శకులు విభిన్న కెమెరా యాంగిల్స్‌లో షూట్ చేశారు. ఇది కూడా హిచ్‌కాక్ శైలి ప్రభావమే.
ఆయన కెమెరాతో చాలా ప్రయోగాలు చేసేవారు. 'వెర్టిగో' సినిమాలో తీసిన ఒక షాట్ చాలా ప్రసిద్ధి చెందింది. దాన్ని 'వెర్టిగో షాట్' అని పిలుస్తారు.
భారతదేశంలోని చాలా మంది దర్శకులపై హిచ్‌కాక్ ప్రభావం కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులు దీన్ని అంగీకరించారు కూడా.
"మొదట హిచ్‌కాక్ ఫేమస్ సినిమాలు మాత్రమే చూశాను. ఆయన మూకీ చిత్రాలు చూశాక, నాకు నిధి దొరికినట్టు అనిపించింది" అని అనురాగ్ కశ్యప్ ఒకసారి అన్నారు.
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హిచ్‌కాక్ స్టైల్ సన్నివేశాలు చాలా ఉంటాయి.
'సైకో' సినిమా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ గోపాల్ వర్మ 'ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సైకోయింగ్ ' అనే బ్లాగ్ రాశారు.
"మీరు థియేటర్‌లో లేదా ఇంట్లో కూర్చుని హారర్ చిత్రం చూస్తూ అరిచిన ప్రతిసారీ హిచ్‌కాక్‌కు ధన్యవాదాలు తెలిపినట్టు" అని వర్మ అందులో రాశారు.
అంధాధున్, జానీ గద్దర్, ఏక్ థీ హసీనా వంటి థ్రిల్లర్‌లను రూపొందించిన శ్రీరామ్ రాఘవన్ కూడా హిచ్‌కాక్ నుంచి స్ఫూర్తిని పొందానని చెప్పారు.
కొందరు దర్శకులు తమ సొంత సినిమాల్లో అతిథులుగా కనిపిస్తారు. భారతీయ దర్శకుల్లో సుభాష్ ఘయ్, తన సినిమాలలో కొన్ని సెకన్ల పాటు కనిపిస్తారు. దీనిని కూడా హిచ్‌కాక్ ప్రభావంగా పరిగణించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీయడానికి కారణాలేంటి... ఇతర విమానయాన సంస్థలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
- ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?
- సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా, ఎలా ఏర్పడతాయి?
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














